*టీసీఎస్ భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ కు పునర్వైభవం రానుందా!*
ఉచితానికి అలవాటు పడితే అభివృద్ధి మాటేమోగానీ “ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే” అనే సామెత లాగా అవుతుందన్నది మాత్రం ముమ్మాటికీ నిజం. ఈ సత్యం అర్థం చేసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.
అది ఒక మారుమూల గ్రామం. అక్కడికి వెళ్లాలంటే కాలినడకన లేదా సైకిల్ మీద నాలుగు కిలోమీటర్లు మట్టి రోడ్డులో ప్రయానిన్చాల్సిందే. నగరానికి దూరంగా ఉన్న ఆ గ్రామస్థులు ఏ వస్తువు కొనాలన్నా గ్రామంలోని 4 కిరాణా షాపులకు వెళ్లాల్సిందే. అందులో కేవలం ముగ్గురు మాత్రమే తక్కువ లాభంతో వస్తువులను విక్రయిస్తుండడంతో గ్రామస్థులంతా ఆ ముగ్గురి దగ్గరే ఎక్కువ సరుకులు కొంటూ నాల్గవ దుకాణానికి వెళ్లడం మానేశారు. దీంతో దుకాణంలో సరుకులు అమ్ముడుపొక ఆ దుకాణాదారుడి అప్పులు పెరిగాయి. దిక్కుతోచని స్థితిలో పట్టణంలో ఉంటున్న స్నేహితుడి సలహా కోరడంతో అతనొక సలహా ఇచ్చాడు. స్నేహితుడి సలహా ప్రకారం మరుసటి రోజు “ఈ దుకాణంలో ఏ వస్తువైనా ఉచితం” అనే బోర్డు పెట్టాడు. ‘ఉచితం’ అనగానే గ్రామస్థులంతా ఆ దుకాణానికి ఎగబడ్డంతో మిగతా దుకాణాల వ్యాపారం తగ్గిపోయింది. చేసేదేమీలేక ఆ దుకాణాదారులు దుకాణాలు మూసేయడంతో ఆ ఊరిలో ఒక్క దుకాణం మాత్రమే మిగిలింది. ఆరు నెలల పాటు ఉచిత పథకం కొనసాగించి ఆ తర్వాత ఉచిత ఆఫర్ అయిపోయిందని ఒక్కో వస్తువు తక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించాడు. ఊర్లో వేరే దుకాణాలు లేకపోవడం, ఉన్న ఒక్క దుకాణంలో ధర తక్కువ ఉండటంతో ప్రజలు ఆ దుకాణంపై ఆధారపడడంతో, రెండేళ్ల తర్వాత అసలు ధర కంటే ఎక్కువకు అమ్మడం ప్రారంభించాడు. ఉచితాలకు అలవాటు పడిన ప్రజలకు ఇది గుణపాఠం గా మారింది. దేశ ప్రజలకు ‘జియో’ నేర్పిన గుణపాఠం కూడా అలాంటిదే.
అలాగే మన దేశంలో జియో నెట్వర్క్ మొదట్లో ప్రజలకు ఉచితాల ఎర వేసి ఇతర మొబైల్ నెట్వర్క్ లను దెబ్బతీసింది. చివరకు జియో మొబైల్ నెట్వర్క్ రంగంలో ఎకచ్చత్రాధిపత్యానికి తెరలేపింది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, దేశంలో జియో నెట్వర్క్ అత్యున్నత స్థాయికి చేరడానికి ప్రభుత్వం ప్రోత్సహించడమే ప్రధాన కారణం. ఒకవైపు భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తీవ్ర నష్టాల్లో ఉందన్న విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వం పునరుద్ధరణ ప్రయత్నంలో విఫలమైంది. అంతేకాకుండా 5 అక్టోబర్ 2022 న Jio 5G సేవలు దేశమంతా అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం నేటికీ 4G సేవలు అందించలేక పోతుంది అందుకు ప్రధాన కారణం బిఎస్ఎన్ఎల్ 4G పరికరాలు స్వదేశీ పరికరాల తయారీదారుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి వస్తుంది , అందువల్ల 4G, అలాగే 5G సర్వీసులను ప్రారంభించడానికి ఎక్కువ ఆలస్యమవుతుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఫిన్లాండ్ ఆధారిత నోకియా నుండి 5G నెట్వర్క్ పరికరాలను కొనుగోలు చేసింది. జియో విదేశీ పరికరాలను ఉపయోగించి ప్రముఖ స్థాయిలో నిలుస్తుంటే, ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ గురించి మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం.
20 సంవత్సరాల క్రితం దేశంలో ఒకేఒక నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ మాత్రమే అందుబాటులో ఉండేది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అంటే అప్పట్లో ప్రజలకు ఎనలేని విశ్వాసం ఉండేది. మారుమూల పల్లెల్లో సైతం పటిష్టమైన సిగ్నల్ వ్యవస్థతో ప్రజల మనసును గెలుచుకుంది. ఒక వెలుగు వెలిగిన బిఎస్ఎన్ఎల్ నేడు కంటికి కానరాకుండా పోతుంది. ఒకప్పుడు రూ.10 వేల కోట్ల లాభంతో నడిచిన సంస్థ నేడు రూ.6662 కోట్ల నష్టాల్లో కూరుకుపోవడానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ప్రభుత్వం 1990లో BSNL ల్యాండ్‌లైన్ సేవలతో తన నెట్‌వర్క్‌ను ప్రారంభించింది, ఆపై 2000 సంవత్సరంలో మొబైల్ ఫోన్ల రాకతో BSNL మొబైల్ సేవలను ప్రారంభించింది మరియు ప్రతి సంవత్సరం కొత్త ఆఫర్లతో ముందుకు సాగడం ప్రారంభించింది. అంతేకాదు 2001 వరకు తిరుగులేని నెట్ వర్క్ గా ఉన్న ఈ సంస్థ 2004 వరకు పదివేల కోట్ల లాభాలతో నిలవగా.. తర్వాత 2005లో దేశంలో నెట్ వర్క్ కంపెనీలన్నింటినీ వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా నిలిచింది. చివరకు ఎయిర్‌టెల్‌ను కూడా అధిగమించింది. అప్పట్లో బీఎస్ఎన్ఎల్ సిమ్ కొనుగోలు చేసేందుకు గంటల తరబడి నిలబడేవారు. కంపెనీ 2009 వరకు మంచి లాభాలు ఆర్జించి ప్రభుత్వానికి రూ.46668 కోట్ల భారీ మొత్తాన్ని అందించింది. అప్పట్లో ప్రభుత్వానికి భారీ లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీల్లో బీఎస్ఎన్ఎల్ ఒకటి. ఒకప్పుడు 70 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్న BSNL, భారతదేశంలో తిరుగులేని నెట్‌వర్క్‌గా ఎదిగింది. 2007లో, WIMAX సాంకేతికతకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన BSNL, ఆ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడాన్ని అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. కానీ అప్పటి కేంద్ర టెలికాం మంత్రి ఎ.రాజా WIMAX టెక్నాలజీకి అనుమతి ఇవ్వకపోవడంతో 2009లో మళ్లీ అనుమతి కోరగా, ప్రభుత్వం అందుకు WIMAX కు సంబంధించిన టెండర్స్ లేకుండా తీసేశారు. 2007 లో BSNL WIMAX టెండర్ వచ్చి ఉంటే ఈరోజు ఏ ఒక్క టెలికం సంస్థ మిగిలి ఉండేది కాదు. కొత్త టెక్నాలజీని అవలంబించడం లో BSNL వెనుకబడడంతో, మిగిలిన టెలికాం కంపెనీలు కొత్త టెక్నాలజీని త్వరగా స్వీకరించాయి, ఇది బీఎస్ఎన్ఎల్ కి కోలుకోలేని దెబ్బ. జియో చేపట్టిన ఉచిత ఆఫర్ వల్ల బీఎస్ఎన్ఎల్ సంస్థనే కాకుండా అన్ని టెలికాం సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. అప్పటి ప్రభుత్వం WIMAX టెక్నాలజీకి అనుమతివ్వకపోవడంతోనే BSNL తీవ్ర నష్టాన్ని చవిచూసిందన్న విషయం జగమెరిగిన సత్యం. అందువల్లనే సంస్థకు రూ.1800 కోట్ల నష్టం వచ్చింది. అంతేకాకుండా 2008లో అప్పటి కమ్యూనికేషన్ మరియు ఐటీ శాఖ మంత్రి ఎ. రాజా జారీ చేసిన మొత్తం 122 లైసెన్స్‌లను కోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత 2G స్పెక్ట్రమ్ కుంభకోణం భారతదేశ రాజకీయ రంగాన్ని కుదిపివేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.30,984 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన బీఎస్ఎన్ఎల్ సంస్థ పునరుద్ధరణకు పటిష్టమైన ప్రణాళికలు చేయాల్సిన అవసరముంది.
*TCS మరియు BSNL భాగస్వామ్యం కొత్త శకానికి నాంది:*
TCS మరియు BSNL మధ్య భాగస్వామ్యం భారతీయ టెలికాం మార్కెట్లో కొత్త శకానికి నాంది పలికింది. Jio ధరలు 12 నుండి 25 శాతం, ఎయిర్టెల్ ధరలు 11 నుండి 21 శాతం మరియు వోడాఫోన్ ఐడియా (Vi) 10 నుంచి 21 శాతం వరకు పెరిగాయి, జియో మరియు ఎయిర్టెల్ యొక్క అధిక ధరలతో జనం ఇకపై BSNL కి మారే అవకాశముంది. ఈ తిరుగుబాటులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మధ్య గణనీయమైన భాగస్వామ్యం ఉంది. టాటా ప్రమేయం కేవలం ఇంటర్నెట్ సేవలు అందించడమే కాకుండా భారత దేశంలో నాలుగు ప్రాంతాల్లో డేటా సెంటర్లు కూడా నిర్మిస్తోంది, ఇది దేశంలోని 4G మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ అభివృద్ధి ప్రస్తుత మార్కెట్ ను సవాలు చేస్తూ వేగవంతమైన మరియు మరింత విశ్వసనీయమైన ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో Jio మరియు Airtel ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, BSNL ఈ భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించు కోగలిగితే ఈ ద్వంద్వ వ్యవస్థ కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. పోటీ ధరలను మరియు మెరుగైన సేవలు అందించడం ద్వారా, BSNL జియో మరియు ఎయిర్టెల్ నుండి ఇటీవలి ధరల పెంపుపై అసంతృప్తిగా ఉన్న గణనీయమైన వినియోగదారులను ఆకర్షించగలుగుతుంది.
BSNL కంపెనీ 4G సేవలను అందించడానికి ఇప్పటికే ఉన్న సాంకేతికతలపై ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనివ్వడం దేశానికే గర్వకారణం. దేశ భవిష్యత్తు కోసం టీసీఎస్ కూడా ప్రభుత్వరంగ సంస్థ BSNL తో భాగస్వామ్యం కావడం అభినందనీయం.
దేశ సంపదను పెంపొందించాలంటే ప్రతి ఒక్కరు BSNL వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
*వ్యాసకర్త*
*కోట దామోదర్*
*మొబైల్: 9391480475*
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి