29, అక్టోబర్ 2023, ఆదివారం

ఎన్ని"కలలు"

 ఎన్ని"కలలు":


తరాలు మారినా పేదోడి తలరాత మారడం లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వం వైఫల్యమా లేదా ప్రజల వైఫల్యమనేది అతికొద్ది మందికి తెలిసిన విషయం.
నీతి, నిజాయితీ, న్యాయం పట్ల నిబద్ధత ఉన్న వారిని ఎన్నుకోకుండా, డబ్బులు ఇచ్చినవారినే ఎన్నుకోవడమే దీనంతటికి కారణం. దీన్నిబట్టి మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రజలు అభివృద్ధి కోరుతున్నారా! అవినీతి కోరుతున్నారనేది అర్ధం కానీ ప్రశ్నగా మారింది. ప్రజలు  అభివృద్ధి కోరుకున్నట్లైతే అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలి, అవినీతి కోరుకున్నట్లైతే అవినీతిపరుడైన నాయకున్ని ఎన్నుకోవాలి. ఈ రోజుల్లో అన్ని పార్టీలు డబ్బులు పంచడం మామూలే. అయితే ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనేది ఆలోచించవలసిన ప్రశ్న. డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడిక లేదా డబ్బులు తక్కువ ఇచ్చేవాడిక లేదా అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడికి వేయాలనేది ప్రజల నిర్ణయం. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అన్నట్లుగా ఓటు వేసే సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నాయకున్ని ఎన్నుకోవాలంటే ప్రజల్లో ఓటు హక్కు ప్రాధాన్యత అవగాహన తప్పనిసరి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎన్ని"కలలు":

ఒకప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలు సంతోషంగా ఓటు వినియోగించడానికి ముందడుగు వేసేవారు. ఇచ్చిన హామీలు నెరవేరుతాయని నిరుపేదలకు చేయూత అందుతుందని, ఎన్నికల సమయంలోనే పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే కలలు కంటారు. అప్పట్లో నాయకులు ఇచ్చే హామీలు నమ్మదగినవిగా ఉండేవి. అందులో కొంతైనా హామీలు నెరవేరేవి. కానీ నేడు నాయకులిచ్చే హామీలు అమలు అవుతాయనేది పైనున్న దేవుడికే తెలియాలి హామీలిచ్చిన నాయకుడికి తెలియాలి. అంత నమ్మశక్యంగా ఉంటాయనేది ప్రతి ఓటరుకు తెలిసిందే. ఒకాయన ఈసారి మేము గెలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు తక్కువే ఇస్తామని, మరొకాయన మేము గెలిస్తే అంతకంటే తక్కువకు ఇస్తామని హామీలిస్తున్నారు. అది సాధ్యమయ్యే పనేనా  అనేది ఓటరు ఆలోచన చేయాల్సిన అవసరముంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జనాలు అయోమయం అవడమే తప్ప అవసరానికి ఒక పథకం కూడా పేదోడికి అందదు. నిత్యావసర వస్తువుల ధరలు మండుతూనే ఉంటాయి. ధరలు పెరగడానికి కారణాలు వెతుకుతూ ప్రజలను మభ్య పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదు. అది నాయకుల కనికట్టు మంత్రం. ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప ఉపయోగపడే ఉపన్యాసం ఒకటి ఉండదు. ఇది జగమెరిగిన సత్యం. ఓట్లు దగ్గరపడ్డాక జనాలలో వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం నిత్య అవసర వస్తువుల ధరలు తగ్గించి ఓట్లు అయినాక అంతకంత పెంచడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా ఓట్లకు ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది. తాగనివాడికి కూడా తాగడం నేర్పుతారు ఫ్రీ గానే వస్తుంది కదా అలా మద్యానికి అలవాటు చేసి ఓట్లయినాక మద్యం రేట్లు పెంచుతారు తాగుడుకు బానిసైన వారు అప్పుచేసి అయినా తాగుతారు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తారు ఇది నాయకులకు తెలుసు మందు ఫ్రీగా పోస్తే మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి డబ్బులు వస్తాయని. ఓట్లేసే జనాలు ఎర్రిపప్పలు అనుకుంటారేమోగాని జనాలు తిరగబడితే అదోలా ఉంటుందన్న సంగతి నాయకులు ఎరుగరు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత రేషన్ లాంటి పథకాలు ప్రజలకు అవసరం అంతేగాని పెన్షన్ పథకాలు పెట్టి సోమరిపోతులను చేస్తున్నారు. ఏ పని చేయక అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా  నాయకుల నటన అత్యంత అద్భుతంగా ఉంటాయి. నిజ జీవితంలో సినిమా నటుడు కూడా నటించనిది నాయకులు నటించి నటనలో జీవిస్తారు. ప్రజలు అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటే నిరుపేదలకు న్యాయం జరుగుతుందనేది ముమ్మాటికీ నిజం.
నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవడం ఎలా అనేది ప్రజలకు పెద్ద సవాలే.. నిజాయితీ నాయకుడిని గుర్తించడం ఎలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఓటరు మదిలో...

ప్రజాధనాన్ని వృధా చేయకుండా చర్యలు తీసుకోవాలి:

ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ప్రజా ధనం వృధా చేయడం వల్ల రానున్న రోజుల్లో పేదలు తినడానికి తిండి లేని పరిస్థితి చూడాల్సి వస్తోంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉండాలి. సోషల్ మీడియా ప్రచారాలు కూడా చాలా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు ను సక్రమంగా వినియోగించుకునేలా ఎన్నికల సమయానికి రెండు నెలల ముందు మద్యాన్ని నిషేధించాలి. మనీలాండరింగ్‌ను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాలి.

చట్టాలు మారాలి:

ప్రజా ప్రతినిధుల నేరచరిత్ర ఎన్నికల సంఘం పరిధిలోకి చేర్చడమే కాకుండా, ఓటర్లు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉండేలా ఎన్నికల సంఘం వెబ్‌సైట్లలో అన్ని అంశాలను పొందుపరచాలి. అప్పుడే ఓటరు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశముంది. అంతేకాకుండా అభ్యర్థి గెలిచిన తర్వాత అవినీతికి పాల్పడినట్లైతే ఆ సమయంలో ఓటర్లు రీకాల్ చేసుకొని మరొకరిని ఎన్నుకునే వెసులుబాటు కల్పించాలి. దీనివల్ల అవినీతిని అరికట్టే అవకాశముంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో రీకాల్ సిస్టమ్ అమలులో ఉంది. ఇలాంటి దేశాలలో మాత్రమే సుపరిపాలన పరుగులు పెడుతుంది. ఇలాంటి చట్టాల కోసం యువత కృషి చేయాలి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి.     
నిజాయితీ గల నాయకులు ఉన్నారా?

90 శాతం మంది నాయకులు అవినీతిపరులు అయితే 10 శాతం మంది నిజాయితీ గల నాయకులు అని చెప్పవచ్చు. ఉదాహరణకు గుమ్మడి నర్సయ్య  5 సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఇప్పటికి సాధారణ జీవితం కొనసాగించడం గొప్ప విషయం. సమాజానికి గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తులు అవసరం. ఈరోజుల్లో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే తరాలకు సరిపడా సంపాదన వెనకేసుకుంటున్నారు. గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు సంపాదన కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నాయకుడు. ఇలాంటి వారిని ప్రజలు ఎందుకు ఎన్నుకోరు? ప్రజలే మోసపోతున్నారు కానీ నాయకులు మోసం చేయడం లేరన్న విషయం గమనించాలి.
గుమ్మడి నర్సయ్య తో పాటు జయ ప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారిని ప్రజలు గుర్తించకపోవడం విచారకరం. సమాజంలో మార్పు రావాలంటే సమస్యలపై పోరాడే నాయకుడు కావాలి. అప్పుడే పేదలకు సరైన సంక్షేమ పథకాలు అందుతాయి.

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి సరైన నాయకుడిని సరైన సమయంలో ఎన్నుకోవాలి..
పేదోడి కల నెరవేరాలంటే. ఓటు ఆయుధం గా ఉపయోగించిన నాడే సాధ్యపడుతుంది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475        





5, అక్టోబర్ 2023, గురువారం

పల్లె నుండి ప్రపంచ ఆర్ధికవేత్తగా తెలంగాణ బిడ్డ






సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా!
అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా!

దాశరథి గారు రచించిన ఈ పాట భక్తులకు భగవంతుని పట్ల మరింత భక్తిని కలిగించింది. ఎంతోమంది నిరాశ ప్రజలను ఉత్సాహ పరిచింది. నిరుపేద విద్యార్థులను ప్రభావితం చేస్తూ వారిని ప్రయోజకులను చేసింది. చదువుకు పేదరికం అడ్డంకి కాదని, అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా స్ఫూర్తినిచ్చింది. ఈ చదువులు మనకెందుకులే అనుకున్న నిరుపేద విద్యార్థుల మదిలో చదవాలనే ఆశను రేకెత్తించాయి వారి ప్రతిభను ఖండాంతర ఖ్యాతి గడించేలా చేసింది. పల్లె వాసులను పట్నం వైపు వెళ్లేలా ప్రభావితం చేసింది. పల్లెటూరి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది.

మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ!
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ!  అన్నట్టుగా ప్రతి మనిషికి సాధించాలనే  పట్టుదల, దృఢ సంకల్పం, తపన, తపస్సు ఉంటే మనిషి సాధించలేనిది ప్రపంచంలో ఏదీ లేదనడంలో సందేహం లేదు. ప్రతి మనిషి జీవితంలో అవరోధాలు, ఆటంకాలు సహజమే కానీ వాటిని అవకాశాలుగా మలచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని మరోసారి నిరూపించిన ఉస్మానియా లో వికసించిన పేదింటి విద్య కుసుమం, సర్కార్ బడి నుంచి అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఎదిగిన తెలంగాణ వ్యక్తి, స్నేహాశీలి, మృదుస్వభావి, విద్యావేత్త, అనన్య ప్రతిభ కలిగిన రచయిత, సంపాదకుడు, సలహాదారు, బహుభాషా కోవిదుడు, "రవీందర్ రేనా".  

"రవీందర్ రేనా" గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఎదురులేని శక్తిగా, స్వయం కృషితో అసామాన్య విద్యావేత్తగా, తెలంగాణ బిడ్డగా అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఆసియా-పసిఫిక్, ఆఫ్రికాలో 31 సంవత్సరాలకు పైగా బోధన మరియు పరిశోధన రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి ఆయా దేశాలు అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాలతో సత్కరించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.

రవీందర్ రేనా ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

విద్యార్హతలు:

తెలంగాణ, హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పిఎచ్. డి (గోల్డ్ మెడల్), ఎం. ఫిల్. ఎకనామిక్స్‌లో ఎంఏ పూర్తి  చేశారు.
తెలంగాణ, వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ లో ఎల్ ఎల్ బి. (బ్యాచిలర్ ఆఫ్ లీగల్ లాస్) పూర్తి చేశారు.
తమిళనాడు అన్నామలై విశ్వవిద్యాలయం లో బి.ఇడి. (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) పూర్తి చేశారు.
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ లో ఎకనామిక్స్‌లో బి ఏ పూర్తి చేసారు.

అవార్డులు:

2011లో నమీబియా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ పరిశోధకుడి అవార్డును అందుకున్నారు.
2012లో అమెరికన్ బయోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ ద్వారా మ్యాన్ ఆఫ్ ది అవార్డు అందుకున్నారు.
2012 నుంచి 2022 వరకు విద్య రంగంలో ఆయన అందించిన సేవలకు పలు అవార్డులు అందుకున్నారు.
2022 లో డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వారిచే ఉత్తమ పరిశోధకుడిగా గుర్తింపు లభించింది.
2023 లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ICERT) వారిచే ఏకలవ్య అవార్డు అందుకున్నారు.
2023 ఒలింపస్ ఇంటర్నేషనల్ అవార్డు (OIASA) అందుకున్నారు.

అంతర్జాతీయ గుర్తింపు

ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (UA) అవార్డును అందుకున్నారు.
అతని పరిశోధన, రచనల ఆధారంగా, అమెరికన్ హిస్టారికల్ సొసైటీ, USA వరల్డ్ హూ ఈజ్ హూ ఇంటర్నేషనల్‌లో అతని ప్రొఫైల్‌ను నమోదు చేసింది.
అతను ప్రపంచంలోని టాప్ 01% పరిశోధకులలో ఒకడు.
డబ్లిన్, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (UA) అవార్డు మరియు గ్లోబల్ ఎకనామిక్స్ జడ్జిస్ ప్యానెల్ చైర్మన్ గా ఎంపిక చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం.

ప్రచురణలు:

పరిశోధన పుస్తకాలు - 10; పాఠ్యపుస్తకాలు - 5; స్టడీ మెటీరియల్ - 4, జర్నల్ పబ్లికేషన్స్ (పీర్ రివ్యూడ్ ) - 150, అంతర్జాతీయ -120;  జాతీయ -31, సవరించిన పుస్తకాలలో అధ్యాయాలు- 50, వార్తా పత్రికలు, మ్యాగజైన్‌లు మరియు వెబ్‌సైట్‌లలో కథనాలు – 125 కంటే ఎక్కువ.

బి సి రిజర్వేషన్ కోసం పోరాటం :

1995లో ఉస్మానియాలో చదువుతున్న సమయంలో వెనుకబడిన బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆర్.కృష్ణయ్య తదితరులు నేతృత్వంలో విద్యార్థి నాయకుడిగా రవీందర్ రేనా పోరాడారు. ఆ సమయంలో ఉస్మానియా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుతో బీసీలకు సముచిత రిజర్వేషన్లు కల్పించాలని అనేక చర్చలు జరిపారు. రవీందర్ రేనా నిరుపేదలకు న్యాయం కోసం తీవ్రంగా పోరాడిన విద్యార్థి నాయకుడు.  

కుటుంబ నేపథ్యం, విద్యాబ్యాసం:

రవీందర్ రేనా గారు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, ఎర్రబెల్లి గ్రామంలో నిరుపేద రైతు కుటుంబానికి చెందిన చంద్రమౌళి, రాజమ్మ దంపతులకు సెప్టెంబర్ 18, 1969 నాడు జన్మించారు. 1975 నాటి కాలంలో ఎర్రబెల్లి గ్రామం ఎలాంటి సౌకర్యాలు నోచుకోని పల్లె కనీసం బస్సు, కరెంటు, త్రాగు నీరు సౌకర్యం లేని గ్రామం. ఎర్రబెల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఆయన విద్యాభ్యాసం కొనసాగింది.  గురువులు రవీందర్ గారికి  చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఇంకా పై చదువులు చదవాలని మన గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని ప్రోత్సహించేవారు. గురువుల ప్రోత్సాహమే ఆయనలో పట్టుదల పెంచింది. కనీసం చదవడానికి కరెంట్ సౌకర్యం లేనప్పటికీ  మనసుంటే మార్గాలెన్నో అన్నట్లుగా కిరోసిన్ దీపం సహాయంతో మొక్కవోని దీక్షతో చదివారు. ఆ తర్వాత ఎనిమిదొవ తరగతి చదువుకునేందుకు తన గ్రామంలో పాఠశాల లేనందున ఎర్రబెల్లి నుండి భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల వరకు ప్రతి రోజు కాలినడకన వెళ్లి ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి పూర్తి చేశాడు. అంతేకాదు 10వ తరగతి చదువుతున్నప్పుడు పుస్తకాలు, పరీక్ష ఫీజులు కట్టేందుకు డబ్బులు లేని సమయంలో తల్లి వద్ద డబ్బులు లేవని గ్రహించి ఊళ్ళో కూలి పనులు చేసి పుస్తకాలు కొని చదివి పాసయ్యాడు. చదువుపై ఆయనకున్న ఆసక్తికి ఇది నిదర్శనం. హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడు సుదర్శన్ రెడ్డి మరియు ప్రాథమిక పాఠశాలలో శ్రీ సోమలింగం వంటి చాలా మంది ఉపాధ్యాయుల నుండి ప్రేరణ పొందారు. హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం హన్మకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలో పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో బట్టల దుకాణంలో నెలకు 80 రూపాయల జీతంతో దినసరి కూలీగా పనిచేస్తూ డిగ్రీ పాసయ్యారు. బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతోనే గడిచింది. తల్లి గ్రామంలో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. తల్లి కష్టాలు చూడలేక చలించిపోయాడు, తనను నమ్ముకున్న కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చదువు సరైన మార్గమని, కష్టాలను అధిగమించేందుకు చదువు ఆయుధమని భావించాడు. తర్వాత పై చదువుల కొరకు హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ పిఎచ్. డి పూర్తి చేశారు. ఆయన ప్రతిభకు పిఎచ్. డి లో గోల్డ్ మెడల్ రావడం విశేషం, ఎం. ఫిల్. ఎకనామిక్స్‌లో ఎంఏ, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ నుంచి బీఈడీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి, అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పటికీ ఆయనది ఎంతెత్తు ఎదిగిన ఒదిగి ఉండాలనే తత్వం. బాల్యమంతా బాధల తోనే గడిచిన ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టుసడలని పట్టుదలతో ప్రయత్నించి విజయాలను సొంతం చేసుకున్నారు. మూర్తీభవించిన మానవత్వానికి మరో పేరు రవీందర్ రానే. పలు దేశాలలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ స్వదేశం పై మమకారంతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా శ్రీశ్రీ విశ్వవిద్యాలయం వంటి సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా మరియు న్యూఢిల్లీలోని స్పర్ష్ గ్లోబల్ బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ, తన కొడుకు మరియు కుమార్తెను కూడా స్వదేశంలోనే చదివిస్తుండడం ఇది దేశంపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. అతని విద్యాభ్యాసమంతా భారతదేశంలోనే కొనసాగింది. బోధన మరియు పరిశోధనలో 31 సంవత్సరాల అనుభవం. భారతీయ సేవా 5 సంవత్సరాలు; 26 ఏళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను 40 కంటే ఎక్కువ దేశాలు సందర్శించాడు మరియు ఎరిట్రియా, పాపువా న్యూ గినియా, నమీబియా, దక్షిణాఫ్రికా, రష్యా, స్విట్జర్లాండ్ మొదలైన దేశాల్లో పనిచేశాడు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన రవీందర్ రానే గారి జీవితం నిరుపేద విద్యార్థులకు ఆదర్శం.

యువతకు సందేశం:

ఆశయ సాధనకు పేదరికం అడ్డు కాజాలదని, ప్రతి విద్యార్థి తన సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకునే దిశగా పట్టుసడలని ప్రయత్నం చేస్తూ సాధించేవరకు శ్రమించాలి. అప్పుడే విజయం మన సొంతం.
అసాధ్యమనే పదంలో "అ" అనే అక్షరాన్ని పక్కన పెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధ్యమే. ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం. సమస్యలు వచ్చాయని సతమత పడకుండా అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని పలు అంతర్జాతీయ సదస్సుల్లో యువతకు ఆయన సందేశాన్ని అందించారు.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475  









 

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...