26, మార్చి 2023, ఆదివారం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం


పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన గురువులకు, ముఖ్య అతిధులకు, సీనియర్ అన్నలకు, జూనియర్ తమ్ముళ్లకు ప్రతిఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు  తెలియజేసుకుంటున్నాను.

పూర్వ విద్యార్థులమందరం చదువుకున్నచోటే కలుసుకోవడం అనేది గొప్ప విషయమే అయినప్పటికీ, మూర్తీభవించిన మానవత్వంతో 1986-2023 వరకు పూర్వవిద్యార్ధులందిరిని ఒకేచోట కలుసుకునే అవకాశాన్ని కల్పించిన గురువులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురువుల ఆలోచన తీరు అభినందనీయం, అనిర్వచనీయం.

ఆయుధం కన్న అక్షరం గొప్పది. కత్తి కన్న కలం గొప్పది.

అక్షరం, కలం విలువలు  ప్రసాదించే గురువులు ఈ రెండింటికన్నా గొప్పవారు. ఎందుకంటే గురువులేనిది అక్షరం లేదు. అక్షరం లేనిదే కలం లేదు.

దేశ భవిష్యత్తు నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమైనది - కీర్తించదగినది. అందుకే ఆచార్యదేవోభవ అన్నారు.

తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే. తల్లిదండ్రులు జన్మనిస్తే. గురువులు ఆ జన్మని సార్ధకం చేసుకోవడానికి అవసరమైన దారులు వేస్తారు. అవి మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి మరియు ఎదగడానికి సహాయపడతాయి - ప్రతి విద్యార్థి ఎదగాలని కోరుకునే వారు గురువులే.

గూగుల్ లో దొరకనిది గురువు చెప్పగలరు.  గూగుల్ ని కనిపెట్టిన వాళ్ళు కూడా ఒక టీచర్ దగ్గరే చదువుకున్నారనే సంగతి మరచిపోకూడదు. ప్రతి విద్యార్థి గురువులను  గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గురువు స్థానం ఎంత గొప్పదంటే ఒక ఇంజనీర్ మరొక ఇంజనీరుని చేస్తాడేమో, ఒక డాక్టర్ ఇంకాకొంతమంది డాక్టర్స్ ని చేస్తాడేమో కానీ ఒక టీచర్ మాత్రమే ఎంతో మంది డాక్టర్లని మరెంతో మంది ఇంజనీర్లని, ఇంక వివిధ రంగాలలో ఉన్నతమైన స్థానానికి చేర్చగలడు, ఉపాధ్యాయుల వల్లే మంచి వ్యక్తులు (ప్రముఖులు) తయారువుతారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదు.

ఆ రోజుల్లో ఎలాంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించకుండా విద్యార్థులకు అర్థమయ్యేలా ఆచార్యులు బోధించిన తీరు అభినందనీయం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే తెలుగు మీడియం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆంగ్ల పాఠాలు బోధించడం విశేషం.

విద్యార్థులు పుస్తకాలకే  పరిమితం కాకుండా ప్రపంచంలోని సామజిక స్పృహ కలిగించే విషయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా.. రాబోవు తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ. 

గురువులందరికీ వందనం.. అభివందనం.

మధుర స్మృతులు:
  • మొదట్లో కాలేజీలో చేరాలంటే ఒకరకమైన ర్యాగింగ్ భయం ఉండేది. అది మొదటి సంవత్సరానికి మాత్రమే. ఒక సంవత్సరం తర్వాత మేము నేర్చుకున్న పాఠం ఏమిటంటే: సీనియర్లను గౌరవించండి, మీరు వారిని కలిసినప్పుడు నమస్తే చెప్పండి మరియు సీనియర్లు ఏదైనా సహాయం కోరితే చేయాలనేదే, అది ర్యాగింగ్ ఉద్దేశ్యం. ఒకప్పుడు ఉగ్రరూపం దాల్చిన ర్యాగింగ్ భూతం మనిషి ఎదుగుదలకు (ఊతంగా) ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఆ కాలపు ర్యాగింగ్‌ను తట్టుకుని నిలబడే మనిషి ప్రపంచంలో ఎక్కడైనా బతకగలడనే నమ్మకంతో ఉంటాడు. మనిషిలో ఒకరకమైన ధైర్యాన్ని నింపుతుంది.
  • అప్పుడు సీనియర్స్ కొంత మంది ర్యాగింగ్ సమయంలో వింత విచిత్రమైన ఆంక్షలు విధించేవారు. అవేంటంటే "జనగనమన" ఒకరిని పాడమనేది ఇంకొకరిని డాన్స్ చేయమనేది. ఆ సమయంలో నాకు డాన్స్ రాక  సీనియర్ల వితండవాదానికి అప్పుడు ఏడ్చినా సందర్భం అయితే ఇప్పుడు మాత్రం నవ్వుకునే సందర్భం. 
  • అప్పట్లో ర్యాగింగ్, ఇప్పుడు ర్యాగింగ్‌లో అనేక మార్పులు సంతరించుకోవడంవల్ల విద్యార్థులు భయాందోళనకు గురువుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇది బాధాకరమైన విషయం.
  • సినిమా చూసేందుకు దగ్గరలో థియేటర్లు లేకపోయినా కొందరు సీనియర్లు అయిదు రూపాయలు తీసుకొని టీవీ హాల్లో సినిమాలు వేసేది. ఆ సినిమాలు చూసి చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. ఐమాక్స్ థియేటర్‌లో చూసిన సినిమా కూడా అంత ఆనందాన్ని ఇవ్వదు. స్నేహితుల మధ్య దీన్ని చూడటం నిజంగా ప్రత్యేకమైన అనుభవం.
  • హాస్టల్ డైనింగ్ హాళ్లలో వంటలు రుచిలేక మరియు సాంబారులో పురుగులు పడిన సందర్భంలో విద్యార్థుల ఆవేశం ఓ విలయతాండవం, వితండవాదం.
  • పరీక్షల సమయంలో టీ కోసం లైన్లో నిలబడి తాగిన సందర్భం, క్లాస్ ఎగ్గొట్టి పక్కన పరిసరప్రాంతాల (బొజ్జికుప్ప) పర్యవేక్షించిన సందర్భం ఓ మధురజ్ఞాపకాలే.
  • హాస్టల్ లో ఉన్న స్నేహితులమంతా ఎంతబాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళమంటే అది అనిర్వచనీయమైన స్నేహబంధం. ప్రాణానికి ప్రాణం ఇచ్చేంత. ఆప్యాయత అనురాగాలు, ఆపదలో ఆపన్నహస్తాలు. మాకు ఏమైనా అయితే అక్కడ అమ్మానాన్న ఉండరుగాని వారులేని లోటు మా స్నేహితులు తీర్చేవారు అంతమంచి హాస్టల్ స్నేహబంధం నన్ను ఎంతగానో ఆకర్షించింది.
  • సాయంకాలం స్నేహితులతో శ్యామలరావు గుడిసెలో టీ తాగిన సందర్భాలు జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం.
  • సెల్ ఫోన్ లు లేనిరోజుల్లో హాస్టల్ లో ఒకేఒక ల్యాండ్ ఫోన్. అమ్మానాన్న నుండి ఫోన్ ఎప్పుడొస్తుందోఅని ఎదురుచూసిన సందర్భాలు అతిమధురం.
  • జ్వరమొస్తే పిచ్చిశంకరయ్య హాస్పిటల్ కి తీసికెళ్ళిన తోటి స్నేహితుల ఆత్మీయతకు అభినందనీయం. GMRP Hostel స్నేహబంధం అల్లుకుపోయిన మల్లెతీయగలాంటిది. 
  • సెకండ్ షో కెళ్ళి అర్ధరాత్రి భద్రాచలం నుండి నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకమే..
  • మనీయార్డర్ కోసం పోస్టుమ్యాన్ ఎప్పుడొస్తాడని ఎదురుచూసిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకమే..
  • హాస్టల్ ఆవరణంలో బోరింగ్ దగ్గర స్నానం మరియు బట్టలు ఉతికిన జ్ఞాపకాలు మధురమైనవి.. 
  • దగ్గర్లో కిరాణాషాపులు లేక ఇబ్బంది పడుతున్న హాస్టల్ విద్యార్థులకు అటెండర్ శ్యామలరావు అందించిన  సేవలు అమోఘం. 
  • పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో చెట్లకింద చదివిన జ్ఞాపకాలు గొప్ప అనుభూతి.
  • హాస్టల్ గోడపక్కనుండి పోయే అమ్మాయిలనుచూసి ఈలలు, కేకలతో చేసిన చిల్లరపనులు ఓ చిలిపి జ్ఞాపకమే.
  • స్నానం చేయడానికి వాటర్ వేయకపోతే "ఒరేయ్ రామారావు" అని అరిచిన జ్ఞాపకాలు.. 
  • ఫ్రెండ్స్ తో ప్లే గ్రౌండ్ లో ఆడిన ఆటలు అతిమధురం 

మన జీవితంలో లక్షలు, కోట్ల కన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహం దొరకడం గొప్ప విషయం. స్నేహబంధానికి, ఆత్మీయత, అనురాగాలకు ఆదర్శం ఈ ఆదర్శ ఆశ్రమ కళాశాల.

ప్రపంచాన్ని జయించే శక్తినిచ్చే కోవెల.. ఈ ఆదర్శ ఆశ్రమ కళాశాల.. 

గత స్మృతులను విస్మరించకుండా ఇలాంటి కార్యక్రమాలను జరుపుకోవడం అభినందనీయo.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475




   

15, మార్చి 2023, బుధవారం

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే


ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే

దేశ భూభాగాన్ని రక్షించడం, దేశంలో శాంతి భద్రతలను కాపాడడం మరియు దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడంతోపాటు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులకు శత్రువులతో పోరాడటానికి సరైన తుపాకులు, బాంబులు, ఫిరంగులు, క్షిపణులు, సైనిక వాహనాలు మరియు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇతర మందుగుండు సామగ్రి అవసరం. మన దగ్గర సరైన ఆయుధాలు ఉంటేనే శత్రువుతో పోరాడగలమని మనందరికీ తెలుసు.

 ప్రతి దేశానికి అవసరమైన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి మరియు రక్షణ పరికరాలను తయారు చేయడానికి సరైన కర్మాగారాలు (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు) కలిగి ఉండటం చాలా అవసరం.

 రక్షణ పరికరాల తయారీకి సంబంధించి ప్రపంచంలోని బలమైన దేశాల్లో భారత్ఒకటి. రక్షణ పరికరాల ఉత్పత్తిలో భారత్కు అపారమైన సామర్థ్యం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. 1947 నాటికి భారతదేశంలో 18 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కలిగి ఉండటం గర్వించదగిన విషయం.

 భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 18 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవాన్ని జరుపుకుంటారు మరియు ఆయుధ కర్మాగారాలను గౌరవించే రోజు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవం 1801లో భారతదేశంలో మొట్టమొదటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్థాపించిన జ్ఞాపకార్థం.

 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (OFB) ప్రపంచంలోనే 37 అతిపెద్ద రక్షణ పరికరాల తయారీ సంస్థ, ఆసియాలో 2 అతిపెద్దది మరియు భారతదేశంలో అతిపెద్దది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (OFB) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ పరికరాల తయారీ కంపెనీ మరియు భారతదేశంలోని పురాతనమైనది. ఇందులో మొత్తం 80 వేల మంది ఉద్యోగులు పనిచేయడం గొప్ప విషయం.భారతదేశ ఆయుధ కర్మాగారాలు ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సంస్థలలో ఒకటిగా పరిగణించబడ్డాయి. కర్మాగారాలకు నూట యాభై సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశం యొక్క ఆయుధ కర్మాగారాల బలాన్ని ప్రపంచం చూసింది.

 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల చరిత్ర:

 ఇంగ్లండ్కు చెందిన ఈస్టిండియా కంపెనీ భారత్పై తమ ఆర్థిక ఆసక్తిని పెంచుకోవడానికి మరియు తమ రాజకీయ ప్రభావాన్ని పొందేందుకు రక్షణ పరికరాల తయారీని కీలక అంశంగా భావించింది.

  •  1712 – ఇచ్ఛాపూర్లో డచ్ ఓస్టెండ్ కంపెనీ గన్ పౌడర్ ఫ్యాక్టరీ స్థాపన.
  •  1775లో కోల్కతాలోని ఫోర్ట్ విలియమ్లో బోర్డ్ ఆఫ్ ఆర్డినెన్స్ ఏర్పాటుకు బ్రిటిష్ అధికారులు అంగీకరించారు.
  •  1787లో ఇషాపూర్లో గన్ పౌడర్ ఫ్యాక్టరీ స్థాపించబడింది, ఇది 1791 నుండి ఉత్పత్తిని ప్రారంభించింది.
  •  1801లో కోల్కతాలోని కాసిపోర్లో గన్ క్యారేజ్ ఏజెన్సీ ప్రారంభించబడింది మరియు ఉత్పత్తి మార్చి 18, 1802 నుండి ప్రారంభమైంది. ఇది ఇప్పటి వరకు ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల మొదటి పారిశ్రామిక స్థాపన.
  •  1904లో రైఫిల్ ఫ్యాక్టరీ స్థాపించబడింది.

 దేశవ్యాప్తంగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.

 మహారాష్ట్ర                     10

ఉత్తర ప్రదేశ్                    9

మధ్యప్రదేశ్                    6

తమిళనాడు                   6

పశ్చిమ బెంగాల్            4

ఉత్తరాంధ్ర                      2

తెలంగాణ                       1

చండీగఢ్                       1

ఒరిస్సా                        1

బీహార్                          1

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల వృద్ధి:

భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 18 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉండేవి. అంతేకాకుండా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 21 కర్మాగారాలు స్థాపించబడ్డాయి. భారత సాయుధ దళాలు చేసిన మూడు ప్రధాన యుద్ధాల కారణంగా రక్షణ సంసిద్ధత ఆవశ్యకతల నేపథ్యంలో బీహార్లోని నలందలో 40 కర్మాగారం స్థాపించబడింది. స్వాతంత్య్రం అనంతరం పురాతనమైన కర్మాగారాలను పునర్ వ్యవస్తీకరించడంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో క్రియాత్మక స్వయంప్రతిపత్తి, సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు కొత్త వృద్ధి సామర్థ్యాన్ని మరియు ఆవిష్కరణలను ఆవిష్కరించడం కోసం దాని పునర్నిర్మాణ ప్రణాళికలలో భాగంగా జూన్ 16, 2021 కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన ప్రకారం, రక్షణ ఉత్పత్తి శాఖ కింద పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (“OFB”) యొక్క 41 ఉత్పత్తి యూనిట్ల (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు) విధులను కార్పొరేటీకరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ మంత్రిత్వ శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్). భారత ప్రభుత్వం 1 అక్టోబర్, 2021 నుండి 41 ఉత్పత్తి యూనిట్ల నిర్వహణ, నియంత్రణ, కార్యకలాపాలు మరియు నిర్వహణ మరియు గుర్తించిన ఉత్పత్తియేతర యూనిట్లను పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందిన 7 ప్రభుత్వ కంపెనీలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.

అక్టోబర్ 2022లో, భారత ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను రద్దు చేసి ఏడు కొత్త రక్షణ PSUలుగా మార్చింది

ఏడు కొత్త డిఫెన్స్ కంపెనీలు:

మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL);

ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVANI);

అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ (AWE ఇండియా);

ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ (TCL) (ట్రూప్ కంఫర్ట్ ఐటమ్స్);

యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL);

ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL)

గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL).

తెలంగాణ (మెదక్) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ:

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు పరిధిలోని 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో OFMK ఒకటి. ఇది పదాతిదళ పోరాట వాహనాల స్వదేశీ ఉత్పత్తి కోసం అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీచే 19 జూలై 1984 స్థాపించబడింది. ఇది 3023 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు 3000 మందికి ఉపాధి కల్పిస్తోంది. పదాతిదళ పోరాట వాహనాల (ICVలు) యొక్క భారతదేశ ఏకైక తయారీదారు. కర్మాగారం క్షిపణి లాంచర్లు, సాయుధ అంబులెన్స్లు, స్వీయ చోదక హోవిట్జర్లు, ఆర్మర్డ్ కార్లు, మానవరహిత గ్రౌండ్ వెహికల్స్ (UGVలు), ఆర్మర్డ్ లైట్ రికవరీ వెహికల్స్, NBC recce వాహనాలు, మైన్ ప్రొటెక్షన్ వెహికల్స్, ఆర్మర్డ్ యాంఫిబియస్ డేజర్లు, ఆర్మర్డ్ రాడార్లు, నావికా ఆయుధాలు మొదలైనవాటిని తయారు చేస్తుంది

OFMK BMP-II/IIK కోసం TOTలో ప్రావీణ్యం సంపాదించింది మరియు 98.5% స్వదేశీకరణతో వాహనాలను తయారు చేసింది. OFMK, DRDO సహకారంతో, భారత సైన్యం యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి AAT, CMT, AERV మరియు NBCRVలను అభివృద్ధి చేసింది.

 OFMK, స్వదేశీ R&D ప్రయత్నాల ద్వారా, MHA మరియు ఇండియన్ ఆర్మీ యొక్క పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మరియు మైన్ ప్రొటెక్షన్ వెహికల్స్‌ను అభివృద్ధి చేసింది. OFMK సివిల్ ట్రేడ్ మరియు ఎగుమతి మార్కెట్‌లోకి కూడా ప్రవేశించింది.

భారత సైన్యానికి కావలిసిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో తయారవడం గర్వించదగిన గొప్ప విషయం. 


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475



 


1, మార్చి 2023, బుధవారం

మారాలి చట్టాలు మారాలి..


మారాలి చట్టాలు మారాలి..


పేదలకు చట్టాలు, సంపన్నులకు చుట్టాలు..

చట్టాలు పేదోడి పాలిట శాపాలు, ఉన్నోడి పాలిట వెలుగు దీపాలు..

మారాలి చట్టాలు మారాలి, సమానత్వపు చట్టాలు తేవాలి ..

తప్పుచేసినవారికి సరైన శిక్షలు వేయాలి..

తప్పించుకు తిరిగే వారిని కఠినంగా శిక్షించాలి.

నిర్భయ చట్టాలెన్ని ఉన్నా న్యాయం గెలువదాయె .. నిజం నిగ్గు తేలదాయె..

ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు తల్లుల కడుపు కోతలు, ఇక మారవా ఆడబిడ్డల తల రాతలు..

మారాలి చట్టాలు మారాలి.. మార్పు కొరకు పట్టుబట్టి తీరాలి..

మారాలి చట్టాలు మారాలి.. పేదోడి తలరాత మారాలి..

భాదితుల దరి చేరాలి న్యాయం, చట్టాలెన్ని ఉన్నా జరిగుతున్నది శూన్యం..

అమాయకత్వం వీడాలి .. హక్కులపై అవగాహన పెంచుకోవాలి ..

ఐకమత్యం తో కలిసి మెలగాలి .. సంఘటితంగా ప్రగతి సాధించాలి ..

ప్రజలు తిరగబడాలి.. విప్లవ కెరటంలా ఉద్యమించాలి ..

మారాలి చట్టాలు మారాలి.. మారాలి పేదోడి తలరాత మారాలి



రచయిత

కోట దామోదర్

మొబైల్ : 9391480475

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...