10, ఆగస్టు 2025, ఆదివారం

అవరోధాలను అధిగమించి విద్యాకుసుమంగా ఎదిగిన “డాక్టర్. బండ సరోజన"

 *అవరోధాలను అధిగమించి విద్యాకుసుమంగా ఎదిగిన “డాక్టర్. బండ సరోజన"*

అవకాశమొస్తే అబలలు సబలలుగా మారి అన్నింటా పురుషులతో సమానమేనని సవాలు విసరడమే కాకుండా వారు అడుగిడని రంగమే లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ మాటకొస్తే అతివలు తమ మేధస్సు, శక్తిసామర్ధ్యాలతో అద్భుతంగా రాణించిన దృష్టాంతాలు చరిత్రలోనే కాక వర్తమానంలో కూడా మనకు గోచరమవుతాయి. రాణి రుద్రమదేవి, సుమిత్ర దేవి,  సరోజినీ నాయుడు, ఆరుట్ల కమల దేవి, మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ లాంటి వారే కాక వర్తమానంలో తెలంగాణ గడ్డ మీద పుట్టి పట్టుదలతో తనను తాను “చదువుల తల్లి”గా మార్చుకున్న *"డాక్టర్ బండ సరోజన"* లాంటి ఆ కోవకు చెందిన వారెందరో ఉన్నారు.

నిజాం పాలనలో అణచివేతలు, దురాచారాలకు గురైన వారిలో ప్రధాన బాధితులు మహిళలు అని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఆనాటి సమాజంలో మహిళలపై అడుగడుగునా ఆంక్షలు విధించి వారిని ఇంటికే పరిమితం చేసి ‘అబల’గా చిత్రీకరించింది. ఆ రోజుల్లో అంతగా చదువుకు నోచుకోని అత్యధిక శాతం తెలంగాణ మహిళలు పల్లెల్లో పశువుల కాపర్లుగా, వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటూ రజాకార్ల దాష్టికాలతో అనుక్షణం భయం గుప్పిట్లో బతికారు. రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరులో అనేక మంది వీర మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. రజాకార్ల పోరాటం తరువాత కూడా తెలంగాణలో మహిళలకు విద్యనభ్యసించడానికీ పూర్తిగా స్వేచ్ఛ దొరకకపోవడం శోచనీయం. తెలంగాణ పల్లెల్లో దొరల బిడ్డలు, ధనికులు, ఉన్నత వర్గాల్లోని మహిళలు మాత్రమే కొద్దిపాటి స్వేచ్ఛను అనుభవించినప్పటికీ, చదువుకున్న మహిళల శాతం అతి తక్కువ అనే చెప్పాలి. నిరంకుశ నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలను కళ్లారా చూసిన మహిళలు కొంతమంది ఎలాగైనా రజాకార్లను తరిమికొట్టాలనే సంకల్పంతో పురుషులతో సమానంగా తుపాకులు చేతబట్టి పోరుబాట పట్టారు. అలాంటి పరిస్థితుల నుండి విముక్తి కోసం ఎన్నో అసమానతలు, శ్రమదోపిడి కష్టాలను ఎదుర్కొని క్రమంగా విద్యా వ్యాప్తి చెందడం వల్ల మహిళల్లో చైతన్యం రావడం జరిగింది. రజాకార్ల పోరాటం తర్వాత మహిళలలో విద్యనభ్యసించాలనే కోరిక బలంగా కలిగింది. కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు “ఆడపిల్లకు చదువెందుకు” అనే అభిప్రాయంతో స్వీయ నిబంధనలు ఏర్పరచుకోగా, మరి కొన్ని గ్రామాల్లో సరైన స్కూల్ లేక మహిళలు ఇంటి నాలుగు గోడలకే పరిమితమై అవకాశాల కోసం పరితపించారు. ఆ తర్వాత పలువురు సంఘసంస్కర్తలు, విద్యావంతులు, అభ్యుదయవాదుల కృషితో స్త్రీ విద్య, అభివృద్ధికి మద్దతు లభించింది. “కత్తికన్నా కలం గొప్పది.. గన్ను కన్నా పెన్ను గొప్పది” అన్న మాటలను నిజం చేసేందుకు మహిళల్లో చైతన్యం నింపేందుకు పెద్ద ఎత్తున మహిళా సాధికారత కోసం ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత అతికొద్ది మంది మహిళలు విద్యనభ్యసించి మహిళాభ్యున్నతికి స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి స్ఫూర్తివంతమైన మహిళలో  రిటైర్డ్ ప్రొఫెసర్, తెలుగు పాఠ్య పుస్తక రూపకర్త *"డాక్టర్ బండ సరోజన"* ఒకరు.

బండ సరోజన సిద్ధిపేట జిల్లాలోని (ఒకప్పుడు వరంగల్ జిల్లా) మారుమూల గ్రామమైన లద్నూర్ లో మల్లయ్య, అంబమ్మ దంపతులకు ఏప్రిల్ 3, 1941న జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటికి ఆమె వయసు కేవలం 7 సంవత్సరాలు. ఒకవైపు నిరంకుశ పాలన మరోవైపు రజాకార్ల హింసాయుత చర్యలతో ఊరి జనం అల్లాడిపోయారు. ఆమె తన పసి ప్రాయంలోనే అలాంటి కొన్ని సంఘటనలను స్వయంగా చూసి ఆందోళన చెందిన సందర్భాలున్నాయి. ఆడపిల్ల అడుగు బయట పెడితే ఏమి జరుగుతుందోనన్న భయంతో తల్లిదండ్రులెవరూ అమ్మాయిలను బయటకు కాదు కదా కనీసం పాఠశాలకు కూడా పంపేవారు కాదు. అయితే చదువు పట్ల కొంత అవగాహన ఉన్న ఆమె తండ్రి తన కూతుర్ని చదివించాలనే ఆలోచనతో అదే గ్రామం లద్నూర్ పాఠశాలకు పంపించేవారు. ఓ రోజు రజాకార్లు దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించినప్పుడు, ఆ దాడిలో ఆమె చదువుతున్న పాఠశాల పూర్తిగా ధ్వంసం అయింది. అప్పటికి ఆమె మూడో తరగతి చదువుతున్నారు. పాఠశాల పూర్తిగా కాలిపోవడం వల్ల భయంతో ఎవరు కూడా పాఠశాలకు వెళ్లలేకపోయారు. కొన్ని నెలల తరువాత గ్రామ పెద్దల సహాయంతో పాఠశాలకు మరమ్మత్తు చేసి పునః ప్రారంభించడంతో ఆమె మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. ఏడవ తరగతి తరువాత, ఉన్నత చదువుల కోసం విద్యా సౌకర్యాలు లేని కారణంగా, ఆమె ఒక సంవత్సరం పాటు తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయ పడుతూ చదువు మరిచిపోకుండా ఉండడానికి పొలం గట్ల మీద అక్షరాలు రాస్తూ ఉండేవారు. ఓ రోజు ఆమె తండ్రి తన కూతురికి చదువు మీద ఉన్న ఆసక్తిని గమనించి రోజూ సాయంకాలం సమయంలో ఆమెకు మహనీయుల చరిత్ర, తెలుగు పద్యాలు, తెలుగు జాతీయాలు నేర్పించేవారు. ఇలా, తండ్రి ఆమెలో విద్య పట్ల మరింత ఆసక్తిని పెంచారు. ఆమె ఐదు సంవత్సరాల పాటు తండ్రితో వ్యవసాయం మరియు పశువులు కాయడం లాంటి పనులు చేసింది. ఆ రోజుల్లోని సౌకర్యాల లేమి, విద్య పట్ల తల్లి వ్యతిరేకతలను పట్టించుకోకుండా, చదవాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. 1962లో, ఆమె సిద్ధిపేటలో ఎలిమెంటరీ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత 1963లో, ఆమె సికింద్రాబాద్‌లోని బోయిగూడా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉద్యోగం పొందింది. వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా, ఇంకా పై చదువులు చదవాలనే ఆసక్తితో, ఉద్యోగం చేస్తూనే A.N. రావు గారి మార్గదర్శకత్వంలో ఏ శిక్షణ లేకుండా 10వ తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత  PUC (Pre-University Course), BA, B.Ed., 1974లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి MA పట్టా పొందినప్పటికీ ఆమెలో చదువుపై తృష్ణ ఏమాత్రం తగ్గలేదు. ఇదే ఆమెను 1976లో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ (Master of Education Degree) పూర్తి చేసేలా  పురికొల్పింది. చివరకు పిహెచ్‌డీ (PhD) చేయాలన్న దృఢ సంకల్పంతో, పట్టువదలకుండా 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్‌డీ పట్టా పొందారు. సరోజన విద్యకు అండగా నిలిచినా వ్యక్తి బొడ్డు దామోదర్ ఆమె ఉన్నత విద్య అభివృద్ధికి తోడ్పడ్డాడు. విద్యావంతురాలైన ఆమె రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (State Council of Educational Research and Training) లో 45 పాఠ్య పుస్తకాల రూపకల్పన చేసి విద్యా రంగానికి శ్లాఘనీయమైన సేవలందించారు. నియత, అనియత గిరిజన నవోదయ సిబిఎస్సి ఢిల్లీ వారికి పాఠ్య పుస్తక రూప కల్పనలో ప్రశంసనీయమైన సేవలందించారు. తెలుగు బోధనా పద్ధతులు - తెలుగు అకాడమీ వారికి బోధించడంలో తనదైన ముద్ర వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య బాపు రమణల ఆధ్వర్యంలో వీడియో పాఠాలు నిర్వహించి విద్యారంగానికి ఎనలేని కృషి చేశారు. అంతేకాకుండా 10 వ తరగతి ఉపవాచకం విశ్వమాత థెరిస్సా పాఠ్యపుస్తక రూపకర్త గా ప్రముఖులచే ప్రశంశలు అందుకున్నారు.  విద్యను అందించడమే కాకుండా సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో కూడా ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా, ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమిక విద్య పథకం (APPEP) లో ప్రాజెక్ట్ మూల్యాంకనం యొక్క డిజైన్ మరియు విశ్లేషణలో ఎదురైన కొన్ని కీలక సమస్యలను ఆమె తన నైపుణ్యంతో పరిష్కరించారు. సరోజన విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని అందించడం వరకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజాన్ని నైతికంగా పరిపుష్టం చేసేందుకు విశేష కృషి చేశారు. 45 పాఠ్యపుస్తకాలే కాకుండా మరో 12 పుస్తకాలూ స్వతహాగా రచించి మొత్తం 57 పుస్తకాలతో ఆమె  సుదీర్ఘ ప్రయాణంలో తరువాత, 1999లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతితో కొన్ని సంవత్సరాల పాటు చౌటుప్పల్ లోని అలిమినేటి మాధవ రెడ్డి మెమోరియల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేశారు.


*అవార్డులు*:

తెలంగాణ ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభ పురస్కారం అందుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అమెరికాలో కూడా అనేక పురస్కారాలు అందుకున్నారు.


జీవితపు తొలినాళ్ళలో సరైన విద్యా సౌకర్యాలు లేకపోయినప్పటికీ, చదువు పట్ల అనురక్తితో, ఆమె ప్రతి అడ్డంకిని అవకాశంగా మలచుకున్నారు. ఒక ప్రయత్నం లేదా మరొక ప్రయత్నంలో నా లక్ష్యాన్ని నిర్ధారితంగా చేరుకుంటానన్న ఆత్మవిశ్వాసంతో, 7వ తరగతి నుండి పీహెచ్‌డీ వరకు ఏ విధమైన ప్రామాణిక శిక్షణ లేకుండా చదవడం ఆమె సాధించిన గొప్ప విజయం. నేటి విద్యార్థులు బండ సరోజన లాంటి వ్యక్తుల జీవితాలను ప్రేరణగా తీసుకుని, తమ లక్ష్యాలను నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేయాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఏవో కొన్ని అడ్డంకులను మరియు సవాళ్లను ఎదుర్కోవడం సహజమే కానీ వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగిన వారు మాత్రమే వారి లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475

కామెంట్‌లు లేవు:

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...