16, నవంబర్ 2024, శనివారం

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్"

అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రపంచ బాక్సింగ్ క్రీడా రంగానికి రారాజు. సింహం వేటాటడం మొదలెడితే ఎంత పెద్ద జంతువైనా వణికిపోవాల్సిందన్నట్లుగా, ఆయన రింగ్ లోకి అడుగు పెడితే  ఎంతటివారైనా వణికిపోవాల్సిందే. ఆయన కొట్టే పంచులకు ప్రత్యర్థుల గుండెలు అదరాల్సిందే, బాక్సింగ్ పంచ్ లకు పాఠం నేర్పిన గురువు ఆయన. ప్రపంచ ఛాంపియన్ గా తిరుగులేని బాక్సర్ గా చరిత్ర సృష్టించి ఎంతో మంది ఆటగాళ్లను మట్టికరిపించిన యోధుడు. బాక్సింగ్ చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తిగా పేరుగాంచిన వరల్డ్ హెవీ వెయిట్ బాక్సర్ " మైఖేల్ గెరార్డ్ టైసన్ (మైక్ టైసన్)".

మైక్ టైసన్ ఆటంటే అభిమానులకు పెద్ద వేడుక. టైసన్ బరిలోకి దిగగానే స్టేడియం ఈలలు మరియు ఆనందోత్సాహాలతో నిండిపోతుంది. టైసన్‌ని చూస్తే ప్రత్యర్థుల్లో భయం ఏమోగానీ అభిమానుల చేసే హర్షధ్వానాలు వింటుంటే ప్రత్యర్థుల గుండెల్లో ఒక రకమైన భయం పుడుతుంది. టైసన్ పంచ్ పులి పంజాలా శక్తివంతమైనది. ఓ పంచ్ వేస్తే ప్రత్యర్థుల ఆశలు గల్లంతైనట్లే అలా మొదటి రౌండ్ లోనే వెనుదిరిగిన వారెందరో ఉన్నారు. అంతేకాదు ఆయన వేసిన పంచ్‌ల వల్ల ఎముకలు విరిగి రక్తం కారడంతో కొందరు కోమాలోకి వెళ్ళిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టైసన్‌తో ఆట అంటే మృత్యువును ఎదుర్కోవడం లాంటిది.

1985లో అరంగేట్రం చేసిన టైసన్ 2005 వరకు ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు. సుదీర్ఘ విరామం తర్వాత 58 ఏళ్ల వయసులో నవంబర్ 15, 2024న 59వ సారి పోటీ చేయనున్నాడని తెలిసి అభిమానులు అతని విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అతను ప్రత్యర్థి 27 ఏళ్ల జేక్ పాల్‌తో 7 రౌండ్ల పాటు వీరోచితంగా పోరాడాడు మరియు 8వ రౌండ్‌లో, అతని శరీరం సహకరించక ఓటమిని చవిచూశాడు. అతని ఓటమి టైసన్ కంటే అభిమానులకే ఎక్కువ భాద కలిగించింది. 39 సంవత్సరాల పాటు ప్రపంచ ఛాంపియన్ గా ఎన్నో రికార్డులు సృష్టించి బాక్సింగ్ క్రీడారంగంలో ధీరుడిగా నిలిచిన టైసన్ ఓడిపోవడమేంటి ఇది కలా లేదా నిజమా అని అభిమానులకు నమ్మశక్యం కానీ  విషయం. కానీ ఇది నమ్మలేని నిజం.

గెలిచిన ప్రతివాడికి ఏదో రోజు ఓటమి తప్పదన్నట్లు 59 సార్లు పోటీలో పాల్గొని 50 సార్లు  ఎదురులేని విజయాలు సాధించి బాక్సింగ్ రారాజుగా చరిత్ర సృష్టించాడు కానీ 59 వ పోటీలో ఓటమిపాలై అభిమానులకు గెలుపు ఎప్పుడు ఓటమి కొరకే అనే పాఠాన్ని నేర్పాడు.

ప్రపంచంలోని బాక్సింగ్ క్రీడాకారుల్లో మకుటం లేని మహారాజుగా నిలిచిన టైసన్ ఓటమి అనంతరం అభిమానులతో ఇలా అన్నారు "గెలిచిన ప్రతివాడికి ఏదో ఒకరోజు ఓటమి తప్పదు, ఓడిన ప్రతివాడికి ఏదో ఒకరోజు గెలుపు తప్పదు, నేను ఓటమితో కుంగిపోను గెలుపుతో పొంగిపోను అని అభిమానులకు ఒక గొప్ప సందేశం అందించారు.

ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ, తుమ్ముకు తమ్ముడు లేడన్నట్లు గెలిచిన ప్రతివాడిని భుజాన ఎత్తుకొని ఉరేగించేవారున్నారుగాని, ఓడిపోయినవారి భాదను అర్థం చేసుకొని ఓదార్చే వారు ఉండరు. టైసన్ గురించి తెలియని పిల్లకాయలు కూడా టైసన్ ఓడిపోయాడని తెగవాగేస్తున్నారు కానీ మనం గమనించాల్సింది ఒకటి. టైసన్ వయసుకు ప్రత్యర్థి వయసుకు సగం తేడా 58 సంవత్సరాల వయసులో కూడా 27 వయసులో ఉన్న బాక్సర్ తో పోటీకి సిద్దమయ్యాడంటే, ఒకరకంగా చెప్పాలంటే టైసన్ గెలిచినట్లు.  

చిన్నతనంలో ఎన్నో కష్ట నష్టాలను చవిచూసిన టైసన్ 13 ఏళ్ల వయసులో 38 సార్లు బాల నేరస్థుడిగా అరెస్టయ్యాడనే విషయం ఎంతమందికి తెలుసు? మైక్ టైసన్ నేరస్థుడి నుంచి ప్రపంచ ఛాంపియన్‌గా ఎలా ఎదిగాడో తెలుసుకోవాలంటే ఈ కథనం తప్పక చదవాల్సిందే.

1966లో న్యూయార్క్ నగరంలో జన్మించిన మైక్ టైసన్ బాల్యం కష్టాలు, కన్నీళ్లతో సాగింది. పేదరికం మరియు వ్యక్తిగత కారణాలతో ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరిగేది. ఎప్పుడు గొడవలు జరిగినా టైసన్‌కు కోపం వచ్చేది. ఓ రోజు పెద్ద గొడవ రావడంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడం తో కుటుంబ భారం అంతా తల్లిపైనే పడింది. కుటుంబ పోషణ కోసం తల్లి ఆర్థికంగా, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. టైసన్ చూడటానికి అసహ్యంగా ఉండటంవల్ల అతని స్నేహితులందరూ అతన్ని ఏడిపించేవారు. అందువల్ల అతనికి అంతులేని కోపం వస్తుంటుంది. స్కూల్ లో జరిగిన విషయాలేమి తల్లితో చెప్పకుండా ఎదురు దాడికి దిగి స్నేహితులను రక్తం వచ్చేలా కొట్టాడు అంతే తప్ప ఇతరులకు చెప్పి బాధ పడేవాడు కాదు. తండ్రి భయం లేనందున తల్లి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎప్పుడు  స్నేహితులతో గొడవ పడేవాడు. అతనికి ఎప్పటినుంచో పావురాలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు, టైసన్ తన కంటే పెద్ద వ్యక్తి పావురాన్ని హింసించడాన్ని చూడకుండా ఉండలేకపోయాడు. చివరకు అతనితో గొడవపడి చితకబాదారు. అంతేకాదు 13 ఏళ్ల వయసులో చిన్న చిన్న నేరాలకు పాల్పడి 38 సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. ఒకరోజు మాజీ బాక్సర్ బాబీ స్టీవర్ట్ అతని కోపాన్ని మరియు అతను విసిరిన పంచ్‌లను చూసినప్పుడు అతని బాక్సింగ్ సామర్థ్యాన్ని గమనించాడు. చిన్నచిన్న దొంగతనాలు చేసే టైసన్‌ని గొప్ప క్రీడాకారుడిని చేయాలనే ఆలోచన వచ్చింది. స్టీవర్ట్ టైసన్‌ను అద్భుతమైన బాక్సర్‌గా భావించాడు. అతనికి కొన్ని నెలలపాటు శిక్షణ ఇచ్చి బాక్సింగ్ ట్రైనర్ కస్ డి'అమాటోతో పరిచయం చేశారు. 16 సంవత్సరాల వయస్సులో అతని తల్లి మరణించిన తరువాత, అతను అమాటో వద్ద ఉంటూ బాక్సింగ్ శిక్షణలో మెలకువలను నేర్చుకున్నాడు. టైసన్ తన బాక్సింగ్ అరంగేట్రం 1985లో న్యూయార్క్‌లోని అల్బానీలో చేశాడు అప్పుడాయన వయసు 18 సంవత్సరాలు. తొలి ఆటలోనే TKO ద్వారా హెక్టర్ మెర్సిడెస్‌ను మొదటి రౌండ్లో ఓడించాడు. KO లేదా TKO ద్వారా నిర్వహించిన 28 పోటీలలో 26 గెలవడమే గాక అందులో 16 పోటీలలో మొదటి రౌండ్లోనే ఓడించి ప్రేక్షకులను దిగ్భ్రాంతుల్ని చేసి, అభిమానులను ఆనందోత్సాహాలతో ఉర్రుతలూగించారు. అతి తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

గొరిల్లా తో పోటీకి సిద్ధపడిన టైసన్:

1980 లో న్యూయార్క్ లోని ఓ జూ పార్క్ సందర్శించినప్పుడు జూలో చాలా గొరిల్లాలు ఉండగా అందులో ఒక గొరిల్లా ఇతర గొరిల్లాలను కొడుతుండటం చూశారు. జంతు ప్రేమికుడైన టైసన్ ఎలాగైనా ఆ గొరిల్లా అంతు చూడాలని పట్టుబట్టి అక్కడ ఉన్న సిబ్బందితో ఎంత డబ్బైనా ఇస్తాను కానీ నేను ఆ గొరిల్లాతో పోరాడాలని చెప్పగా అతనికి టైసన్ గురించి తెలిసి ఏమాత్రం ఒప్పుకోలేదట. చావుకు కూడా భయపడని వ్యక్తిత్వం ఆయనది. చిన్నతనంలో పావురం కోసం పోరాడి చివరకు ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌గా ఎదగడం గొప్ప విషయం కదా!

ప్రమాదకరమైన జంతువుల పట్ల మైక్ టైసన్‌కు ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఎవరైనా పులిని చూడగానే వణికిపోతారు వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ టైసన్ మాత్రం పెంపుడు కుక్కలు పెంచుతున్నట్లు పులులను పెంచుకుంటాడు. వాటితో సరదాగా ఆడుకుంటాడు కూడా. ఒకసారి మూడు పులులను కొనుగోలు చేశాడంట, వాటికోసం ఏకంగా ఎక్స్ఛేంజ్లో దాదాపు $71,000 ఖర్చు చేశాడంట అంతేకాకుండా ఆయన బెడ్ రూంలో    పులులతో నిద్రించిన సందర్భాలు ఉన్నాయంట దీన్నిబట్టి టైసన్ ఎంతటివాడో తెలుస్తుంది కదూ!. కొన్నాళ్ళకు పులులను పెంపుడు జంతువులుగా చూడకూడదని గ్రహించి, 14 సంవత్సరాల తర్వాత వాటిని అభయారణ్యంలో వదిలేశాడు. కానీ పులులంటే ఆయనకు అమితమైన ప్రేమేనంట.

ఆయన సాధించిన విజయాలు:

WBC, WBA మరియు IBF ప్రపంచ హెవీవెయిట్ టైటిళ్లను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన బాక్సర్‌గా టైసన్ చరిత్ర సృష్టించారు. అతను WBA, WBC మరియు IBF టైటిళ్లను ఏకకాలంలో సాధించిన మొదటి హెవీ వెయిట్ బాక్సర్.

టైసన్ స్ఫూర్తి ఎవరంటే:

టైసన్ యొక్క ప్రేరణ మహమ్మద్ అలీ అని చాలా మంది అనుకుంటారు, అయితే టైసన్

ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్న పేర్లను విని చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. అలీ నాకు బాక్సింగ్‌పై ఆసక్తి కలిగించాడు కానీ నాకు స్ఫూర్తిని కలిగించలేదని టైసన్ చెప్పాడు. రాబర్టో డ్యూరాన్ మరియు షుగర్ రే లియోనార్డ్ నన్ను గొప్ప బాక్సర్‌గా మార్చడానికి ప్రేరేపించారని అన్నారు.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...