8, నవంబర్ 2022, మంగళవారం

అంతరించిపోతున్న కుమ్మరి వృత్తి

మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'.

మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసింది కుమ్మరి.

మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే గాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా తీర్చిదిద్దిన ఘనత కుమ్మరిది. పూర్వం మానవుడు మట్టిపాత్రలు మాత్రమే వాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాడు. మనిషి పుట్టుక మరియు చావు కుండలేనిదే పూర్తికాదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పుట్టిన పురిటి బిడ్డకు పురుడు పోసేందుకు మరియు చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు సైతం కుండను వినియోగిస్తారు. ఇలా మనిషి మనుగడకు మట్టి పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయని అనడంలో ఎలాంటి సందేహములేదు. మట్టిని కుండగా మలచడంలో నేర్పరితనం ఉంటుంది. సాధారణంగా అది అందరికి సాధ్యం కాదు.

కుండ చెప్పిన నీతి:

ఒకసారి కుండను ఎవరో అడిగారట...

నువ్వు పరిస్థితులతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా (ప్రశాంతంగా) ఉంటావు కదా ! ఇది ఎలా సాధ్యం ! అని...

దానికి కుండ చెప్పిన సమాధానం మనను ఆలోచించేలా చేస్తుంది. తాను వచ్చింది మట్టిలో నుండి అని, మళ్ళీ తిరిగి వెళ్లి కలిసేది కూడా మట్టిలోనే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని అంటూ మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరులాంటివి అవసరమా...! అని జవాబు ఇచ్చిందంట..

కుండ చెప్పిన నీతి ఎంత మధురం! అలా కుండ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.  

నాడు పెళ్లిళ్లు, దశ దిన కర్మలు, గ్రామాలలో జరుపుకునే బోనాలు, ఉగాది, జాతరలకు కుమ్మరులు తయారు చేసిన కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, అన్నం వండుకోవటానికి (బువ్వ గిన్నె), నీళ్లు నిల్వచేయటానికి (గోలెం), నీళ్లు మరగపెట్టడానికి (కుండ), వస్తువులను భద్రపరచటానికి (గాదెలు), కూరాడు, ముంత, దీపపు ప్రమిదలు, కల్లు కుండలు, పెళ్ళిలో అయిరేని కుండలు,  గరిగ ముంత, రంజన్లు, మట్టి బొమ్మలు, పూల కుండీలు, నీళ్ళ బుంగలు, ఇంటి నిర్మాణం కోసం పెంకులు, డబ్బులను దాచుకునేందుకు గళ్ల గురిగిలను, వేసవి కాలంలో చల్లని నీటిని అందించే కూజాలను తయారు చేసేవారు. శుభ కార్యాలకు సైతం కుమ్మరి కుండలనే వాడుతుంటారు. కొంత మంది అనారోగ్యానికి గురైనప్పుడు సైతం కుమ్మరి కుండలనే వినియోగించేవారు. ఎందుకంటే అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఇవి ఎంతో దోహదపడుతుంటాయి. ఇలా మట్టి పాత్రలను అనేక విధాలుగా ఉపయోగించుకునేవారు. అతి సాధారణంగా కనిపించే ఒక కుండ తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ముందుగా చెరువుల్లో రేగడిమట్టిని తీసుకొచ్చి అందులో రాళ్లు లేకుండా జల్లెడ పట్టి ఇసుక మాదిరిగా తయారుచేస్తారు. ఎన్ని కుండలు చేయాలనుకున్నారో దానికి ఎంత మట్టి కావాలో అంత మట్టి ఒకదగ్గర పోసి అందులోకొన్ని నీళ్ళుకలిపి కాళ్లతో బాగా తొక్కి ముద్దలు ముద్దలుగా తయారుచేసుకుంటారు.  తరువాత ఆ మట్టి ముద్దలను కుమ్మరి చక్రంపై (సారె) పై చేర్చి పొడుగాటి కర్రతో గిరగిరా రెండు చేతులతో తిప్పుతూ మట్టిని చేతివేళ్ల తో నేర్పరితనం రంగరించి కావాల్సిన అకృతి వచ్చే వరకు మలిచి దానిని కొలిమిలో ఉంచి కాల్చుతారు.

ఎండాకాలంలో వేడి తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి కుండలను ఎక్కువ వాడేవారు.

మట్టి కుండల్లోని నీరు త్రాగడంవలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటుపడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు.

అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారుచేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్ళలో నివసించినవారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాలలో సైతం పెంకుటిళ్ళుఅంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.

 

 మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...