22, మే 2023, సోమవారం

శంకర్ గౌడ “MBBS”

శంకర్ గౌడ “MBBS”

తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, వైద్యులు మనకు పునర్జన్మనిస్తారు, అందుకే "వైద్యో నారాయణ హరి" అని అంటారు. వైద్యులు దేవుడితో సమానమని అర్ధం.

ఈరోజుల్లో పేదవాడికి జబ్బు వస్తే పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. 
పూర్వకాలంలో రోగాలు వస్తే సరైన వైద్యం అందుబాటులో లేక భయపడే వారు కానీ నేడు అన్ని రోగాలకు వైద్య సదుపాయాలున్నప్పటికీ పేదవాడు మాత్రం రోగాలకు అయ్యే ఖర్చుని చూసి భయపడుతున్నారు.  అతి చిన్న రోగానికి కూడా లక్షలలో ఖర్చవుతుండటం మన నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం. వైద్యాన్ని వ్యాపారంగా చూడడమే అందుకు కారణం. కొందరు వైద్యాన్ని వ్యాపారంగా భావిస్తుంటే మరికొందరు మాత్రం వ్యాపార దృక్పథంతో కాకుండా సమాజానికి మేలు చేయాలన్న దృఢ సంకల్పంతో ఎంతో మందికి సేవలందిస్తూ స్ఫూర్తి ప్రధాతలుగా నిలుస్తూ ఉన్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వైద్యుడు  "డాక్టర్ శంకర్ గౌడ"  కేవలం 5 రూపాయలకే వైద్యం అందిస్తూ నిరుపేదల పాలిట దేవుడయ్యారు.

వ్యాపార దృక్పథంతో పనిచేసే వైద్యులను చూసి అసహ్యించుకునే నేటి కాలంలో, డాక్టర్ శంకర్ గౌడ లాంటి వైద్యులను చూస్తుంటే ఆశ్చర్యం కలుగకమానదు.

కర్ణాటక రాష్ట్రం మాండ్యా లోని శివల్లికి చెందిన డాక్టర్ శంకర్ గౌడ ఒక నిరుపేద రైతు కుటుంబానికి చెందినవారు. కుటుంబ పోషణకోసం తన తండ్రి పడే కష్టాన్ని చూసి చిన్నతనంనుండే తండ్రి వ్యవసాయ పనికి సాయం చేసేవారు. మొదటినుండి చదువుల్లో ముందుండేవారు. తాను నివసిస్తున్న గ్రామానికి ఎలాంటి వైద్యసదుపాయాలు లేనందున గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన శంకర్ గౌడకు చిన్నప్పటినుండే డాక్టర్ కావాలనే కోరిక ప్రబలంగా ఉండేది. అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో తాను పెరిగేకొద్దీ తన ఆలోచన డాక్టర్ చదువు వైపే ఉండేది. మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుండి తన ఎం బి బి ఎస్ పూర్తిచేసిన తరువాత వెనిరియాలజీ మరియు డెర్మటాలజీ లో డిప్లొమా కూడా అభ్యసించారు.

5 రూపాయలకే వైద్యం చేయడానికి కారణం:

వందలాది మంది రోగులకు వైద్యం చేస్తూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మైసూరు మెడికల్ కాలేజీ రీసెర్చ్ అండ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కె గోవింద సేవ మరియు అంకితభావంతో డాక్టర్ గౌడ స్ఫూర్తి పొందారు. డాక్టర్ శంకర్ గౌడ వైద్య సలహా కోసం డాక్టర్ గోవిందను సందర్శించిన సమయంలో అయన నిరుపేదలకు చేస్తున్న సేవలు డాక్టర్ శంకర్ గౌడ ను ఎంతగానో ఆకర్శించాయి. అంతేకాకుండా డాక్టర్ కె గోవింద నుండి  ప్రేరణ పొందిన శంకర్ గౌడ ఎం బి బి ఎస్ పూర్తి చేసిన తర్వాత తన విద్యను తన గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఒక విన్నూతమైన ఆలోచనే నిరుపేదలకు 5 రూపాయల వైద్యం చేయడానికి బీజంవేసింది.

ప్రజా సేవకుడు "డాక్టర్ శంకర్ గౌడ":

వైద్య సదుపాయాలు లేని తన గ్రామంలో పేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో 5 రూపాయలకే వైద్యం అందించడం గొప్ప విషయం. అతికొద్ది మందితో వైద్యం ప్రారంభించి నేడు కొన్ని వేల మందికి 5 రూపాయలకే వైద్యసేవలందించడం అభినందనీయం. 5 రూపాయల చికిత్సతో పాటు, డాక్టర్ గౌడ తన రోగులకు నాణ్యమైన మరియు సరసమైన మందులను సూచించేవారు. అంతేకాకుండా తన హాస్పిటల్ ఖరీదైన బంగ్లాలో కాకుండా చిన్న క్లినిక్ లోనే చికిత్స అందిస్తుంటారు. కొన్ని సందర్భాలలో వీధుల్లో కూడా వైద్య సేవలందిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా వైద్యవృత్తిలో సేవలందిస్తున్న ఆయనకు సొంత వాహనం కూడా లేకపోవడం అత్యంత ఆశ్చర్యం. ప్రతిరోజూ అతను తన గ్రామం నుండి మాండ్య సిటీ (క్లినిక్)కి ప్రజా రవాణాలో వెళ్తాడు. డాక్టర్ గౌడకు ఇప్పటికీ ఫోన్ లేదు, కంప్యూటర్ లేదు మరియు ఇంటర్నెట్ సదుపాయం లేదు. అయితే, ఆయనకు వ్యాధులపై అత్యాధునిక పరిజ్ఞానం ఉంది. పెద్ద పెద్ద హాస్పిటల్లో నయంకాని చర్మ వ్యాధులను అతి తక్కువ ఖర్చుతో నయం చేయగలిగే నైపుణ్యం కలిగిఉన్నాడు. 38 ఏళ్ల అనుభవం ఉన్న చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ గౌడ చికిత్సకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దేశం నలుమూలలనుండి అనేక మంది ప్రజలు సందర్శిస్తున్నారు.

ప్రతిభావంతమైన సేవలకు అనేక అవార్డులు:

డాక్టర్ గౌడ శ్లాఘనీయమైన వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్-2022' ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించింది. అవార్డు అందుకున్న సందర్బంగా డాక్టర్ గౌడను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రత్యేకంగా అభినందించారు. మానవతా భావజాలం ఉన్న గౌడ లాంటి వైద్యులు ప్రతి గ్రామంలో, దేశంలో అవసరమని, గ్రామీణ ప్రజల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని సూచించారు.

డాక్టర్ గౌడ రాజకీయ ప్రస్థానం:

మాండ్య పార్లమెంటు స్థానానికి డాక్టర్ గౌడ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజాసేవకుడిగా, ప్రజా నాయకుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా గౌడ తన వైద్య సేవలను కొనసాగించడం ఆయన లోని మానవత్వానికి నిదర్శనం. ఇప్పటికి 5 రూపాయలతో కుల, మత, మతాలకు అతీతంగా లక్షలాది మందికి వైద్యం చేస్తూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. గౌడ లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదిగితే కొంతైనా అవినీతి నిర్ములన జరుగుతుందని, ఈ దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని భావిస్తూ గౌడ లాంటి వ్యక్తులు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను.

గౌడలాంటి డాక్టర్లు ఈ దేశానికి ఎంతో అవసరం:

నిరంతరం నిరాడంబరమైన సేవలందిస్తున్న నిస్వార్ధ ప్రజా సేవకుడు డాక్టర్ శంకర్ గౌడ.

గౌడ లాంటి మానవత్వం ఉన్న వైద్యులు ఈ దేశంలోనే కాదు ప్రతి పల్లెకు అవసరం. అంతేకాకుండా, ప్రతి వైద్య విద్యార్థికి కనీసం 6 నెలల పాటు గ్రామాల్లో ఉచిత వైద్యం అందించే ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టాలి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై వైద్య విద్యార్థులకు అవగాహన ఏర్పడి కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

వ్యాసకర్త, JCIV ప్రధాన కార్యదర్శి 
కోట దామోదర్
మొబైల్ 9391480475




మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...