10, జనవరి 2023, మంగళవారం

చేనేత కార్మికుల కన్నీటిగాధ




చేనేత కార్మికుల కన్నీటిగాధ 

మనిషి జీవించాలంటే కూడు, గూడు, గుడ్డ, నీరు ఎంతో ప్రధానం. ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్న ఎంత అవసరమో, వస్త్రాన్ని అందించే నేతన్న కూడా అంతే అవసరముందనడంలో అతిశయోక్తిలేదు. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేవరకు బట్టల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానవాళికి వస్త్రాన్ని అందించడమే కాకుండా అగ్గిపెట్టెలో పట్టే ఆరడుగుల చీరను నేసి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర మన చేనేత కళాకారులది. చేతి నైపుణ్యంతో అందమైన చీరలను సృష్టించడం నేతన్నకు మాత్రమే సాధ్యం.
భారతీయత సాంస్కృతిక కళలలో ఒకటైన చేనేత కళ ప్రపంచానికే ఆదర్శం, మరియు మన దేశానికి గర్వకారణం.

స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత పాత్ర:

భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో పండించిన పత్తిని చౌకగా కొనుగోలుచేసి విదేశాలకు ఎగుమతి చేసేది. అంతేకాకుండా విదేశాలలో తయారైన వస్త్రాలను మన దేశంలో పన్నులు మినహాయించి విక్రయించేవారు. బ్రిటిష్ ప్రభుత్వం విదేశీ వస్త్రాలకు పన్నులు మినహాయించి దేశీయ వస్త్ర పరిశ్రమలపై పన్ను భారాన్ని పెంచింది. బ్రిటిష్‌ ‌ప్రభుత్వ విధానాలతో భారతదేశ వస్త్ర పరిశ్రమ పతనమైంది. దింతో స్వాతంత్య్ర ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ నినాదం చేరింది. మహాత్మగాంధీ రాట్నంపై నూలు వడికి దేశ ప్రజలకు స్వదేశీ వస్త్రాలనే ధరించాలని ఇచ్చిన పిలుపు ఉద్యమానికి ఊతమిచ్చింది. 1905 ఆగస్టు 7 కలకత్తా టౌన్‌ ‌హాలులో నిర్వహించిన భారీ సమావేశంలో నేతలంతా విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. బానిసత్వం వద్దు, ఆత్మగౌరవమే ముద్దు అని సాగిన స్వాతంత్య్ర ఉద్యమంలో నూలువడికే రాట్నం ప్రధాన భూమిక పోషించడమేగాక స్వాతంత్య్ర సాధనకు ఒక సాధనంగా నిలిచింది. అలా స్వాతంత్య్ర ఉద్యమానికి చేనేత రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది.

విదేశాలకు ఎగుమతి మరియు చేనేత ఘనత:

మన దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగం. 17,18 శతాబ్దాల నాటికి ప్రపంచ వస్త్ర వ్యాపారంలో 25 శాతం వాటా మన దేశానిదే అందుకు చేనేత కార్మికులను అభినందిచాల్సిన అవసరం ఎంతోఉంది. మన దేశం నుంచి 85 శాతం మేర యూరోప్కు వస్త్ర వ్యాపారం సాగించారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్అవసరాలకు అనుగుణంగా మన చేనేత కళాకారులు తమ కళను, నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించిన తెలంగాణలోని పోచంపల్లి వస్ర్తాలు అమెరికా, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, లండన్‌, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంతేకాకుండా సిరిపురం, వెల్లంకిలలో తయారవుతున్న కాటన్బెడ్షీట్స్‌, డ్రెస్మెటీరియల్స్కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ఉండడం గొప్ప విషయం.  రాజాపేట మండలంలోని రఘునాథపురంలో తయారవుతున్న లుంగీలు ముంబయి, సూరత్ నుంచి గల్ఫ్దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వ్యాపారులు ఆన్లైన్వేదికగా నేరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. భూదాన్పోచంపల్లితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌, కొయ్యలగూడెం, సంస్థాన్నారాయణపురం, పుట్టపాక, రామన్నపేట, సిరిపురం, వెల్లంకి, చండూరు, మోత్కూరు, రాజాపేట, ఆలేరు, గుండాల, నాగారం, బోగారం వంటి వందలాది గ్రామాల్లో వేల సంఖ్యలో చేనేత కుటుంబాలు చేనేత వృత్తినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు ప్రత్యేకించి మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు విశిష్ట స్థానం ఉండటం ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. మొదటగా ఇక్కత్ వస్త్రాలు నేసిన పోచంపల్లి నేతకార్మికులు వారి కళానైపుణ్యాన్ని తెలంగాణలోని పలు జిల్లాల లోని గ్రామాలకు వ్యాపింపజేయటం చేనేతకు కొండంత అండగా నిలిచింది. ఇక్కత్ వస్త్రాలు తెలంగాణ నుండి పలు విదేశాలు ఎగుమతి చేస్తున్నారు అంటే మన చేనేత కార్మికుడి కళానైపుణ్యం ఎలాంటిదో వేరుగా చెప్పనవసరం లేదు.

మన దేశంలో మరెక్కడా లేనటువంటి దరీస్ లు వరంగల్ జిల్లా కొత్తవాడ నేతన్నలు నేయడం చాలా గొప్ప విషయం. అంతేకాదు వారి కళాత్మక నైపుణ్యానికి  2017 లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించడం. అభినందనీయం. లండన్ మ్యూజియంలో దరిస్ ను ప్రదర్శనకు ఉంచడం పట్ల వరంగల్ నేతలే కాకుండా తెలుగు రాష్ట్రాల నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఇక్కడి నేతన్న నేసే రంగు రంగుల తివాచీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వరంగల్ జిల్లా కమలాపూర్ నేతన్నలు తొలిసారిగా జీన్స్ క్లాత్ తయారు చేయడంలో సరికొత్త రికార్డు సృష్టించారు. వారి కళాత్మకతను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు రాజకుటుంబాలు ధరించే హిమ్రూ పట్టు చీరలు కమలాపూర్ చేనేత సొసైటీలో తయారవుతున్నాయి. వీరి ప్రతిభకు యునెస్కో విశిష్ట సంప్రదాయ వస్త్రాలలో గుర్తింపు దక్కడం గొప్ప విషయం. మహాదేవపూర్ నేతన్నలు నేసే దసలి పట్టు చీరలకు ఎంతో ప్రత్యేకత ఉంది. పట్టు పురుగుల నుంచి దారం తీసి పట్టు వస్త్రాన్ని నేస్తారు. అంతేకాదు అడవిలో లభించే సహజసిద్ధమైన రంగులతో వాటిని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతారు. ఇక్కడి నేతన్నలు దసలి పట్టు చీరలను బతికిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తయ్యే విభిన్న వస్త్రాలను సిద్ధిపేట గొల్లభామ చీరలు, గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కడ టెస్కో ద్వారా కొనుగోలు చేసి మార్కెట్లోకి పంపిస్తున్నారు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీరను తయారుచేసి సరికొత్త రికార్డు సృష్టించడమే కాక వెండి కొంగుతో, అరటి, తామర నారుతో పట్టు చీరలు తయారు చేసి అందరిని అబ్బురపరిచి తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు సైతం అందుకున్నాడు.

చేనేత కార్మికుల కన్నీటి గాధ

మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీపడలేక ఛిద్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయూత కరువైంది. సనాతన సంప్రదాయాలు కనుమరుగవుతున్నా.. తన సంప్రదాయ వారసత్వ వృత్తిని, కళను కాపాడుకుంటున్న నేతన్నకళ తప్పిపోయిన బతుకీడుస్తున్నాడు. మొదటి నుంచి చేనేతగొప్పదని ఉపన్యాసాలు దంచే చాలా మంది నాయకులు వారి జీవితాలను బాగుచేసే బాధ్యత నుంచి మాత్రం తప్పించుకుంటున్నారు. మూడు పూటలు కష్టపడే నేతన్ననేడు తన బిడ్డలకు ఒక్క పూట కూడా  కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలోనే దాదాపు స్వాతంత్ర్య ఆనంతరం కుటుంబాలను వదిలి నేతన్నలు పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్రలోని షోలాపూర్, భివాండి, బొంబాయి నగరాలు కూడా దాటి గుజారాత్ రాష్ట్రంలోని సూరత్, అహ్మదాబాద్ పట్టణాలలో బట్టల మిల్లులలో రోజుకు పన్నెండు గంటలకు మించి పనిచేస్తూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. పిల్లలను చదివించడానికి స్థోమత లేక అదే పనిలో కొనసాగిస్తున్న కుటుంబాలెన్నో. ఎప్పటి నుండైతే వీరి వలసలు కొనసాగాయోనాటి నుండి పల్లెటూళ్ళలో మగ్గం శబ్దాలతో లయ బద్దంగా నాట్యమాడిన నేతన్నల వీధులు నిశ్శబ్ధంగా రోదిస్తున్నాయి. అటు తర్వాత జరిగిన పరిణామమే కొంత మంది నేతన్నలు అప్పులు చేసి మర మగ్గాలను తెప్పించుకున్నారు. కానీ వారికి ముడి సరుకు అందుబాటులో లేదు, వున్నా కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితులలో చేసిన అప్పులు తీర్చలేక తమ కుటుంబాల ఆకలి బాధను చూడలేక చాలా మంది నేతన్నలు ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఇంకా మర మగ్గం మీద నేసిన సరుకు సరియైన మార్కెటింగ్ సదుపాయాలు లేక, గిట్టుబాటు ధరలేక తప్పనిసరి పరిస్థితులలో  మధ్య ళారీల దోపిడికి గురు అయి మర మగ్గానికి కూడా దూరంకావలిసిన దుస్థితి ఏర్పడింది.. కరోనా కారణంగా నేతన్న కల చెదిరినట్లయింది. అనేక నేత పరిశ్రమలు మూతపడటం వలన వృత్తినే నమ్ముకున్న నేతన్న వేరే పనిచేయలేక సతమతమవుతున్నాడు, చావుకైనా సిద్ధపడుతున్నాడు. అయినా తన వృత్తిని కాపాడుకోవటంకోసం నేతన్న అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి కనుక కొనసాగితే భారత దేశానికి గర్వకారణమైన చేనేత కళాసంపద శాశ్వతంగా కోల్పోయే ప్రమాదమున్నది.  ప్రస్తుతం పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, తగ్గిపోతున్న అమ్మకాలు ఇలా ఎన్నో కారణాలచేత చేనేత రంగం కష్టాలు కన్నీళ్ల కలబోత అయింది.

గణాంకాల ప్రకారం:

ఇండియా హ్యాండ్లూమ్ సెన్సస్ (2019-20) గణాంకాల ప్రకారం, దేశంలో 26,73,891 మంది చేనేత కార్మికులు మరియు 8,48,621 మంది అనుబంధ కార్మికులు ఉన్నారు, వీరిలో 25930 మంది చేనేత కార్మికులు మరియు 21922 మంది అనుబంధ కార్మికులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం 38000 మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో 47852 వేల మగ్గాలు ఉండగా ఒక్క సిరిసిల్లలోనే 34 వేల చేనేత కార్మికులున్నారు. సిరిసిల్లలో పాతికవేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. సిరిసిల్లలో రోజుకు 34 లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. వివిధ పట్టణాలు, నగరాల్లో వస్త్ర తయారీ యూనిట్లలో దాదాపు 70లక్షల మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 380 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉన్నాయి

ఎదుర్కొంటున్న సమస్యలు:

1. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలలో సరైన నిధుల కేటాయింపులు లేకపోవడం చేనేత కార్మికులకు పెట్టుబడి ప్రధాన సమస్య అయింది. బట్టల తయారీకి సంబంధించిన ముడిసరుకు కొనాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి, వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే నేతన్నలు వారు తయారుచేసిన చీరలను అమ్ముకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.

2. నేతన్నకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. గ్రామాల్లోని నేత కార్మికులకు ముడిసరుకు అందుబాటులో లేకపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ దూరం ప్రయాణించవలసి రావడంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోంది.

3. ముడిసరుకు ధరలు పెరుగుదల, సిల్క్, కాటన్/నూలు, జనప, రసాయనాల ధరలు పెరగడం వల్ల కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి.

4. అన్ని సంప్రదాయ డిజైన్లను అనుకరించి కాపీ చేసి తయారుచేయడంవల్ల చేనేత పరిశ్రమ ఉత్పత్తులకు రక్షణ లేకుండా పోతోంది. అలాగే పేటెంట్' లేకపోవడంతో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుంది.

5. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధి పొందాలనే ఉద్దేశ్యంతో సూరత్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారున్నారు. ప్రభుత్వం వారికి ఇప్పటివరకు ఎలాంటి ఉపాధి కల్పించలేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.

6. చేనేత పరిశ్రమ వర్గాలు మరియు అనేక రాష్ట్రాలు కూడా పన్ను పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ముడిసరుకు ధరలు పెరగడం, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఎంతో మంది చేనేత కార్మికుల జీవితాలు తలకిందులయ్యాయి.

ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి:

1. కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన జిఎస్‌టి రద్దు చెయ్యాలి, దశాబ్దాలుగా అస్తవ్యస్త విధానాలతో కుప్పకూలిన చేనేత పరిశ్రమ జీఎస్టీ పన్నుల భారంతో కొట్టుమిట్టాడుతోంది. సహజసిద్ధమైన నూలు, చేనేత వస్త్రాలను జీఎస్టీలో మినహాయించకపోతే చేనేతలకు ఉపాధి పూర్తిగా తగ్గిపోతుంది. వస్త్ర దిగుమతులు పెరుగుతాయి. జీఎస్టీపై సవివరమైన చర్చలు జరగాల్సి ఉంది. చిన్న, సన్నకారు రైతులు, చేనేత కుటుంబాల సమస్యలు, పరిష్కారాలను మిళితం చేసి సమగ్ర విధానాన్ని రూపొందించాలి. కొత్త పన్ను విధానం వల్ల ఉపాధిని కోల్పోవడమే కాకుండా స్వతంత్ర చేనేత రంగం ఉనికిని కోల్పోతుంది. తద్వారా భారతీయ వస్త్ర పరిశ్రమ విదేశీ ఉత్పత్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది.

2. 1985లో అప్పటి ప్రభుత్వం చేనేత రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చి చేనేత కళాకారులు మగ్గం పైనే 22 రకాల వస్త్రాలను తయారుచేయాలని ఆమోదించారు. తర్వాత కేంద్రం 11 రకాల ఉత్పత్తులకు కుదించింది. ప్రస్తుతం ఉన్న 11 రకాల ఉత్పత్తులను పరిరక్షించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. చేనేతకు కేటాయించిన 11 రకాల ఉత్పత్తులను ఖచ్చితంగా అమలు జరపాలి. ఉల్లంఘించిన పవర్లూమ్యజమాన్యాల పై చర్యలు తీసుకోవాలి. ఎన్హెచ్డిసి ద్వారా నూలు సప్లయి చేయాలి.

3. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలలో సరైన నిధులు కేటాయించాలి.

4. చేనేత కార్మికుడిగా గుర్తింపు కార్డు ఉన్నవాళ్ళకి మాత్రమే చేనేత రుణాలు ఇవ్వాలి.

5. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

6. రాజ్యాంగం ప్రకారం చేనేత కార్మికులకు స్వయం ఉపాధి కల్పించాలి.

7. తెలుగు రాష్ట్రాల్లో స్పిన్నింగ్ పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి రైతులు పండించే నాణ్యమైన పత్తిని స్పిన్నింగ్ పరిశ్రమలు ఉన్న కోయంబత్తూరు, చెన్నై వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాదు అక్కడి పరిశ్రమల్లో తయారైన నూలును తీసుకొచ్చి విక్రయిస్తే రవాణా చార్జీలతో పాటు ధర కూడా పెరుగుతుంది. అందువల్ల మన రాష్ట్రంలో స్పిన్నింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల సామాన్యులకు ధర అందుబాటులో ఉంటుంది. తక్షణమే ప్రభుత్వం స్పిన్నింగ్ పరిశ్రమ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

8. చేనేత గుర్తింపు కార్డు ఉన్నవారికి ప్రభుత్వం సబ్సిడీపై మరమగ్గాలు అందించాలి. కనుమరుగైపోతున్న చేనేత వృత్తిని కాపాడాలి.

ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని నేతన్నలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లైతే చేనేత రంగం అభివృద్ధి చెందడమే కాక వారి పార్టీకి కూడా మంచి పేరు లభిస్తుందని చేనేత కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత సమస్యలను గుర్తించి సమస్యలను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరుకుంటున్నారు.

అంతరించిపోతున్న చేనేత కళను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరిది. చేనేత వస్త్రాలు రిద్దాం నేతన్నలను కాపాడుకుందాం

 

వ్యాసకర్త:
కోట దామోదర్
మొబైల్
: 9391480475


 

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...