19, సెప్టెంబర్ 2024, గురువారం

హాస్యానికి చిరునామా సాకలి హనుమంతు:

హాస్యానికి చిరునామా సాకలి హనుమంతు:

నిన్న అనుకోకుండా వాట్సాప్ చూస్తుండగా స్టేటస్ లో అనుకోకుండా సాకలి హనుమంతు చనిపోయాడన్న వార్త చూసాను. హనుమంతు మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. హనుమంతు తన నవ్వుల పువ్వులతో గుమ్మడవెల్లి ప్రజలందిరికి హాస్యసుగంధాలు అందించాడు.అందరితో కలసి అందరినీ నవ్వించేవాడు. నలుగురిలో నవ్వుల రారాజు. సహజంగా సినిమాల్లో కామెడీ సీన్లు చేయాలంటే స్క్రిప్ట్ రాయాలి, ఒకరు స్క్రిప్ట్ రాస్తారు, మరొకరు కామెడీ చేస్తారు. కానీ హనుమంతు, గుడ్ల రాజమల్లు ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా సహజంగానే సందర్భానుసారంగా అలవోకగా హాస్యాన్ని పండించే భాష ప్రావీణ్యత కలిగిన వారు గుమ్మడవెల్లి లో ఇద్దరే. హనుమంతుని వయస్సు దాదాపు 75 సంవత్సరాలు. కానీ అలుపెరగని కఠోర శ్రామికుడు, అతను చేసే పనులు చూస్తే 25 ఏళ్ల యువకుడు కూడా చేయలేరేమో అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు.  వయసు కేవలం మనిషికే కానీ మనుసుకాదని నమ్మిన వ్యక్తి హనుమంతు. హనుమంతు మాటలు వింటే ఎంతటి కఠోరమైన మనసు అయినా కరిగిపోవాల్సిందే ఆయన మాటల చమత్కారం తేనె లాంటివి. కోపంలో ఉన్నవారిని సైతం నవ్వించగల శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి. నేను హైదరాబాద్ నుండి ఊరికి ఎప్పుడైనా వెళ్తే  "నమస్తే పెద్దన్న" అనేది. నా వయసు ఆయన వయసులో సగం అయినా ఆయన నన్ను అన్న అనే పిలుస్తాడు. అన్న మంచిగున్నావే వదినగిట్ల అంత మంచేనా అన్న అని పలకరిస్తే నా ఊరిని విడిచి పోలేము అనే భావన కలిగేది ఇంతటి ప్రేమానురాగాలు చూపే వ్యక్తులు దొరకటం నా అదృష్టంగానే భావిస్తాను. నేను ఊరికి వచ్చానని తెలిస్తే చాలు తప్పకుండ నన్ను కలిసి చాల సేపు ముచ్చట పెట్టేది. హనుమంతు మా ఇంట్లో ఉప్పలమ్మ పండుగ జరిగిన ప్రతిసారి ఆయన ఉండాల్సిందే హనుమంతు మా ఇంటి సాకాలాయన. అయినా హనుమంతు మా ఇంటి సొంతమనిషి లాగే ఉండేవారు. ఆప్యాయతంగా మాట్లాడే హనుమంతు అన్న లేనిలోటు ఎప్పటికీ తీరదు. కల్మషం లేని వ్యక్తి, ఆపద అంటే నేను ఉన్న అనే హనుమంతు లాంటి మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమైన విషయమే. ఆయన అద్భుతమైన వాయిద్య కళాకారుడు కూడా చిరంజీవి సినిమా పాటలంటే పిచ్చి. హనుమంతు ఎవరిని కూడా పేరు పెట్టి పిలవరు అందరిని వరుసలు కలుపుతూ మర్యాదగా పిలవటం ఆయనకు అలవాటు. చిన్నపిల్లలందరిని ఓ తాత అని పిలుస్తూ ఊళ్ళో అందరి మనుసులను గెలుచుకున్న వ్యక్తి హనుమంతు తాత. ఒకానొక సందర్భంలో గుడ్ల రాజమల్లు పొలం దగ్గర హనుమంతు, గుడ్ల రాజమల్లు మాట్లాడుకునే తీరును చూసి నా జీవితంలో ఎప్పుడు నవ్వనంత నవ్వు వచ్చింది. వాళ్లిద్దరూ వరుసకు బావ భామర్దులు. ఈ ఇద్దరు ఎక్కడ కలిసి మాట్లాడుకున్న వారి మాటలువిని పక్కన ఉన్నవారు నవ్వకుండా ఉండలేరు. అంత హాస్యాస్పదంగా ఉంటాయి వారి మాటలు. చమత్కారమైన మాటలు ఛలోక్తులు హనుమంతుకు వెన్నతో పెట్టిన విద్య. గుడ్ల రాజమల్లు కూడా ఓ అద్భుతమైన హాస్య కళాకారుడే.

ఓరోజు గుడ్ల రాజమల్లు పొలం లో పని చేస్తుండగా తోట రాములు గుడ్ల రాజమల్లును చూసి "ఎందుకే రాజమల్లు నీకింత కష్టం సప్పుడుఁజేక ఇంట్లో ఇంత తిని కూసోక" అని అన్నాడు వెంటనే రాజమల్లు తోట రాములును చూసి "నువ్వుపెట్టిన బువ్వేరా రాములు" అన్నాడు అక్కడ ఉన్నవాళ్ళంతా నవ్విర్రు. ఆ విషయాన్నీ ఇప్పటికి గుర్తు చేసుకున్నపుడల్లా నవ్వుకుంటాను. నవ్వుల రారాజు రాజమల్లు మరణం కూడా బాధాకరమే. హాస్యం వీరిద్దరి చిరునామా,నవ్వించడం వీరి నైజం,మాటల్లో హాస్యాన్ని పండించడంలో వీరిద్దరిది ఒక ప్రత్యేక శైలి, ఏ విషయంపై మాట్లాడిన తన హాస్యాస్పందన పటిమతో రక్తి కట్టించే వారు. వీరిద్దరి మరణం గుమ్మడవెల్లి గ్రామానికి తీరని లోటు. 

హనుమంతు ను స్మరించుకుంటూ వారికివే మా ఘన నివాళులు.

కోట దామోదర్

మొబైల్ 9391480475 


కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...