21, జూన్ 2026, ఆదివారం

జీరోలతో చెప్పిన జీవిత పాఠం

అదొక పేరుగాంచిన పారిశ్రామిక సంస్థ. భారత నావికాదళానికి ప్రత్యక్షంగా సేవలందించే ఆ కంపెనీ, పరోక్షంగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడ పనిచేసే ప్రతి ఉద్యోగి పని వెనుక దేశభక్తి దాగి ఉంటుంది.


ఒకరోజు ఉదయం ఆ సంస్థలోని ఒక విభాగం జనరల్ మేనేజర్‌కి పై అధికారుల నుండి అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. పాకిస్తాన్‌తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా నావికాదళానికి అవసరమైన పరికరాల ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫోన్ పెట్టిన వెంటనే మేనేజర్ గారు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు. వెంటనే తన డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ కాన్ఫరెన్స్ హాల్‌లోకి పిలిచారు.

“ఇకపై అందరూ సమయానికి రావాలి. అవసరమైతే అదనపు సమయం పనిచేసైనా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. ఇది కేవలం కంపెనీ పని కాదు… దేశ భద్రతకు సంబంధించిన బాధ్యత,” అని గంభీరంగా చెప్పారు.

కానీ అక్కడున్న ఉద్యోగుల ముఖాల్లో ఆశించిన ఉత్సాహం కనిపించలేదు. కొందరు నిర్లక్ష్యంగా కూర్చున్నారు. మరికొందరు ఆయన మాటలు విన్నట్టే లేరు.

అది గమనించిన మేనేజర్ గారికి ఒకరకమైన ఆందోళన మొదలైంది.
“ఇలాంటి పరిస్థితిలో వీళ్లలో బాధ్యతాభావం ఎలా పెంచాలి? ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ఎలా పూర్తి చేయాలి?” అని ఆలోచించారు.

కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి, కొద్దిసేపటి తర్వాత ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు.

“అందరూ ఒక పేపర్, పెన్ తీసుకోండి,” అన్నారు.

ఉద్యోగులందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ పేపర్లు తీసుకున్నారు.

“ఇప్పుడు మీ మనసులో… 20 సెకండ్లలో మీరు ఎన్ని సున్నాలు (0) రాయగలరో ఒక సంఖ్యను ఊహించుకుని ముందుగా పేపర్ మీద రాసుకోండి,” అన్నారు.

అందరూ తమకు తోచిన సంఖ్యను రాసుకున్నారు.

తర్వాత మేనేజర్ గారు స్టాప్‌వాచ్ ఆన్ చేసి,
“స్టార్ట్!” అన్నారు.

ఉద్యోగులందరూ వేగంగా సున్నాలు రాయడం మొదలుపెట్టారు.
20 సెకండ్లు పూర్తయ్యాక,
“స్టాప్!” అన్నారు.

“ఇప్పుడు మీరు నిజంగా ఎన్ని సున్నాలు రాశారో లెక్కించండి. తర్వాత మీరు ముందుగా అనుకున్న సంఖ్యతో పోల్చండి,” అన్నారు.

కొంతమంది తాము అనుకున్నదానికంటే ఎక్కువ రాశారు.
మరికొందరు తక్కువ రాశారు.

అప్పుడు మేనేజర్ గారు చిరునవ్వుతో మాట్లాడటం ప్రారంభించారు.

“చూశారా…?
మనలో చాలామంది ముందే ఒక పరిమితిని నిర్ణయించుకుంటారు. ‘నేను ఇంతవరకే చేయగలను’ అని అనుకుంటారు. కానీ ప్రయత్నం మొదలుపెట్టాక మన సామర్థ్యం మన ఊహకంటే ఎక్కువగా ఉంటుందని ఇప్పుడే మీరే నిరూపించారు.

దేశం కోసం పనిచేసే మనం, సాధారణ ఉద్యోగులు కాదు. మనం చేసే ప్రతి పని సరిహద్దుల్లో ఉన్న సైనికుడికి బలం అవుతుంది. మీరు కొంచెం ఎక్కువ సమయం పనిచేస్తే… అక్కడ ఒక నావికాదళ సైనికుడు మరింత భద్రంగా ఉంటాడు.

మన సామర్థ్యాన్ని మనమే తక్కువ అంచనా వేయొద్దు. అవసరం వచ్చినప్పుడు సాధారణ మనిషిలో కూడా అసాధారణ శక్తి బయటపడుతుంది,” అన్నారు.

ఆ మాటలు ఉద్యోగుల హృదయాలను తాకాయి.
అందరి కళ్లలో కొత్త ఉత్సాహం కనిపించింది.

ఆ రోజు నుండి ఆ డిపార్ట్మెంట్‌లో మార్పు మొదలైంది. ఉద్యోగులు సమయానికి రావడం మాత్రమే కాదు, అవసరమైతే అదనపు గంటలు పనిచేసి ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఆ రోజు మేనేజర్ గారు ఉద్యోగులకు కేవలం పని గురించి మాత్రమే కాదు…
మనిషి తనను తాను నమ్ముకుంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని నేర్పించారు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి… ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి… కానీ… అల ఎంత ఉప్పొంగినా...