18, ఆగస్టు 2024, ఆదివారం

తెలుగు సినీ జగత్తుకే అజరామరం సినారె గేయాలు

తెలుగు సినీ జగత్తుకే అజరామరం సినారె గేయాలు

 నిజం చెప్పాలంటే కొన్ని పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిని, అనిర్వచనీయమైన అనుభూతిని, మరియు మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తాయి డా. సి. నారాయణరెడ్డి గారు రాసిన పాటలు. ఆయన కలం నుండి దొర్లిన పాటలు ఎందరో తెలుగువారి హృదయాలను దశాబ్దాలుగా ఓలలాడిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన పాటలోని ప్రతిపదం శ్రోతల హృదయ కవాటాల మీటలను సుతిమెత్తగా స్పృశిస్తుంది. ప్రేమికుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన యుగళగీతాల ద్వారా అద్భుతమైన సాహిత్యాన్నిఅందించిన సాహిత్యశిఖరం "సినారె". సందార్భానుసారం వైవిధ్యభరితమైన దైవభక్తి, దేశభక్తి,బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు, వచన కవితలు, గజల్స్, పౌరాణిక రచనలతో శ్రోతలకు వీనుల విందు చేశారు. సందర్భానుసారంగా ఏ పాటైనా అలవోకగా రాయగల ప్రావీణ్యత ఆయనకు వాగ్దేవి ద్వారా సిద్ధించిన వరం. ఆయన కలం నుంచి జాలువారిన దాదాపు ప్రతి పాట తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో పాటు అప్రయత్నంగా వారి పెదవులపై నాట్యమాడేలాచేస్తుంది. పండితుల నుంచి పామరుల వరకు అందరినీ అలరించిన విశిష్ట శైలి ఆయన సొంతం. తెలుగు సినిమా పాటల్లో ఛందస్సుకు, భావానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన కవి సినారె. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయన శైలి అద్వితీయం. రచనలో వైవిధ్యం పాటల్లో మాధుర్యం. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప మహాకవులలో ముందు వరుసలో ఉంటారు "సినారె". పద్మశ్రీ, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, సోవియట్ - నెహ్రు పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిలుగా నిలిచాయి.

 సినారె గారు రాసిన ప్రతి పాటలోనూ అద్భుతమైన పద ప్రయోగం ఉంటుంది. 1962లో "గులేబకావళి" సినిమాతో గేయ రచయితగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 3,500కు పైగా పాటలకు సాహిత్యాన్ని అందించడంతో పాటు  తెలుగు సినిమా పాటలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి చేశారు. రాసిన తొలి పాటతోనే తెలుగు సాహిత్యం పై తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసానీ.. అంటూ రాసిన పాటతో అందరి మనుషులను దోచుకున్నారు. ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం.. ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం.. అంటూ  ప్రేమ బంధాన్ని విడదీయరాని బంధమని,  ఆ బంధాన్ని విడదీయరాని బంధంగా ఇగిరిపోని గంధం గా అభివర్ణించారు. ఎన్ని యుగాలైనా ఆయన పాట ఇగిరిపోని గంధంలా అద్భుతమైన పద విన్యాసాలతో పసందైన పాటలను అందించారు. ఈ పాట ఇప్పటికి ఎప్పటికి ప్రజాదరణ పొందుతూనే ఉంటుంది.

 1962లో వచ్చిన "ఆత్మబంధువు" సినిమాలో" చదువురాని వాడవని దిగులు చెందకు - మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు" మానవత్వం లేని చదువులు ఉన్నా. లేకున్నా ఒక్కటే అనే విషయాన్ని  ఈపాటద్వారాసుస్పష్టంగాతెలియజేశారు. "ఏమి చదవి పక్షులు పైకెగురగలిగెను..ఏ చదువువల్ల చేపపిల్ల లీదగలిగెను"అంటూకొన్నిఉదాహరణలతోచదువురాని వారికి చదువురాదని దిగులు చెందకు మంచి హృదయమున్నచాలని తెలియజేశారు. అదే సంవత్సరం వచ్చిన "కులగోత్రాలు" సినిమాలో

చిలిపికనుల తీయని చెలికాడా.. నీ నీడను నిలుపుకొందురా.
నీలికురుల వన్నెల జవరాలా.. నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల అంటూ ప్రేమికుల మదిలో చిరకాల ముద్ర వేసుకున్నారు.

 బి.ఎస్.రంగా 1964లో శిల్పకళా ప్రావీణుడైన జక్కన్న జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చారిత్రాత్మక చిత్రం "అమరశిల్పి జక్కన" సినిమాలోని శిల్పకళకు ప్రాణం పోసే రాతిబండలపై  రచించిన "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో – ఈబండల మాటున ఏ గుండెలు మ్రోగెనో" పాట ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాదరణ చెంది మనల్నిఆలోచింపజేస్తుంది.

1970 లో ఎ.సంజీవి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం "ధర్మదాత" సినిమాలోని "ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతంకన్నా" ఈ పాట ద్వారా ఓ తండ్రి తన కుటుంబంకోసం ఎంత కష్టపడతాడో వివరిస్తూ, తన పిల్లలను ప్రయోజకులను చేయడంకోసం తన ఇష్టాలను మరిచి తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. తాను ముళ్ల బాటలో నడిచి పిల్లలను పూల బాటలో నడిపేందుకు ఏ మాత్రం వేనుకాడడన్న విషయాన్ని మనసుకు హత్తుకునే విధంగా వివరించారు. "ఉన్న నాడు ఏమి దాచుకున్నావు.. లేనినాడు చేయి సాచనన్నావు". తండ్రి తన కోసం ఏమి దాచుకోకుండా  పిల్లల కోసం సర్వం త్యాగం చేస్తాడు కానీ పిల్లలు కాదు పొమ్మంటే వారిదగ్గర చేయి చాచకుండా తన భాదను గుండెల్లో పెట్టుకొని పైకి నవ్వుతో కనిపిస్తాడు కనిపించని తండ్రి ప్రేమను ఈపాట ద్వారా కనిపించేలా చేశారు సినారె గారు.

దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన "తాత మనవడు" చిత్రంలోని "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం"

వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనం అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే గొప్ప సందేశాత్మక చిత్రం ఇది.

1974లో ఎస్.డి.లాల్ దర్శకత్వంలో విడుదలైన "నిప్పులాంటి మనిషి" తెలుగు చిత్రంలోని "స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం" బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్నాబాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు. బాధలను ప్రేమించు భాయీ.. లేదు అంతకు మించి హాయ్..స్నేహమే.. హొయ్ అని గొప్పగా వర్ణిస్తూ రాసిన ఈ పాట బాగా ప్రాచుర్యం పొందింది.

2001 లో బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన "ప్రేమించు" చిత్రంలోని "కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా" ఒక తల్లి తన పిల్లలను మాత్రమే చూసుకుంటుంది కానీ పిల్లలు లేని వారు దేశంలో పిల్లలందరినీ తన బిడ్డలుగా భావిస్తారు. కేవలం తల్లిగా ఉండాలనే ఆలోచన కంటే ఎక్కువగా ఆదరించి, పెంచి పోషించిన వారు కూడా తల్లితో సమానమని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు సినారె. 

ఖసీదా ద్వారా పర్షియన్లు గజల్ ను సాహితీ లోకం లోకి తీసుకువచ్చారు. గజల్లు పర్షియన్ భాషలో జలాలుద్దీన్ మొహమ్మద్ రూమి, హాఫిజ్, తుర్కీ కవులు గజల్ రచించారు. మొదటి గజల్ 10వ శతాబ్దంలో ఇరాన్లో ఉద్భవించింది.  తర్వాత12వ శతాబ్దంలో ముస్లిం రాజుల పాలనలో మొఘలులు ఇరానియన్ ఆచారాలతో పాటు గజల్ ఇరాన్ నుండి భారతదేశానికి వ్యాప్తి చేశారు. ఉత్తర భారత కవులు మిర్జా గాలిబ్ (1797-1869), ముహమ్మద్ ఇక్బాల్ (1877-1938) ఇరువురూ పారశీ మరియు ఉర్దూ భాషలలో గజల్ రచించారు. గజల్ తెలుగు సాహిత్యంలోకి1963లో అడుగుపెట్టింది. ‘వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది/ పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’’ చాలామందికి గజల్ అంటే అసలైన అర్ధం తెలియదు "గజల్" అంటే ప్రియురాలితో ఏకాంతమున జరిపే ప్రణయ సల్లాపమని నైఘంటికార్థం" . గజల్ ఒక శృంగార రసాత్మక అసలు సిసలైన భావకవిత. తెలుగు గజల్ మొదటిసారిగా, కాఫియా మరియు అంత్యానుప్రాస నియమాలను అనుసరించి, కవిత్వ శైలిని (లేదా శ్లోకం) కొంతవరకు, ఛందస్సులో లేదా వ్యక్తీకరణ పద్ధతి ఉపయోగించారు. తెలుగు గజల్‌ను మొదటిసారిగా తెలుగువారికి దాశరథి కృష్ణమాచార్యలు 1965లో పరిచయం చేస్తే ఆ తర్వాత సినారె గారు ఉర్దూ మాధ్యమంలో చదవడం వల్ల గజళ్ళలోని భాష, భావం. సౌందర్యం వంటివి తెలుగు గజళ్ళలోనూ ఉర్దూ వాతావరణాన్ని తేగలిగారు. ఎన్నో అద్భుతమైన తెలుగు గజల్ అందించడమే కాకుండా వాటి ప్రాముఖ్యతను ప్రపంచ నలుమూలల వ్యాపింపచేసారు.

ఆయన రచించిన గజల్స్ కొన్ని తెలుసుకుందాం..

"చిన్నదీపమని అనుకోకు అది చీకటినే కాల్చేస్తుంది..
జనమేం చేస్తుందని అనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది"  చిన్నదీపమని అనుకోకు అదే లేకుంటే ఇల్లంతా చీకటే, జనం ఏమిచేస్తారు అనుకుంటే సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి గజల్స్ చదువుతుంటే పాఠకుడికి రసజ్ఞత భావం కలిగి ఇంకా చదవాలనే కోరిక కలుగుతుంది.

 1. "ఎవరో ఎదో అన్నారని మూసేయకు మాయని జీవితం..

ఏవో కలతలు పాకుతుంటే చించేయకు రాయని కాగితం" ..

2 . "పరులకోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని.. 

మూగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని"..

3 . "ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక..

ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక"..

సినారె గారి కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఓ అద్భుతమే.. స్వయంగా ఆయన గజళ్ళు రాయడమే కాక వాటిని అంతే ఆర్తితో స్వయంగా పాడటం మరో గొప్ప విషయం..

ప్రపంచ పదులు:

ప్రపంచపదులు అంటే విస్తరించి చెప్పడం అని అర్ధం.  సహజంగా పార్శిలోని రుబాయిలో నాలుగు పాదాలు ఉంటాయి. సినారెవాటినిఐదుపాదాలకుపెంచడమేకాకుండాఛందస్సుతోపాటుశబ్దలయ, భావస్పందనలు కలిగివుండేలా మహత్తరమైన ప్రయోగాలు చేసి ప్రపంచపదులను ప్రపంచనదులుగా విస్తరింపజేశారు. ప్రాపంచిక అన్వేషణకు అక్షర రూపంగా సినారె కలం నుండి జాలువారిన ఆణిముత్యాలే ఈ ప్రపంచపదులు.

ప్రపంచపదుల్లోని సినారె చేసిన పదప్రయోగం చూద్దాం:

జరిగిపోయిన కాలమెన్నడు తిరిగిరాదని తెలిసినా..
జారిపోయిన తార నింగికి చేరలేదని తెలిసినా..
మంచుకమ్మిన బుర్రలను విదిలించుకుని పోరెందుకో..


రాలిపోయే ఆకులను ఎవరాపిన ఏముందిలే..
ఊడిపోయే జుత్తునెంతగా ఒత్తినా ఏముందిలే..
ఒప్పుకున్నా కొన్ని మార్పులు తప్పవేమో ప్రకృతిలో..


కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది?
కత్తులు నాటిన గుడిలో భక్తి యెలా పండుతుంది?
'అంతాభద్రం' అంటూ ఎంత కాలమీ సూక్తులు.
వంచన దూరిన ఇంట్లో మంచి యెలా బతుకుతుంది?
నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది?

చూడండి సినారె గారు ఎంత అద్భుతంగా రాశారో.. చదివేకొద్దీ ఇంకా చదవాలనే రసజ్ఞతాభావం కలిగినప్పుడే అది అసలైన కవిత, అసలైన రచన.

85 ఏళ్ల జీవితకాలంలో 85 కు పైగా రచనలు చేసి ఎన్నో పదవులు చేపట్టి ఎనెన్నో పురస్కారాలు పొందిన సినారె మనమధ్య లేకపోవచ్చు కానీ ఆయన పాటకు, కవితలకు, రచనలకు మరణం లేదు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో మేరునగధీరుడు... నిత్య సాహిత్య కృషీవలుడు.. మన సినారె..


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475




కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...