అంతరించిపోతున్న రజక వృత్తి
మనం చరిత్రను ఒక సారి అవలోకిస్తే నేడు చలామణి లో ఉన్న కరెన్సీ కు బదులుగా గతంలో “వస్తు మార్పిడి” మరియు “సేవా మార్పిడి” విధానం అమలులో ఉండేదని తెలుస్తుంది. సమాజంలోని వ్యక్తుల మధ్య లావాదేవీలు సులువుగా సాగేందుకు మన పూర్వీకులు విభిన్న వృత్తుల ఆధారంగా కుల వ్యవస్థను ఏర్పాటు చేసారన్న విషయం మనందరికీ తెలిసు. ఈ వ్యవస్థ ఏర్పాటు కారణంగా పురాతన కాలం నుంచి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అనేకమంది వారి వారి కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించేవారు. కానీ కాలంతో పాటు మారుతున్న పరిస్థితులు మరియు జీవనశైలి కి అనుగుణంగా నేడు ప్రాంతాలకు అతీతంగా అనేక కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కుల వృత్తులలో రజక వృత్తి ఒకటి. కుల,మత.జాతి,లింగ,వయో బేధాలు లేకుండా అందరికి సమానంగా సేవలందించిన మరియు అందిస్తున్నవృత్తి "రజక వృత్తి". శ్రమైకజీవన సౌందర్యాన్ని చాటిచెప్పిన వృత్తి "రజక వృత్తి". గ్రామాల్లో రజకుల వృత్తి అత్యంత ప్రధానమని, ఇతిహాసాల్లో వారి వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని పాల్కూరికి సోమనాథ రచించిన బసవపురాణంలో "మడివాలు మాచయ్య కథ (మడేలు కథ)"లో ప్రస్తావన ఉంది.
మడివెలయ్య, మాసయ్య ల కథ:
భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైనవి. పురాణాలంటే మన భారతీయ సంస్కృతికి దర్పణాలు, జ్ఞాన విజ్ఞానాల భాండాగారాలు. పురాణాలు అనంత విశ్వం గురుంచి వివరిస్తాయి. ఇతిహాస పురాణాలంటే పూర్వకాలంలో జరిగిన సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా తెలుపబడేది.
బసవ పురాణం ఆధారంగా మడేలు పురాణం సృష్టి ఆవిర్భావం నుండే ప్రారంభమైందని తెలుస్తుంది. పార్వతీ కల్యాణం సమయంలో, పురాణంలో భాగంగా దక్షుడు తాను నిర్వహించిన యజ్ఞానికి పార్వతికి ఆహ్వానం పంపలేదని ఉటంకించబడింది. ఆహ్వానం లేకుండానే యజ్ఞానికివెళ్లిన పార్వతి, దక్షుడు చేసిన అవమానాన్నిభరించ లేక యజ్ఞకుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఈ సంఘటనతో కోపోద్రిక్తుడైన శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని భంగపరిచి వధిస్తాడు. ఈ పరిణామానికి ఆగ్రహించిన త్రిమూర్తులు, వీరభద్రుడిని సృష్టించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మడివేలయ్య అవతారం ఎత్తమంటారు. వారి ఆదేశాల ప్రకారం వీరభద్రుడు పాలకొలనులోకి దూకగా మడివెలయ్య, మాసయ్యలు జన్మిస్తారు. వీరభద్రుని అంశ నుండి జన్మించిన మడేలయ్య లింగాన్ని పూజించి, మెడలో 32 లింగాలు, చేతిలో నల్లని వీర గంటతో మైల ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మాసయ్య శివుని పూజిస్తూ నిత్యం శివ ధ్యానంలో ఉండేవాడు. ఒకరోజు ఆకలితో ఉన్నమాసయ్య,మడేలయ్యకు చెప్పకుండా అతను భిక్షాటన ద్వారా తెచ్చినదంతా భుజిస్తాడు. ఈ విషయాన్ని త్రిమూర్తులకు తెలియచేయడానికి మడేలయ్య కోపంగా వెళ్తారు. “త్రిమూర్తులు 33 కోట్ల దేవతల ముందర మడేలుతో నీ అన్నం తిన్న వాడు కాబట్టి నీకు అర్థివాడై ఏడాదికి ఒకసారి మీ ఇంటికి వస్తే, మీ మీ ఇంట్లో పురుడు చేస్తే రజకుని కష్టానికి పురుడు కట్నం, ఇంట్లో ఎవరైనా చనిపోతే చావు కట్నం, పిల్లలకు పెళ్లి చేస్తే పెళ్లి కట్నం ఇవ్వాలని నీ తమ్ముడు అయినందుకు కంచం పొత్తు ఉంటుందని, అందుకు ప్రతిఫలంగా నీ వంశాన్ని కీర్తిస్తాడని” ఒప్పందం చేస్తాడు.
ఆ తర్వాత మడేలయ్య తన యొక్క పాపపరిహారం తీర్చుకోవటానికి సుర ముప్పది మూడు కోట్ల దేవతలు మునులు విడిచిన వస్త్రాలను 12 సంవత్సరాలు శుద్ధి చేస్తాడు. ఒక రోజున శివుడు మడేలయ్య వృత్తిని పరీక్షించేందుకు తన పులి చర్మంతోపాటు తాను కప్పుకునే బొంతను పిండ మని కోరుతాడు. ఆ బొంత 33 గజాల పొడవుతో అందులో చీర పేన్లు, నల్లులు 101 జంతువులు ఉన్నాయని వాటిని చావకుండా పిండటం నీ తరం కాదని చెప్తాడు. అయినప్పటికీ మడేలయ్య పిండు తానని బయలుదేరుతాడు. అప్పుడు మడేలయ్య ఏనుగు మీద బొంతను వేసుకొని నీటి కోసం లోకాలన్నీ తిరిగినా కనిపించవు. ఎందుకంటే అప్పటికే పరమ శివుడు నీటిని మాయం చేస్తాడు. అప్పుడు శీతలాదేవి పరమశివుడు పెట్టిన పరీక్షను ఎలాగైనా నెగ్గాలని మన వృత్తి ధర్మాన్ని పాటించాలని మడేలయ్యతో నన్ను సంహరించి నా అవయవాలతో బొంతను పిండి పరమశివుని కోరిక తీర్చాలని కోరుతుంది. అప్పుడు మడేలయ్య శీతలా దేవి కన్నీరు పోకుండా కట్టకట్టి నీరుగాను, కనుగుడ్లు తీసి ఉడకబెట్టే కడువలుగాను, చనుబాలను పొయ్యి రాళ్ల గాను, ఆమె ఇరవై వేళ్లు కొట్టి వంటచెరకు గాను, నరములు తీసి గాలి తాళ్లుగాను,చర్మాన్ని వడ కోక గాను, రక్తం తీసి చౌడు గాను, శీతలాదేవి డొక్కను బానగాను, కడుపుల అన్నం సున్నంగాను చేసి శివుని బొంత పిండుతాడు. అలాగే అప్పుడే ఆమె పేగులను తీసి చెరువు మీద వేయగా తూటికూరగా మొలుస్తాయి. రజకులు ఇప్పటికీ తూటికూర తినకపోవడాని కి కారణంగా ఇదే చెబుతారు. మడేలయ్య శివుని బొంత పిండిన తర్వాత శివుని కొరకు వెతుకుతుండగా ఎక్కడ శివుడు కనిపించడు. దారిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు మడేలయ్యను ‘ఎవరి కోసం వెతుకుతున్నావని’ అడుగుతాడు. అతను శివుని గురించి అని చెప్పగా అయితే ‘నన్ను నీ భుజాలమీద ఎక్కించుకొని తీసుకుపోతే, నేను శివున్ని చూపిస్తా’ అంటాడు. ఆలా అతన్ని భుజాలమీద ఎక్కించుకొని వెళ్తుండగా ఉన్నట్టుండి అతను బరువు పెరిగి పోతాడు. అప్పుడు మడేలయ్య అతని బరువు మోయలేక కిందకు దించుతాడు వెంటనే అతను మాయమైపోతాడు అంతలో ఎదురుగా వస్తున్నా వ్యక్తి మడేలయ్య తో నువ్వు నీ భార్య వెళ్లారు వచ్చేటప్పుడు ఒక్కడివే వస్తున్నవేంటని అడుగుతాడు అప్పుడు మడేలయ్య జరిగిన విషయమొత్తం చెప్తుండగా అతను ఒకసారి వెనక్కి తిరిగి చూడమన్నాడు. అతను వెనక్కి తిరిగి చూడగానే శీతలా దేవి కనిపిస్తుంది. ఆవ్యక్తియే శివుని రూపంలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మడేలయ్య ‘నాకు చాకలి వృత్తి కావాలని, వండని కూడు, వడ కని బట్ట, పిండని పాడి, ఇంటిముందు తడి వస్త్రాలు పొడి వస్త్రాలు తరగకుండా ఉండాలని, ఎవరి కోకలు అయినా కట్టుకున్నా నన్ను ఏమీ అనకూడదని’ కోరుకుంటాడు. అందుకు శివుడు దీవించి నీకు అన్నం పెట్టని వారు నరకం పోతారని అభయమిస్తాడు. ప్రత్యక్షంగా శివుని పులి చర్మం, బొంత ఉతికిన వీరి వృత్తి ప్రధామైనదే అని చెప్పొచ్చు.
సబ్బును కనుగొన్న మొదటి శాస్త్రవేత్త "రజకుడు":
రసాయనిక డిటర్జెంట్లు వాడుకలోకి రాకముందు ప్రకృతి సిద్ధంగా లభించే చౌడు మట్టితో బట్టలు ఉతుకేవారు. చౌడు మట్టి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసింది రజకులే. చౌడు అనగా భూముల్లో పైకి తేలిన ఉప్పటి నున్నటి మట్టి. కాల క్రమేపి మట్టిని సున్నపుగడ్డతో కలిపిన గమ్మును సబ్బుగా తయారుచేసి వాటితో బట్టలు ఉతకడం ప్రారంభించారు. ఈ సబ్బుతో ఉతికితే మరింత శుభ్రత వస్తుందని భావించి బట్టలు శుభ్రం చేయడానికి కెమిస్ట్రీ ఆవశ్యకతను కనిపెట్టిన తొలి శాస్త్రవేత్త "రాజకుడు".
ఉబ్బకేయడం:
ఒకప్పుడు గ్రామాల్లో అంటు వ్యాధులు ఎక్కువగా వ్యాపించేవి. మనిషి కి రోగాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు స్నానం చేయడం మరియు ప్రతిరోజూ ఉతికిన బట్టలు తొడగటం అనేది మనిషి ఆరోగ్యానికి ఎంతో అవసరం. మానవు డు విసర్జించే పన్నెండు రకాల మాలినాలను చాకలి స్వయంగా తన చేతులతో శుభ్రం చేసి అంటువ్యాధుల నుండి సమాజాన్ని రక్షించిన రజకులు ఈ దేశానికి గర్వకారణం అనడంలో సందేహమే లేదు.
చౌడు మట్టితో ఉతికితే బట్టలు తెల్లబడవచ్చు కానీ బట్టల్లోని క్రిములను చంపలేమని రజకులు మొదటగా గ్రహించారు.. వ్యాధికారక క్రిములను నాశనం చేసే సరైన ప్రక్రియను కూడా రజకులే కనుగొన్నారు. బట్టల నుండి సూక్ష్మక్రిములను చంపడానికి శుభ్రపరిచే ప్రక్రియను ఉబ్బకేయడం అంటారు. త్రికోణాకారంలో ఉండే మూడు పెద్ద మట్టికుండలను పొయ్యి మీద పెట్టి వాటి చుట్టూ మట్టితో దిమ్మె కడుతారు. వాటిలో సగం వరకు నీళ్లు పోసి, ఆ మూడు కుండల మీద ఉబ్బకు వేయాల్సిన బట్టలను సౌడు నీళ్లతో తడిపి కుప్పలుగా పేరుస్తారు. తర్వాత ఆ బట్టల కుప్పకు ఒక పెద్ద బుట్టను కప్పుతారు. ఆ తరువాత కుండ కింద మంట పెడ్తారు. కుండలలోని నీరు ఆవిరై అది పైనున్న బట్టన్నింటికీ వ్యాపిస్తుంది. అలా గంట ఆవిరి పట్టాక వాటిని తీసి నీళ్లలో ఉతుకుతారు. ఇలా చేయడం వల్ల బట్టలు పరిశుభ్రంగా ఉంటాయి.
శుభ కార్యాలలో రజకుల పాత్ర:
బట్టలు ఉతకడంలోనే కాకుండా అన్ని శుభకార్యాల్లోనూ రజకుడంటే అత్యంత ప్రాధాన్యత ఉంటుందనడంలో అతిశయోక్తిలేదు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళికి ముందు రజకులు జరిపే "లగ్గం పోలురాయటం" అనే వేడుక ఎంతో ప్రత్యేకమైనది. వీరు పోలు రాసినతరువాతే వేదమంత్రాలతో తాళికట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే శుభలేఖలు పంచిన క్షణం నుండి కార్యానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. మన హైందవ సంప్రదాయాలలో ముందుగా రజకుల ద్వారా శుభలేఖలు పంచితేనే శుభం జరుగుతుందని ప్రజలకు గట్టి నమ్మకం ఉండేది. శుభకార్యాలకు మరియు ముఖ్యమైన పనులకు బయలుదేరేముందు రజకులు ఎదురైతే మంచి జరుగుతుంది అనే నమ్మకం గ్రామమలలో ఇప్పటికి ఉంది. పెళ్లి తరువాత పెళ్ళికొడుకు పెళ్లికూతురిని ఉరేగించడంలో పల్లకిమోసె కార్యక్రమం కూడా రజకులదే కావడం ఎంతో గొప్ప విషయం. పల్లకి రజకులు మోస్తేనే వివాహిత దంపతులకు శుభం జరుగుతుందని ప్రజల విశ్వాసం. వివాహ వేడుక ప్రారంభం నుంచి ముగిసే వరకు రజకుల పాత్ర వర్ణనాతీతం. వీరు లేనిదే గ్రామాల్లో ఎలాంటి సంప్రదాయ కార్యక్రమాలు జరిగేవి కావు. కానీ కాలక్రమేణా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేడు పట్టణాల్లో, కల్యాణ మండపాల్లో జరిగే కార్యక్రమాలు వారి అవసరాలు లేకుండానే జరిగిపోతున్నాయి. అప్పట్లో ఎడ్లబండి ఉన్నాసరే పల్లకీలోనే ఊరేగేవారు. ఆ ఆనందం చెప్పరానిది. కానీ ఇప్పుడు రజకుల అవసరాలు లేకుండా వాహనాలను ఎంతో అందంగా తీర్చిదిద్ది ఊరేగుతున్నారు. నేటి తరానికి పల్లకి ఎలా ఉంటుందో చూడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పల్లకీలో ఊరేగించే సంప్రదాయం అంతరించడం చాలా బాధాకరం.
గ్రామాల్లో రజకుల సేవలు వెలకట్టలేనివి:
రాజుల కాలంలో రజకులు అణిచివేతకు గురైనారు. కష్టానికితగ్గ కూలి ఇవ్వకుండా వారితో వెట్టిచాకిరి చేయించుకున్నారు. రాజులు ఏ ప్రాంతానికి వెళ్లాలన్నాగుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లు ఉపయోగించేవారు. రాజు ఎంతదూరం వెళ్తే అంతదూరం రజకుడు కండువా నడుంకి చుట్టుకొని ఆ బండిముందే నడవాలని రాజు ఆజ్ఞాపించేవారు. రజకుడు ఆ బండి ముందు నడిస్తేనే మంచి జరుగుతుందని రాజు నమ్మకం. గ్రామంలోని దేవుళ్ల ఊరేగింపులలో రజకులు కాగడాలను మోసుకెళ్లడం ఆనవాయితీ. ఇందుకు అంగీకరించని వారిపై పెత్తందార్లు నిర్ధాక్షిణ్యంగా దాడులు చేసేవారు. అంతేగాక గ్రామంలోని గుడి, గడి, కచ్చిరు శుభ్రం చేయవలిసిన భాద్యత కూడా రజకులపై ఉండేది. రజకులకు వారసత్వ హక్కు కూడా ఉండేది. అప్పట్లో రజక కుటుంబాలు రెండు మూడు గ్రామాల్లో ఒకే కుటుంబం ఉండేవి. ఆ ఊరి బట్టలు ఉతకాలంటే ఆ కుటుంబంలోని రజకులు తప్ప మరెవరూ ఉతకకూడదు అనే నియమాలు ఉండేవి. వారి కుటుంబంలోని పిల్లలు విడిపోయినప్పుడు, వారు తల్లిదండ్రులకు చెందిన గ్రామాలను పంచుకునేవారు.
అంతరించిపోతున్న రజక వృత్తి :
ఒకప్పుడు పండుగలప్పుడు ఇంటింటికీ తిరిగి బట్టలు సేకరించి చాకిరేవులో ఉతికి సాయంకాల సమయంలో ఎవరిబట్టలు వారికీ ఇచ్చేవారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే. అందరి బట్టలు ఒకేదగ్గర చౌడుమట్టి కలిపినా నీళ్లలో నానబెట్టి ఉతికినతరువాత ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తారు. బట్టలు ఎవరెవరివి అనేది గుర్తుపెట్టుకోవడం చాల గొప్ప విషయం. అందుకే తెలంగాణాలో ఒక నానుడి పుట్టింది "చదువుకున్నోడికన్నా రజకుడు మేలని". కానీ ఇప్పుడు బట్టలుతికే వాషింగ్ మెషిన్ రావడంవల్ల ధనిక, బీద కుటుంబాల సైతం వారి బట్టలను వారే ఉతుకోవడం మొదలుపెట్టారు. వాషింగ్ మెషీన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి వీరి వృత్తి అంతరించడం ప్రారంభం అయింది. నేడు పూర్తిగా కనుమరుగైందని చెప్పవచ్చు. దీంతో పలు రజక బతుకులు అగమ్యగోచరంగా మారాయి. అంతేగాక గ్రామాలలో బ్రాహ్మణుల , దొరల ఇళ్లలో రజక మహిళలే ఇంటి పని చేసేవారు. కానీ కాల క్రమేణా ఇతర కులాల వారు కూడా చేయటం వలన వీరి ప్రాధాన్యత తగ్గింది. . ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రజక కుటుంబాలను ఆదుకుంటామని చెప్పటమే తప్ప ఎవరు ఏమి చేయరని వారు వాపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు రజకులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్ని “బంగారు తెలంగాణ” గా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి రజకులు చేసిన సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని రజకులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి