మనిషి పుట్టుకతో ఏదైనా అవయవలోపం ఏర్పడినా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి. కానీ ఇంద్రియాలలో ప్రధానమైన నయనాలు (కళ్ళు) లేకుంటే మాత్రం ఆ జీవితం అంధకారమే.
మానవ శరీరంలో అత్యంత విలువైన, సున్నితమైన అవయవం కన్ను. మానవుడు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడగల్గుతున్నాడంటే దానికి కారణం కళ్ళు. అది మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. కళ్ళు లేనివారు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.
మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం వుండకూడదు అంటారు. మనోస్థైర్యం ఉన్నవారు శరీర వైకల్యాన్ని అధిగమించడమేగాక ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఇది అక్షరాలా నిజం. అలాంటి స్ఫూర్తివంతమైన అంధురాలి యదార్థ జీవిత గాధ ఇది. ఆమె పేరు "పయ్యావుల కొమురమ్మ". ఆమె పుట్టుకతోనే అంధురాలు. అయితేనేం తన పనులు తానే చేసుకుంటూ ఎంతోమంది దివ్యాంగులకు, యువతీయువకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
కొమురమ్మది సూర్యాపేట జిల్లా మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లి. ఆమె నిరుపేద యాదవ కుటుంబంలోబొర్రయ్య, ముత్తమ్మలకు జన్మించింది . ఆమె జన్మతః అంధురాలు అవటంవల్ల సవాలక్ష సవాళ్ళు ఎదుర్కొంది. జీవితంలో ఏ పనిచేయలేని కొమురమ్మకు తల్లి ముత్తమ్మ తొలి గురువు. ప్రపంచంలోని అమ్మలందరికీ పిల్లలపై ఆకాశమంత ప్రేమ ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ముత్తమ్మ కు బిడ్డ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ. అంధకారం అలుముకున్న తన బిడ్డ జీవితాన్ని చూసి ఆ తల్లి రోదించిన సందర్భాలెన్నో. కొమురమ్మను అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కానీ అది అంధుల పాఠశాల కాకపోవడంతో ఆమె గురువులు చెప్పేపాఠాలు సరిగా అర్ధం చేసుకోలేకపోయేది. చుట్టుప్రక్కల ఎక్కడ కూడా అంధుల పాఠశాలలు లేనందున ఆమె ఇంటికే పరిమితమయింది.
కొమురమ్మను తల్లి కూలిపనులకు, పొలం పనులకు ఎక్కడికి వెళ్లిన తన వెంటే తీసుకుకెల్లేది, అంతేగాక తన తల్లి మాట్లాడే బంధుత్వ వరుసలను , మాట్లాడే విధానాన్ని పరిశీలించి కొద్దికొద్దిగా నేర్చుకోవడం ప్రయత్నించింది.ప్రతిఒక్కరి గొంతును గుర్తుంచుకునేది. ఎవరైనా ఇంటికి వస్తే వారి గొంతువిని వారి పేరు వెంటనే చెప్పేది అంత జ్ఞాపకశక్తి కొమురమ్మది. మానవత్వానికి మరో పేరు "పయ్యావుల ముత్తమ్మ". ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనసు ఆమెది. బిడ్డ ఎదిగేకొద్దీ తల్లికి అనుకోని బాధ వెంటాడేది.తానుఆరోగ్యంగా ఉన్నంతవరకు బిడ్డను చూసుకుంటాను కానీ తన తరువాత తన బిడ్డ ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా పనులు ఎలా చేసుకుంటుంది అనే ఆలోచనే బాధించేది ఆ తల్లికి. లచ్చమ్మకు అక్షరజ్ఞానం లేకపోయినా ముందుఆలోచనతో తన బిడ్డకు అందరిలాగే వంట, ఇంటి పనులు చేసుకోవడానికి మంచి శిక్షణ ఇచ్చింది. కొమురమ్మ శ్రద్దగా వింటూ ఓపికగా నేర్చుకోసాగింది. ఆలా కొమురమ్మ జీవితాన్ని ఆమె చీకటి నుండి వెలుగులోకి తీసుకురాగలిగింది. మొదట బిడ్డ జీవితంచూసి చలించిపోయేది. ఆమె మంచి భవిష్యత్తు కోసం తపించేది. తల్లీ నీకు పాదాభివందనం.
బిడ్డపట్ల తల్లి ప్రేమ వర్ణించలేనిది, వెలకట్టలేనిది. పనులు నేర్పించడమేగాక ఊరిలో ఎవరింటికి ఎలా వెళ్లాలో తీసుకొనివెళ్ళి చూపించేది చాలా సార్లు. తల్లి చూపించిన ఇంటి దూరాన్ని అడుగుల లెక్కతో మరియు సమయాన్ని బట్టి ప్రతిఒక్కరి ఇంటికి వెళ్లగలదు. అది చూసేవారికి ఆశ్చర్యం, అనుమానం కూడా కళ్ళు కనిపిస్తాయేమోఅని. కానీఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది.
కళ్ళు లేవని కలత చెందలేదు. నాకు భవిష్యత్తు లేదని ఆగిపోలేదు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకుసాగింది. ఆమె విజయం వెనుక తల్లి ఉంది.
అలా తల్లి ముత్తమ్మ కొమురమ్మను 43 ఏళ్ళు వరకు అన్నీతానే దగ్గరుండి చూసుకుంది. ఒడిదొడుకులతో సాగుతున్న కొమురమ్మ జీవితం లో అనుకోకుండా తీవ్ర అనారోగ్యం కారణంగా తల్లి మరణించింది. తల్లి మరణవార్తవిన్న కొమురమ్మ కన్నీరుమున్నీరైంది. ఆ సంఘటన చూసిన ఊరి జనానికి ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించిన సందర్భం.. తల్లి మరణాంతరం తండ్రి (బొర్రయ్య) కూడా అనారోగ్యానికి గురైనారు. ముత్తమ్మ ముందుఆలోచనతో కొమురమ్మ తన పనులు తానే చేసుకునేలా తర్ఫీడునిచ్చింది.
నిరుపేదరాలైన కొమురమ్మకు ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. పాత మట్టిగోడలమద్యే ఆమె నివాసం. ఎన్ని ప్రభుత్వాలు మారిన కొమురమ్మ గోడు పట్టించుకునే నాధుడే లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం కొమురమ్మపట్ల ప్రత్యేక చొరవ చూపాలని కోరుకుంటున్నాం.
ఈరోజుల్లో అన్నిఅవయవాలుండి పనిచేయటానికి బద్ధకం ఉన్నవాళ్ళకి కొమురమ్మ ఒక ఆదర్శం కావాలని కోరుకుంటూ..
కొమురమ్మ నిండునూరేళ్ళు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనందరం ఆ భగవంతుణ్ణి కోరుకుందాం.
కోట దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి