26, నవంబర్ 2023, ఆదివారం

సిరి వెన్నెల పాటకు మరణం లేదు.

 "సిరి వెన్నెల" పాటకు మరణం లేదు.


"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం"  

సమాజంలోని అసమానతలు, అక్రమాలు మరియు అన్యాయాలను బహిర్గతం చేయడానికి పోరాడే నిజాయితీగల పౌరులు లేరని మరియు ఈ ప్రపంచం ఎప్పటికీ మారని తీరును తన కలం నుండి జాలువారిన అక్షరాలను అద్భుతమైన పాటగా మలిచి ప్రపంచానికి చాటిచెప్పిన మహాకవి, తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత, పాటల పూదోటలో విరిసిన పారిజాతం "సిరి వెన్నెల సీతారామశాస్త్రి".

సిరి వెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు మూడు దశాబ్దాల పాటు మధురమైన పాటలు అందించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాతో పాట ప్రారంభించి ఎన్నో తెలుగు సినీ పాటలకు  సిరుల జల్లు కురిపించారు. అంతేకాదు తన మొదటి పాట "విధాత తలపున"కి నంది అవార్డు రావడం అభినందనీయం. మొదటి పాట నుంచి చివరి పాట వరకు పాటల్లోని అభినయం ఎందరో తెలుగు పాటల ప్రియులను ఆకట్టుకుంది. ప్రతి పాట ప్రతి పదం మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఆయన రాసిన ప్రేమ యుగళగీతాలు ప్రేమికుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన సాహిత్య శిఖరం సిరి వెన్నెల. సిరి వెన్నెల సాహిత్యానికి మసకబారిన హృదయాలను సైతం కదిలించే సామర్థ్యం  ఉందంటే అతిశయోక్తి కాదు. సిరి వెన్నెల తెలుగు పదాలతో అలవోకగా ఆడుకోగల సాహితీవేత్త. సిరి వెన్నెల శాస్త్రి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం ప్రేక్షకుల మదిలో చిరకాలం పదిలంగా ఉంటాయనేది ముమ్మాటికీ నిజం.

ఆయన రాసిన పాటలన్నీ పాటల పూదోటలో వికసించిన గులాబీల్లా ఉంటాయి. పాటలన్నీ అద్భుతం. అర్ధవంతం. ఆణిముత్యం..పాటలో వైవిధ్యం..ప్రతి పాటలో మానవత్వానికి బాటలు వేసే ఎన్నో భావాలు..ఒక్కో పదంలోనూ అద్వితీయమైన వ్యక్తిత్వపు జాడలు.

ఆణిముత్యం వంటి కొన్ని పాటలు గుర్తుచేసుకుందాం:

 1993 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాయం సినిమాలోని  "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని" ఈ పాట పలు భాషల్లోకి అనువదించడమేగాక ఎంతోమందిని ఆలోచింపజేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట వినని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. నేటికీ ఈ పాట మారుమోగుతూనే ఉంది. ఏనాటికి మారదు లోకం, మారదు కాలం అంటూ రాసిన ప్రతి పదం ఆలోచనాత్మకంగా ఉంది. ఆయన పాటతోనే యావత్ దేశాన్ని ప్రశ్నించాడు. కుర్రకారును ఉర్రూతలూగించే పాటల నుంచి సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల వరకు ప్రతి ఒక్కటీ.. గుండెను హత్తుకొనేలా రాయడం సిరి వెన్నెల కే సాధ్యం.  

హిందూ సంప్రదాయంలో మంగళ సూత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధానికి గుర్తు ఈ మంగళ సూత్రం. పుట్టింటి వారిని,మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళ సూత్రంలో రెండు తాళి బొట్లు ఉంటాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ విడాకుల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారు ముందుగా మంగళసూత్రం విశిష్టత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1994 లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం అందించిన శుభలగ్నం చిత్రంలోని 

చిలక ఏ తోడు లేక  ఎటేపమ్మ ఒంటరి నడక

తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక

లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అంటూ సిరి వెన్నెల గారు రాసిన ఈ పాట కోట్లాది ప్రజలను ఆలోచింపజేసింది.

అనురాగం కొనగలిగే  ధనముందా  ఈ లోకంలో

మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో... అంటూ ప్రేమను కొనగలిగే డబ్బు ఈ ప్రపంచంలో ఉందా? ధన వ్యామోహం లో ఉన్న కలియుగ ధనరాశులకు తన పాటతో జ్ఞానోదయం చేశారు మహానుభావుడు సిరి వెన్నెల.

కొన్ని పాటలు మన వ్యవస్థని, మన సమాజంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తాయి... అలాంటి పాటే 1997 లో కృష్ణవంశీ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన చిత్రం "సింధూరం" లోని 

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ!

ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే! 

ఈ పాటకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు లభించింది.

సమాజంలో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ప్రశ్నించే రచన సిరి వెన్నెల కలం.

ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన సిరి వెన్నెలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 

ఆయన రాసిన పాటల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిలో 

రుద్రవీణ లో "నమ్మకు నమ్మకు ఈ రేయిని"

స్వర్ణకమలం లో "ఆకాశంలో ఆశల హరివిల్లు"

నువ్వే కావాలి లో "ఎక్కడ ఉన్న పక్కన నీవే"

చక్రం లో "జగమంత కుటుంబం"

అమ్మ రాజీనామా లో "ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం "

ఇలాంటి ఎన్నో కమనీయమైన పాటలతో తెలుగు ప్రజల మనసులను దోచుకున్న గేయరచయిత సిరి వెన్నెల.

మనిషికి మరణం తప్ప పాటకు మరణం లేదనడం లో అతిశయోక్తి లేదు.  


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475






కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...