పూర్వం ప్రజలు వ్యవసాయం మరియు చేతి వృత్తుల పైనే ఆధారపడి జీవించేవారని మనందరికీ తెలుసు. మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, కొన్ని వృత్తులు కనుమరుగవుతున్నాయి మరియు వాటి స్థానంలో కొత్త పద్ధతులు కనుగొనబడుతున్నాయి. కనుమరుగవుతున్న చేతివృత్తులలో కుమ్మరి వృత్తి ఒకటి.
కుమ్మరి మట్టితో ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసి మానవ జాతికి తొలి సాధనాన్ని అందించడమే కాక దానిని నిత్యావసర వస్తువుగా మార్చిన ఘనత కుమ్మరి కే దక్కుతుంది. గతంలో ఈ వృత్తి కి ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ నేడు ప్రాధాన్యత తగ్గిపోవడంతో కుమ్మరి వృత్తి ని వదిలి అనేక కుటుంబాలు ఇతర పనులు చేసుకుంటుండగా మరికొందరు కుమ్మరి వృత్తి నే నమ్ముకుని దిన దిన గండంగా బతుకీడుస్తున్నారు.
"మన్నును నమ్ముకున్నోడు ఏనాటికి చెడిపోడు" అనే నానుడి నిజం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన తాత, తండ్రి చేసే కుమ్మరి వృత్తినే వారసత్వ సంపదగా పుణికిపుచ్చుకుని నేర్చుకున్నాడు. కుమ్మరి వృత్తి అంతరించిపోతున్నప్పటికీ మన్ను నే నమ్ముకుని వృత్తి ని బతికించడం కోసం బతుకీడుస్తున్న "భాను చందర్ ప్రజాపతి చెలిమిళ్ళ" నిజ జీవిత గాథ ఎందరికో ఆదర్శం.
జననం, విద్యాభ్యాసం:
హైదరాబాద్‌లోని చార్మినార్, రెయిన్ బజార్ కుమార్‌వాడి కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన చెలిమిళ్ళ యాదయ్య మరియు నర్సమ్మ దంపతులకు 23.05.1991 న జన్మించారు. తన చిన్ననాటి నుండి తండ్రి పడుతున్న కష్టాలు చూసి తండ్రికి సాయం చేస్తూ వృత్తిని నేర్చుకోగలిగాడు. భాను చందర్ పదేళ్ల వయసులో తండ్రి అనారోగ్య కారణాలతో ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కుటుంబ పోషణ కోసం ఆరో తరగతి మధ్యలోనే చదువు మానుకొని భాను చందర్ తన తండ్రి వృత్తిని అనుసరించడం ప్రారంభించాడు.
మానవజాతి మనుగడకు మట్టి కుండ మరువలేని సేవలందించింది.
మానవజాతి మనుగడకు మట్టి కుండ ఎంతో మేలు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే కాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా సేవలందించిన మట్టి కుండ మాయమవుతుండటం బాధాకరమైన విషయం. ఎప్పుడైతే మార్కెట్లోకి ఫ్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటు పడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు. అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారు చేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్లలో నివసించే వారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాల్లో సైతం పెంకుటిళ్ళు అంతరించిపోతున్నాయి.
పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్లాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులో నుంచి తామే స్వయంగా మట్టి తెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈ రోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినా సరే వృత్తి పై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండటం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల పై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.
ఎంతో కళానైపుణ్యం తో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్, ప్లాస్టిక్, జర్మన్ సిల్వర్ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపుతో వెలవెల బోతోంది. కాలచక్రం తో పోటీ పడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.
మట్టి కోసం ఎన్నో ప్రయత్నాలు:
గతంలో ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు తప్పనిసరిగా ఉండేవి. ఆ రోజుల్లో కుమ్మరికి కుండ తయారీకి ఎలాంటి ఖర్చు లేకుండా గ్రామ సమీపంలోని చెరువుల్లో ఒండ్రుమట్టి దొరికేది. ఎండా కాలంలో చెరువుల నుంచి ఒండ్రుమట్టిని సేకరించి కుండను తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి, ఆ మట్టిని నీటితో తడిపి కాళ్లతో మట్టిని మెల్లగా తొక్కి ముద్దలుగా చేసి ఎంతో ఓపికతో కుండను తయారు చేస్తారు. ఆ తర్వాత కుండను కాల్చడానికి కూడా అనేక పద్ధతులు ఉపయోగిస్తారు. ఎంతో ఓర్పు మరియు నైపుణ్యం లేనిదే కుండ తయారు చేయడం అసాధ్యం. ఎంతో శ్రమకోర్చి తయారు చేసిన మట్టి కుండ మానవాళికి తొలి వస్తువుగా ఉపయోగపడడం గొప్ప విషయం.
కానీ నేడు ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురై మట్టి కోసం కుమ్మరి అల్లాడుతుండటం బాధాకరమైన విషయం. ఒకప్పుడు ఉచితంగా లభించే మట్టి నేడు అందుబాటులో లేదు. మరికొందరు సుదూర ప్రాంతాల నుంచి మట్టిని కొనుగోలు చేసి కుండలు తయారు చేసిన గిట్టుబాటు ధర లేక కుటుంబాన్ని పోషించుకోలేక కుమ్మరి వృత్తికి దూరమవుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న భాను చందర్ ప్రజాపతి చెలిమిళ్ళ మాత్రం మట్టిని నమ్ముకుని, మట్టితోనే మమేకమై జీవిస్తున్న అరుదైన కళాకారుడు. జీవనోపాధికి మరెన్నో మార్గాలు కనిపించినా, తరతరాలుగా సంక్రమించిన కుమ్మరి వృత్తిని విడిచిపెట్టకుండా అదే తన జీవిత ధ్యేయంగా ఎంచుకున్నాడు. ఈ రోజున కూడా కుమ్మరి చక్రం తిరుగుతోందంటే, మట్టి కళ ఇంకా ఊపిరి పీలుస్తోందంటే, భాను చందర్ వంటి కళాభిమానుల అంకితభావమే అందుకు ప్రధాన కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కుటుంబ పోషణ కోసం ఎన్నో కష్టాలు ఎదురైనా, ఆదాయం తక్కువైనా, మార్కెట్ అనుకూలించకపోయినా, ఆధునిక యంత్రాల పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆయన అడుగు వెనక్కి వేయలేదు. "మట్టి బతికితేనే మనిషి ఆరోగ్యం బతుకుతుంది... కుమ్మరి బతికితేనే సంస్కృతి బతుకుతుంది" అనే విశ్వాసంతో నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, సాంస్కృతిక వేదికలు, ప్రదర్శనల్లో ప్రత్యక్షంగా కుండల తయారీని ప్రదర్శిస్తూ మట్టి కుండ విశిష్టతను ప్రజలకు వివరిస్తున్నారు.
మట్టి కుండలో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, మట్టి పాత్రల వినియోగం పర్యావరణానికి ఎంత మిత్రమో, ప్లాస్టిక్‌పై ఆధారపడటం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటో ప్రతి ప్రదర్శనలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయన చేతులు కుండను మాత్రమే మలచడం లేదు; సమాజంలో పర్యావరణ స్పృహను, ఆరోగ్య చైతన్యాన్ని, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని కూడా మలుస్తున్నాయి.
ప్లాస్టిక్ వాడకం వద్దు. మట్టి కుండలు ముద్దు.
ప్రకృతిని ప్రేమించిన మనిషి నేడు ప్లాస్టిక్‌ను ప్రేమిస్తూ తన భవిష్యత్తును తానే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. క్షణిక సౌకర్యం కోసం, చౌక ధర కోసం, ఆకర్షణీయమైన ఆకృతులు, కళ్లు చెదిరే రంగుల మోజులో పడి ప్రపంచమంతా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని విపరీతంగా పెంచుకుంది. కానీ ఆ సౌకర్యం వెనుక దాగి ఉన్న ప్రమాదం మాత్రం నిశ్శబ్దంగా మానవజాతిని వెంటాడుతోంది. ప్లాస్టిక్ కుళ్లదు... కానీ ప్రకృతిని కుళ్లిస్తుంది. అది కరగదు... కానీ మనిషి ఆరోగ్యాన్ని కరిగిస్తుంది. అది మట్టిలో కలవదు... కానీ మట్టినే కలుషితం చేస్తుంది.
నేడు విచక్షణారహితంగా పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం, రసాయనాల విచ్చలవిడి వాడకం భూమి, నీరు, గాలి అనే ప్రకృతి పంచభూతాలనే కలుషితం చేస్తున్నాయి. పశుపక్ష్యాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. నదులు, సముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. చివరికి ఈ కాలుష్యమే తిరిగి మన ఆహారంలోకి, మన తాగునీటిలోకి, మన శరీరంలోకి చేరి అనారోగ్యానికి కారణమవుతోంది. ఇలాగే కొనసాగితే భావితరాలకు పచ్చని ప్రకృతి కాదు... ప్లాస్టిక్ చెత్తతో నిండిన భూమే వారసత్వంగా మిగిలిపోతుంది.
ఒకప్పుడు మన పూర్వీకుల జీవితం ప్రకృతితో మమేకమై ఉండేది. మట్టి కుండల్లో వండిన ఆహారం, మట్టి పాత్రల్లో నిల్వ చేసిన ధాన్యం, మట్టి కుండలో చల్లబడిన నీరు వారి ఆరోగ్యానికి, ఆయుష్షుకు, ఆనందానికి మూలాధారం. మట్టి కుండలో నిల్వ చేసిన నీరు సహజసిద్ధంగా చల్లబడటమే కాదు, దాని సహజ గుణాలను కాపాడుతూ శరీరానికి మేలు చేస్తుంది. విద్యుత్ అవసరం లేదు... రసాయనాల అవసరం లేదు... ప్రకృతే శీతలీకరణ చేస్తుంది. ఇదే భారతీయ జీవన తత్వం. ఇదే ప్రకృతి ప్రసాదించిన వరం.
నేడు చల్లని నీటి కోసం ఫ్రిజ్‌లు, శుద్ధి కోసం యంత్రాలు, నిల్వ కోసం ప్లాస్టిక్ పాత్రలపై ఆధారపడుతున్న మనిషి, తన ఇంటి ముంగిట నిలిచిన మట్టి కుండ గొప్పతనాన్ని మరచిపోయాడు. ఒక మట్టి కుండ కొనడం అంటే ఒక కుమ్మరి కుటుంబానికి ఆశను కొనడం. ఒక సంప్రదాయానికి ఊపిరి పోయడం. ఒక చేతివృత్తిని కాపాడడం. ఒక పర్యావరణ ఉద్యమానికి చేయూత ఇవ్వడం.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం నేడు ఒక అలవాటు మాత్రమే కాదు. ఒక సామాజిక బాధ్యత. మట్టి పాత్రలను ప్రోత్సహించడం ఒక అభిరుచి మాత్రమే కాదు—భావితరాల భవిష్యత్తుకు మనం ఇచ్చే భరోసా. ప్రతి ఇంట్లో ఒక మట్టి కుండ ఉంటే విద్యుత్ ఆదా అవుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, పర్యావరణం పరిరక్షించబడుతుంది, కుమ్మరి కుటుంబం బతుకుతుంది.
ప్రకృతిని కాపాడాలంటే ప్లాస్టిక్‌కు దూరం కావాలి.
ఆరోగ్యాన్ని కాపాడాలంటే మట్టికి చేరువ కావాలి.
కుమ్మరి కళను కాపాడాలంటే మట్టి కుండను ఆదరించాలి.
కుమ్మరి వృత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందించాలి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ''స్వదేశీ ఉత్పత్తుల'' అభివృద్ధికి, గ్రామీణ వృత్తుల ఆధునికీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో విఫలమైంది అనడంలో సందేహం లేదు. కుమ్మరి వృత్తి డిమాండ్ తగ్గడంతో గ్రామీణ వృత్తులపై ఆధారపడిన కార్మికులు ఈ వృత్తిని వదులుకుని పట్టణాలకు వలస వెళ్లి లేబర్ మార్కెట్‌లో రోజువారీ కూలీలుగా ఎక్కువ గంటలు పని చేస్తూ తక్కువ వేతనాలు పొందుతూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
భాను చందర్ ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతరించిపోతున్న జానపద కళలను, సంప్రదాయ చేతివృత్తులను సంరక్షించడం ప్రభుత్వాలు, సమాజం ఉమ్మడి బాధ్యత. తెలంగాణకు చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య తన జీవితాన్నంతా కిన్నెర కళ పరిరక్షణకు అంకితం చేసినందుకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం అభినందనీయం. అది ఒక వ్యక్తికి లభించిన గౌరవం మాత్రమే కాదు; అంతరించిపోతున్న ఓ జానపద కళకు దక్కిన జాతీయ గుర్తింపు.
అదే విధంగా శతాబ్దాల చరిత్రను, భారతీయ సంస్కృతి పరిమళాన్ని తన చేతి చక్రంపై సజీవంగా నిలబెడుతున్న కుమ్మరి కళాకారుల పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. కాలంతో పోరాడుతూ, మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటూ, మట్టినే నమ్ముకుని సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్న వారి కృషి కూడా సముచిత గుర్తింపుకు అర్హమైనదే. ముఖ్యంగా భాను చందర్ ప్రజాపతి చెలిమిళ్ళ వంటి కళాకారులు మట్టి కుండల విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూనే, అంతరించిపోతున్న కుమ్మరి కళకు ఊపిరి పోసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. వారి సేవలు కేవలం ఒక కుటుంబ జీవనోపాధికి పరిమితం కావు; మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే మహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి.
ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలతో సత్కరించడం, ఆర్థిక ప్రోత్సాహం అందించడం, వారి కళకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, యువతకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యలు తీసుకుంటే అంతరించిపోతున్న కుమ్మరి వృత్తికి కొత్త ఊపిరి లభిస్తుంది. కళాకారుడిని గౌరవించడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే కాదు—ఒక సంప్రదాయాన్ని, ఒక సంస్కృతిని, ఒక నాగరికతను గౌరవించినట్లే.
మట్టిని మూర్తిగా మలిచే చేతులు గౌరవింపబడితేనే మట్టి సంస్కృతి నిలుస్తుంది. కుమ్మరి చక్రం తిరిగితేనే సంప్రదాయం సజీవంగా ఉంటుంది. భాను చందర్ వంటి కళాకారులకు తగిన గుర్తింపు లభించడం వారి వ్యక్తిగత విజయమే కాదు—భారతీయ చేతివృత్తుల పునర్వైభవానికి నాంది అవుతుంది.
భాను చందర్ కళను వీక్షించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఆయన ప్రతిభను అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రశంసలు మాత్రమే కాదు, అలాంటి కళాకారులకు ఆచరణాత్మక ప్రోత్సాహం, ప్రభుత్వ గుర్తింపు, సమాజం నుంచి ఆదరణ కూడా లభించినప్పుడే ఈ అపురూపమైన కళకు శాశ్వత జీవం లభిస్తుంది.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475