స్వర్గాన్ని దివి నుండి భువికి చేర్చే శక్తి సంగీతానికి ఉందని నానుడి. ఆంగ్ల రచయిత "ఎమిల్ లుడ్విగ్" చెప్పినట్లుగా భూలోక వాసులను స్వర్గానికి ఎగరేసుకుపోయే శక్తి సంగీతానికి ఉందన్న నిజం సంగీత ప్రియులకు మాత్రమే తెలుస్తుంది. *సంగీతమే కాదు కవిత్వం* కూడా ఆ కోవకు చెందినదనే విషయం కవితాప్రియులకు మాత్రమే తెలుస్తుంది. అన్ని కవిత్వాలకు ఆ శక్తి ఉంటుందో లేదో తెలియదు గానీ పాఠకుల హృదయాలను దోచుకునే కవిత్వాలకు అలాంటి శక్తి ఖచ్చితంగా ఉంటుంది. భావాత్మక కవిత్వం చదువుతున్నప్పుడు పాఠకుడు తనకు తెలియకుండానే అందులో లీనమై అలౌకికానందాన్ని, తాదాత్మ్యాన్ని పొందుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దీన్నే ‘రసానందం’ అంటారు. సంగీతానికే కాదు భూలోక పాఠకులను స్వర్గంలొ విహరింపజేసేశక్తి కవిత్వానికి కూడా ఉందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
కవిత్వం (కవిత) చదివితే పాఠకుని మనస్సులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి. అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలంగా విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగరమధనం జరిగినట్లుగా భావమథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరుతుంది. శ్రీశ్రీ గారు చెప్పినట్లు కవితా వస్తువు ఏదైనా, అమ్మజోల పాట పాడితే చంటిపాప నిద్రలోకి జారుకున్నట్లుగా పాఠకుడు కవిత్వాన్ని తనివితీరా ఆస్వాదించేలా కవి ప్రతిభాశైలి ఉండాలి. అలాంటి కవిత్వం రాసేవారు ఈమధ్యకాలంలో చాల అరుదుగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం వేలకొద్దీ కవితా సంపుటులు వెలువడుతున్నా వాటిలో కొన్ని మాత్రమే పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. కవిత్వం పట్ల పాఠకుడికి రసజ్ఞత కలగాలంటే, కవి సందర్భానుసారంగా కథావస్తువును కళ్లకు కట్టే విధంగా , మనసును రంజింపజేసే విధంగా కవిత్వీకరించాలి. అప్పుడే కవి పాఠకుల హృదయాంతరాలాల్లోకి చేరుకోగలడు. ఇటీవల “మహతీ సాహితీ కవిసంగమం”, కరీంనగరం వారి “ధనుర్మాస కవితోత్సవం 2024-25” సందర్భంగా వైవిధ్య వ్యాస రచయిత యేచన్ చంద్ర శేఖర్ మస్తిష్కం నుండి పురుడుపోసుకున్న "కవన చంద్రికలు" ఆ కోవకు చెందినవే. కమ్మనైన అమ్మపాట ఎంత మధురమో "కవన చంద్రికలు"లో రచయిత "యేచెన్ చంద్రశేఖర్" రాసిన అమ్మ కవిత్వం కూడా అంతే మధురంగా అనిపిస్తుంది. చంటిపిల్లలు అన్నం తినేందుకు మారాం చేస్తే “చందమామ రావే, జాబిల్లి రావే” అంటూ అమ్మ చందమామను చూపించగానే కడుపు నిండా భోజనం చేసినట్లు, చందమామ పాటవలె మృదుమధురంగా అమ్మ కవితకు అక్షరరూపం కల్పించారు చంద్ర శేఖర్. ఈ పుస్తకంలో “జీవన సౌరభాలు” మరియు “స్వాతంత్ర్య సమరయోధులు” అని రెండు భాగాలున్నాయి.
“జీవన సౌరభాలు” లోని "సకల సౌభాగ్యాల పరమావధి కన్నతల్లి" అన్న కవితలో "అడగకుండా బిడ్డ ఆకలిని తెలుసుకునేది తల్లి.. బిడ్డ ఆకలి తీర్చడానికి పస్తులుండేది తల్లి" అని, ప్రపంచంలో అడగకుండానే బిడ్డ ఆకలిని గుర్తించే ఏకైక వ్యక్తి కన్నతల్లి మాత్రమే అనే అక్షర సత్యాన్ని అందమైన పదాల పొందికతో పాఠకుడికి పసందైన విందును అందించారు. ఈ కవిత చదివిన ప్రతి పాఠకుడి మదిలో కన్నతల్లిపై మమకారం ఉప్పొంగేలా, తల్లిప్రేమను వివరించిన తీరు వర్ణనాతీతం అనిపిస్తుంది. మరో కవితలో "జీవం పోసేది అమ్మ అయితే.. జీవితం ఇచ్చేది నాన్న", "జీవితపు నాణేనికి అమ్మ బొమ్మ అయితే.. బొరుసు నాన్న" అని కడదాకా తనకోసం, తన సుఖసంతోషాలకోసం ఏనాడూ ఆలోచించక జీవితమంతా కన్నబిడ్డలకోసం పరితపించే ‘నాన్న’ గురుంచి ఎంతో అద్భుతంగా చెప్పారు. కవన చంద్రికలు లోని ఒక్కో కవిత చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా కవిత్వం రాయాలన్న ఉద్విగ్నతకు లోనవుతాడు. పాఠకులను మంత్రముగ్దులను చేసే ప్రాసతో కవిత్వం రాయడమంటే అది యేచెన్ చంద్రశేఖర్ గారికే సాధ్యం అనే భావన ఏర్పడుతుంది. ఈ పుస్తకంలోని 49 కవితలు సరళమైన తెలుగు భాషలో సామాన్య పాఠకులకు సైతం కవిత్వంపై అనురక్తి కలిగించే విధంగా ఉన్నాయి.
"సుఖం మరిగిన మనిషి" కవితను గమనిస్తే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఆధునికత’ పేరుతో మనిషి సుఖాలకు అలవాటుపడుతూ యాంత్రికంగా మారుతున్న విషయాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. మనిషి సుఖాలకు అలవాటుపడి, శారీరక శ్రమ లేక రోగాల పాలవుతున్నాడు. సమాజంలో మార్పు రావాలి. కానీ, ఆ మార్పు వలన మనిషికి ప్రయోజనం కలగాలి తప్ప పరాభవం, పతనం కాకూడదన్న విషయాన్నీ కవిత రూపంలో చెప్పడమనేది చాల గొప్ప విషయం. "కాయకష్టం మరిచాడు మనిషి.. సోమరిగా మారిపోయాడు మనిషి" అని అయన వాపోవడం ముమ్మాటికీ వాస్తవమే కదా! ఒకానొకప్పుడు మనిషి మూడుపూటల అన్నంకోసం కష్టపడి పనిచేసేవాడు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఉచితాలకు అలవాటుపడి కష్టాన్ని మరిచిన మాట వాస్తవమే. సుఖం మరిగిన మనిషి గురుంచి ఎన్నో విషయాలను ఈ కవితలో ప్రస్తావించారు.
"ఛిద్రమవుతున్న బతుకు చిత్రం" కవితలో , ‘కరోనా’ నేపథ్యంలో బడుగుల బతుకు కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ రచయిత ఇలా అన్నారు ...
"ఛిద్రమవుతున్నాయి బడుగుల బతుకులు..
మానలేదింకా కరోనా రేపిన గాయాలు"
"అంతలోనే విరుచుకుపడ్డ ధరల శరాఘాతాలు.. ఆకాశాన్నంటే ధరలతో తప్పట్లేదు వెతలు"
కరోనా ప్రభావంతో సామాన్యుడు చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తోంటే, ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు పెను భారాన్ని మోపుతున్నాయని, అరకొర సంపాదనతో జీవితాలు కుదేలవుతున్నాయని అయినా బడుగు జీవులు సంసారసాగరమీదడానికి భగీరథప్రయత్నాలు చేస్తున్నారని ఈ కవిత ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు.
"స్నేహం" ఈ కవితలో "అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తమే స్నేహం.. చెమర్చిన కన్నులలో చెదిరిపోని జ్ఞాపకమే స్నేహం" అంటూ, ఈ సృష్టిలో స్నేహానికి మించిన గొప్ప వరం మరొకటి లేదంటాడు రచయిత. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి మనిషికి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. అందుకే మంచి స్నేహితున్ని మించిన ఆస్తి లేదంటారు. మన జీవితంలో లక్షలు, కోట్ల సంపదకన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహం దొరకడం గొప్ప వరం. స్నేహానికి ఎల్లలు, కులం, మతాలుండవు. “స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా” అనే అక్షర సత్యాన్ని స్పష్టంగా వివరించారు.
రెండవ భాగం “స్వాతంత్ర్య సమరయోధులు”లో 37 కవితలు చరిత్రలో అట్టడుగు పుటలలో శిధిలావస్థలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల గురుంచి రాశారు. వారిలో చాలా మంది గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. చరిత్ర మరిచిన అలాంటి మహనీయుల గాధలను భవిష్యత్ తరాలు స్ఫూర్తిగా తీసుకునేలా, ఆ యోధుల త్యాగాలను విశ్లేషిస్తూ క్లుప్తంగా వివరించారు.
"కవన చంద్రికలు" లోని ప్రతి కవిత దేనికది ప్రత్యేకమే. ప్రతి కవిత కూడా పాఠకుడిని భావుకతకు గురిచేసేలా రాయడం ఆయన రచనాశైలికి కలికితురాయిగా నిలుస్తాయి. చదివిన ప్రతి పాఠకుడు, కలం చేతబట్టి తన హృదయంతరాలాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోయాలనే ప్రేరణ కలిగించేలా సాగింది యేచెన్ చంద్రశేఖర్ “కవన చంద్రికలు”. సమాజాభివృద్ధికి ఉపయోగపడే మరిన్ని కవితలు యేచెన్ చంద్ర శేఖర్ గారి కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ ఆకాంక్ష.
“కవన చంద్రికలు” ప్రతుల కోసం రచయితను నేరుగా మొబైల్ నెంబర్ +91 8885050822 కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా లేదా chandrashekar.achen@gmail.com కు ఈమెయిల్ పంపడం ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాస రచయిత
కోట దామోదర్
మొబైల్: 9391480475
