26, మార్చి 2023, ఆదివారం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం


పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన గురువులకు, ముఖ్య అతిధులకు, సీనియర్ అన్నలకు, జూనియర్ తమ్ముళ్లకు ప్రతిఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు  తెలియజేసుకుంటున్నాను.

పూర్వ విద్యార్థులమందరం చదువుకున్నచోటే కలుసుకోవడం అనేది గొప్ప విషయమే అయినప్పటికీ, మూర్తీభవించిన మానవత్వంతో 1986-2023 వరకు పూర్వవిద్యార్ధులందిరిని ఒకేచోట కలుసుకునే అవకాశాన్ని కల్పించిన గురువులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురువుల ఆలోచన తీరు అభినందనీయం, అనిర్వచనీయం.

ఆయుధం కన్న అక్షరం గొప్పది. కత్తి కన్న కలం గొప్పది.

అక్షరం, కలం విలువలు  ప్రసాదించే గురువులు ఈ రెండింటికన్నా గొప్పవారు. ఎందుకంటే గురువులేనిది అక్షరం లేదు. అక్షరం లేనిదే కలం లేదు.

దేశ భవిష్యత్తు నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమైనది - కీర్తించదగినది. అందుకే ఆచార్యదేవోభవ అన్నారు.

తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే. తల్లిదండ్రులు జన్మనిస్తే. గురువులు ఆ జన్మని సార్ధకం చేసుకోవడానికి అవసరమైన దారులు వేస్తారు. అవి మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి మరియు ఎదగడానికి సహాయపడతాయి - ప్రతి విద్యార్థి ఎదగాలని కోరుకునే వారు గురువులే.

గూగుల్ లో దొరకనిది గురువు చెప్పగలరు.  గూగుల్ ని కనిపెట్టిన వాళ్ళు కూడా ఒక టీచర్ దగ్గరే చదువుకున్నారనే సంగతి మరచిపోకూడదు. ప్రతి విద్యార్థి గురువులను  గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గురువు స్థానం ఎంత గొప్పదంటే ఒక ఇంజనీర్ మరొక ఇంజనీరుని చేస్తాడేమో, ఒక డాక్టర్ ఇంకాకొంతమంది డాక్టర్స్ ని చేస్తాడేమో కానీ ఒక టీచర్ మాత్రమే ఎంతో మంది డాక్టర్లని మరెంతో మంది ఇంజనీర్లని, ఇంక వివిధ రంగాలలో ఉన్నతమైన స్థానానికి చేర్చగలడు, ఉపాధ్యాయుల వల్లే మంచి వ్యక్తులు (ప్రముఖులు) తయారువుతారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదు.

ఆ రోజుల్లో ఎలాంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించకుండా విద్యార్థులకు అర్థమయ్యేలా ఆచార్యులు బోధించిన తీరు అభినందనీయం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే తెలుగు మీడియం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆంగ్ల పాఠాలు బోధించడం విశేషం.

విద్యార్థులు పుస్తకాలకే  పరిమితం కాకుండా ప్రపంచంలోని సామజిక స్పృహ కలిగించే విషయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా.. రాబోవు తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ. 

గురువులందరికీ వందనం.. అభివందనం.

మధుర స్మృతులు:
  • మొదట్లో కాలేజీలో చేరాలంటే ఒకరకమైన ర్యాగింగ్ భయం ఉండేది. అది మొదటి సంవత్సరానికి మాత్రమే. ఒక సంవత్సరం తర్వాత మేము నేర్చుకున్న పాఠం ఏమిటంటే: సీనియర్లను గౌరవించండి, మీరు వారిని కలిసినప్పుడు నమస్తే చెప్పండి మరియు సీనియర్లు ఏదైనా సహాయం కోరితే చేయాలనేదే, అది ర్యాగింగ్ ఉద్దేశ్యం. ఒకప్పుడు ఉగ్రరూపం దాల్చిన ర్యాగింగ్ భూతం మనిషి ఎదుగుదలకు (ఊతంగా) ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఆ కాలపు ర్యాగింగ్‌ను తట్టుకుని నిలబడే మనిషి ప్రపంచంలో ఎక్కడైనా బతకగలడనే నమ్మకంతో ఉంటాడు. మనిషిలో ఒకరకమైన ధైర్యాన్ని నింపుతుంది.
  • అప్పుడు సీనియర్స్ కొంత మంది ర్యాగింగ్ సమయంలో వింత విచిత్రమైన ఆంక్షలు విధించేవారు. అవేంటంటే "జనగనమన" ఒకరిని పాడమనేది ఇంకొకరిని డాన్స్ చేయమనేది. ఆ సమయంలో నాకు డాన్స్ రాక  సీనియర్ల వితండవాదానికి అప్పుడు ఏడ్చినా సందర్భం అయితే ఇప్పుడు మాత్రం నవ్వుకునే సందర్భం. 
  • అప్పట్లో ర్యాగింగ్, ఇప్పుడు ర్యాగింగ్‌లో అనేక మార్పులు సంతరించుకోవడంవల్ల విద్యార్థులు భయాందోళనకు గురువుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇది బాధాకరమైన విషయం.
  • సినిమా చూసేందుకు దగ్గరలో థియేటర్లు లేకపోయినా కొందరు సీనియర్లు అయిదు రూపాయలు తీసుకొని టీవీ హాల్లో సినిమాలు వేసేది. ఆ సినిమాలు చూసి చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. ఐమాక్స్ థియేటర్‌లో చూసిన సినిమా కూడా అంత ఆనందాన్ని ఇవ్వదు. స్నేహితుల మధ్య దీన్ని చూడటం నిజంగా ప్రత్యేకమైన అనుభవం.
  • హాస్టల్ డైనింగ్ హాళ్లలో వంటలు రుచిలేక మరియు సాంబారులో పురుగులు పడిన సందర్భంలో విద్యార్థుల ఆవేశం ఓ విలయతాండవం, వితండవాదం.
  • పరీక్షల సమయంలో టీ కోసం లైన్లో నిలబడి తాగిన సందర్భం, క్లాస్ ఎగ్గొట్టి పక్కన పరిసరప్రాంతాల (బొజ్జికుప్ప) పర్యవేక్షించిన సందర్భం ఓ మధురజ్ఞాపకాలే.
  • హాస్టల్ లో ఉన్న స్నేహితులమంతా ఎంతబాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళమంటే అది అనిర్వచనీయమైన స్నేహబంధం. ప్రాణానికి ప్రాణం ఇచ్చేంత. ఆప్యాయత అనురాగాలు, ఆపదలో ఆపన్నహస్తాలు. మాకు ఏమైనా అయితే అక్కడ అమ్మానాన్న ఉండరుగాని వారులేని లోటు మా స్నేహితులు తీర్చేవారు అంతమంచి హాస్టల్ స్నేహబంధం నన్ను ఎంతగానో ఆకర్షించింది.
  • సాయంకాలం స్నేహితులతో శ్యామలరావు గుడిసెలో టీ తాగిన సందర్భాలు జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం.
  • సెల్ ఫోన్ లు లేనిరోజుల్లో హాస్టల్ లో ఒకేఒక ల్యాండ్ ఫోన్. అమ్మానాన్న నుండి ఫోన్ ఎప్పుడొస్తుందోఅని ఎదురుచూసిన సందర్భాలు అతిమధురం.
  • జ్వరమొస్తే పిచ్చిశంకరయ్య హాస్పిటల్ కి తీసికెళ్ళిన తోటి స్నేహితుల ఆత్మీయతకు అభినందనీయం. GMRP Hostel స్నేహబంధం అల్లుకుపోయిన మల్లెతీయగలాంటిది. 
  • సెకండ్ షో కెళ్ళి అర్ధరాత్రి భద్రాచలం నుండి నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకమే..
  • మనీయార్డర్ కోసం పోస్టుమ్యాన్ ఎప్పుడొస్తాడని ఎదురుచూసిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకమే..
  • హాస్టల్ ఆవరణంలో బోరింగ్ దగ్గర స్నానం మరియు బట్టలు ఉతికిన జ్ఞాపకాలు మధురమైనవి.. 
  • దగ్గర్లో కిరాణాషాపులు లేక ఇబ్బంది పడుతున్న హాస్టల్ విద్యార్థులకు అటెండర్ శ్యామలరావు అందించిన  సేవలు అమోఘం. 
  • పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో చెట్లకింద చదివిన జ్ఞాపకాలు గొప్ప అనుభూతి.
  • హాస్టల్ గోడపక్కనుండి పోయే అమ్మాయిలనుచూసి ఈలలు, కేకలతో చేసిన చిల్లరపనులు ఓ చిలిపి జ్ఞాపకమే.
  • స్నానం చేయడానికి వాటర్ వేయకపోతే "ఒరేయ్ రామారావు" అని అరిచిన జ్ఞాపకాలు.. 
  • ఫ్రెండ్స్ తో ప్లే గ్రౌండ్ లో ఆడిన ఆటలు అతిమధురం 

మన జీవితంలో లక్షలు, కోట్ల కన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహం దొరకడం గొప్ప విషయం. స్నేహబంధానికి, ఆత్మీయత, అనురాగాలకు ఆదర్శం ఈ ఆదర్శ ఆశ్రమ కళాశాల.

ప్రపంచాన్ని జయించే శక్తినిచ్చే కోవెల.. ఈ ఆదర్శ ఆశ్రమ కళాశాల.. 

గత స్మృతులను విస్మరించకుండా ఇలాంటి కార్యక్రమాలను జరుపుకోవడం అభినందనీయo.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475




   

కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...