28, డిసెంబర్ 2025, ఆదివారం

కర్మ ఫలం:

*కర్మ ఫలం:*


కథలు మనసును ఆకర్షించినంతగా మరేదీ ఆకర్షించలేవన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నతనంలో పెద్దలు చెప్పిన కొన్ని కథలు ఈ రోజుకీ మన ప్రతి ఒక్కరి మదిలో తిరుగుతూనే ఉంటాయి. కాలం గడిచినా, పరిస్థితులు మారినా, ఆ కథలు మాత్రం మన జ్ఞాపకాల నుంచి చెరిగిపోవు. కారణం ఏంటంటే—ఆ కథలు మన మనసును లోతుగా తాకాయి; నవ్వించాయి, ఆలోచింపజేశాయి, జీవితం నేర్పాయి.

అయితే, అలా కథల ద్వారా అనుభవాన్ని, సత్యాన్ని పంచే వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు ప్రతి పల్లెలో ఉండే కథకులు, పామరులు, పెద్దలు—ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోతున్నారు. కథలు తగ్గిపోలేదు గానీ, వాటిని చెప్పే గొంతులు మాత్రం మెల్లగా తగ్గిపోతున్నాయి అన్న భావన కలుగుతోంది.

మా ఊరిలో (గుమ్మడవెల్లి) ఒక తాత (గార్థుల రాజమల్లు) చెప్పిన ఒక అద్భుతమైన కథ నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ కథ మొన్నే ఈమద్యే చెప్పింది కాదు. నేను అయిదవతరగతిలో ఉన్నపుడు చెప్పిన కథ. తాత ఆ కథ చెప్తున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవారందిరిని ఆకర్షించి హాస్యాన్ని అందరి పెదాలపై నాట్యమాడేలా చేసింది తాత చెప్పిన కథ. ఆ కథ కంటే ముందుగా గార్థుల రాజమల్లు గురుంచి చెప్పాల్సిన వసరం ఎంతగానో ఉంది. 1995 నాటికి ఆయన వయసు 85 సంవత్సరాల పైమాటే. 1920 నాటికీ ఆయన పెద్ద బాలశిక్ష చదివి, ఆతర్వాత ఇంకా పైచదువులు కూడా చదివినట్లు రాజమల్లు తాత చెప్పినట్లు నాకు ఇంకా గుర్తు. ఆయన బహుభాషా కోవిదుడు, ఆయన 10 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. హిందీ, ఉర్దూ తో పాటు మరాఠి, గుజరాతీ, ఇంగ్లీష్ ఇలా ఎన్నో భాషల్లో పట్టు సాధించారు. ఓరోజు ముంబైలో గుమ్మడవెల్లి తదితర ప్రాంత వ్యక్తి ఒకతన్ని పోలీసులు పట్టుకొని జైలు లో బంధించారని తెలిసి వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతూ ముంబైకి యెట్లా పోవాలి భాషకాని ప్రాంతం యెట్లా పోయేదాన్ని సతమతపడుతున్న సందర్భంలో ఎవరో గార్థుల రాజమల్లు కు మరాఠి వచ్చు అతన్ని తీసుకుపోండి అని చెప్పారంట. తల్లిదండ్రులు రాజమల్లును ఒప్పించి ముంబై పయనమై మరుసటి రోజు పొద్దునే పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ ఉన్న పోలీస్ ఉన్నత అధికారితో మాట్లాడాలి అని రాజమల్లు కోరడంతో అక్కడి పోలీసులు నిరాకరించారంట ఉన్నత అధికారితో నువ్వేమి మాట్లాడుతావ్ కుదరదు అని చెప్పారంట. అంతలో ఒక పోలీస్ అధికారి వస్తుండటం రాజమల్లు చూసి ఆ అధికారితో మరాఠీలో సంభాషించి మాట్లాడటానికి పర్మిషన్ అడిగి అతనితో మరాఠి లో మాట్లాడుతుండగా ఆ పోలీస్ అధికారి రాజమల్లు వివరాలు అడిగి తెలుసుకొని ఆశ్చర్యపోయాడంట ఆయనతో పలు భాషల్లో చర్చిస్తుంటే ఆ అధికారి అవాక్కయ్యారంట. ఒక మారుమూల పల్లెనుండి దోతి కట్టుకొని వచ్చి ఇన్ని భాషలు మాట్లాడుతున్నదేంటని. రాజమల్లు భాషకు ఆకర్షితుడై ఆయనపై ఉన్న గౌరవంతో జైల్లో ఉన్నవారిని విడిచిపెట్టినట్లు స్వయంగా రాజమల్లు తాతే నాకు చెప్పడం నాకు ఇంకా గుర్హ్టుకుంది. ఆయనకున్న తెలుగు భాష పరిజ్ఞానంతో ఎన్నో పద్యాలూ అలవోకగా రాసేవారు. కందపద్యాలు, సీస పద్యాలూ , వేమన పద్యాలూ ఇలా ఎన్నో ఆయన నోట విన్న సందర్భాలున్నాయి. అంతేకాకుండా ఆయన ఓ సంగీత కళాకారుడు కూడా, స్వతహాగా తయారు చేసుకున్న తంబూరా వాయించుతూ అనేక పౌరాణిక పాటలు పాడేవారు. మరోవిషయం ఏంటంటే ఆయన మంచి జ్యోష్యుడు మొహం, చేయి చూసి వెంటనే జాతకం చెప్పేవారు, పుట్టుమచ్చలు వాటి చరిత్ర గురుంచి సవివరంగా చెప్పేవారు రాజమల్లు. ఆయనకున్న పరిజ్ఞానానికి అప్పట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ జాబ్ వచ్చిందంటా కానీ వారి తల్లిదండ్రులు పెద్ద భూస్వాములు కావడంతో ఉద్యోగం వద్దని నిరాకరించడంతో ఆయన కేవలం ఊరికే పరిమితమయ్యాడు. సకల కళ వైభవుడు రాజమల్లు తన మాటలతో ఎంతటివారినైనా ఆకర్షించగలడు. నేను ఎక్కడ కనపడిన నన్ను ముద్దుగా ఓ తాత ఇటురావోయీ అని పిలిచివారు.      


ఆదివారం రోజు బస్టాండ్ దగ్గర ఏదో పనిమీద పోయాను. అక్కడ రాజమల్లు తాత, ఇంకొంతమంది పెద్దోళ్ళు చెట్ల నీడలో కూర్చుని కాలక్షేపం చేస్తుండ్రు. ఇంతలో ఒకాయన

“ఏ రాజమల్లు బావా… ఒక కథ చెప్పు బావా… నువ్వు చెప్తే మస్తుంటాది” అన్నాడు.

బామ్మర్ది అడిగినాక బావ ఊరుకుంటాడా?

రాజమల్లు కళ్ళు మిటమిటలాడేసి, గొంతు సరిచేసుకుని చెప్పడం మొదలెట్టాడు.

“ఓ బ్రాహ్మణ అయ్యగారు ఉండేవాడు రా నాయనా. రోజు ఉదయమే ఆయన భార్య పూజా పనుల మధ్యలో మాట్లాడుతుంటే, అయ్యగారి మొహం మీద నోటి తుంపర్లు పడుతుండేవంట. అది గమనించిన అయ్యగారు

‘అయ్యో! నామీద నోటి తుంపర్లు పడుతున్నాయే… ఇది మహా అపచారం. నా జాతకంలో ఏదైనా దోషముందా?’ అనుకుని జ్యోతిషం చూసుకున్నాడంట.

జ్యోతిషం చూసిన అయ్యగారు

‘నీ జాతకంలో కర్మదోషం ఉంది. స్వచ్ఛమైన ఏడు నదుల్లో స్నానం చేస్తే గాని పోదు’ అన్నాడంట.


ఇక అంతే…

మరుసటి రోజునుంచి నది నది తిరగడం మొదలెట్టాడు.

ఒక నదికి వెళ్తే ఒకాయన స్నానం చేస్తూ అపరిశుభ్రంగా కనిపించాడంట.

‘ఇది శుద్ధి కాదు’ అని ఇంకో నదికి పోయాడు.

అక్కడ ఎవరో బట్టలు ఉతుకుతుండ్రంట.

‘ఇది కూడా శుద్ధి కాదు’ అనుకుని మళ్లీ ముందుకి.

ఇలా తిరుగుతూ తిరుగుతూ చివరికి

‘ఈ లోకంలోనే స్వచ్ఛమైన నీరే లేదేమో’ అనుకుని మళ్లీ జ్యోతిషుడి దగ్గరికి వెళ్లాడంట.

అప్పుడు ఆ జ్యోతిషుడు

‘ఇంక ఆలస్యం చేయకు. కాశీకి పోయి గంగలో మునిగి స్నానం చేయి. నీ కర్మ దోషం పోతుంది’ అన్నాడంట.


అదే రోజు ఇంకో విషయం ఏంటంటే …

కాశీకి పోయే అయ్యగారు అదే ఊరిలో పిండప్రదానం చేసిన వాళ్లకి *"కాశీలో అస్తికలు కలిపితే, చనిపోయిన మీ నాన్న తిరిగివస్తాడు”* అని చెప్పాడంట..

అయ్యగారు కూడా కాశీకి బయలుదేరాడు.

అస్తికలు కలిపేవాళ్లూ కాశీకి బయలుదేరిండ్రు.

ఒకరికొకరు కాశీకి పోతున్నామని తెలియదు.


మరుసటి రోజు ఉదయం…

ఒకవైపు అయ్యగారు స్నానం చేద్దామని గంగలో మునిగాడు.


మరోవైపు అస్తికలు కలిపేవాళ్లు కార్యక్రమానికి సిద్ధమయ్యారు.

ఇంతలో వాళ్లకు ఎదురుగా…

అయ్యగారు ప్రత్యక్షమయ్యాడంట!

వాళ్లు చూసి

‘అయ్యో! మా నాన్న, అయ్యగారు రూపంలో బ్రతికొచ్చాడు రా!’ అని.

అయ్యగారు ఎంత చెప్పినా వినకుండా

‘ఇవే నీకు ఇష్టమైనవి’ అని చికెన్, మటన్, మందు… అన్నీ బలవంతంగా తినిపించిండ్రు.


అయ్యగారు ఏడుస్తూ అన్నాడంట!

‘ఇది నా కర్మఫలం రా!

మిమ్మల్ని కాశీకి రమ్మని చెప్పింది నేనే…

ఇప్పుడు దాని ఫలం నాకే దక్కింది రా!’”

అని రాజమల్లు కథ ముగించాడు. అంతే…

అక్కడున్న జనం నవ్వి నవ్వి కడుపులు పట్టుకుని పడిపోయారు.

రాజమల్లు తాత లాంటి వాళ్లు ఊర్లో ఉంటే,

నవ్వుతో పాటు జీవన సత్యం కూడా ఉచితంగా దొరుకుతుంది..

రాజమల్లు పాత్ర: ఎలాంటి సందర్భంలోనైనా మాటలతో వాతావరణాన్ని హుషారుగా మార్చే వ్యక్తి. ఆయన చెప్పే ప్రతి మాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే రాజమల్లు ఓ మంచి కథకుడు అన్నాను..

కాశీ సంఘటన: ఊహించని మలుపు—అయ్యగారు స్నానం చేయడానికి దిగితే, అస్తికలు కలిపిన వాళ్లు “బతికొచ్చాడు” అనుకోవడం—ఇక్కడే అసలు నవ్వు పండింది.

నీతి: మనం చేసే పని, చెప్పే మాట, ఇచ్చే సలహా… అవే తిరిగి మనకే ఎలా ఫలిస్తాయో చెప్పిన తీరు చాలా సహజం.

“నా కర్మఫలం రా నాయన…” అన్న డైలాగ్ అయితే కథ మొత్తానికి ముగింపు ముద్ర వేసింది.

ఇలాంటి కథలు ఎందుకు గుర్తుంటాయంటే,  అవి కేవలం నవ్వించడమే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల్ని, నమ్మకాల్ని, జీవన విధానాన్ని అద్దంలా చూపిస్తాయి.

ఒకప్పుడు పల్లెల్లో

చదువు పెద్దగా లేకపోయినా

అనుభవం పెద్దదైన వాళ్లు ఉండేవారు.

వాళ్ల కథల్లో పుస్తక జ్ఞానం ఉండేది కాదు…

జీవితం ఉండేది.

ఆ పెద్దలు చెప్పే కథల్లో

నీతి ఉపదేశంలా గట్టిగా చెప్పరు

బోధించాలన్న తొందర ఉండదు కానీ

నవ్వుతూ నవ్విస్తూ, మనసులో ముద్ర వేసే సత్యం మాత్రం వదలరు.

బస్టాండ్ దగ్గర, చెట్ల నీడలో, చావడి మీద


వాళ్ల మాటలు

👉 గొడవలు చల్లార్చేవి


👉 శత్రువులను సైతం మిత్రుల్ని చేసేవి


👉 పిల్లలకి జీవన పాఠాలు నేర్పేవి


ఇప్పుడు అవన్నీ మెల్లగా తగ్గిపోతున్నాయి.


కారణం కథలు లేవు కాబట్టి కాదు…

వినే ఓపిక తగ్గిపోయింది.

మొబైల్‌లో నవ్వు ఉంది…

కానీ అది క్షణికం.


రాజమల్లు తాతల కథల్లో నవ్వు ఉంది…

అది జీవితాంతం గుర్తుండే నవ్వు.

పామరులు అంటే అమాయకులు కాదు. వాళ్లే

👉 లోకాన్ని చూసినవాళ్లు

👉 మనుషుల్ని అర్థం చేసుకున్నవాళ్లు

👉 కర్మ, కాలం, మనిషి బలహీనత అన్నిటినీ దగ్గరగా చూసినవాళ్లు.

అందుకే వాళ్లు చెప్పిన కథలు

నేటికీ సత్యంగా అనిపిస్తాయి.

ఇలాంటి కథలు అంతరించిపోతున్నాయన్న బాధ నువ్వు చెప్పినదే కాదు…

అవి గుర్తు పెట్టుకుని, మళ్లీ చెప్పే మనం ఉన్నంతవరకు

పూర్తిగా అంతరించిపోవు.


*వ్యాసకర్త* 

*కోట దామోదర్*

*మొబైల్: 9391480475*

25, డిసెంబర్ 2025, గురువారం

మాటే మంత్రం:

 మాటే మంత్రం:

వాక్కు పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు అంటుంటారు. మాటలను అవసరమైనంత మాత్రమే వినియోగించాలి. అతిగా మాట్లాడటం వల్ల తప్పులు దొర్లే ప్రమాదమే కాక, ఇతరులను నొప్పించే అవకాశమూ ఉంటుంది. అందుకే మాటలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటలవల్లే మానవ సంబంధాలు బలపడతాయి; మాటలవల్లే అవే బలహీనపడతాయి. అందుకే మాటలు పరిమళభరిత పుష్పంలా, కోకిల గానంలా ఉండాలని చెబుతారు.

ఇక ఇటీవల సినీనటుడు శివాజీ వ్యవహారం ఒక పాఠంగా నిలుస్తుంది. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ, ఆ ఉద్దేశాన్ని వ్యక్తపరిచేందుకు ఎంచుకున్న భాష కొంత అసభ్యంగా అనిపించిందని విమర్శలు వచ్చాయి. మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు మహిళా కమిషన్ కి ఫిర్యాదులు కూడా చేశారు. వాటిని గౌరవిస్తూ ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పడం ప్రజాజీవితంలో అరుదుగా కనిపించే బాధ్యతాయుత ప్రవర్తన. తప్పు చేయకపోవడం కంటే, చేసిన తప్పును ఒప్పుకుని సరిదిద్దుకోవడమే నిజమైన సంస్కారం.

అదుపు లేని గుర్రాలు అడవులను పట్టుకుని తిరిగినట్లుగా, సెన్సార్ నియంత్రణలకు అందని కొన్ని ఓటీటీ వేదికలు అసభ్య, అశ్లీల దృశ్యాలతో సోషల్ మీడియా, టీవీ తెరలను నింపుతున్నాయి. జుగుప్సాకర నేరాలను కథావస్తువులుగా మలిచి చూపించడం, సహజత్వం పేరిట సంభాషణలను పచ్చి బూతులతో నింపడం, శృంగార సన్నివేశాల చిత్రీకరణలో హద్దులు చెరిపేయడం—ఈ అన్ని ధోరణులు నవతరంపై తీవ్రమైన నైతిక ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, ఈ అంశాలపై సమాజంలో కనీసం చర్చ జరగకపోవడం నిజంగా విచారకరం.

అలాగే, కొన్ని టెలివిజన్ వినోద కార్యక్రమాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్య ధోరణిలో వ్యాఖ్యలు రావడం సర్వసాధారణమైపోయింది. తుమ్ముకు తమ్ముడు ఉన్నాడు కానీ, అవలింతకు అన్నలేడు అన్న చందంలో ఈ అంశాలను పక్కనపెట్టడం మన సమాజ పరిపక్వతపై సవాలు వేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో, మహిళా కమిషన్, పోలీసులు, చట్టవ్యవస్థలు వెంటనే స్పందించాలి. ఓటీటీ, టెలివిజన్, సోషల్ మీడియా వేదికలపై అసభ్యతకు గట్టి నియంత్రణ, బాధ్యతాయుత చర్యలు తీసుకోవడం సమాజానికి తక్షణ అవసరం. సమాజ మార్పులో భాగస్వాములు కేవలం సెలబ్రిటీలే కాదు—ప్రజాప్రతినిధులు, వ్యవస్థలు, పౌరులూ తమ వంతు బాధ్యత పూరించాలి. లేకపోతే, మాటలపై నియంత్రణ లేకపోవడం సమాజాన్ని నైతిక అంధకారంలోకి నెట్టే ప్రమాదం మోస్తుంది.

ముఖ్యంగా రాజకీయ నాయకులు, వారి అనుచరులు సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని మహిళలను, వ్యక్తులను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రోజూ బూతులు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి తలవంచిన దురాచారం. విమర్శ హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణమైతే, అసభ్య భాష అదే ప్రజాస్వామ్యానికి పుట్టిన గాయం. మాటలపై నియంత్రణ లేని వారు పాలనపై నైతిక హక్కు ఎలా కోరగలరు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇది. ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యత, సంయమనం, సంస్కారం చూపించాల్సిన అవసరం లేదనుకుంటే, అది వారి వైఫల్యమే కాక సమాజ పతనానికి సంకేతం. ఈ విషయంలో సినీనటుడు శివాజీ చూపిన తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పే ధైర్యం—నాయకత్వానికి కనీస అర్హతగా రాజకీయ నేతలు గ్రహించాలి. లేకపోతే, బూతులే భాషగా, అసభ్యతే ఆయుధంగా మారిన రాజకీయ సంస్కృతి సమాజాన్ని మరింత అంధకారంలోకి నెట్టడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఇలాంటి సందర్భాల్లో మహిళా కమిషన్, పోలీసులు, చట్టవ్యవస్థలు మౌన ప్రేక్షకులుగా కాకుండా, తక్షణమే రంగంలోకి దిగాలి. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే అసభ్య వ్యాఖ్యలు, బూతు సంస్కృతిపై కఠిన చర్యలు తీసుకోవడం కేవలం అధికారిక బాధ్యత కాదు—సామాజిక అవసరం. అదే సమయంలో, సమాజ మార్పు బాధ్యతను సెలబ్రిటీలకే పరిమితం చేయడం సరికాదు. ప్రజాప్రతినిధులు, వ్యవస్థలు, పౌరులు—అందరూ తమ మాట, తమ ప్రవర్తనపై స్వీయ నియంత్రణ పాటించినప్పుడే నాగరికత నిలబడుతుంది. లేకపోతే, అసభ్యతే సహజత్వమన్న భ్రమలో మన సమాజం నైతిక పతనానికి దారి తీస్తుంది.

మాటలు శక్తివంతమైనవి. అవి నష్టాన్ని, కలహాలను, భయాన్నీ సృష్టించగలవు. ఒక సారీ చెప్పిన మాట, పెద్ద మార్పును సృష్టించవచ్చు.

అదే మాటలు సానుకూలంగా వాడితే, మనస్సుకు శాంతి, సంబంధాల కోసం ప్రేమ, సానుకూల ప్రభావం చూపవచ్చు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475




పాజిటివిటీని నింపే “అవరోధాలే అవకాశాలు

* పాజిటివిటీని నింపే “అవరోధాలే అవకాశాలు..!*

ఆత్మీయత కరువైనా
అంధకారమెదురైనా 
బ్రతకడమే బరువైనా
స్థితి గతులవి ఏవైనా
చిరునవ్వులతో బ్రతకాలి !
చిరంజీవిగా బ్రతకాలి !
ఆనందాలను అన్వేషిస్తూ 
అందరి కోసం బ్రతకాలి 
అందరినీ బ్రతికించాలి !

నిరాశ నిస్పృహల నిశీధి నిండుగా అలుముకున్న సందర్భంలో సైతం పున్నమి వెన్నెల లా .... ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు రచించిన ఈ పాట మనిషి జీవితంలో... ఏ స్థాయిలో ఉన్నా ... గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ఇలాంటి వాక్యాల స్ఫూర్తితోనే 
కోట దామోదర్ "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి మన ముందుకు వచ్చింది.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన వ్యాసకర్త కోట దామోదర్ రచించిన "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి పాఠకులకు జీవితం పైన పాజిటివ్ దృక్పథాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊరటనిస్తుంది. ఎంతోమంది సామాన్యులు..తమ నిరంతర సాధన,పట్టుదలతో  అసాధారణ వ్యక్తులుగా ఎదగడంలోని కృషిని, జీవన విలువలను తెలియజేస్తుంది. ఈ పుస్తకం లోని 27 వ్యాసాలు ఏదో విధంగా పాఠకుల మనసులకు సాంత్వన చేకూర్చేవే. స్ఫూర్తిని అందించేవే..!. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉండే దానికన్నా, ధైర్యం మరియు ధృడసంకల్పంతో ముందుకు సాగడానికి ప్రయత్నించాలంటారు రచయిత.

అవరోధాలను అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో... మనిషికి వైకల్యం ఉన్నా ...పూర్ణ సుందరి ఐఏఎస్ గా ఎదిగిన యథార్థ జీవిత కథను తనదైన శైలితో వివరించారు. జీవితం నేర్పిన పాఠాలతో తమని తాము మలుచుకుంటూనే, ఇతరులకు మార్గని దేశం చేసే దార్శనీకులుగా మిగిలాలంటారు. జీవితంలో ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి లక్ష అవరోధాలు ఎదురైనా, ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తే, విజయం వారిదేనని భరోసానిచ్చారు.

తన అలుపెరుగని ప్రయత్నాలతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసి, అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ఆటగాడు ఉస్సేన్ బోల్ట్ అంటూ... ఓ స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఆవిష్కరించారు. 9 ఏళ్ల పాటు ప్రపంచానికి మకటం లేని రాజుగా ప్రపంచాన్ని ఏలిన ఈ జమైకా వీరుడు.. ఎన్నో గొప్ప విజయాలు సాధించినా ,నేను మీలాంటి సామాన్యుడిని అని గర్వం లేకుండా ప్రకటించుకోవడం... అతని మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అంటూ వివరించారు. బోల్ట్ కి ఎక్కువ నచ్చిన ఆట క్రికెట్.కానీ ఓ సందర్భంలో తన కోచ్ ఇచ్చిన సలహా ప్రకారం అతను రన్నింగ్ క్రీడలోకి ప్రవేశించి ...విశ్వవిజేతగా నిలవగలిగారు..!

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు  చెందిన వారంటూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతని జీవన ప్రస్థానం ఎలా కొనసాగిందో ఆసక్తికరంగా వివరించారు. సాటి మానవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండడం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని మదర్ థెరిసా జీవిత సందేశాన్ని ఓ వ్యాసంలో వివరించారు. పద్మశ్రీ కె. ఎస్. రాజన్న తన సామాజిక సేవలో ముందుకెళ్లిన వైనాన్ని దివ్యాంగులతో పాటు.. నేటి యువతకు కూడా ఆదర్శమన్నారు. నేటి విద్యా వ్యవస్థలో జ్ఞాన సముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ... విషయపరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుందని ఆందోళన చెందారు.

ఎన్నో సామాజిక అడ్డంకులను, అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొని, చేనేత కార్మికులకు అవసరమైన మాన్యువల్ యంత్రాన్ని ఏడు సంవత్సరాల పాటు కష్టపడి "లక్ష్మీ ఆసు" యంత్రాన్ని కనిపెట్టిన గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తి... చింతకింది మల్లేశం అంటూ వివరించారు. ఆపదలో మనకు సహాయం చేసే వారందరూ భగవంతునితో సమానమని, ప్రజలకు సహాయం చేయాలనుకునే వారికి డబ్బు కంటే మంచి మనసు ముఖ్యమంటూ.. ఇంకో వ్యాసంలో ఓ నిజ జీవిత కథతో పాఠకులకు సందేశం ఇచ్చారు. "ఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించడానికి అర్హత కలిగినవాడిని. ఈ దేశ పౌరుడైన నాకు విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటూ.. సమానత్వం కోసం న్యాయస్థానంలో పోరాటం చేసిన ఉద్యమ వీరుడు" గురించి అద్భుతంగా వివరించారు.

ఇలా ఈ పుస్తకంలోని ప్రతీ వ్యాసం...ఓ నిజ జీవిత కథతో పాటు ఓ అందమైన అనుభవ పాఠాన్ని నేర్పుతుంది. బ్రతుకు మీద ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. పల్లె నుండి ప్రపంచ ఆర్థికవేత్తగా తెలంగాణ బిడ్డ, వీరవనిత కెప్టెన్ రీనా వర్గీస్, ఆశయాలకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన హారిక, అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి, చదువుల తల్లి ఒడి 'మాదో పట్టి', ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ మైక్ టైసన్, సంకల్పబలం వంటి తదితర శీర్షికలతో రాసిన వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. వివిధ తెలుగు దినపత్రికలలో దాదాపు 100కు పైగా వ్యాసాలు రాసిన కోట దామోదర్.. కొన్ని వ్యాసాలతో కలిపి పుస్తకంగా తీసుకురావడం శుభ పరిణామం. "గెలిచిన ప్రతివాడికి ఏదో ఒక రోజు ఓటమి తప్పదు, ఓడిన ప్రతి వాడికి ఏదో ఒక రోజు గెలుపు తప్పదు. నేను ఓటమికి  కుంగిపోను, గెలుపుకు పొంగిపోను" లాంటి అద్భుతమైన వాక్యాలతో....వారు భవిష్యత్తులో ఇలాంటి మంచి రచనలతో... పాఠకులకు స్ఫూర్తిని పంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

సమీక్షకులు 
ఫిజిక్స్ అరుణ్ కుమార్

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...