అంగవైకల్యం ఆశయ సాధనకు అవరోధం కాదు:
అవయవాలు అన్నీ సరిగా ఉన్నా చదువుల పట్ల మక్కువ చూపని ఎంతో మంది విద్యార్థులకు ఆయనొక ఆదర్శం. అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప. అది మనిషిలో ఉన్న ప్రతిభకు కాదు అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం "వరిపెల్లి యాకయ్య సార్". అయన సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.
జననం, విద్యాబ్యాసం:
సూర్యాపేట జిల్లాలోని మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లిలో నిరుపేద కుటుంబంలో వీర సోమయ్య, బుచ్చమ్మ దంపతులకు 1-3-1944న జన్మించారు. ఆ దంపతులకు మొదటి సంతానమైన కుమారుడిని చూస్తూ ఎంతో సంతోషించేవారు. ఎంతో అల్లారుముద్దుగ సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా అయన 4 వ ఏటా పోలియో కారణంగా అంగవైకల్యానికి (నడవలేని పరిస్థితి) గురియైనారు. వారి తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ, ప్రాపంచిక జ్ఞానంతో కుమారుడిని (యాకయ్య సార్) చదివించాలన్న తపనతో వారి స్వగ్రామమైన గుమ్మడవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
1949 కాలంలో (యాకయ్య సార్ చదివే రోజుల్లో) గుమ్మడవెల్లి గ్రామంలో కరెంటు మరియు రవాణా సౌకర్యం వంటి సదుపాయాలేనప్పటికీ అయన చదువు పట్ల ఉన్న సంకల్పం, కృషి, నిర్దిష్ట ప్రణాళికతో నాల్గొవ తరగతి పూర్తి చేశారు. గుమ్మడవెళ్లిలో నాలుగో తరగతి వరకే సదుపాయం ఉన్నందున అయన గుమ్మడవెల్లి నుండి 8 కిలోమీటర్ల దూరప్రాంతమైన తుంగతుర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదు, ఆరో తరగతులు పూర్తి చేశారు.
ఆతరువాత పై చదువులు చదవటానికి సూర్యాపేటలోని మల్టీ పర్పస్ స్కూల్ లో చేరి 7 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు, ఆ రోజుల్లో 12వ తరగతి చదవడం గొప్ప విషయం. అయితే చదువుకోవాలనే తపన అతనిలో ఇంకా ప్రబలంగా ఉండడంతో పై చదువులకోసం ప్రయత్నిచడం కొనసాగించారు. మనుసుంటే మార్గాలెన్నో అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి యాకయ్య సార్, అనుకున్న ఆశయం కోసం అహర్నిశలు కష్టపడి ఆసాద్యన్ని సుసాధ్యం చేయగలిగే వారు. చదువు పట్ల అతని ఏకాగ్రతను గమనించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఉపాధ్యాయ శిక్షణా కోర్సు చేయాలని సూచించారు. పట్టుదలతో ప్రయత్నిచి ఇల్లందులోని టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసి 10 - ఆగస్టు - 1970లో ప్రభుత్వ టీచర్ గా నియమితులైనారు. అయన జీవితంలో ఆశయం కోసం ఎన్నో సాధనాలు , శోధనలు , పరిశోధనలు ఎన్నో పట్టుసడలని ప్రయత్నాలు చేసి అనుకున్నది సాధించిన ఘనుడు యాకయ్య సర్.
క్యాన్సర్ తో పోరాడిన ధైర్యవంతుడు:
అంగవైకల్యాన్ని జయించిన యాకయ్య సార్. టీబీ వ్యాధి ఆయన్ని చాలా కాలం పాటు బాధించింది. అయినా టీబీ వ్యాధి కూడా ఆయన్ని వెంటాడి వెనుతిరిగింది.
అంతేగాక టీబీ వ్యాధి తర్వాత భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి కూడా అతనికి పరీక్ష పెట్టింది.
దైర్యం క్యాన్సర్ ఉన్నోడినికూడా బతికిస్తుంది..
భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది.. అన్నట్లుగా యాకయ్య సార్ ధైర్యంతో భయంకరమైన క్యాన్సర్ ని కూడా జయించారు. క్యాన్సర్ ని జయించటం అంటే మృత్యువుతో పోరాటమే.. యాకయ్య సార్ అన్నింటిని జయించిన ధైర్యశాలి..
గురువుగారి జ్ఞాపకాలు :
అయన స్వగ్రామమైన గుమ్మడవెళ్లిలోనే ఉపాధ్యాయుడిగా పనిచేయటం మా అందరి అదృష్టంగా భావిస్తు, అయన నా గురువుగా చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. ఇంకా సంతోషకరమైన విషయమేమిటంటే ఆయన తనయుడు అంజయ్య సార్ కూడా నాకు గురువు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
యాకయ్య సార్ లో ఉన్న గొప్ప ప్రత్యేకతయేంటంటే అయన చిరునవ్వు. ఆ చిరునవ్వెప్పుడు అయన ముఖారవిందాన్ని అలంకరిస్తూనే ఉంటుంది. కొన్నిసందర్భాలలో సార్ ఎక్కడైనా బయట కనిపిస్తే "నమస్తే సార్ అంటే " సార్ దానికి బదులుగా గాలం విసిరినట్లు చిరునవ్వు విసురుతారు. చిరునవ్వు సార్ కి గొప్ప ఆస్తి, మరియు ఆయుధం కూడా ఆ ఆయుధానికి అందరం ఆకర్షితులమే..
సార్ పిల్లలందరిని తన కుటుంభ సభ్యులుగా భావించి, వారి భవిష్యత్తుని దృష్టిలోపెట్టుకుని విద్యార్థుల యొక్క విద్యానైపుణ్యాన్ని, వారియొక్క సామర్ధ్యాన్ని, చురుకుదనాన్ని గ్రహించటంలో యాకయ్య సార్ కి వెన్నతోపెట్టిన విద్య.
ఆయన దగ్గర శిష్యరికం పొందిన వారిలో చాలా మంది విద్యావేత్తలు, ప్రముఖులు, నాయకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే యాకయ్య సార్ బహుముఖప్రజ్ఞాశాలి. అయన చదువు చెప్పేవిధానంలో ఎంత ప్రత్యేకత ఉందొ, బ్లాక్ బోర్డుమీద చక్కటి బొమ్మలు గీయటంలో కూడా అంత ప్రావీణ్యత ఉంది. అంతేకాకుండా అయన స్వరం, ఆయనకి దేవుడిచ్చిన గొప్ప వరం, మంచి మంచి పాటలు పాడేవారు, ఒక వృత్తాకారం సర్కిల్ గీస్తే అది ఎంత గుండ్రంగా వస్తుందంటే అది చూస్తే గానీ మాటలతో వర్ణించలేనిది. అంత అందమైన బొమ్మలు గీయటంలో సార్ దిట్ట.
పాఠంచెప్పిన మరుసటి రోజు ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు, ఎంతవరకు పాఠం అర్ధంచేసుకున్నారు అనే పరీక్షా పర్యవేక్షణ అన్ని మాకు తెలియకుండానే. నొప్పిలేకుండా సూదివేయటం అనే సూత్రం సార్ ది. అది మా భవిష్యత్తుకి పునాది రాయి.
పాఠం చెప్పేటైంలో పిల్లలతో గరుకుగా ఉండేవారు, పాఠం అయిపోయినాక చురుకుగా, చిలిపిగా నవ్వుతు మాతో గడిపేవారు, చురుకుగా, గరుకుగా కాలానికనుగుణంగా ఒదిగిపోయే వ్యక్తిత్వం యాకయ్య సార్ ది. అది అందరికి అసాధ్యం అనే చెప్పాలి.
నేను 5 వ తరగతి చదివేటపుడు మాకు సామాన్య శాస్త్రం చెప్పేవారు సార్, అందులో ఒక అబ్యాసం ఆరోగ్యం గురుంచి ఉండేది. ఆ అబ్యాసం యాకయ్య సార్ చెప్పిన విధానం ఒక అద్భుతం అంత బాగా చెప్పినారు. అందులో ఆరోగ్యమే మహా భాగ్యం అనేదాని గురించి ఎంతబాగా వర్ణించారంటే అది వర్ణణనాతీతం. ఆరోగ్యమే మహా భాగ్యం అని చదవటం చాలా సులభమే కానీ దాన్ని ఆచరించటం, దాన్ని ఆచరణలో పెట్టటం మన జీవితకాలం సరిపోదు, అది అర్ధం కాదు మనకి. అది అర్ధం చేసుకునేలోపే ఆకాశంలో మబ్బులు మాయమైపోయినట్లు, భూమిమీద మన ప్రాణం మాయమైపోతుంది అది అంతుచిక్కని రహస్యం. స్కూల్లో టీచర్స్ కొరత ఉన్నపుడు యాకయ్య సార్ దశావతారాలలో ప్రత్యక్షమైయేవారు విద్యార్థులకు వేరే సబ్జక్ట్స్ చెప్పటానికి. ఆయనొక దశావతారమూర్తి.
ఏందేందు వెతికిన అందందు కలదు, ఇందులేదని అందులేదని సందేహం లేదనే పదానికి నిర్వచనం. అయన అన్ని సబ్జక్ట్స్ లో ప్రావీణ్యత కలవారే. పొద్దునే పేపర్ చదివే అలవాటుంది. ఆ అలవాటుని మాకూడా అంటించాలనే ముఖ్యఉద్దేశంతో ప్రేయర్ సమయంలో మాతో పేపర్ చదివించే కార్యక్రమం మొదలెట్టారు. యాకయ్య సార్ దయవల్ల మాకు పేపర్ పరిజ్ఞానం పెరిగింది. జనవరి 26 , ఆగస్టు 15 ల కార్యక్రమాలకు విద్యార్థులందరికీ ఆటలపోటీలు నిర్వహించేవారు. అందులో యాకయ్య సార్ పాత్ర ఎక్కువగా ఉండేది. పిల్లలు ఆటలాడే సమయంలో ఉత్తేజపరిచేందుకు, ఉత్సాహపరిచేందుకు వారి ప్రయత్నం అపురూపమైనది. యాకయ్య సార్ వారి శిష్యుల మనసులో విశిష్ట ముద్రవేసుకున్నారు.
జీవితంలో ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి లక్ష అవరోధాలు ఎదురైనా ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేయాలి, కానీ విజయం మనదే. అడ్డంకుల వద్ద ఆగిపోవడం లక్ష్యాన్ని చేరుకోలేమనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మీ శిష్యుడు
కోట దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి