జలం వినా జీవం నాస్తి:
నీరు లేకుండా ఏ జీవి కూడా బ్రతకజాలదు, అందుకనే “జలం వినా జీవనం నాస్తి” అంటారు. మనం నీటిని పొదుపుగా ఉపయోగిస్తే, ప్రతి నీటి చుక్క మన భవిష్యత్తు తరాలను కాపాడుతుంది. మనం నీటిని వృధా చేస్తే, మన భవిష్యత్తు తరాలు అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిపోతున్న నీటి ఎద్దడికి నిదర్శనం గత సంవత్సరం బెంగళూరులో జరిగిన తీవ్ర నీటి కొరత పరిస్థితులు. జనాభాకు తగినట్టు నీటి సరఫరా ఉండడంతో, కొన్నేళ్ళ క్రితం వరకు ప్రధాన నగరాల్లో నీటి కొరత అంత తీవ్రంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యధికంగా భూగర్భ జలాల వినియోగం, పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ కారణంగా యధేచ్చగా అటవీ నిర్మూలన వంటి అంశాలతో నీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. పర్యావరణ అసమతుల్యత కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, వర్షపు నీటి సంరక్షణ మరియు మెరుగైన సరస్సు నిర్వహణ లేకపోవడం వల్ల నీటి సమస్య గణనీయంగా పెరిగింది. నీటి సమస్యను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై సుజల దీప్తికి బాటలు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బాల్యం నుంచే నీటి పొదుపు జీవన శైలిలో ఒక భాగంగా మార్చాల్సి ఉంది. బెంగళూరు నీటి సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు “రెయిన్ రీచ్” కార్యక్రమం ద్వారా పర్యావరణవేత్త హరిహరన్ చంద్రశేఖర్ చేప్పట్టిన చొరవ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.
చాలా నగరాలలో ఏటా కురిసే వర్షపాతంలో దాదాపు 90 శాతం వృధా అవుతుంది. నగరాలలో సరస్సులు కనుమరుగవడం, వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా రోడ్ల నిర్మాణం చేపట్టడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నగరాలలో కురిసే వర్షపునీరు డ్రైనేజీ గుండా నేరుగా నదుల్లోకి చేరడం వల్ల భూగర్భజలాల పునరుద్ధరణకు అవకాశం లేదు. నీటిని సంరక్షించడానికి మన జీవనశైలిలో మార్పులు అవసరమని భావించి, పిల్లలలో సరైన అవగాహన కల్పిస్తే తద్వారా నీటిని ఆదా చేయడం చిన్నప్పటి నుండే అలవాటుగా మారుతుందని పర్యావరణవేత్త డాక్టర్ హరిహరన్ చంద్రశేఖర్ పాఠశాల విద్యార్థులకు నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి “రెయిన్ రీచ్” కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బెంగళూరు నీటి సంక్షోభం ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం వంటిది. నీటి సమస్యను అధిగమించడానికి పొదుపు మంత్రాన్ని జపించాల్సిందేనని రెయిన్ రీచ్ కార్యక్రమం ద్వారా మున్సిపల్ పాఠశాలల్లో వర్షపు నీటిని సురక్షితమైన తాగునీటిగా మార్చడానికి వడపోత వ్యవస్థతో కూడిన వర్షపు నీటి సేకరణ (RWH) వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది కాకుండా, వర్షపాతాన్ని మరియు డేటా-లాగ్‌ను ఎలా కొలవాలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం, వర్షపు నీరు శుద్ధి చేసే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడే “రెయిన్ గేజ్” వాతావరణ స్టేషన్‌ను ఏర్పాటు చేసి తద్వారా పిల్లలకు పూర్తి అవగాహన ఏర్పడేలా అనుభవం కలిగిన నిపుణులతో వారికి శిక్షణ ఇస్తారు. ప్రతి నెలా పిల్లలకు నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ, నీటి దుర్వినియోగంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అర్థమయ్యేలా, వ్యవస్థలను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పిస్తారు. ఈ కార్యక్రమం ఫలితంగా బెంగళూరులోని 40 పాఠశాలలు ఇప్పటివరకు 34 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయడం గర్వించదగిన విషయమే. విద్యార్థుల ఈ కృషిని స్ఫూర్తిగా తీసుకుని దీనిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే నీటికి డోకా ఉండదు.
రెయిన్ రీచ్ సిస్టమ్ మాత్రమే కాదు, మిలియన్ వెల్స్ ఫర్ అనే సంస్థ కూడా బెంగళూరులో నీటి సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో కీలకమైన చొరవను చేపట్టింది. బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల బోర్డుకు మద్దతుగా ఉన్న ఈ ప్రాజెక్ట్, సాంప్రదాయ బావి మైనింగ్ పద్ధతులను ఉపయోగించి నగరం అంతటా పది లక్షల లోతు బావులు నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. బావి నిర్మాణం యొక్క పురాతన పద్ధతులను ఉపయోగించడం ద్వారా, భూగర్భజల వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది, 2025 నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిన మిలియన్ వెల్స్ ఫర్ బెంగళూరు ప్రాజెక్ట్ బెంగళూరుకు నీటి భద్రతను నిర్ధారించే దిశగా ప్రయత్నిస్తోంది.
బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్ లో కూడా నీటి సంక్షోభం ఏర్పడే అవకాశం లేకపోలేదు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడానికి ఎన్నో కారణాలున్నప్పటికీ, అధిక నీటి వినియోగంతో పాటు వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకింపచేయడంలో నగర వాసులు విఫలం కావడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అయితే వర్షం నీటిని భూమిలోకి ఇంకింపచేయడంలో నగరవాసుల అలసత్వం ఒక కారణమైతే, ఈ అంశంపై ప్రభుత్వం తగిన ఆసక్తిని చూపకపోవడం మరో కారణం. ప్రతిచోటా సిసి రోడ్ల నిర్మాణం కారణంగా నగరంలో ఏటా కురిసే వర్షం నీరు భూమిలోకి ఇంకే అవకాశం చాలా తక్కువ. వర్షం నీరు భూమిలోకి ఇంకాలంటే అందుకు ఇంకుడు గుంత ద్వారానే సాధ్యం అని గ్రహించి మొదటిసారిగా ఇంకుడు గుంతల ఆలోచన ద్వారా జలయజ్ఞానికి శ్రీకారం చుట్టి వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసిన వ్యక్తి బాకారం వద్ద గల పద్మశాలి కాలనీ వాస్తవ్యులు రాజాపేట ఆంజనేయులు. 1997లో ఒకసారి ఆయన అధికారిక పనుల నిమిత్తం గుజరాత్ లోని రాజ్ కోట్ సందర్శించిన సందర్భంగా అక్కడ కొందరు స్త్రీలు రోజంతా తలపై బిందెలు పెట్టుకుని నీళ్లు మోసే దృశ్యం ఆయనకు తీవ్ర బాధ కలిగించింది. అంతేకాక అప్పటికే తమ కాలనీలో కూడా భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడి ట్యాంకర్లపై ఆధారపడవలసి రావడంతో ఆయన మస్తిష్కంలో మొదటి సారి “ఇంకుడు గుంతల” ద్వారా జలయజ్ఞం చేపట్టాలనే సంకల్పానికి బీజం పడింది. వెంటనే ఆయన తమ కాలనీలోని భావసారూప్యత గల ఐదుగురు మిత్రులతో కలిసి 31 జూలై 1997 న ప్రయోగాత్మకంగా పూర్తి శాస్త్రీయ ప్రమాణాలతో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. తొలి ప్రయత్నంలోనే ఆంజనేయులు శ్రమ ఫలించి భూగర్భజల మట్టం పెరగడంతో కాలనీలోని మిగతా వారు కూడా ఆయన సారధ్యంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందారు. భూగర్భ జలాలు పెరగడానికి, నీటి ఎద్దడి నివారణకు ఇంకుడు గుంత తప్పనిసరని నిరూపించిన రాజాపేట ఆంజనేయులు ఇంకుడు గుంత ఆలోచనను ప్రతి ఒక్కరూ పాటిస్తే నగరంలో నీటి చింత ఉండబోదు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ IAS అధికారిణి శాంతా షీలా నాయర్ యొక్క వ్యూహాత్మక ప్రణాళిక మరియు విధాన రూపకల్పన నైపుణ్యం వల్ల చెన్నై తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దోహదపడింది. 2001లో ఆమె తమిళనాడు బోర్డు కార్యదర్శిగా ఉన్నప్పుడు తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వర్షపు నీటి సంరక్షణ ప్రాజెక్టును ప్రారంభించి, మొత్తం బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఆమె అన్ని భవనాల్లో వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. నాయర్ సూచనమేరకు చెన్నైలోని ప్రజలందరూ ఇంటి అవసరాల కోసం ప్రత్యేక ట్యాంకులు మరియు పైపులను ఏర్పాటు చేసుకొని వర్షపు నీటి సంరక్షణకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఈ చొరవ నీటి సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా నగరంలో స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులకు ఒక ఉదాహరణగా నిలిచింది.
నీటి కొరత పరిస్థితులు మరింత తీవ్రరూపందాల్చకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వృధా నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల నిర్మాణం మరియు నిర్వహణ ఒక ఉద్యమంలా చేపడితే, భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475