20, ఏప్రిల్ 2023, గురువారం

మే డే

దేశ శ్రేయస్సు కోసం ఎండనకా, వాననకా, కాలాలకు అతీతంగా అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామికులు ఈ దేశ ప్రగతికి మూలాలు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. కార్మికుల స్వేదం చిందించకపోతే ఏ దేశం ప్రగతిశీల మార్గంలో నడవబోదనడంలో అతిశయోక్తి లేదు..

గుండు పిన్ను నుంచి విమానం వరకు ప్రతి వస్తువు తయారీకి శ్రామికుల శ్రమ ఎంతో అవసరం. 

కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరు కార్మికులే, శ్రమనే నమ్ముకుని పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికులే. దేశ భవిష్యత్తు నిర్మాణంలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది.

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా అమెరికా మరియు ఐరోపాలో అనేక పెద్ద పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల్లో పని చేయడానికి అసంఖ్యాక కార్మికులు అవసరం. దీంతో ఉత్పత్తి రంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం కార్మికుల శ్రమను విచక్షణారహితంగా దోపిడీ చేయడం ప్రారంభించారు. కార్మికులతో రోజుకు కనీసం 16 గంటల నుంచి 20 గంటల వరకు పని చేయించేవారు. కర్మాగారాలకు సరైన వెంటిలేషన్ మరియు లైటింగ్ వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. అందువల్ల కొందరు కార్మికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు తమ శ్రమను మరచిపోవడానికి పాటలు పాడినా లేదా విశ్రాంతి తీసుకున్న యజమానులు కోపోద్రిక్తులైయేవారు. ఈ క్రూరమైన చర్యల నేపథ్యంలో కార్మికుల్లో క్రమంగా తిరుగుబాటు మొదలైంది. కార్మిక సంఘాల ఏర్పాటు ప్రారంభమైంది. 1764-1800 మధ్యకాలంలో, బ్రిటన్‌లో మరియు తరువాత ఐరోపాలో ట్రేడ్ యూనియన్లు ఏర్పడ్డాయి. 1806లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ప్రేరణ పొందిన కార్మికులు మెకానిక్స్ యూనియన్ పేరుతో మొదటి ట్రేడ్ యూనియన్‌ను స్థాపించారు. పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్‌ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఆ పోరాట జ్వాలలు అన్ని దేశాల ప్రాంతాలకు వ్యాపించాయి. 1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 18 గంటల పని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఆ ఉద్యమంలో ఎందరో కార్మికులు మరణించి తమ హక్కులు సాధించుకున్నారు. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరవీరుల స్పూర్తికి గుర్తుగా జరుపుకునేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే.

నేటికీ ఫలించని కార్మిక హక్కులు:

దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా దేశ ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువును ఉత్పత్తి చేస్తూ వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. నేటికీ శ్రామికశక్తి అసంఘటిత రంగంలోనే ఉండడం మరింత బాధాకరం. కార్మికుల చట్టాల్లో ఎన్నో మార్పులు వస్తున్నా వారి వేతనాలు, జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. చట్టాలు అమలవుతున్న, ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. తత్ఫలితంగా కార్మికుల శ్రమకి తగ్గ వేతనం ఇవ్వకుండా, పనిలో రక్షణలు లేకుండా, సమ్మె హక్కులు లేకుండా, కనీసం వారు ఆరోగ్యంగా ఉండడానికి కనీసం భద్రత కల్పించకుండా వారిచేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. 

చట్టాలు మారిన కార్మికుల కష్టాలు తీరలేదు:

బ్రిటిష్‌ పాలనలోని అమానవీయ కార్మిక విధానాలను, బానిస చట్టాలను స్వాతంత్య్రానంతరం అనేక మంది కార్మికులు పోరాడి కార్మిక సంక్షేమమే ధ్యేయంగా 44 కార్మిక చట్టాలను రూపొందించుకున్నారు. ఈ 44 కార్మిక చట్టాలవల్ల కొంతమేరకు కార్మికులకు లాభం చేకూరిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం 44 చట్టాలు రద్దు చేస్తూ కొత్త 4 లేబర్‌ కోడ్‌లు రూపొందించింది. ఈ 4 చట్టాల వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోయే అవకాశముందని మరియు జీతాలతో వ్యత్యాసముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

4 లేబర్‌ కోడ్‌లు:

  • పారిశ్రామిక సంబంధాల కోడ్‌.
  • వేతనాల కోడ్‌.
  • సామాజిక భద్రత కోడ్‌.
  • భద్రత-ఆరోగ్యం- పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌.

పారిశ్రామిక సంబంధాల కోడ్‌:

పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మిక హక్కులను దెబ్బతీస్తుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల డిమాండ్లపై సమ్మె నోటీసు ఇవ్వడానికి కేంద్రం ఒకప్పుడున్న  14 రోజుల గడువును 60 రోజులకు పొడిగించింది. సమ్మెకు వ్యతిరేకంగా న్యాయస్థానికి  వెళ్లేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. దీంతో న్యాయస్థానం లో కేసు ఉన్నంత వరకు కార్మికులు సమ్మెకు దిగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు 10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలను పరిశ్రమలుగా పరిగణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 20కి పెంచగా చిన్న పరిశ్రమల కార్మికులు చట్టబద్ధమైన ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమ పథకాల నుండి మినహాయించబడే ప్రమాదం ఉంది. పాత చట్టం ప్రకారం, యాజమాన్యం యూనియన్‌లను గుర్తించే నిబంధన లేదు. ఏ యూనియన్ అయినా కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిపే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం పరిశ్రమల్లో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్నట్లైయితేనే యూనియన్‌గా పరిగణించబడుతుంది. 

వేతనాల కోడ్‌:

వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగుల వేతన విధానంలో పలు మార్పు సంతరించుకున్నాయి. తత్పలితంగా కార్మికుడి టేక్ హోమ్ పే తగ్గుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల కోడ్‌ చట్టం ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక జీతం (CTC) కంపెనీ ఖర్చులో 50% కంటే తక్కువ ఉండకూడదు. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ వేతనాన్ని తగ్గించి పై నుంచి ఎక్కువ అలవెన్సులు ఇస్తూ కంపెనీపై భారాన్ని తగ్గించుకుంటున్నాయి. దీంతో ఉద్యోగికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. బేసిక్ వేతనం తగ్గడంవల్ల   

కార్మికుడి రిటైర్మెంట్ తరువాత జీవన ఉపాధికి చెల్లించబడే  గ్రాట్యుటీ, పీఎఫ్‌, పెన్షన్ లు భారీగా తగ్గే అవకాశముంది. ఈ వేతనాల కోడ్ వల్ల కార్మికుడికి తీవ్ర నష్టమే తప్ప లాభం లేదు.

ఎందరో త్యాగాల ఫలితంగా  కొట్లాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి స్వస్తి చెప్తూ యాజమాన్యం కోరితే 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాలని, అం దుకు ఎలాంటి ఓటీ (ఓవర్‌ టైమ్‌) వేతనాలను చెల్లించాల్సిన అవసరం లేదని చట్టం పేర్కొన్నది.

అతి తక్కువ పెన్షన్ తో రిటైర్డ్ కార్మికుల జీవితం:

ప్రవేట్ రంగంలో 40 ఏళ్లు పనిచేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛను 2500 లోపే, అది కూడా 30000 జీతంతో పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛను. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటం వల్ల మనిషి జీవన వ్యయం పెరిగింది. పెన్షన్ మాత్రం పెరగటంలేదు. 2500 తో రిటైర్డ్ కార్మికులు ఏ విదంగా జీవనం కొనసాగించాలి?.ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేస్తే అతనికి సగం జీతం పెన్షన్ వస్తుంది. ఈ దేశ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన ప్రైవేట్ కార్మికుడికి మాత్రం 2500 పింఛన్. దేశంలోని ప్రజాప్రతినిధులు వారి జీతాలు మరియు పెన్షన్స్ పెంచుకుంటున్నారు తప్ప కార్మికులకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటు రంగంలోని కార్మికులకు సరైన పింఛను, కనీస వేతన పథకాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనావుంది. 

కరోనా కారణంగా పెరగని కార్మికుల జీతాలు:

కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరియు మానవాళిని విపత్తులోకి నెట్టింది. ఈ మహమ్మారిని నియంత్రించే ప్రయత్నంలో మన దేశంతో పాటు అనేక దేశాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువగా నష్టపోయిన రంగాల్లో పారిశ్రామిక రంగం ఒకటి. పరిశ్రమలకు ఐటీ సంస్థల లాగా ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించే వెసులుబాటు ఉండదు. దీంతో ఉత్పత్తితో పాటు లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా కారణంగా ఇప్పటికి కోలుకొని పరిశ్రమలున్నాయనే చెప్పొచ్చు. కరోనా ప్రభావం వల్ల నష్టాలలో ఉన్న పరిశ్రమలు కార్మికులకు ఏటా జీతాలు పెంచలేమని కొన్ని పరిశ్రమలు వెల్లడించాయి. అయితే కొన్ని లాభదాయక పరిశ్రమలు కూడా కరోనా ప్రభావం సాకుతో జీతాలు పెంచలేమని చెబుతూ కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కరోనా ప్రభావంతో పరిశ్రమలు కాకుండా కార్మికులు ఎక్కువగా నష్టపోయారన్నది నమ్మలేని నిజం. 

ఉద్యోగ విరమణ తర్వాత కూడా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి:

పారిశ్రామిక రంగాలలో పని చేసే కార్మికులకు ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తమకు వచ్చే జీతం తక్కువగా ఉండడంతో పిల్లలను చదివించేందుకు, కుటుంబ పోషణకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనుకోకుండా అనారోగ్య సమస్యలు ఎదురైతే కుటుంబ సభ్యులకు ఈఎస్ ఐ దిక్కు. వేరే మార్గం లేదు. ఉద్యోగం ఉన్నంత కాలం ఇఎస్‌ఐపైనే ఆధారపడుతున్నారు. ఇక రిటైర్మెంట్ తర్వాత కార్మికుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ అన్నీ తక్కువ, కార్మికుడు ఎలా బతకగలడు? కావున ప్రభుత్వం కార్మికుల గురించి ఆలోచించి పదవీ విరమణ తర్వాత కూడా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475











 






కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...