7, జూన్ 2023, బుధవారం

గౌరవనీయులైన జౌళి శాఖ మంత్రి కే టి ఆర్ గారికి,

జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం - తెలంగాణ 


గౌరవనీయులైన జౌళి శాఖ మంత్రి కే టి ఆర్ గారికి, 

జౌళి శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా.


విషయం: ఇతర వృత్తి పని వారితో పాటు చేనేత పని వారికి కూడా లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయగలరని విజ్ఞప్తి.

తెలంగాణలో వివిధ కుల వృత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వృత్తి పనివారి జీవన ప్రమాణాల పెంపు కోసం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రేవు గారి ఆలోచన మేరకు అల్పాదాయ వర్గాలకు చెందిన వృత్తి పని వారికి పూర్తి సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం అభినందనీయం. 

మన దేశంలో వ్యవసాయరంగం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. ఎన్నో  వ్యయప్రయాసలకోర్చి లాభసాటి కాకపోయినప్పటికీ, తరతరాలుగా మగ్గాలనే నమ్ముకుని తమ కుల వృత్తిని ఎంతో  నిబద్ధతతో నిర్వహిస్తున్న చేనేత కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రాకపోవడం శోచనీయం. చేనేత కళాకారులు అత్యధికంగా ఉండే సిరిసిల్ల నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మీకు వారి వెతల గురించి వివరించడమంటే “మేనమామ కు అమ్మమ్మ గురించి చెప్పడం” లాంటిదే. 

మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని అందించిన నేతన్నల పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ సినీ గేయ రచయిత “జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా - చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు” అని వాపోయారు. దురదృష్టవశాత్తూ నేతన్నల పరిస్థితి నేటికీ ఏమాత్రం భిన్నంగా లేదన్న విషయం మీకు తెలియంది కాదు.    మానవాళికి వస్త్రాన్ని అందించిన రెక్కాడితే కానీ డొక్కాడని నేతన్నల బతుకు కరోనా మహమ్మారి కారణంగా పూర్తిగా ఛిద్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేత జీవితం, అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను ఎంతో నైపుణ్యంతో నేసిన చేనేత కళాకారుల జీవితాలు కన్నీళ్ల కలబోత అయ్యింది. ఈ రంగంలో కాలానుగుణంగా యాంత్రీకరణతో పాటు పెను  మార్పులు వస్తున్నా చేనేత కార్మికుల ఆకలి తీరడం లేదు. భారత దేశంలోనే అత్యధిక ఓటర్లుగా ఉన్న పద్మశాలీలకు  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందని ద్రాక్షగా మిగలడం బాధాకరమైన విషయం. 

సహృదయులు మరియు మానవతకు మారు పేరైన మీరు ఆకలితో అలమటిస్తున్న చేనేతల కుటుంబాలకు సానుభూతితో ఇతర కుల వృత్తి పని వారితో సమానంగా గుర్తించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల ఆర్ధిక సహాయం వర్తింపచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉండి వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి, వంటి నిండా బట్ట కల్పించాలని యావత్ తెలంగాణ చేనేత కళాకారుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తున్నాము. 

భవదీయ, 

ప్రధాన కార్యదర్శి 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475




కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...