"*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*!
మూడో కన్ను తెరవగానే ప్రపంచం మొత్తం మన కళ్లముందే ప్రత్యేక్షమైనట్లు. మూసుకున్న కళ్లతో జీవితం చూడగలమని భావించడం ఒక అపోహ మాత్రమే. ఆ అపోహల పొరలు తొలగినప్పుడే నిజమైన ప్రపంచం మనకు కనిపిస్తుంది. చూడటానికి రెండు కళ్లే సరిపోవు; నిజాన్ని గ్రహించడానికి జ్ఞానం అనే మూడో కన్ను అవసరం.
అదే భావాన్ని గుర్తు చేసేలా ముక్కామల చక్రధర్ గారి “మూడో కన్ను” ఒక మేల్కొలుపు స్వరం. ఆయన విశ్లేషణలు మనం గమనించని అనేక విషయాలను ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొస్తాయి. సాధారణంగా మన కళ్లకు కనిపించని కోణాలను ఆయన స్పష్టంగా చూపిస్తారు. ఇప్పటివరకు మనకు తెలియని నిజాలు నెమలి పురివిప్పి నాట్యం చేసినట్లు ఒక్కసారిగా మన కళ్లముందు విరబూస్తాయి. నెమలి నాట్యం చూసినప్పుడు మన కళ్లకు కలిగే ఆకర్షణ ఎంత మధురమో, “మూడో కన్ను” వ్యాసాలు చదివినప్పుడు మన ఆలోచనలకు కలిగే ఆకర్షణ కూడా అంతే గాఢంగా ఉంటుంది.
సమాజంలో దాగి ఉన్న వాస్తవాలు, కాలగర్భంలో కనుమరుగైపోయిన కవులు, మనం అలవాటుగా చూసి మర్చిపోయిన సాహిత్య సత్యాలు, ఇవన్నీ ఆయన మూడో కన్ను తెరిచిన క్షణంలోనే మన ముందుకు వస్తాయి. ఆలోచించని విషయాలను ఆలోచింపజేయడం, ప్రశ్నించని విషయాలను ప్రశ్నింపజేయడం, కనిపించని వాస్తవాలను స్పష్టంగా చూపించడం. ఇదే నిజమైన మూడో కన్ను పని.
అందుకే మూడో కన్ను అంటే కోపం కాదు, వినాశనం కాదు. అది అవగాహన. అది జ్ఞానం. అది మేల్కొలుపు. ఆ కన్ను (పుస్తకం) తెరిచినప్పుడే మనం చూస్తున్న ప్రపంచం వెనుక దాగి ఉన్న అసలు ప్రపంచం మనకు అర్థమవుతుంది.
“ఆయన ‘యాది’ ఎట్లా మరుస్తాం..?” ఈ వ్యాసం చదివిన తర్వాత సామల సదాశివ గారిని మరవడం అసాధ్యమే అనిపిస్తుంది. ఈ వ్యాసంలో ప్రస్తావించిన ఎన్నో విషయాలు చాలా మందికి తెలియనివే అని చెప్పాలి. ఉదాహరణకు, ఉర్దూ గజల్స్‌ను మొదటిసారిగా తెలుగువారికి పరిచయం చేసింది సదాశివ గారేనని మనలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు, తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులు బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేడియో బృందంలో సదాశివ గారు కూడా కీలకంగా ఉన్నారని తెలిసినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది.
ఇలాంటి మరెన్నో అరుదైన విషయాలను విపులంగా అక్షరీకరించడం చక్రధర్ గారికే సాధ్యమనే భావన కలుగుతుంది. ముఖ్యంగా సదాశివ గారు మరియు విశ్వనాథ సత్యనారాయణ గారి మధ్య జరిగిన ఒక సందర్భాన్ని ఆయన ఎంతో చక్కగా , హృద్యంగా వివరించిన తీరు ఈ వ్యాసానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వ్యాసం చదివిన తరువాతే ఆ ఇద్దరు మహనీయుల మధ్య ఉన్న ఆత్మీయత, ఆలోచనా లోతు మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
“తెలంగాణ తామర పువ్వు దాశరధి” అనే వ్యాసం చదివినప్పుడు నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసి ఆశ్చర్యపోయిన సందర్భం. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ తెలంగాణ గర్వాన్ని గీతంగా పలికించిన దాశరథి కేవలం విప్లవ కవియే కాదు; భక్తి గీతాలను కూడా అంతే అలవోకగా రాయగల అరుదైన ప్రతిభ కలిగిన మహాకవి అని ఈ వ్యాసం స్పష్టంగా తెలియజేస్తుంది.
విప్లవ స్వరంతో సమాజాన్ని మేల్కొలిపిన కవి, భక్తి భావంతో హృదయాలను కదిలించిన కవి—ఈ రెండు పరస్పర విభిన్నమైన ధోరణులను సమానంగా మిళితం చేసి తెలంగాణ సాహిత్యంలో ఒక శక్తిగా ఎదిగిన దాశరథి వ్యక్తిత్వాన్ని చక్రధర్ గారు ఎంతో హృద్యంగా, విశ్లేషణాత్మకంగా వివరించారు.
ఆయన రచనలు దాశరథి కేవలం ఒక కవి కాదు; తెలంగాణ ఆత్మను పలికించిన స్వరం అనే భావన స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది.
కవిత్వంలో ఒక ప్రత్యేక ప్రయోగం గా నిలిచిన "ముక్త పద గ్రస్తం" దాశరథి గారు పాట రూపంలో వినియోగించిన తీరు ఎంత అద్భుతమో ఈ వ్యాసం చదివినప్పుడు మరింత స్పష్టమవుతుంది. నిజానికి ముక్త పద గ్రస్తం అనే అలంకార శైలిపై ఈ కాలం వారికి అంతగా పరిచయం లేకపోయినా, దాశరథి కవిత్వంలో అది ఎలా ఒదిగిపోయిందో ఎంతో హృద్యంగా వివరించారు. అలాంటి అరుదైన సాహిత్యాంశాలను ఈ వ్యాసంలో పొందుపరచడమే కాకుండా, వాటిని సామాన్య పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడం నిజంగా ప్రశంసనీయం.
చక్రధర్ గారు రచించిన “కూసుమంచి అగ్రహారం నుంచి మూడో కన్ను వరకు” వంటి రచనలు చదివినప్పుడల్లా ఆయన సాహిత్య దృష్టి ఎంత విశాలమో అనిపిస్తుంది. ఆయన రచనల పట్ల నాకు కూడా అపారమైన అభిమానం ఉందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు.
“పూల పాటల పండుగ బతుకమ్మ”
తెలంగాణ ఆత్మను పలికించే ఆడబిడ్డ ల ఆనందోత్సవం.
తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ ఆట పాటలు కేవలం పండుగ సంబరాలు మాత్రమే కాదు, ఉద్యమానికి ఊపిరి పోసిన శక్తి గా మారాయి. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి పాడిన పాటలు ఉద్యమానికి ధైర్యాన్ని, ఆశను నింపాయి. ఆ పూల మధ్య పుట్టిన గానమూ, ఆత్మగౌరవం కోసం ఎగిసిన నినాదం కలిసి తెలంగాణ ఆత్మను ప్రపంచానికి చాటి చెప్పాయి.
అందుకే ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరినందించిన ఆ క్షణాలు ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టంగా నిలిచాయంటారు రచయిత ముక్కామల చక్రధర్ గారు .
“దిగంబర కవితో కొన్ని గంటలు” అనే వ్యాసం చదువుతుంటే అది కేవలం ఒక రచనగా కాకుండా, మనసులో నిద్రపోయిన జ్ఞాపకాలను మెల్లగా మేల్కొలిపే అనుభూతిగా అనిపిస్తుంది. ఒక మంచి వ్యాసం పాఠకుడిని తన జీవితంలోని చిన్న చిన్న సంఘటనల వద్దకు తీసుకెళ్తేనే అది సార్థకమవుతుంది. ఈ వ్యాసం కూడా అచ్చం అలాంటి అనుభూతిని కలిగిస్తుంది.
ఈ వ్యాసం చదువుతున్నప్పుడు నా చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్లముందు తిరిగాయి. చిన్నప్పుడు మా ఇంటికి అమ్మమ్మ, తాత వచ్చేవారు. వాళ్లు వచ్చిన రోజుల్లో ఇంటి అంతా ఒక ప్రత్యేకమైన ఆనందంతో నిండిపోయేది. కానీ వారు మరుసటి రోజు వెళ్తారని తెలిసిన క్షణం మనసులో ఒక విచిత్రమైన బాధ కలిగేది. “ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండును” అనే ఆలోచన సహజంగానే మనసులో మెదిలేది.
అప్పుడు చిన్న పిల్లల అమాయకత్వంతో ఎన్నో చిన్న చిన్న ప్లాన్లు వేసేవాళ్లం. వాళ్లు వెళ్లే ముందు వారి బ్యాగ్ దాచిపెడితే, అది దొరకక ఇంకో రోజు అయినా ఉండిపోతారేమో అనే బాల్యపు ఊహలు మనసులో మెదిలేవి. ఆ చిన్న ప్రయత్నాల వెనుక దాగి ఉండేది ప్రేమ మాత్రమే.
అలాగే ఈ వ్యాసంలో కూడా దిగంబర కవి నగ్నముని తో గడిపిన ఆ కొన్ని గంటలు రచయితకు ఎంతో విలువైనవి గా అనిపిస్తాయి. నవ్వుతూ, మాట్లాడుకుంటూ గడిపిన ఆ క్షణాలు తక్కువ సమయం అయినప్పటికీ హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాలుగా మారాయి. మనకు ఇష్టమైన వారితో గడిపిన సమయం ఎప్పుడూ చాలదనే భావన ఈ వ్యాసంలో స్పష్టంగా కనిపిస్తుంది.
అంతిమంగా ఈ వ్యాసం మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది—
మన జీవితంలో గొప్ప జ్ఞాపకాలు పెద్ద సంఘటనల వల్ల కాకుండా, ఇలాంటి చిన్న చిన్న అనుభూతుల వల్ల ఏర్పడతాయి. అవి గడిచిపోయినా, మనసులో మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి.
“మూడో కన్ను”లోని అన్ని వ్యాసాలు అద్భుతమే. ప్రతి వ్యాసానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన అనుభూతి ఉంది. ఇక్కడ నేను కొన్ని వ్యాసాల గురించి మాత్రమే ప్రస్తావించాను. ఎందుకంటే ప్రతి వ్యాసం గురించి నేనే పూర్తిగా చెబితే, మీరు చదివే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ రచనల అసలు రుచిని తెలుసుకోవాలంటే మీరు స్వయంగా చదవాలి. అందుకే మీరందరూ ‘మూడో కన్ను’ను తప్పక చదవాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యాసాల లోతు, భావం, అందం నిజంగా అనుభూతి అవుతుంది.”
ప్రతి వారం విశాలాంధ్రలో వెలువడే ఆయన కాలమ్ చదవని రోజు లేదనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కూచిమంచి అగ్రహారం నుంచి “మూడో కన్ను” వరకు ఆయన రాసిన వ్యాసాల్లో నేను చదవని దాదాపు ఒక్కటీ లేదు. ఆయన నుంచి ఎప్పుడు వాట్సాప్ సందేశం వస్తుందా అని ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు అనుకోవచ్చు.
ముక్కామల గారి “మూడో కన్ను” నిజంగా అదిరిపోయింది. ఆలోచింపజేసే దృష్టి, ప్రత్యేకమైన శైలి, మనసును తాకే భావాలతో ప్రతి వ్యాసం నిలిచిపోతుంది. ఇక ఆయన “నాలుగో కన్ను” ఎప్పుడు తెరుస్తారో అని ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి