మరపురాని యోధులు
2008లో ముంబైలో జరిగిన 26/11మారణహోమం భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఉగ్రవాద మచ్చగా మిగిలిపోయింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 174 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డ విషయం దేశ ప్రజలెన్నటికీ మర్చిపోలేరు. భారత భద్రతా బలగాలు 60 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి 10 మంది ఉగ్రవాదులలో 9మందిని మట్టుబెట్టి ఒక్క అజ్మల్ కసబ్‌ను మాత్రమే ప్రాణాలతో పట్టుకున్న విషయం, ఆ ఉగ్రవాదిపై ఏప్రిల్ 20, 2009న ప్రారంభమైన విచారణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నవంబర్ 21, 2012న ఉరి తీసిన విషయం అందరికి గుర్తుంది. కానీ సుప్రీంకోర్టు విచారణలో నిర్భయంగా వాంగ్మూలం ఇచ్చి కసబ్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రత్యక్ష సాక్షిగా నిరుపమాన ధైర్యం ప్రదర్శించిన అతి పిన్న వయస్కురాలైన దేవికా రోటావన్ విషయం మాత్రం చాలామందికి తెలియదు. మరొక్క మాటలో చెప్పాలంటే గుర్తుకులేదు. దాడి జరిగిన సమయంలో దేవికా రోటావన్ వయసు కేవలం 9 ఏళ్ళు మాత్రమే. దుర్ఘటన సందర్భంలో అక్కడ చాలామంది ఉన్నప్పటికీ అందులో ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పడానికి సాహసం చేయకపోవడం విచారకరమైన విషయం. దేశభక్తి మూర్తీభవించిన ఒక 9 ఏళ్ళ అమ్మాయి ఉగ్రవాదికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం ఏంటి అనే సందేహం ప్రతిఒక్కరికి కలుగుతుంది. కనీసం అంతటి తెగువకు సాహసించిన ఆ అమ్మాయి పేరు మనలో ఎంత మందికి గుర్తుంది? “అన్నీ గుర్తుపెట్టుకుంటాం కానీ అసలోడిని మాత్రం మర్చిపోతాం” అనే సామెత లాగా ప్రస్తుత సమాజం తీరు ఉంది. ప్రతి సంవత్సరం నవంబర్ 26న “26/11 నెవర్ అగైన్” అని కొవ్వొత్తుల ప్రదర్శనలు, సంతాప సభలు నిర్వహిస్తుంటాం కానీ ప్రాణాలతో పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాదికి ఉరిశిక్ష పడేందుకు ప్రాణాలకు తెగించి వాంగ్మూలం ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి దేవికా రోటావన్ ను మాత్రం అందరం మర్చిపోయాం.కళ్ళముందు నేరం జరిగినా చూసీచూడనట్లు పట్టించుకోకుండా పోయేవారు కొందరైతే, అనవసరమైన విషయాల్లో తలదూర్చితే ప్రాణాలకే ముప్పని భావించేవారు మరికొందరు ఉంటారు. సాక్ష్యం చెప్పడం అంటే చావుకు ఎదురుపోయినట్లే అనే ఉద్దేశంతో అక్కడ జరిగిన సంఘటనను చూసినప్పటికీ చూడలేదని చెప్పి తప్పించుకుంటారు. కొన్ని సంఘటనల్లో సాక్ష్యులను హతమార్చిన సందర్భాలు కూడా ఉండడమే ఇందుకు కారణం. ఏదైనా నేరం జరిగినప్పుడు, సరైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే కదా నేరం రుజువై నేరస్థుడికి సరైన శిక్ష పడేది. మరి సాక్షాలే లేనప్పుడు కోర్టు నేరస్థులను శిక్షించేది ఎలా? నేరాలు జరుగకుండా ఆపేది ఎలా? ఇలాంటి సంఘటనలలో నేరస్థులను శిక్షించడం న్యాయస్థానాలకు ఇబ్బందికరంగా మారుతుంది. చిన్న చిన్న నేరాలకు సైతం సాక్ష్యాలు చెప్పడానికి ప్రజలు వెనకాడుతున్న సమయంలో దేశంలోనే అతిపెద్ద ఉగ్రదాడి ఘటనలో 9 ఏళ్ళ అమ్మాయి ప్రత్యక్ష సాక్షిగా ముందుకు రావడం యావత్ దేశం గర్వించదగిన విషయమే కదా! ఇది ముమ్మాటికీ గర్వించదగిన విషయమే. అంతేకాదు దేవికను అభినందించాల్సిన విషయం కూడా. ఇంతటి సాహసానికి ఒడికట్టిన దేవికా రోటావన్ ఎవరనేది తెలుసుకోవాలంటే ఈ వ్యాసం పూర్తిగా చదవాల్సిందే.
భారత చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రవాద చర్యల్లో ఒకటైన 26/11 ముంబై దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటికి తొమ్మిదేళ్ల వయసు గల దేవికా రోటావన్ కు ఆ ఘటనా సమయంలో కుడి కాలిపై బుల్లెట్ గాయం కాగా కాల్పులు జరిపిన కసబ్‌ను స్వయంగా చూసింది. 65 రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడిన దేవికాను ఆ తర్వాత ప్రభుత్వం కోర్టులో సాక్షిగా ప్రవేశ పెట్టింది. దేశం కోసం, దేశ రక్షణ కోసం ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నిర్భయంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకువచ్చింది. ఆమె సాక్ష్యం చెప్పకుండా ఉండటానికి ఉగ్రవాదుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. అంతేకాదు ఆమె బంధువులు కూడా ఉగ్రవాదులవల్ల తమకు ప్రాణహాని కలుగుతుందేమోనని భావించి వారికి దూరంగా ఉన్నారు. దీనికి తోడు, పాఠశాలలో దేవికాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీని వల్ల ఇతర విద్యార్థులకు ప్రాణ హాని జరిగే అవకాశం ఉందని పాఠశాల యాజమాన్యం ఆమెను పాఠశాల నుండి బహిష్కరించారు. దేవిక ఉగ్రవాదుల లక్శ్యంగా ఉన్నందున అద్దె ఇంటివారు కూడా వెళ్లగొట్టే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే దేవిక మాత్రం దేశం పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఇసుమంతైనా భయపడలేదు. కోర్టు విచారణలో సాక్ష్యం చెప్పడమే కాకుండా కసబ్ ను గుర్తించి, ఆరోజు దాడిలో అతనే తనపై కాల్పులు జరిపాడని సాక్ష్యం చెప్పడంతో, కోర్టు మే 2010లో, కసబ్ కు మరణశిక్ష విధించి, నవంబర్ 21, 2012న ఉరి తీసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికీ దేవిక అనేక అవరోధాలను, అవమానాలను ఎదుర్కొంటోంది. ఉండటానికి సరైన ఇల్లు లేక, అద్దెకు దొరక్క ఎన్నో సార్లు ప్రభుత్వానికి తన బాధను మొరపెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. సాక్ష్యం చెప్పే సమయంలో ఎందరో నాయకులు అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవి ఏవీ నెరవేరలేదు. ఆమె కూడా మనలో చాలా మంది లాగా ‘నాకెందుకులే’ అనుకుని ఉండి ఉంటే కసబ్ కి ఉరి శిక్ష పడేది కాదేమో! తన మరియు తన కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశం కోసం ఆమె చేపట్టిన సాహసోపేతమైన చర్యను గుర్తించుకోకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.
కసబ్ ను పట్టుకున్న సబ్ ఇన్స్పెక్టర్ గుర్తున్నాడా?
దేవికా రోటావన్ పేరుతో పాటు కసబ్ ను పట్టుకునేందుకు కేవలం చేతిలో లాఠీతో కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న కసబ్ సహా మరో ఉగ్రవాదిపై విరుచుకుపడి కసబ్ సజీవంగా పట్టుబడడంలో కీలకంగా వ్యవహరించిన సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే పేరు దేశ పౌరులు మరిచిపోయారు. తుకారాం ఒంబ్లే 26/11 ముంబై దాడుల సమయంలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలు లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు అమూల్యమైన విజయాన్ని సాధించాడు. ఆయన అసమాన ధైర్యసాహసాలు దేశం కోసం త్యాగానికి ప్రతీకగా నిలిచాయి. పోలీసు శాఖలో చేరడానికి ముందు, ఓంబ్లే 16 సంవత్సరాలకు పైగా భారత సైన్యంలో పనిచేశారు. ఇది తన కర్తవ్య భావాన్ని మరియు దేశం పట్ల ప్రేమను పెంచింది. ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత ఆయన అలుపెరగని సేవాభావంతో ముంబై పోలీస్ శాఖలో చేరారు. ముంబై దాడుల తర్వాత స్కోడా కారును హైజాక్ చేసి సీఎస్టీ వద్ద విధ్వంసం సృష్టించి పారిపోతున్న ఇద్దరు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తుకారాం ఓంబ్లే అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరుపుతున్నప్పటికీ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఓంబ్లే లాఠీ (లాఠీ) తప్ప మరేమీ లేకుండా కసబ్ వద్ద ఉన్న ఏకే-47 బారెల్ ను పట్టుకుని మరింత కాల్పులు జరపకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంతటి దైర్యవంతుడిని కూడా మనం మరిచిపోవడం ఇంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉండదేమో!
"పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప..." అని శ్రీశ్రీ అన్నట్లు కళ్ళఎదుట జరిగిన సంఘటనకు మనం సాక్ష్యం చెప్పలేకపోతున్నామంటే నిజానికి మనం బానిస సంకెళ్ళు వేసుకున్నట్లే.. మన దేశంలో ఎంతోమంది దేశం కోసం పోరాడుతున్న యోధులు ఉన్నారు కానీ వారిని గుర్తించుకోకపోవడమే మనం చేసే పెద్ద తప్పు.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ :9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి