21, జూన్ 2026, ఆదివారం

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది


మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి…

ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి…


కానీ…


అల ఎంత ఉప్పొంగినా చివరికి ఒడ్డునే ఒదిగిపోతుంది,

కల ఎంత ఎత్తుకు ఎగిరినా చివరికి కాలగర్భంలోనే కలిసిపోతుంది.


కలలన్నీ కరిగిపోతాయి,

కాలపు కెరటాల్లో కొట్టుకుపోతాయి.

ఆశలన్నీ అలసిపోతాయి,

అనుభవాల ఒడ్డున ఆగిపోతాయి.


నిన్నటి కోరిక నేడు జ్ఞాపకమవుతుంది,

నేటి స్వప్నం రేపటి కథనమవుతుంది.

మనిషి పరిగెత్తిన దారులన్నీ

కాలం కాళ్లకింద మట్టిగా మారిపోతాయి.


అలకు ఒడ్డు శాశ్వతం కాదు,

కలకు గెలుపు శాశ్వతం కాదు.

జీవితం అనే సముద్రంలో

ప్రయాణమే నిజం, గమ్యం కాదు.


అందుకే…


కల నెరవేరినా వినయంగా ఉండు,

కల చెదిరినా ధైర్యంగా నిలువు.

ఎందుకంటే కాలం ముందు

కిరీటమూ ఒక జ్ఞాపకమే,

కన్నీటిబొట్టూ ఒక జ్ఞాపకమే.


అల ఒడ్డున కలిసినట్లు,

కల కాలంలో కలిసినట్లు,

మనిషి జీవితం కూడా

చివరికి ఒక కథగా మిగిలిపోతుంది.


✍️

కోట దామోదర్

నాన్నకు ప్రేమతో ❤️…

 నాన్నకు ప్రేమతో ❤️…


మనం కోరిన కోరికలన్నిటినీ దేవుడు తీరుస్తాడో లేదో తెలియదు,

కానీ మనం కోరుకున్న ప్రతి చిన్న కోరికను

కాదనకుండా నెరవేర్చే దేవుడు మాత్రం నాన్న.


మన సంతోషం కోసం తన బాధలను దాచే త్యాగం నాన్న,

మన భవిష్యత్తు కోసం తన భవిష్యత్తు ను త్యాగం చేసేది నాన్న.


మన అడుగులు తడబడితే కొండంత అండగా నిలిచేది నాన్న,

మన ఆశలు రెక్కలు తొడిగితే ఆకాశమై విరిసే గగనం నాన్న.


దేవుడిని ప్రార్థిస్తే వరం దొరకొచ్చు, దొరకకపోవచ్చు,

కానీ నాన్నను అడిగిన కోరిక మాత్రం

ఆయన గుండెపై భారమైనా, భుజాలపై బాధైనా తప్పక నెరవేరుతుంది.

కోరిక మనది… కష్టం నాన్నది,

విజయం మనది… త్యాగం నాన్నది.

ప్రేమకు నిర్వచనం అడిగితే “అమ్మ” అంటారు,

బాధ్యతకు ప్రతిరూపం అడిగితే “నాన్న” అంటారు.


✍️

కోట దామోదర్ 

మొబైల్ 9391480475

జీరోలతో చెప్పిన జీవిత పాఠం

అదొక పేరుగాంచిన పారిశ్రామిక సంస్థ. భారత నావికాదళానికి ప్రత్యక్షంగా సేవలందించే ఆ కంపెనీ, పరోక్షంగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడ పనిచేసే ప్రతి ఉద్యోగి పని వెనుక దేశభక్తి దాగి ఉంటుంది.


ఒకరోజు ఉదయం ఆ సంస్థలోని ఒక విభాగం జనరల్ మేనేజర్‌కి పై అధికారుల నుండి అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. పాకిస్తాన్‌తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా నావికాదళానికి అవసరమైన పరికరాల ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫోన్ పెట్టిన వెంటనే మేనేజర్ గారు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు. వెంటనే తన డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ కాన్ఫరెన్స్ హాల్‌లోకి పిలిచారు.

“ఇకపై అందరూ సమయానికి రావాలి. అవసరమైతే అదనపు సమయం పనిచేసైనా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. ఇది కేవలం కంపెనీ పని కాదు… దేశ భద్రతకు సంబంధించిన బాధ్యత,” అని గంభీరంగా చెప్పారు.

కానీ అక్కడున్న ఉద్యోగుల ముఖాల్లో ఆశించిన ఉత్సాహం కనిపించలేదు. కొందరు నిర్లక్ష్యంగా కూర్చున్నారు. మరికొందరు ఆయన మాటలు విన్నట్టే లేరు.

అది గమనించిన మేనేజర్ గారికి ఒకరకమైన ఆందోళన మొదలైంది.
“ఇలాంటి పరిస్థితిలో వీళ్లలో బాధ్యతాభావం ఎలా పెంచాలి? ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ఎలా పూర్తి చేయాలి?” అని ఆలోచించారు.

కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి, కొద్దిసేపటి తర్వాత ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు.

“అందరూ ఒక పేపర్, పెన్ తీసుకోండి,” అన్నారు.

ఉద్యోగులందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ పేపర్లు తీసుకున్నారు.

“ఇప్పుడు మీ మనసులో… 20 సెకండ్లలో మీరు ఎన్ని సున్నాలు (0) రాయగలరో ఒక సంఖ్యను ఊహించుకుని ముందుగా పేపర్ మీద రాసుకోండి,” అన్నారు.

అందరూ తమకు తోచిన సంఖ్యను రాసుకున్నారు.

తర్వాత మేనేజర్ గారు స్టాప్‌వాచ్ ఆన్ చేసి,
“స్టార్ట్!” అన్నారు.

ఉద్యోగులందరూ వేగంగా సున్నాలు రాయడం మొదలుపెట్టారు.
20 సెకండ్లు పూర్తయ్యాక,
“స్టాప్!” అన్నారు.

“ఇప్పుడు మీరు నిజంగా ఎన్ని సున్నాలు రాశారో లెక్కించండి. తర్వాత మీరు ముందుగా అనుకున్న సంఖ్యతో పోల్చండి,” అన్నారు.

కొంతమంది తాము అనుకున్నదానికంటే ఎక్కువ రాశారు.
మరికొందరు తక్కువ రాశారు.

అప్పుడు మేనేజర్ గారు చిరునవ్వుతో మాట్లాడటం ప్రారంభించారు.

“చూశారా…?
మనలో చాలామంది ముందే ఒక పరిమితిని నిర్ణయించుకుంటారు. ‘నేను ఇంతవరకే చేయగలను’ అని అనుకుంటారు. కానీ ప్రయత్నం మొదలుపెట్టాక మన సామర్థ్యం మన ఊహకంటే ఎక్కువగా ఉంటుందని ఇప్పుడే మీరే నిరూపించారు.

దేశం కోసం పనిచేసే మనం, సాధారణ ఉద్యోగులు కాదు. మనం చేసే ప్రతి పని సరిహద్దుల్లో ఉన్న సైనికుడికి బలం అవుతుంది. మీరు కొంచెం ఎక్కువ సమయం పనిచేస్తే… అక్కడ ఒక నావికాదళ సైనికుడు మరింత భద్రంగా ఉంటాడు.

మన సామర్థ్యాన్ని మనమే తక్కువ అంచనా వేయొద్దు. అవసరం వచ్చినప్పుడు సాధారణ మనిషిలో కూడా అసాధారణ శక్తి బయటపడుతుంది,” అన్నారు.

ఆ మాటలు ఉద్యోగుల హృదయాలను తాకాయి.
అందరి కళ్లలో కొత్త ఉత్సాహం కనిపించింది.

ఆ రోజు నుండి ఆ డిపార్ట్మెంట్‌లో మార్పు మొదలైంది. ఉద్యోగులు సమయానికి రావడం మాత్రమే కాదు, అవసరమైతే అదనపు గంటలు పనిచేసి ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఆ రోజు మేనేజర్ గారు ఉద్యోగులకు కేవలం పని గురించి మాత్రమే కాదు…
మనిషి తనను తాను నమ్ముకుంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని నేర్పించారు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

20, జూన్ 2026, శనివారం

ఒక్క నిర్ణయం.. వందలాది రైతు కుటుంబాల్లో ఆశాకిరణం

 ఒక్క నిర్ణయం.. వందలాది రైతు కుటుంబాల్లో ఆశాకిరణం


ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, ఆధునిక విద్య ప్రభావంతో యువత ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లోనే భవిష్యత్తును చూసిన యువత, నేడు మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలు, విదేశాల వైపు అడుగులు వేస్తున్నారు. చదువు పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానం, విదేశీ విద్య లేదా విదేశీ ఉద్యోగం సాధించడమే చాలా మంది యువత లక్ష్యంగా మారింది. ఈ ఆలోచనా ధోరణితో వారు గ్రామీణ జీవితం, వ్యవసాయం కంటే నగర జీవనం, ప్రపంచ స్థాయి అవకాశాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా వ్యవసాయం, గ్రామీణ జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోతోంది. ఒకప్పుడు పొలాల్లో పనిచేసిన యువకులు నేడు కంప్యూటర్ల ముందు పనిచేస్తున్నారు. వ్యవసాయాన్ని కొనసాగించే వారసులు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ మార్పు వల్ల గ్రామాల రూపురేఖలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు యువత సందడితో కళకళలాడిన పల్లెలు నేడు వృద్ధులతోనే కనిపిస్తున్నాయి. అనేక ఇళ్లకు తాళాలు వేళ్ళాడుతుండగా, వీధుల్లో యువత సందడి తగ్గిపోయింది. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక బంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి.

మరోవైపు వ్యవసాయ రంగం కూడా కార్మికుల కొరత, వారసుల లేమి, సాగుభూముల తగ్గుదల వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. రైతు కుటుంబాల యువత వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాల వైపు వెళ్లడంతో భవిష్యత్తులో ఆహార భద్రతపైనా ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే స్వీయాభివృద్ధి పట్ల యువత ఆలోచనా ధోరణిని తప్పుబట్టలేం. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక భద్రత కోసం వారు కొత్త అవకాశాలను వెతుకుతున్నారు. కానీ అదే సమయంలో గ్రామాల అభివృద్ధి, వ్యవసాయ ఆధునీకరణ, గ్రామీణ ఉపాధి అవకాశాల పెంపును ఇటు యువత అటు ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి.  యువత గ్రామాల్లోనే ఉండి అభివృద్ధి సాధించే పరిస్థితులు కల్పించగలిగితేనే పల్లెలు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయనే ఆలోచన చేస్తే వ్యవసాయరంగానికి తిరుగుండదనేది ముమ్మాటికీ నిజం.

కొంతమంది యువత మాత్రం లక్షల్లో జీతాలు, విదేశీ అవకాశాలను సైతం వదులుకొని స్వంత ఊరిలోనే ఉపాధి అవకాశాలు సృష్టించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ కోవకు చెందినదే నిజామాబాద్ జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన సంజనా రెడ్డి అనే యువతి. 

ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సంజనా రెడ్డికి ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఎంతో మంది యువత కలగా భావించే ఆ అవకాశాన్ని ఆమె సులభంగానే అందుకుంది. అయినప్పటికీ, ఆ ఉద్యోగంలో చేరలేదు. మరింత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే లక్ష్యంతో IELTS, GRE పరీక్షలు రాసి అద్భుతమైన స్కోర్లు సాధించింది. ఆమె ప్రతిభ ఆధారంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో అడ్మిషన్ కూడా లభించింది. అయితే అదే సమయంలో సంజనా మనసులో ఒక ప్రశ్న మెదిలింది.

"ఉన్నత చదువుల కోసం నా సొంత ఊరిని, నా దేశాన్ని వదిలి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విదేశానికి ఎందుకు వెళ్లాలి? నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని, టెక్నాలజీని నా కళ్ల ముందే కనిపిస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు ఉపయోగించకూడదు? నా గ్రామానికి, నా ప్రజలకు నేను ఏమి చేయగలను?" అని తనను తాను ప్రశ్నించుకుంది.

ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న క్రమంలో ఆమె మనసు తిరిగి తన మూలాల వైపు మళ్లింది. చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు, పొలాల్లో చెమటోడ్చే రైతుల కష్టాలు, చదువుకుని అవకాశాల కోసం ఊరిని విడిచి వెళ్తున్న యువత, కుటుంబ భారం మోస్తూనే ఉపాధి కోసం ఎదురుచూస్తున్న మహిళల జీవితాలు ఆమె కళ్లముందు కదిలాయి.

అమెరికా వెళ్లడం ఆమె భవిష్యత్తును మార్చవచ్చు. కానీ తన గ్రామంలో ఉండి ఏదైనా కొత్తది చేయగలిగితే తన భవిష్యత్తుతో పాటు ఎన్నో కుటుంబాల భవిష్యత్తును మార్చవచ్చని ఆమెకు స్ఫురించింది. ఎంతోమంది కలలుగనే విదేశీ విద్య అవకాశాన్ని సైతం ఆమె స్వచ్ఛందంగా వదులుకుంది. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన సంజనకు రైతుల జీవితం కొత్త కాదు. చిన్నప్పటి నుంచి పొలాల్లో కష్టపడే రైతులను, పంట పండించిన తర్వాత కూడా సరైన ధర కోసం ఆందోళన చెందే కుటుంబాలను ఆమె దగ్గరగా చూసింది. వర్షాలు పడకపోతే ఒక బాధ, పంట బాగా పండినా గిట్టుబాటు ధర రాకపోతే మరో బాధ. రైతు ఎంత కష్టపడినా మధ్యలో దళారులే ఎక్కువ లాభపడుతున్నారనే వాస్తవం ఆమెను కలచివేసింది.

"రైతు పండించాలి... దళారి సంపాదించాలి" అనే పరిస్థితిని మార్చాలని ఆమె సంకల్పించింది. తన చదువు, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆలోచనలను రైతుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే ఆమె నగరాల్లో ఉండే ప్రజలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రతిరోజూ పొలంలో రైతులు చేసే పనులు, వ్యవసాయ జీవన విధానం, రైతుల కష్టాలు, పంటల సాగుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది.

అలా ఆమె పోస్ట్ చేసిన పసుపు సాగుకు సంబంధించిన ఒక వీడియో అనూహ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షలాది మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియో చూసిన వినియోగదారులు మార్కెట్‌లో దొరికే ఉత్పత్తుల కంటే నేరుగా రైతుల పొలం నుంచి వచ్చే స్వచ్ఛమైన పసుపును కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు.

చాలామంది వైరల్ అవుతున్న వీడియోను ఆనందంగా చూసినప్పటికీ ఆ తరువాత మరిచిపోతారు. కానీ సంజనా అందులో కూడా ఒక అవకాశాన్ని చూసింది. రైతుల కష్టానికి సరైన విలువ తీసుకురావడానికి ఇదే సరైన సమయమని భావించింది. ఆ ఆలోచనే 'ఇందూరు ఫార్మ్స్' అనే ఈ-కామర్స్ స్టార్టప్‌కు పునాది వేసింది.

ఇందూరు ఫార్మ్స్ ద్వారా రైతుల నుంచి పంటలను నేరుగా కొనుగోలు చేసి, ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వినియోగదారులకు చేరవేయడం ప్రారంభించింది. దీంతో రైతులకు మెరుగైన ధర లభించగా, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి.

ఒక చిన్న గ్రామంలో మొదలైన ఈ ప్రయాణం నేడు తెలంగాణ సరిహద్దులను దాటి ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాలకు విస్తరించింది. ఒకప్పుడు అమెరికాకు వెళ్లాలని సిద్ధమైన యువతి. నేడు తన గ్రామం నుంచే వందలాది మంది రైతుల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరవేస్తోంది. ఆమె కథ ఒక యువతి విజయగాథ మాత్రమే కాదు. ఉపాధి కోసం గ్రామాలను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని, గ్రామాల్లోనే అవకాశాలను సృష్టించి విజయాన్ని సాధించవచ్చనే ధైర్యాన్ని సంజనా రెడ్డి యువతలో నింపింది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి… ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి… కానీ… అల ఎంత ఉప్పొంగినా...