విశ్రాంతి వయస్సులో విజ్ఞాన యాత్ర:
చాలా మంది అమ్మమ్మలు, నాన్నమ్మలకు చదువు లేకపోయినా, వారి హృదయం మాత్రం జ్ఞానం తో నిండి ఉంటుంది. చిన్ననాటి రోజుల్లో చదువుకోకపోయినా బాధను వారు జీవితాంతం మోస్తూనే ఉంటారు. ఆ బాధే వారికి చదువు విలువను బాగా అర్థం చేసుకునేలా చేస్తుంది.
సాయంత్రం పిల్లలు చుట్టూ చేరగానే, అమ్మమ్మ వారిని దగ్గరకు తీసుకుని ప్రేమగా తల నిమురుతుంది. తన కష్టాల కథను మృదువుగా చెప్పి, చివరగా “నాన్నా, నేను చదువుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాను. మీరు మాత్రం బాగా చదువుకోండి” అని హృదయపూర్వకంగా చెబుతుంది. ఆ మాటల్లో పుస్తకాల జ్ఞానం లేకపోయినా, అనుభవాల జ్ఞానం ఉంటుంది. చదువు లేకపోయినా, వారి మాటలే పిల్లలకు జీవిత పాఠాలుగా మారుతాయి.
తమకు దక్కని చదువు పిల్లలకు అయినా అందించాలనుకునే వారి ఆశయం ఎంతో గొప్పది. అలాంటి అమ్మమ్మలకు చదువుకునేందుకు ఒక పాఠశాల ఉంటే, వారు అక్షరాలు నేర్చుకొని తమ పేరును తామే రాయగలిగితే ఎంత ఆనందపడతారు! చదవడం రాయడం నేర్చుకోవడం వారికి కొత్త ఆశ, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
అలాంటి అమ్మమ్మల కోసం ఒక పాఠశాల ఉంటే ఎంత బాగుండేదో అనిపించక మానదు. నిజానికి, అలాంటి ఒక ప్రత్యేక పాఠశాల మహారాష్ట్రలోని థానే జిల్లాలో, ముర్బాద్ పరిధిలోని ఫంగానే గ్రామంలో ఉంది. అది ఆజిబైచి శాల అని పిలవబడుతుంది. కానీ ఈ పాఠశాల గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.
ముందుగా మనం ఆజిబైచి అంటే ఏమిటో తెలుసుకుందాం.
ఆజీబాయి అంటే మరాఠీలో "అమ్మమ్మ" అని అర్థం.
“చి” అంటే మరాఠీ భాషలో "సంబంధించింది" అని అర్థం.
అందువలన, ఆజిబైచి శాల అంటే అమ్మమ్మల పాఠశాల అని అర్థం.
2016 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుడు యోగేంద్ర బంగార్ గారి కృషితో అమ్మమ్మల పాఠశాల ప్రారంభించబడింది. ‘యోగేంద్ర బంగార్ గారికి ఈ పాఠశాల ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది?’ అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో కలగడం సహజమే. ఈ పాఠశాల ప్రారంభం 2016 లో కొంత వినూత్నంగా, ఆసక్తికరంగా జరిగింది.
ఒకరోజు వారి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గాథను గానం చేశారు. పాటలోని వీరగాథను అవ్వలు ఆసక్తిగా విన్నా, చదువు లేని కారణంగా ఆ కథ యొక్క లోతు వారికి పూర్తిగా అర్థం కాలేదు. కార్యక్రమం ముగిసిన తర్వాత అవ్వలు గ్రామ ఉపాధ్యాయుడైన యోగేంద్ర బంగార్ గారి వద్దకు వెళ్లి, ‘మేం కూడా చదువుకుని ఉంటే ఈ కథను ఎంత బాగా ఆస్వాదించేవాళ్లమో’ అంటూ తమ జీవితంలో మిగిలిపోయిన బాధను ఆయనతో పంచుకున్నారు.
వారి మాటలు యోగేంద్ర బంగార్ గారి మనసును గాఢంగా కదిలించాయి. ఈ సంఘటనతో ‘వారికీ ఒక పాఠశాల ఉంటే ఎంత బాగుంటుంది’ అనే ఆలోచన ఆయనలో పుట్టింది. స్కూల్ ఏర్పాటు ద్వారా అవ్వలు ఒంటరితనం, అవగాహన లోపం నుండి బయటకు రావచ్చు అని ఆయన భావించి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు, 2016 మార్చి 8న అమ్మమ్మల పాఠశాలను ప్రారంభించారు.
పెద్దవాళ్లు నిత్యం ఇంటి పనులతో బిజీగా ఉంటారు కదా మరి పాఠశాలకు వెళ్లి చదువుకునేంత టైం ఎక్కడ ఉంటుందని అనుకుంటున్నారా? వారి పనులన్నీ అయ్యాక మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్కూల్ కు వెళ్లి చదువుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ సమయం పెద్దవాళ్లు ఇంటి పనులన్నీ ముగించి విశ్రాంతి తీసుకునే సమయం. ఆ సమయాన్ని వారు చదువు నేర్చుకోవడానికి ఉపయోగించడం నిజంగా అభినందించదగిన విషయం. ఈ పాఠశాలలో వారు మరాఠీ అక్షరమాల, తమ పేర్లు రాయడం, తేలికైన లెక్కలు, చదువు మాత్రమే కాకుండా ఆర్ట్స్, క్రాఫ్ట్స్ లను కూడా నేర్చుకుంటారు. అదేవిధంగా, పెద్దవాళ్లకు ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు కూడా ఈ పాఠశాలలో నేర్పుతారు. ఈ పాఠశాలలో చేరాలంటే వయస్సుతో సంబంధం లేదు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా రావొచ్చు.
ప్రతి ఊరిలో వృద్ధాశ్రమాల బదులు ఇలాంటి స్కూల్స్ ఏర్పాటు చేస్తే వృద్ధులకు ఒంటరితనం నుండి ఉపశమనం పొందడమే కాకుండా విద్యావంతులవడం వలన వారికి సమాజం పట్ల, ఆరోగ్యం పట్ల మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా వారికి మొబైల్ వాడకం, ఇంటర్నెట్ వాడకం వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం లభించడం వల్ల ఒంటరితనం నుంచి పూర్తిగా సేద తీరుతారు. “ఆజిబైచి శాల” పాఠశాల వృద్ధ మహిళలకు విద్యా అవకాశాలు అందించడం ద్వారా, వారి జీవితాలలో స్ఫూర్తిని నింపి సంతృప్తిని కలిగిస్తోంది. ఇది సమాజంలో సమానత్వం, మహిళా సాధికారతకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే ప్రతి గ్రామంలో వృద్ధాశ్రమాల బదులు వృద్ధుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఊరూ పూనుకుని ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేస్తే నిరక్షరాస్యత సమస్య సమసి పోవడం మాత్రమే కాదు వృద్ధుల మనోవికాసంతో పాటు వారికి కొత్త జవసత్వాలను ఇచ్చి వారిలో ఉదాసీనత పోగొడుతుంది అంటాడు స్కూల్ వ్యవస్థాపకుడు యోగేంద్ర బంగార్.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి