29, ఆగస్టు 2022, సోమవారం

స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.


స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.

స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.

స్నేహం విలువ గురించి ఎంత చెప్పిన తక్కువే అనడంలో సందేహం లేదు. ఎందరో కవులు, వాగ్గేయకారులు అనేక భాషల్లో స్నేహం గురించి వందలాది పాటలు రాసిన కొన్ని మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రజాదరణ పొందిన పాటల్లో తెలుగు పాటలు కూడా ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం. స్నేహం విలువను పాటల రూపంలో అద్భుతంగా చిత్రించిన గేయ రచయితలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో మన తెలుగు తేజం బహు భాష కోవిదుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నా రే గారు రచించిన నిప్పులాంటిమనిషి చిత్రంలో స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..స్నేహమేరా నాకున్నది.. స్నేహమేరా పెన్నిధి అనే పాట అనే పాట పలు భాషల్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా 1988 లో దర్శకుడు వి. మధుసూదనరావు గారి సమర్పణలో "ప్రాణ స్నేహితులు' సినిమాలోని గేయ రచయిత భువనచంద్ర గారు రాసిన "స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా" అనే పాట ప్రతి తెలుగువాడి హృదయాన్ని దోచుకుంది మరియు స్నేహితుల హృదయాలను దోచుకుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఎవరూ స్నేహాన్ని విడిచిపెట్టరు మరియు ప్రాణ స్నేహితులను మరచిపోరు.

అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అనేది శాంతి సంస్కృతి విలువలు, వైఖరులు మరియు ప్రవర్తన సమితిగా నిర్వచిస్తూ, హింసను తిరస్కరించడం మరియు సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో వాటి మూల కారణాలను పరిష్కరించడం ద్వారా సంఘర్షణలను నిరోధించడానికి ప్రయత్నించే ప్రతిపాదనను అనుసరించే ఒక చొరవ. దీనిని 1997లో UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.

ప్రజలు, దేశాలు, సంస్కృతులు మరియు వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలను ప్రేరేపించ గలదని మరియు సమాజాల మధ్య వంతెనలను నిర్మించగలదనే ఆలోచనతో UN జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది.

"స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల'

ప్రతి విద్యార్థి భవిష్యత్తు తాను చదివిన చదువుపై కంటే విద్యార్థి స్నేహం పైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 100 పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు మిన్న అనే నానుడి ఎప్పటికీ నిజమే. ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు మరియు మంచి నడవడిక, మంచి ప్రవర్తన యొక్క మార్గాన్ని అనుసరిస్తారు ఇది ముమ్మాటికీ నిజం. ప్రపంచంలో కులం, మతం, వయోపరిమితి, ప్రాంతీయ భేదం లేనిది ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ధనిక మరియు పేదలను కలిపేది స్నేహం మాత్రమే. కులాలు, మతాలను కలిపేది స్నేహం ఒక్కటే.    

బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్న బాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు, అదే ఒక మంచి స్నేహితుడు ఉంటే నీ బాధలన్నీ మరిపించి బాల్యాన్ని గుర్తు చేస్తూ బాధను మరిపించే ప్రయత్నం చేస్తాడు (స్నేహితుడు).

మన జీవితంలో లక్షల, కోట్ల కన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని జీవితాంతం కొనసాగించటం ఎంతో అవసరం.  స్నేహానికి ఎల్లలు, కులం, మతలుండవు. ఎటువంటి సమస్యనైనా స్నేహితుడితో పొరపొచ్చాలు లేకుండా చర్చించుకునే అవకాశం ఒక స్నేహితుడి దగ్గర  ఉంటుంది. అహానికి స్నేహం దగ్గర  చోటే ఉండదనడంలో అతిశయోక్తి లేదు. స్నేహంలో ఎక్కువ తక్కువ లుండవు. పేదవాడు గొప్ప ధనవంతునితో స్నేహంతో కలుపవచ్చు. మనం బాల్యంలో చేసిన అల్లరి అప్పుడప్పుడు గుర్తుచేసే మంచి హాస్యనటుడు కూడా స్నేహితుడే.

అప్పుడప్పుడు నేను స్కూల్లో స్నేహితులతో గడిపిన సంఘటనలన్నీ గుర్తుచేసుకొని నాకు నేను ఆనందిస్తాను అది తీపి జ్ఞాపకం. ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత స్నేహితుడు కనిపించిన క్షణం అపురూపంగా, ఆప్యాయతంగా పలకరిస్తే గతంలో మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది
తెలిసీ తెలియక క్లాసురూం లో చేసిన అల్లరి గుర్తుచేసుకుంటూ నవ్వుకునే సందర్భం ఎంత హాయినిస్తుందో.

ఆ రోజుల్లో స్నేహితులతో ఆడుకున్న ఆటలు నేటికీ మదిలో పదిలం.

ఆ రోజుల్లో ఆదివారం అంటే మాకు ఆటల పండుగ. నేను ఆదివారం కోసం ఆతృతగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.

* ఖాళీ అగ్గిపెట్టెలను చించి స్నేహితులతో కలిసి పత్తాలాట ఆడిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకం.

* ఖాళీ సారా ప్యాకెట్లను బంతిలాగా  తయారుచేసి పుచ్చి బంతి ఆట ఆడిన క్షణం ఎంత సంతోషాన్నిచ్చేదో మాటల్లో చెప్పలేనిది, ఆ సంతోషం వెల కట్టలేనిది.

*వడ్ల శేషయ్య ఇంటిదగ్గర సందులో స్నేహితులతో కలిసి ఆడిన గోళీలాట ఎంతో సంతోషాన్నిచ్చేది.

* జిల్లగోన ఆట, చింతగింజలతో దాడి ఆట, కోకో , కబడ్డీ , తొక్కుడుబిళ్ల , పిక్కలాట , వొంగుడు దూకుడు, ముక్కు గీసుడు, దాగుడు మూతలు, దొంగ పోలీస్, దూకుడు పుల్ల, ఉప్పు బేర, తాడట, తుడువు, పైసల్ కమ్ముడు, పైసలట, నీడలు తొక్కుడు, కూరంట బువ్వంట,
ఇలా ఎన్నో ఆటలు స్నేహితులతో కలిసి ఆడుకున్న సందర్భాలు అతి మధుర జ్ఞాపకాలు.

ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారు టీవీలు, మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు తప్ప స్నేహితులతో గడిపే వారు లేరు.

*  వేసవి కాలం వచ్చిందంటే స్నేహితులంతా కలిసి బావుల్లో ఈతకు వెళ్ళేవాళ్ళం
ఆ రోజుల్లో ఊరిలో బంధం బావి, చింతల బావి, మంగలి నారాయణ బావి, నర్సింహారెడ్డి బావి ఉండేవి. ఈ బావిలాల్లో ఈత కొట్టి ఎండాకాలం మొత్తం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన అంత ఆనందం రాదు. నాకు మా అన్నయ్యలకు ఈత నేర్పిన గురువులు ఆకారపు వీరయ్య, చాకలి సొక్కయ్య చాలా మంచి వ్యక్తులు మరియు మా నాన్నకు మంచి స్నేహితులు - సన్నిహితులు కూడా.

* కొన్ని సందర్భాలలో రేగుపళ్ళ కోసం , మామిడి పళ్ళ కోసం బావిలకడ తిరిగిన రోజులెన్నో . ఇంకా కొన్ని సందర్భాలలో దోస్తులతో కలిసి తుమ్మ చెట్లల్లో బంక తీసుకొచ్చి షాపులో ఇస్తే బెల్లం ఇచ్చేది అది తినుకుంటూ ఎంత సంతోషపడేదో మాటలతో చెప్పలేము అని అనుభవిస్తేగానీ స్నేహం తెలియదు.

* ఈత పండ్ల కోసం , సీతాఫలకాయలకోసం స్నేహితులతో కంచెలేమ్మటి చేన్ల ల తిరిగేది అప్పటి అనుభూతి ఓ ప్రపంచాన్నే తిరిగొచ్చాము అనేలా ఉండేది.

* శెనగకాయలు కాల్చుకొని తినేవాళ్ళము సీతాఫలాలు కూడా, ముంజ్జలకోసం గౌడల్లన్న తాళ్ల కాడికి పోయి తినేవాళ్ళం తాటి పళ్ళు వాటిలో ఉండే గేగులు తినేవాళ్ళం.

* రూపాయి ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకిచ్చేది బొలిశెట్టి భాస్కర్ క్రమేపి ఆకారపు ఎల్లయ్య (డబ్బా కొట్టు ఎల్లయ్య ) కూడా ఇచ్చేది. అల సైకిల్ అద్దెకి తీసుకొని సైకిల్ నేర్చుకున్న రోజులు అవి అప్పట్లో సైకిల్ తొక్కి ఊళ్ళో తిరిగితే బుల్లెట్ బండి మీద తిరిగినంత ఆనందం ఉండే.
 
కోట్లు పెట్టిన కొనలేని ఆనందాన్ని ఉచితంగా పొందే అవకాశం ఒక స్నేహానికి ఉంది.
దొరకని చోట స్నేహాన్ని వెతికే కన్నా దొరికిన చోట స్నేహాన్ని వదలకు మిత్రమా..

ప్రాణం ఉన్నంతవరకు మంచి స్నేహాన్ని మరువకు నేస్తమా!!  

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475 






2 కామెంట్‌లు:

యేచన్ చంద్ర శేఖర్ చెప్పారు...

స్నేహ మాధుర్యం గురించి చాలా బాగా రాసారు. కుల, మత, వర్ణ, వర్గ. వయో, లింగ, ధనిక, పేద బేధాలు లేనిదే అసలు సిసలైన స్నేహం. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించిన వారికి తప్ప వేరొకరికి అర్థం కాని బ్రహ్మ పదార్థమే స్నేహం !

Kota Damodar చెప్పారు...

Thank you very much sir

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...