వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు
వృద్ధాప్యం మానవ జీవితంలోని దశలలో ఒకటి. ఈ వృద్ధాప్య దశలో మానవ శరీరం అనేక శారీరక మరియు మానసిక మార్పులకు లోనవుతుంది మరియు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. వృద్ధాప్యం అనేది అపారమైన అనుభవాలతో నిండిన జీవితం. వారు చెప్పే ప్రతి మాట నిజమని పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతారు. అందుకే "పెద్దల మాట చద్దన్నం మూట" అనే నానుడి పుట్టింది.
మన దైనందిన జీవితంలో చాలామంది 60 యేండ్లు నిండకముందే అనేక వ్యాధులతో పోరాడుతూ వారి శరీరం ఏ పని చేయడానికి కూడా సహకరించలేనటువంటి పరిస్థితులను చూస్తూనే ఉంటాము. మానసిక స్థైర్యం మానసిక సమతుల్యత ను దెబ్బతీసి శారీరక, మానసిక సమస్యల తీవ్రతను పెంచడమే దీనికి కారణం. అంతేకాకుండా మానసిక స్థైర్యం ఉన్నవారు వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పని చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నవారు తారసపడుతుంటారు. బహుశా అలాంటి వారిని చూసే " వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు" అనే నానుడి పుట్టుకొచ్చిందనిపిస్తుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన 91 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు, వేద పండితులు రాజారామ్ శాస్త్రి యదార్ధ జీవిత కథ.
జననం, విద్యాభ్యాసం:
సూర్యాపేట జిల్లాలోని మిర్యాల అనే మారుమూల గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో సుబ్బయ్య శాస్త్రి, లక్ష్మి భాగ్యమ్మ దంపతులకు 06-10-1932 న జన్మించారు.. అయన తండ్రి సుబ్బయ్య గారు ప్రముఖ వేదపండితులు. చుట్టుపక్కల గ్రామాలలో జరిగే శుభ కార్యాలన్నీ ఆయనే జరిపేవారు. రాజారామ్ శాస్త్రి గారు చదువుకునే రోజుల్లో పదవయేట అయన తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి తాను కూడా పురోహితం నేర్చుకొని తండ్రికి సహాయం అందించాలనే ఆలోచన కలిగింది. మొదటగా తన తండ్రి దగ్గర గాయత్రి మంత్ర శ్లోకాలతో ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే అన్ని కార్యాలను నిర్వహించే విధంగా వేద మంత్రాలు నేర్చుకోగలిగారు. గ్రామంలోని చిన్న చిన్న కార్యాలను నిర్వహిస్తూనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తీవ్రమైన ఏకాగ్రత, అంకితభావంతో చదువు ప్రారంభించి మంచి విద్యా ప్రతిభ ఉన్న విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు.
ఉద్యోగ ప్రస్థానం:
చదువుతోపాటు, పురోహితం లో మంచి నైపుణ్యం సంపాదించడమే గాక అయన 27 .04 .1954 న ప్రభుత్వ టీచర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం సూర్యాపేట మారుమూల గ్రామాలలో ఉద్యోగం చేసి బదిలీ అయిన తర్వాత గుమ్మడవెల్లి గ్రామానికి ప్రైమరీ స్కూల్ టీచర్ గా నియమితులైనారు. అప్పుడే గుమ్మడవెల్లి లో పాఠశాల ప్రారంభమైంది. అతి తక్కువ విద్యార్థులతో సాగుతున్న పాఠశాలకు రాజారాం సార్ రాకతో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలే కాకుండా క్లాసురూం లో నవ్వులు పువ్వులు పూయించేవారు. ఆయన నోట పాఠాలే కాకుండా అప్పుడప్పుడు పాటలందుకునే పాటల పూదోట రాజారామ్ శాస్త్రి. కచ్చితమైన సమయాన్ని పాటిస్తూ, మంత్రముగ్ధులను చేసే ఆయన బోధనకు ఆకర్షితులైన విద్యార్థులు ఆయన చెప్పే పాఠాలకు గైర్హాజర్ కారంటే అతిశయోక్తి కాదు. ఆయన బోధన తీరు ఓ అద్భుతం పాఠానికి తగ్గట్టుగా ఉదాహారణలతో బోధించేవారు. తన సబ్జెక్ట్ తెలుగు అయినప్పటికీ ఉపాధ్యాయుల కొరత కారణంగా ఇతర సబ్జెక్టులను కూడా బోధించేవారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజారామ్ శాస్త్రి గారు అందించిన శ్లాఘనీయమైన సేవలు గుమ్మడవెల్లి విద్యార్థులు ఎప్పటికి మరిచిపోలేనివి, మరుపురానివి. ఆయన వద్ద శిష్యరికం చేసిన విద్యార్థులంతా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజారామ్ శాస్త్రి గారు 1990 సంవత్సరంలో గుమ్మడవెల్లి లో పదవి విరమణ పొందారు.
పురోహితం లో 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం:
పదేళ్ల వయసులో తండ్రి వద్ద నేర్చుకున్న పురోహితం ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా జీవన ఉపాధి కోసం కొనసాగుతుండటం గొప్ప విషయం. అంతేకాదు 91 ఏళ్ల వయసులో 80 ఏళ్ల అర్చక అనుభవం కలిగి ఉండటం మరో గొప్ప విషయం. చుట్టుపక్కల గ్రామాల్లో పూజారులు లేకపోవడంతో ఆ గ్రామాల్లో జరిగే కార్యములన్నిటిని కూడా శాస్త్రి గారు నిర్వహిస్తారు. ఆయన చేతుల మీదుగా ఇప్పటి వరకు కొన్ని లక్షలకు పైగా వివాహాలు జరిగిపోయాయంటే అతిశయోక్తి కాదు. గుమ్మడవెల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి పెళ్లి ఆయన చేతుల మీదుగా జరిగినవే. అంతేకాకుండా గుమ్మడవెల్లి లో ఉన్న ప్రతి కుటుంబంలో 1960 నాటి నుంచి ఇప్పటివరకు అన్ని కార్యాలు రాజారామ్ శాస్త్రి గారు నిర్వహిస్తుండటం ఒక సరికొత్త రికార్డు సృష్టించాడు. 91 ఏళ్ల వయసులో ఉన్న శాస్త్రి గారు ఇప్పటికీ స్వయంగా వంట, ఇంటి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు అన్నట్లుగా ఆయన ఇప్పటికి పూజలు నిర్వహించే కార్యక్రమాలలో వేద మంత్రాలు 2 గంటలకు పైగా ఆపకుండా చదివే శక్తి ఆయనకు ఉంది. జన్మనామం ప్రకారం భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయడంలో రాజారామ్ శాస్త్రి గారి తరువాతే ఎవరైనా కాబట్టి వాస్తు శాస్త్రం,జ్యోతిష్యం, ఆలస్య వివాహాలు మరియు అనేక ఇతర సమస్యల పరిష్కారం కోసం పలు జిల్లాల నుంచి ప్రజలు అతనిని సంప్రదిస్తారు, ఇది అతని పనికి నిదర్శనం. ఆయన నిరుపేదల పట్ల దయ, కరుణ, ప్రేమ చూపే వ్యక్తి. అందుకే శాస్త్రి గారు పేదల కార్యక్రమాలకు వారి స్థాయికి తగ్గట్టుగా డబ్బులు తీసుకొని, కట్టలేని వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. పేదల పట్ల మానవత్వం చూపే గొప్ప మనసున్న వ్యక్తి. గుమ్మడవెల్లి గ్రామంలో జరిగే ప్రతి పండుగలో ప్రజలను మంత్రముగ్ధులను చేసే వేద మంత్రాలను పఠిస్తూ భక్తులకు వేద మంత్రాల అర్థాన్ని విపులంగా వివరిస్తారు.
వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు:
వయసు శరీరానికే కానీ మనసుకు కాదు అని చెప్పే వాళ్ళని మనం చూశాం కానీ, వయసు శరీరానికి దూరం అన్నట్లుగా రాజారాం శాస్త్రి దినచర్య అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వృద్ధాప్యాన్ని జీవితంలో అత్యంత నీచమైన దశగా భావించి అసలు వాస్తవాన్ని గుర్తించలేని వారికి శాస్త్రి జీవితం ఆదర్శప్రాయం. ప్రతి మనిషికి సమస్యలు రావడం సహజమే అనడంలో సందేహం లేదు. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఆలోచనే ఉత్తమమైన మార్గమని కొద్ది మందికి తెలుసు. మనం నిత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలపై అనవసర ఆలోచనల వల్ల అనారోగ్యానికి గురి కావడం చూస్తూనే ఉన్నాం. ఒక సందర్భంలో శాస్త్రి గారిని తన ఆరోగ్య రహస్యం గురించి అడిగినప్పుడు, అతను ఇలా సమాధానమిచ్చాడు. ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొనే దైర్యం మనలో ఉంటె ఏ శక్తి ఆపలేదు. ధైర్యంతో ముందడుగు వేసినపుడే నువ్వు ప్రపంచాన్ని జయించి గలుగుతావు అని అన్నారు ఆయన. ఉద్యోగం రాక ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఆయన మనోధైర్యాన్ని అందిస్తారు. 91 సంవత్సరాల శాస్త్రి గారు ఇప్పటికి పాఠ్య పుస్తకం లోని అంశాల గురించి చాలా చక్కగా వివరించడం గొప్ప విషయం. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఆయన అందించిన శ్లాఘనీయమైన వైద్యసేవలు మరువలేనివి. జీవితంలో ఏదైనా సాధించాలంటే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన మార్గంలో ముందుకు సాగాలని, లక్ష్య సాధనకు ఎలాంటి అడ్డంకులు ఉండవనేది ముమ్మాటికీ నిజం. రాజారామ్ శాస్త్రి గారి నిజ జీవితం ఎందరికో ఆదర్శం.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475