14, నవంబర్ 2022, సోమవారం

వింతలెన్నో చూడ రండి




ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, అంతుపట్టలేని వింతలు, విశేషాలు ఉన్నాయి. మానవుడికి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి అబ్బుర పరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా చూస్తేగానీ నమ్మలేని అద్భుతాలెన్నింటినో పరిశోధనలు చేసినప్పటికీ కూడా శాస్త్రజ్ఞులు సరైన ఆధారాలు కనిపెట్టలేకపోతున్నారు . 

విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఒకరోజు చెట్టు నుంచి రాలిన ఆపిల్ ను గమనించి, ఆపిల్ క్రింద పడటానికి గల కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందో వివరిస్తూ  విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, గమన సూత్రాలను నిర్వచించాడు. 

ఒక వస్తువును పైకివిసిరినపుడు తిరిగి ఆ వస్తువు కిందకు పడటానికి కారణం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండటంవల్లనే అని మనం చిన్నపుడు పాఠ్యపుస్తకాలల్లో చదువుకున్నాం.

కానీ పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమేనా? అనే సందేహం చాలా మందికి కలగడం సహజమే ..

గురుత్వాకర్షణ శక్తి ధిక్కరించిన చోట పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమే అని చెప్పొచ్చు. ఈ భూగోళం అంతా  గురుత్వాకర్షణ శక్తి కలిగివుందని మనకు తెలుసు. కానీ  ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ప్రదేశాల గురుంచి మాత్రం చాలా మందికి తెలియదు


ప్రపంచంలో కేవలం ప్రదేశాలలోమాత్రమే గురుత్వాకర్షణ శక్తి  పనిచేయదని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు.


 1 . మాగ్నెటిక్ హిల్, లేహ్, లడక్, ఇండియా (Magnetic Hill, Leh Ladakh, India)

భారత దేశంలోని, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, లేహ్ జిల్లాకి 30 కిలోమీటర్ల దూరంలో గల ప్రదేశాలు సుందర మనోహరమైన దృశ్యాలతో పర్యాటకులనుఆకర్షిస్తాయి. అటువంటి అద్భుతమైనఆకర్షణలలో “మాగ్నెటిక్ హిల్” (అయస్కాంత కొండ)ఒకటి. ఇది సముద్రమట్టం కంటే 14,000 అడుగుల ఎత్తులో ట్రాన్స్-హిమాలయన్ ప్రాంతంలో లేహ్-కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది. మాగ్నెటిక్ హిల్ తూర్పున సింధు నది ప్రవహిస్తుంది. మాగ్నెటిక్ హిల్ ప్రాంతం చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన ఒక పసుపు రంగు సైన్ బోర్డు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది.  "అయస్కాంత కొండ, గురుత్వాకర్షణను ధిక్కరించే దృగ్విషయం. మీ వాహనాన్ని రోడ్డుపై తెల్లటి పెయింట్‌తో గుర్తు పెట్టబడిన పెట్టెలో పార్క్ చేయండి" అని రాయబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో మోటారు వాహనాల ఇంజన్లు ఆపేసినా సరే అవి కొండ వైపు గంటకి ఇరవై కిలోమీటర్ల వేగంతో సాగిపోతుంటాయి.. ఈ ప్రాంతం యొక్క లేఅవుట్ మరియు చుట్టుపక్కల వాలులు కొండ యొక్క ఆప్టికల్ భ్రమను సృష్టిస్తాయి. కొండ రహదారి నిజానికి లోతువైపు ఉన్న రహదారి. కొండ రహదారిపై ఉన్న వస్తువులు మరియు కార్లు నిజానికి లోతువైపుకు దొర్లుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తికి ధిక్కరించి ఎత్తుపైకి దొర్లినట్లు కనిపిస్తాయి. అలా వెనక్కి ఎందుకు వెళ్తున్నాయో ఎవ్వరికి అర్ధంకాని వింత. ఇటుగా వచ్చే టూరిస్టులు మాత్రం విచిత్రమైన ఈ అయస్కాంత కొండని చూసి అబ్బురపడుతుంటారు.ఈ కొండ సమీపంలోకి రాగానే హెలికాప్టర్ల వేగంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని అంటారు. జూలై మరియు అక్టోబర్నెలలు ఈ మాగ్నెటిక్ హిల్ సందర్శించడానికి అనువైన సమయం.

సిద్ధాంతాల ప్రకారం:

ఈ కొండకి అయస్కాంత శక్తి  ఉండటంవల్ల ఇలా జరుగుతుందని కొందరి నమ్మకం, మరి కొందరు మాత్రం ఈ కొండ ప్రాంతంలో కంటికి కనిపించని అదృశ్యశక్తులు ఉన్నాయని, మరికొందరు మాత్రం ఆప్టికల్ ఇల్యూషన్ ( దృశ్య భ్రమ) అని . ఇది చుట్టుపక్కల భూమి యొక్క లేఅవుట్ ఆప్టికల్ భ్రమను ఉత్పత్తి చేసే ప్రదేశం , ఇది కొంచెం లోతువైపు వాలుగా కనిపిస్తుంది. ఎత్తుపైకి వాలు. అందువల్ల, గేర్‌ వదిలివేయబడిన కారు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి దొర్లుతున్నట్లు కనిపిస్తుందని అంటుంటారు.

2 . సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ (Saint Ignace Mystery Spot, Michigan, USA).

 అమెరికా, మిచిగాన్ లోని సెయింట్ ఇగ్నాస్ ప్రాంతంలో మిస్టరీ స్పాట్‌ గొప్ప టూరిస్టు కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. మొదటగా ఈ ప్రాంతంయొక్క ప్రత్యకతలను ఎవరు గుర్తించలేకపోయారు.
1939 లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా కొందరు సర్వేయర్లు మిస్టరీ స్పాట్‌ ప్రత్యేకతలని గుర్తించారు. సర్వేయర్లు మొట్టమొదటి సారిగా సెయింట్ ఇగ్నాస్ వచ్చినప్పుడు వారిదగ్గరున్న పరికరాలన్నీ పనిచేయకుండా స్తంభించి పోయాయి.  సర్వేయర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు పరికరాలన్నీ ఒకేసారి నిలిచిపోవడానికి గల కారణాలేంటి అని తెలుసుకోవడానికి పరిశోధనలు చేయగా  ఆ ప్రాంతంలోని కేవలం300 అడుగుల డయామీటర్ సర్కిల్ లో మాత్రమే ఇలా జరుగుతుందని తేలింది. . ఈ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా ఉంటారని. ఆ ఇద్దరూ వేర్వేరు సైజులో ఉన్నా... అక్కడి ఓ రాయి ఎక్కి... అటూ ఇటూ మారగానే ఇద్దరి సైజూ ఒకేలా ఉంటారని. అంతేకాదు... మనిషి గోడపై వాలుగా నిలబడటం అసాధ్యం కానీ అక్కడి గోడలపై వాలుగా నిల్చోవచ్చు. అయినా కింద పడరు. మిస్టరీ స్పాట్ ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వందల వేల మంది సందర్శకులను ఆశ్చర్యపరుస్తూ మరియు కలవరపరుస్తోంది. శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేసిన తరువాత ఆప్టికల్ ఇల్యూషన్ (దృశ్య భ్రమ) తప్ప మరొకటి లేదని చెప్పడమే గానీ కచ్చితమైన కారణాలు చెప్పలేకపోడవం మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

3 . మిస్టరీ స్పాట్, శాంతాక్రజ్, కాలిఫోర్నియా (Mystery Spot, Santa Cruz, California)

 ఇది సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ లాంటిదే. అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని. శాంతాక్రజ్ సమీపంలో ఉన్న ఓ అడవి ప్రాంతంలో ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన అద్భుతమైన చిన్న ప్రాంతం అది కేవలం 150 అడుగుల వ్యాసార్థం కలిగిన ప్రదేశం. ఆ ప్రాంతంలో ఉన్నవారు పక్కకు వంగగలరు. వంకరగా నడవగలరు. వాళ్లు ఓ కొండను వాలుగా ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. చాలా మంది టూరిస్టులు ఆ ప్రదేశానికి తరచూ వెళ్తుంటారు. ఎందుకంటే. ఎన్నిసార్లు చూసినా గానీ ఆ మిస్టరీ ఏంటో అర్థం కాదు. శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఇలా జరగడానికి ముఖ్య కారణం ఆప్టికల్ ఇల్యూషన్ వలనే అనిచెపుతున్నారు కానీ  కచ్చితమైన కారణం ఏంటన్నది తెలియట్లేదు.. ఈ అరుదైన ప్రాంతానికి పర్యాటకుల సందడి ఎక్కువ.   

 4  . జలపాతం, ఫారో ఐలాండ్స్ (Waterfall, Faroe Islands)

స్కాట్లాండ్, ఐలాండ్ మధ్యన అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో ఉన్న జలపాతం ఇది.
సాధారణంగా జలపాతంలోని నీరు పైభాగం నుండి కిందకు పడటం సహజం. ఇక్కడమాత్రం  నీరు కిందకు కాకుండా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువ వీస్తుండటం వల్లే ఇలా జరుగుతుందని కొందరంటుంటే  మరి కొందరు మాత్రం  జలపాతం నుంచి వచ్చే నీటిని గాలి పైకి పంపేస్తోంది గంటకు 75 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బలమైన గాలి వీయడం అటువంటి దృగ్విషయాలకు కారణమవుతుంది అని నిపుణులు చెప్తున్నారు.

5  . హూవర్ డ్యామ్, నెవాడా, అమెరికా (Hoover Dam, Nevada, USA)

ఈ డామ్ అమెరికా లోని అరిజోనా, నెవాడా రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. హూవర్ డామ్ ఒకానొకప్పుడు బౌల్డర్ డామ్ గా పిలిచేవారు. ఇది కొలరాడోనది యొక్క బ్లాక్ కేనియాన్‌‌లో నిర్మించబడిన ఆర్చ్-గ్రావిటీ డామ్. లాస్ వేగాస్ నుండి హూవర్ డ్యామ్ వరకు సుమారు 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హూవర్ డ్యామ్ కి వెళ్లిన వారికి అక్కడున్న అద్భుతాలనుచూస్తే  ఆశ్చర్యంకలిగిస్తుంది. హూవర్ డ్యామ్ పై నుంచి ఓ బాటిల్ తో నీటిని కిందకు జార విడిస్తే, ఆ నీరు కిందకు పడకుండా. పైకి ఆకాశంవైపు వెళ్తుంది. ఎన్నిసార్లు నీరు జార విడిసినా. నీరు పైకే వెళ్తుంది. నమ్మశక్యం కానీ ఈ అద్భుతాన్ని చూసి పర్యాటకులు ఆశ్చర్య పోకుండా ఉండలేరు.  శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత వారు చెప్పిన సమాచార ప్రకారం  ఆ డ్యామ్ దగ్గర గాలి కింద నుంచి పైకి బాగా ఎక్కువగా వీస్తోందని. ఆ గాలి నీటిని పైకి తోసేస్తుందని. అందుకే ఇలా జరుగుతోందని వెల్లడించారు. అయినా పర్యాటకులకు ఇదొక వింత లాగే అనిపిస్తుంది.


మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

kotadamodar.blogspot.com

10, నవంబర్ 2022, గురువారం

ఆశయాలకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన"హారిక"


విలువిద్యంటే అమితాసక్తి గల ఏకలవ్యుడికి విలువిద్యలో నిష్ణాతుడైన ద్రోణాచార్యుడి దగ్గర విద్య అభ్యసించాలనే కోరిక ప్రబలంగా ఉండేది. కానీ క్షత్రియేతరుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించడంతో అతడు ఏమాత్రం కలత చెందక మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిమనే గురువుగా భావిస్తూ పట్టుదలతో విద్యనభ్యసించి ద్రోణాచార్యుని ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునున్నికూడా మించి పోయాడు.

అలాంటి అభినయ ఏకలవ్యుడిలాంటి స్ఫూర్తిదాయకమైన యధార్థ విజయ గాథ నిజామాబాద్, నాందేవ్ గూడకు చెందిన సతీష్ కుమార్, అనురాధ దంపతుల కుమార్తె హారికది.

హారిక తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి అనురాధ బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.చిన్నప్పటినుండి చదువులో అందరికంటే ముందుండే హారిక ఏడవతరగతిలో ఉన్నపుడే తనకు డాక్టర్ కావాలనే కోరిక కలిగిందని చెప్పటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పట్టుదలతో చదివిన ఆమె పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉతీర్ణత సాధించింది. తన చిన్ననాటి ఆశయ సాధన కోసం నీట్ పరీక్ష రాయాలనుకుంది. కానీ నీట్ కోచింగ్ కోసం ఆర్ధిక స్థోమత లేకపోయినప్పటికీ నిరుత్సాహం చెందక తల్లి ప్రోత్సహంతో ముందడుగు వేసింది.  నిరుపేదరాలైనప్పటికీ,మనుసుంటే మార్గాలెన్నో అన్నట్లు హారిక పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ప్రతిరోజూ యూట్యూబ్ లో దీక్షగా వీడియో క్లాసులు చూస్తూ పరీక్షకు సిద్ధమైంది. కోచింగ్ కు  డబ్బులు లేవని ఆగిపోకుండా తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి యూట్యూబ్ మార్గాన్ని ఎంచుకొని ఘోర తపస్సు చేసి నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. ఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. కోచింగ్ లేకుండా మంచి ర్యాంక్ సాధించినప్పటికీ కాలేజీలో సీట్ వచ్చిన తరువాత ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ కలిపి మొత్తం 2 లక్షలవరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అసలేనిరుపేదరాలైన హారిక  డబ్బు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతూ తన చదువుకోసం ఆర్ధిక సహాయం అందించాలని దాతలను వేడుకోగా  అందుకు ఎంతోమంది దాతలు ముందుకు రావడం చాలా గొప్ప విషయం.

నేటి యువతకు ఇంటర్నెట్ (మొబైల్) నిత్యవసర వస్తువులా మారిపోయింది.కొంతమంది ఇంటర్నెట్ ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని ఇంటర్నెట్ ద్వారా వృధాచేసుకుంటున్నారు.సోషల్‌ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లాభం, నష్టం అనేది వినియోగదారుడిమీదే ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ ని మంచికి వాడితే మాత్రం ఈ భూమిమీద తెలియని విషయాలెన్నోతెలుసుకోవచ్చు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలల్లో దొరకని సమాచారం కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుంది. ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్ లో క్లాసులు వింటూ నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్ సాధించిన హారిక విజయమేఇంటర్నెట్ ని మంచికి ఉపయోగిస్తే విద్యార్థులకు ఎంత ప్రయోజనకరమో తెలిపే ఒక చక్కటి ఉదాహరణ.       

ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్నిఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్నహారిక ఎందరికో ఆదర్శం.

సాధించాలనే తపన ఉంటేఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.

అసాధ్యమనే పదంలో"అ" అనే అక్షరాన్ని పక్కనే పెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధించవచ్చు.

ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.

ప్రతి విద్యార్థి అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.

 

మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

kotadamodar.blogspot.com

8, నవంబర్ 2022, మంగళవారం

అంతరించిపోతున్న కుమ్మరి వృత్తి

మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'.

మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసింది కుమ్మరి.

మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే గాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా తీర్చిదిద్దిన ఘనత కుమ్మరిది. పూర్వం మానవుడు మట్టిపాత్రలు మాత్రమే వాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాడు. మనిషి పుట్టుక మరియు చావు కుండలేనిదే పూర్తికాదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పుట్టిన పురిటి బిడ్డకు పురుడు పోసేందుకు మరియు చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు సైతం కుండను వినియోగిస్తారు. ఇలా మనిషి మనుగడకు మట్టి పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయని అనడంలో ఎలాంటి సందేహములేదు. మట్టిని కుండగా మలచడంలో నేర్పరితనం ఉంటుంది. సాధారణంగా అది అందరికి సాధ్యం కాదు.

కుండ చెప్పిన నీతి:

ఒకసారి కుండను ఎవరో అడిగారట...

నువ్వు పరిస్థితులతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా (ప్రశాంతంగా) ఉంటావు కదా ! ఇది ఎలా సాధ్యం ! అని...

దానికి కుండ చెప్పిన సమాధానం మనను ఆలోచించేలా చేస్తుంది. తాను వచ్చింది మట్టిలో నుండి అని, మళ్ళీ తిరిగి వెళ్లి కలిసేది కూడా మట్టిలోనే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని అంటూ మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరులాంటివి అవసరమా...! అని జవాబు ఇచ్చిందంట..

కుండ చెప్పిన నీతి ఎంత మధురం! అలా కుండ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.  

నాడు పెళ్లిళ్లు, దశ దిన కర్మలు, గ్రామాలలో జరుపుకునే బోనాలు, ఉగాది, జాతరలకు కుమ్మరులు తయారు చేసిన కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, అన్నం వండుకోవటానికి (బువ్వ గిన్నె), నీళ్లు నిల్వచేయటానికి (గోలెం), నీళ్లు మరగపెట్టడానికి (కుండ), వస్తువులను భద్రపరచటానికి (గాదెలు), కూరాడు, ముంత, దీపపు ప్రమిదలు, కల్లు కుండలు, పెళ్ళిలో అయిరేని కుండలు,  గరిగ ముంత, రంజన్లు, మట్టి బొమ్మలు, పూల కుండీలు, నీళ్ళ బుంగలు, ఇంటి నిర్మాణం కోసం పెంకులు, డబ్బులను దాచుకునేందుకు గళ్ల గురిగిలను, వేసవి కాలంలో చల్లని నీటిని అందించే కూజాలను తయారు చేసేవారు. శుభ కార్యాలకు సైతం కుమ్మరి కుండలనే వాడుతుంటారు. కొంత మంది అనారోగ్యానికి గురైనప్పుడు సైతం కుమ్మరి కుండలనే వినియోగించేవారు. ఎందుకంటే అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఇవి ఎంతో దోహదపడుతుంటాయి. ఇలా మట్టి పాత్రలను అనేక విధాలుగా ఉపయోగించుకునేవారు. అతి సాధారణంగా కనిపించే ఒక కుండ తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ముందుగా చెరువుల్లో రేగడిమట్టిని తీసుకొచ్చి అందులో రాళ్లు లేకుండా జల్లెడ పట్టి ఇసుక మాదిరిగా తయారుచేస్తారు. ఎన్ని కుండలు చేయాలనుకున్నారో దానికి ఎంత మట్టి కావాలో అంత మట్టి ఒకదగ్గర పోసి అందులోకొన్ని నీళ్ళుకలిపి కాళ్లతో బాగా తొక్కి ముద్దలు ముద్దలుగా తయారుచేసుకుంటారు.  తరువాత ఆ మట్టి ముద్దలను కుమ్మరి చక్రంపై (సారె) పై చేర్చి పొడుగాటి కర్రతో గిరగిరా రెండు చేతులతో తిప్పుతూ మట్టిని చేతివేళ్ల తో నేర్పరితనం రంగరించి కావాల్సిన అకృతి వచ్చే వరకు మలిచి దానిని కొలిమిలో ఉంచి కాల్చుతారు.

ఎండాకాలంలో వేడి తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి కుండలను ఎక్కువ వాడేవారు.

మట్టి కుండల్లోని నీరు త్రాగడంవలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటుపడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు.

అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారుచేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్ళలో నివసించినవారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాలలో సైతం పెంకుటిళ్ళుఅంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.

 

 మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

2, నవంబర్ 2022, బుధవారం

అందరికి ఆదర్శం అంధురాలు "పయ్యావుల కొమురమ్మ"




సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు.
మనిషి పుట్టుకతో ఏదైనా అవయవలోపం ఏర్పడినా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి. కానీ ఇంద్రియాలలో ప్రధానమైన నయనాలు (కళ్ళు) లేకుంటే మాత్రం ఆ జీవితం అంధకారమే.
మానవ శరీరంలో అత్యంత విలువైన, సున్నితమైన అవయవం కన్ను. మానవుడు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడగల్గుతున్నాడంటే దానికి కారణం కళ్ళు. అది మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. కళ్ళు లేనివారు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.
మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం వుండకూడదు అంటారు. మనోస్థైర్యం ఉన్నవారు శరీర వైకల్యాన్ని అధిగమించడమేగాక ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఇది అక్షరాలా నిజం. అలాంటి స్ఫూర్తివంతమైన అంధురాలి యదార్థ జీవిత గాధ ఇది. ఆమె పేరు "పయ్యావుల కొమురమ్మ". ఆమె పుట్టుకతోనే అంధురాలు. అయితేనేం తన పనులు తానే చేసుకుంటూ ఎంతోమంది దివ్యాంగులకు, యువతీయువకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

కొమురమ్మది సూర్యాపేట జిల్లా మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లి. ఆమె నిరుపేద యాదవ కుటుంబంలోబొర్రయ్య, ముత్తమ్మలకు జన్మించింది . ఆమె జన్మతః అంధురాలు అవటంవల్ల సవాలక్ష సవాళ్ళు ఎదుర్కొంది. జీవితంలో ఏ పనిచేయలేని కొమురమ్మకు తల్లి ముత్తమ్మ తొలి గురువు. ప్రపంచంలోని అమ్మలందరికీ పిల్లలపై ఆకాశమంత ప్రేమ ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ముత్తమ్మ కు బిడ్డ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ. అంధకారం అలుముకున్న తన బిడ్డ జీవితాన్ని చూసి ఆ తల్లి రోదించిన సందర్భాలెన్నో. కొమురమ్మను అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కానీ అది అంధుల పాఠశాల కాకపోవడంతో ఆమె గురువులు చెప్పేపాఠాలు సరిగా అర్ధం చేసుకోలేకపోయేది. చుట్టుప్రక్కల ఎక్కడ కూడా అంధుల పాఠశాలలు లేనందున ఆమె ఇంటికే పరిమితమయింది.
కొమురమ్మను తల్లి కూలిపనులకు, పొలం పనులకు ఎక్కడికి వెళ్లిన తన వెంటే తీసుకుకెల్లేది, అంతేగాక తన తల్లి మాట్లాడే బంధుత్వ వరుసలను , మాట్లాడే విధానాన్ని పరిశీలించి కొద్దికొద్దిగా నేర్చుకోవడం ప్రయత్నించింది.ప్రతిఒక్కరి గొంతును గుర్తుంచుకునేది. ఎవరైనా ఇంటికి వస్తే వారి గొంతువిని వారి పేరు వెంటనే చెప్పేది అంత జ్ఞాపకశక్తి కొమురమ్మది. మానవత్వానికి మరో పేరు "పయ్యావుల ముత్తమ్మ". ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనసు ఆమెది. బిడ్డ ఎదిగేకొద్దీ తల్లికి అనుకోని బాధ వెంటాడేది.తానుఆరోగ్యంగా ఉన్నంతవరకు బిడ్డను చూసుకుంటాను కానీ తన తరువాత తన బిడ్డ ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా పనులు ఎలా చేసుకుంటుంది అనే ఆలోచనే బాధించేది ఆ తల్లికి. లచ్చమ్మకు అక్షరజ్ఞానం లేకపోయినా ముందుఆలోచనతో తన బిడ్డకు అందరిలాగే వంట, ఇంటి పనులు చేసుకోవడానికి మంచి శిక్షణ ఇచ్చింది. కొమురమ్మ శ్రద్దగా వింటూ ఓపికగా నేర్చుకోసాగింది. ఆలా కొమురమ్మ జీవితాన్ని ఆమె చీకటి నుండి వెలుగులోకి తీసుకురాగలిగింది. మొదట బిడ్డ జీవితంచూసి చలించిపోయేది. ఆమె మంచి భవిష్యత్తు కోసం తపించేది. తల్లీ నీకు పాదాభివందనం.
బిడ్డపట్ల తల్లి ప్రేమ వర్ణించలేనిది, వెలకట్టలేనిది. పనులు నేర్పించడమేగాక ఊరిలో ఎవరింటికి ఎలా వెళ్లాలో తీసుకొనివెళ్ళి చూపించేది చాలా సార్లు. తల్లి చూపించిన ఇంటి దూరాన్ని అడుగుల లెక్కతో మరియు సమయాన్ని బట్టి ప్రతిఒక్కరి ఇంటికి వెళ్లగలదు. అది చూసేవారికి ఆశ్చర్యం, అనుమానం కూడా కళ్ళు కనిపిస్తాయేమోఅని. కానీఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది.
కళ్ళు లేవని కలత చెందలేదు. నాకు భవిష్యత్తు లేదని ఆగిపోలేదు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకుసాగింది. ఆమె విజయం వెనుక తల్లి ఉంది.
అలా తల్లి ముత్తమ్మ కొమురమ్మను 43 ఏళ్ళు వరకు అన్నీతానే దగ్గరుండి చూసుకుంది. ఒడిదొడుకులతో సాగుతున్న కొమురమ్మ జీవితం లో అనుకోకుండా తీవ్ర అనారోగ్యం కారణంగా తల్లి మరణించింది. తల్లి మరణవార్తవిన్న కొమురమ్మ కన్నీరుమున్నీరైంది. ఆ సంఘటన చూసిన ఊరి జనానికి ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించిన సందర్భం.. తల్లి మరణాంతరం తండ్రి (బొర్రయ్య) కూడా అనారోగ్యానికి గురైనారు. ముత్తమ్మ ముందుఆలోచనతో కొమురమ్మ తన పనులు తానే చేసుకునేలా తర్ఫీడునిచ్చింది.
నిరుపేదరాలైన కొమురమ్మకు ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. పాత మట్టిగోడలమద్యే ఆమె నివాసం. ఎన్ని ప్రభుత్వాలు మారిన కొమురమ్మ గోడు పట్టించుకునే నాధుడే లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం కొమురమ్మపట్ల ప్రత్యేక చొరవ చూపాలని కోరుకుంటున్నాం.
ఈరోజుల్లో అన్నిఅవయవాలుండి పనిచేయటానికి బద్ధకం ఉన్నవాళ్ళకి కొమురమ్మ ఒక ఆదర్శం కావాలని కోరుకుంటూ..
కొమురమ్మ నిండునూరేళ్ళు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనందరం ఆ భగవంతుణ్ణి కోరుకుందాం.


✍

కోట దామోదర్
మొబైల్ : 9391480475

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...