24, అక్టోబర్ 2022, సోమవారం

అంతరించిపోతున్న కల్లుగీత వృత్తి




కల్లు గీత వృత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి

పురాతన కాలంనాటి గ్రంథాలన్నీ తాళపత్రాలే... అంటే తాటాకులమీద రాసినవే. అవి నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ ఆకులోని వైశిష్ట్యం ఏమిటో తెలుస్తోంది.
పురాణాలు మరియు ఇతిహాసాలలో తాటిచెట్టు గురుంచి ఎంతో గొప్పగా వివరించబడింది.

అన్నమయ్య కీర్తనలు , పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లాంటి అమూల్యమైన విషయాలెన్నో తాళపత్ర గ్రంధాల పైనే రాయబడింది. అలాగే తాటిచెట్టు నుండి లభించే కల్లును ప్రకృతి ఔషధంగా పురాణాలలో సురాపానంపేరుతో ప్రస్తావించటం చాల గొప్ప విషయం. స్వర్గలోకంలో అమృతభాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాళ వృక్షమై మొలిచిందట. ఈ మాటలో ఎంత నిజముందో తెలియదు కానీ. మానవ జాతి మనుగడలోను కల్లు పాత్ర కీలకమైనది.

తాటి చెట్లు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది కల్లు. ఆది మానవుని నుంచి ఆధునికమానవుని వరకు కల్లు సేవించటం ఆనవాయితీగా వస్తుంది.  తాటి  కల్లు అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం.  ఒకప్పుడు ప్రజలు పొద్దున్న నుండి సాయంకాలం వరకు చేసిన శ్రమ నుండి ఉపశమనం పొందడానికి కల్లు ని సేవించేవారు. ఒకప్పుడు ఇంటికి బంధువులొస్తే కల్లు, గుగ్గిలతో మర్యాద చేసేవారు.  శ్రమ జీవులకు , కల్లుకు విడదీయరాని బంధం ఉండేది.

అలాంటిది కాలక్రమేపి నేడు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో లిక్కర్‌,బీర్‌, బ్రాంది, విస్కీ, రమ్ము, శీతల పానియాలు (థమ్స్ అప్, కోకోకొలా, స్పైట్‌, మాజా) అనేకం రావటం వలన కల్లు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అందు ఫలితంగా దీనిపై ఆధారపడ్డ లక్షలాదిమంది గీతకార్మికుల బ్రతుకులు ప్రశ్నార్థకంగామారుతున్నాయి. అందుకు కారణం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు శీతల పానీయాలమీద పత్రికలు,టీవీ లలో గుప్పించి ఆకట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కల్లు ఆరోగ్యానికి ఏ విధమైన మేలుచేస్తుందో ప్రజలకు అడ్వర్‌ టైజ్‌మెంటుల  రూపంలో చెప్పకపోవడం ఇందుకు ముఖ్యకారణం అనే చెప్పాలి. నేటియువత మద్యానికిఇచ్చిన ప్రాధాన్యత కల్లుకు ఇవ్వక పోగా దానిని చులకన చేసి చూడటం అత్యంత బాధాకరమైన విషయం. అంతేగాక వ్యవసాయం వంటి ఇతర రంగాల్లో అభివృద్ధి సాదించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిలో ఎలాంటి ఆధునిక పద్ధతులను, విధానాలను తీసుకురాకపోవడంతో ఆ వృత్తి దెబ్బతింటోంది.  ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ గౌడన్న తన సంప్రదాయ వృత్తిని బ్రతికించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు.

పూటగడవటం కోసం గౌడన్న పొద్దుపొద్దుగాల కత్తుల పొదితో, మోకేసుకొని తాళ్లల్ల ప్రత్యేక్షమవుతాడు. సుమారు 10 నుండి 18 మీటర్ల ఎత్తున్న చెట్లని తన ప్రాణాలను సైతంలెక్కచేయకుండా అవలీలగా ఎక్కడంతోపాటు పెద్ద పెద్ద కల్లు కుండలను వెదురుబద్దల సహాయంతో ఎర్రటి ఎండలో ఒంటినిండా చెమటతో వాటిని మోయగలిగే  అసలైన బాహుబలి అంటే గౌడన్నే. వెదురుబద్దతో కుండలను మోయటంకేవలం గౌడన్నకే సాధ్యం. చెట్టెక్కిన  తరువాత ఏదైనా అకస్మాత్తుగా సంభవిస్తే ఇక తన ప్రాణాలు గగనమే. తాటిచెట్టు పైన కొన్ని విషపూరితమైన పాములు, తేలు, ఉడుములు వంటి ప్రమాదకరమైన జీవులతో పోరాడుతాడు. అనుకోకుండా అవి కాటేస్తే  క్రిందకు దిగేవరకు తాను బ్రతికే అవకాశం ఉండదు. అడవిలో అప్పటికప్పుడు చికిత్స అందించేవారు కూడా ఉండరు.  ఇలాంటి వృత్తిని ఎంతో ధైర్యంతో కొనసాగిస్తున్న గౌడన్నని అభినందించాల్సిందే. నిజానికి వీరి వృత్తి చావుతో పోరాటమే అనటంలో అతిశయోక్తిలేదు.

కల్లుగీత కార్మికుల పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గౌడాన్న చెట్టుపైనుండి పడి చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం అందచేయటం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ మేము బ్రతుకున్నపుడే  మంచి మార్గాన్ని చూపే పథకాలుంటే బాగుంటుంది అనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాబోవురోజుల్లో ప్రభుత్వం వీరిని అన్నివిధాలా ఆదుకోవాలని, వారి వృత్తికి సరిపడా నూతన పరికరాలకోసం అధ్యయనం చేసి వృత్తి కొనసాగించేవిధంగా మరియు నీరా కేంద్రాలను ఏర్పాటుచేయాలని కోరుకుందాం..

ముఖ్యంగా తెలంగాణ లోని గ్రామాలలో శుభకార్యాలకే గాక అన్ని రకాల కార్యాలకు మరియు వేసవి కాలంలో కల్లు సేవించేవారి సంఖ్య ఎక్కువ. విందు, వినోదాలకు స్నేహితులతో కలిసి తాళ్లల్ల ముచ్చటిస్తూ కల్లుతాగే మధురమైన జ్ఞాపకాలు పల్లెవాసులు ఎన్నటికీ మరువలేనివి మరుపురానివి. గ్రామాలలో కల్లు మాత్రమే కాకుండా తాటి ఆకులను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు.  పేదవాడి గూటికి పైకప్పుగా ఈ తాటికమ్మలు వాడేవారు. వేసవికాలంలో విలాసవంతమైన భవంతులకంటే పూరిగుడిసెల్లో వేడితీవ్రత తక్కువ. పెళ్లిపందిరికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారుచేసుకోవడానికి తాటాకులు ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాటి మొద్దులతో ఇళ్ల నిర్మాణంసర్వసాధారణం. అంతేగాక వేసవిలో తాటి ముంజలు అమితమైన చలవనివ్వడంతో పాటు తక్షణ శక్తిని మరియు దాహార్తిని తీర్చటానికి బాగా ఉపయోగ పడతాయి. 

కల్లు గురించి వైద్యుల కితాబు:

ఇది ప్రకృతి సిద్ధమైన సహజ పానీయం. దీనిని ఎవరైనా తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
  • ·         తాటి క‌ల్లు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది.
  • ·         డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.
  • ·         అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలనుదూరం చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ·         కంటిచూపును, జుట్టు మరియు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • ·         నీరాలో ఉండే ప్రో బయాటిక్స్ రోగనిరోధక శక్తి పెరుగడానికి దోహదం చేస్తుంది.
  • ·         లీవర్ లేదా కాలేయసంబంధిత వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది.
  • ·         కిడ్నీలో రాళ్లను నివారించడంతో పాటు అప్పటికే ఏర్పడిన రాళ్లను కరిగిస్తుంది.
  • ·         తాటిబెల్లం, తాటి పంచదార వల్లకూడా మంచి ప్రయోజనాలున్నాయి.
  • ·         తాటిక‌ల్లుకు క్యాన్సర్కార‌క క‌ణాల‌ను న‌శింప‌జేసే శ‌క్తి కూడా ఉందని వైద్యనిపుణులు తెలియ‌జేస్తున్నారు.
ఇంతటి విశిష్టత కలిగిన తాటిచెట్లు కనుమరుగవుతున్నాయి. కొందరి స్వార్థప్రయోజనాలకోసం చెట్లని నరికేస్తున్నారు. ఇలాంటి కల్పతరువు వంటి తాటిచెట్లు కనుమరుగు అవుతుంటే.. గ్రామీణ ప్రాంతాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఆవేదన నెలకొంది.

వంద సంవత్సరాలకు పైగా జీవించే తాటిచెట్టు పేదవాడి కల్పతరువు. గౌడన్నల బతుకుదెరువు..

ఈ విషయం ప్రభుత్వం గుర్తిస్తే గౌడన్నలకు ఆదరువు ...



మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...