10, నవంబర్ 2022, గురువారం

ఆశయాలకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన"హారిక"


విలువిద్యంటే అమితాసక్తి గల ఏకలవ్యుడికి విలువిద్యలో నిష్ణాతుడైన ద్రోణాచార్యుడి దగ్గర విద్య అభ్యసించాలనే కోరిక ప్రబలంగా ఉండేది. కానీ క్షత్రియేతరుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించడంతో అతడు ఏమాత్రం కలత చెందక మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిమనే గురువుగా భావిస్తూ పట్టుదలతో విద్యనభ్యసించి ద్రోణాచార్యుని ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునున్నికూడా మించి పోయాడు.

అలాంటి అభినయ ఏకలవ్యుడిలాంటి స్ఫూర్తిదాయకమైన యధార్థ విజయ గాథ నిజామాబాద్, నాందేవ్ గూడకు చెందిన సతీష్ కుమార్, అనురాధ దంపతుల కుమార్తె హారికది.

హారిక తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి అనురాధ బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.చిన్నప్పటినుండి చదువులో అందరికంటే ముందుండే హారిక ఏడవతరగతిలో ఉన్నపుడే తనకు డాక్టర్ కావాలనే కోరిక కలిగిందని చెప్పటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పట్టుదలతో చదివిన ఆమె పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉతీర్ణత సాధించింది. తన చిన్ననాటి ఆశయ సాధన కోసం నీట్ పరీక్ష రాయాలనుకుంది. కానీ నీట్ కోచింగ్ కోసం ఆర్ధిక స్థోమత లేకపోయినప్పటికీ నిరుత్సాహం చెందక తల్లి ప్రోత్సహంతో ముందడుగు వేసింది.  నిరుపేదరాలైనప్పటికీ,మనుసుంటే మార్గాలెన్నో అన్నట్లు హారిక పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ప్రతిరోజూ యూట్యూబ్ లో దీక్షగా వీడియో క్లాసులు చూస్తూ పరీక్షకు సిద్ధమైంది. కోచింగ్ కు  డబ్బులు లేవని ఆగిపోకుండా తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి యూట్యూబ్ మార్గాన్ని ఎంచుకొని ఘోర తపస్సు చేసి నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. ఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. కోచింగ్ లేకుండా మంచి ర్యాంక్ సాధించినప్పటికీ కాలేజీలో సీట్ వచ్చిన తరువాత ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ కలిపి మొత్తం 2 లక్షలవరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అసలేనిరుపేదరాలైన హారిక  డబ్బు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతూ తన చదువుకోసం ఆర్ధిక సహాయం అందించాలని దాతలను వేడుకోగా  అందుకు ఎంతోమంది దాతలు ముందుకు రావడం చాలా గొప్ప విషయం.

నేటి యువతకు ఇంటర్నెట్ (మొబైల్) నిత్యవసర వస్తువులా మారిపోయింది.కొంతమంది ఇంటర్నెట్ ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని ఇంటర్నెట్ ద్వారా వృధాచేసుకుంటున్నారు.సోషల్‌ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లాభం, నష్టం అనేది వినియోగదారుడిమీదే ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ ని మంచికి వాడితే మాత్రం ఈ భూమిమీద తెలియని విషయాలెన్నోతెలుసుకోవచ్చు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలల్లో దొరకని సమాచారం కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుంది. ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్ లో క్లాసులు వింటూ నీట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్ సాధించిన హారిక విజయమేఇంటర్నెట్ ని మంచికి ఉపయోగిస్తే విద్యార్థులకు ఎంత ప్రయోజనకరమో తెలిపే ఒక చక్కటి ఉదాహరణ.       

ఆశయసాధనకు పేదరికం అడ్డుకాజాలదని, తన సంకల్పాన్నిఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్యసాధనే ఊపిరిగా తను అనుకున్న గమ్యం చేరుకున్నహారిక ఎందరికో ఆదర్శం.

సాధించాలనే తపన ఉంటేఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు.

అసాధ్యమనే పదంలో"అ" అనే అక్షరాన్ని పక్కనే పెడితే మనిషి జీవితంలో ఏదైనా సాధించవచ్చు.

ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢ సంకల్పం, కృషి ఉంటే విజయం సాధించడం తథ్యం.

ప్రతి విద్యార్థి అవరోధాలన్నిటినీ అవకాశాలుగా మలుచుకొని నిరంతర కృషితో తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.

 

మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

kotadamodar.blogspot.com

కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...