28, ఫిబ్రవరి 2023, మంగళవారం

ద‌ర్జా‌ కోల్పోతున్న ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం:

ద‌ర్జా‌ కోల్పోతున్న ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం:

దారం ఎంత ఖరీదైనదైనా.. నేతన్న లేకుండా వస్త్రం తయారుకాదు.

దారం మానవ వస్త్రానికి ఆధారం, నేతన్న లేనిదే వస్త్రం లేదు. 

బట్ట ఎంత ఖరీదయినా టైలర్ (దర్జీ) కుట్టకపోతే ఆ గుడ్డకు విలువ లేదు.

వస్త్రానికి దారం ఎంత ముఖ్యమో, మనిషికి బట్టలు తయారు చేయడంలో దర్జీ (టైలర్) కూడా అంతే ముఖ్యం.

నేతన్న, దర్జీ లేని సమాజాన్ని ఊహించలేం. శరీరాన్ని అందంగా తీర్చిదిద్దే బట్టలు, ఆడంబరమైన దుస్తుల డాంబికతను సూచించడంతో పాటు వ్యక్తి యొక్క సంస్కారాన్ని తెలియజేస్తాయి.

నాగరికత అభివృద్ధి చెందుతున్న సమయంలో అందుబాటులోకి వచ్చిన అనేక ఆవిష్కరణలు మానవ జీవితాన్ని సుఖవంతం చేశాయి. కుట్టు యంత్రం మానవజాతి చరిత్రలో ఇప్పటివరకు చేసిన అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఆవిష్కరణలలో ఒకటిగా పేర్కొనబడింది. ఎలియాస్ హోవే తన భార్య పడుతున్న శ్రమ ని తగ్గించడానికి అవిశ్రాంతంగా కృషి చేసి  ఫిబ్రవరి 28న మొదటి కుట్టు యంత్రాన్ని కనుగొన్నాడు. అందుకే అదే రోజు వరల్డ్ టైలర్స్ డే జరుపుకుంటారు.

మొట్టమొదటిసారిగా ఎలియాస్ హోవే అనే అమెరికన్ మెషినిస్ట్ 1845లో మొట్టమొదటి కుట్టు యంత్రాన్ని కనుగొన్నాడు. ఎలియాస్ హోవే ఒక పేద కుటుంబానికి చెందినవాడు. ఆయన పత్తి కర్మాగారంలో యంత్రం మెషినిస్ట్ గా పని చేసేవారు. హోవే జీతం తక్కువ ఉండటంవల్ల  కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉండేది. అందుకే అతని భార్య ఇంట్లో ఇతరులకు కూడా చేతితో బట్టలు కుట్టేవారు. ఆమె చేతితో కుడుతున్న పనిని చూస్తూ, ఆమె శ్రమను గుర్తించి హోవే చేతి కుట్టు ప్రక్రియను యాంత్రికీకరించే మార్గాలను దృశ్యమానం చేశారు,  ఆమె పడుతున్న శ్రమను తగ్గించడానికి ఆరు నెలలు అవిశ్రాంతంగా కృషి చేసి కుట్టు యంత్రం కనిపెట్టాడు. మొదటిసారిగా 1845లో ఫిబ్రవరి 28న కుట్టుమిషన్‌ను కనిపెట్టాడు. 1846లో యునైటెడ్ స్టేట్స్‌లో పేటెంట్ పొందింది కానీ చాలా  కాలం వరకు తన ఆవిష్కరణకు సరైన గుర్తింపు లేకపోవడంతో నిరాశ మరియు నిరుత్సాహానికి గురయ్యాడు. కొన్ని సంవత్సరాల తరువాత యునైటెడ్ స్టేట్స్ వారు తన పేటెంట్‌ను ఉల్లంఘించి కుట్టు మిషన్లను తయారు చేసి విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు, కోర్టులో అనేక వ్యాజ్యాల తర్వాత, అతను 1854లో తన హక్కులను గెలుచుకున్నాడు. అనేక దేశాలు అతని యంత్రాన్ని పరీక్షించి, మరిన్ని కుట్టు యంత్రాలను తయారు చేసేందుకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి.  ప్రపంచ చరిత్రలో అత్యంత ఉపయోగకరమైన యంత్రంగా  ప్రపంచం మొత్తం గర్వపడేలా తన కుట్టు యంత్రాన్ని రూపొందించాడు. ఆయన సేవలకు గుర్తింపుగా అక్టోబర్ 14, 1940 న విడుదలైన ఫేమస్ అమెరికన్ ఇన్వెంటర్స్ సిరీస్‌లో హోవే 5-సెంట్ స్టాంపుతో స్మారకంగా ఉంచబడింది. అంతేకాకుండా ఆయన శ్రమకు ఫలితంగా హోవే జీవిత చరిత్రను 1965 లో బీటిల్స్ సినిమా ద్వారా తెరకెక్కించారు. ఎలియాస్ హోవే 48 సంవత్సరాల వయస్సులో అక్టోబర్ 3, 1867 న అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఎలియాస్ హోవే ఫిబ్రవరి 28న కుట్టుమిషన్‌ను ఆవిష్కరించిన రోజున ప్రపంచ టైలర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మన దేశంలో టైలర్ వృత్తి పై ఆధారపడి జీవించే వారు  చాలా మంది ఉన్నారు. పూర్వకాలంలో మేర వారు మాత్రమే బట్టలు కుట్టేవారు కాలక్రమేపి పద్మశాలీలు కుట్టేవారు. ప్రస్తుతం అన్నివర్గాల వారు టైలరింగ్‌లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. రెడీమేడ్ బట్టలు మార్కెట్ లోకి రాకముందు టైలర్లకు చేతినిండా పని ఉండేది. ఒకప్పుడు పండుగలకు 20 రోజుల ముందే గిరాకీ ఉండేది. అందరూ పండుగ ఆనందంలో కుటుంబ సభ్యులు గడుపుతుంటే, దర్జీలు మాత్రం పండుగ ఆనందాన్ని పొందే వారు కాదు కనీసం తినటానికి సమయంలేని సందర్భాలు ఉంటాయి. దర్జీలు సుఖమెరుగని కష్టజీవులు. పెళ్లిళ్లకు, పండుగలకు, శుభకార్యాలకు, అన్ని కార్యాలకు బట్టలు కుట్టించే వారు కానీ నేడు రెడీమేడ్ బట్టలు విరివిరిగా మార్కెట్ లోకి రావడం వల్ల టైలర్స్ ఉపాధి కోల్పోతున్నారు. ఒకప్పుడు పని ఉన్నా ఆదాయం అంతంత మాత్రమే అయినా కుటుంబాన్ని పోషించడానికి ఈ వృత్తినే ఎంచుకున్నారు. రెడీమేడ్ డ్రెస్సెస్ రావడంతో గిరాకీ గణనీయంగా తగ్గింది దీంతో  టైలర్ వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. టైలరింగ్‌పై ఆధారపడి జీవిస్తున్న వారు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక జీవనోపాధి పొందలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా వృత్తి కొనసాగిద్దామంటే అనుకోకుండా, కరోనా మహమ్మారి  వీరి వృత్తిని మరింత జీవనోపాధి లేకుండా చేసింది. కనీసం పూట గడవని పరిస్థితి నెలకొంది. కొందరు ఈ వృత్తిని వదిలి ఇతర వృత్తుల పై ఆధారపడి జీవిస్తుండగా మరి కొందరు మాత్రం ఈ వృత్తి మాకు జీవనాధారం కొనసాగిస్తున్నారు. రెడీమేడ్ దుస్తువుల నాణ్యతా లోపం వల్ల ఇప్పటికి  కొందరు టైలర్స్ చేత కుట్టించుకోవడం సంతోషించాల్సిన విషయమే కాక వారి యొక్క పని నైపుణ్యానికి నిదర్శనం కూడా. 

కుదేలవుతున్న కుట్టు మెషిన్:

నేడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ రెడీమేడ్ దుస్తులు అందుబాటులో ఉండేలా ఫ్యాషన్ డ్రెస్ ఉత్పత్తుల పరిశ్రమలు విస్తరించాయి. కొత్త కొత్త డిజైన్లతో టీ షర్ట్, జీన్స్ ప్యాంట్లు, షాట్లు, రకరకాల దుస్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. యువత ఆసక్తిని ఆదాయ వనరుగా మార్చుకోవడానికి పెద్ద కంపెనీలు నగరాలతో పాటు చిన్న పట్టణాలు మరియు గ్రామాలకు విస్తరించాయి. దీంతో గ్రామంలో నివసించే వారు సైతం స్టైల్ వైపు ఆకర్షితులై రెడీమేడ్ పై మక్కువ చూపుతుండటంతో టైలర్లకు  ఉపాధి కరువవుతోంది. మార్కెట్లో దొరికే బట్టలు నాణ్యత లేకపోయినా ఫ్యాషన్ డిజైన్ మోజులో పడి టైలర్ తో కుట్టించుకునేవారు గణనీయంగా తగ్గిపోయారు. నాడు పెళ్లిళ్లకు టైలర్స్ తో కుట్టించుకునే యువత నేడు షాపింగ్ మాల్స్ లో కొంటున్నారు. అంతే కాకుండా దుస్తుల తయారీకు సంబంధించిన ముడి సరుకు‌ ధరలు పెరగడంతో టైలర్స్ కి గిట్టుబాటు ధర లేక వృత్తికి తిలోదకాలు వదిలే పరిస్థితి ఏర్పడింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఫ్యాషన్ దుస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో మహిళా టైలర్లు కూడా ఉపాధి కోల్పోతున్నారు. పిల్లలను చదివించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక టైలరింగ్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం టైలర్స్ కి సరైన ఉపాధి కల్పించాలి.

రెడీమేడ్ రాకతో ఉపాధి కోల్పోయిన టైలర్స్ కి ప్రభుత్వ పాఠశాలలు మరియు హాస్పిటల్ లో ఇతర ప్రభుత్వ రంగాలలో యూనిఫాం వంటి పనులు టైలర్స్ కి ఇచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యూనిఫామ్ వంటి పనులు చేనేత కార్మికులు మరియు టైలర్స్ కి ఇవ్వడం వల్ల రెండు రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశముంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం టైలర్స్ కి ఉపాధి కల్పించడంలో సరైన ఆలోచన చేయాలి.

ఆరోగ్య సమస్యలు;

టైలర్ పనిచేసే వారు అనేక  ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరంతరాయంగా కూర్చొని పని చేయడం వల్ల కంటి చూపుతో పాటు వెన్ను నొప్పి, మోకాళ్ళ, ఆర్థో సమస్యలు పెరుగుతున్నాయి. ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల  స్థూలకాయ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.  ముఖ్యంగా సమయానికి దుస్తులు ఇవ్వాలనే ఒత్తిడి కారణంగా మానసిక సమస్యలతో పాటు ఇతరత్రా రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వైద్య బీమా సదుపాయం అందకపోవడంతో టైలర్లంతా ఆందోళన చెందుతున్నారు.

రెక్కాడితే గాని డొక్కాడని టైలర్స్ కి ఎన్నికల సమయంలో అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రతి టైలర్ కి కుట్టు మెషిన్ అందజేస్తామని ప్రగల్భాలు పలికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం నేడు టైలర్లను నిర్లక్ష్యం చేయడం బాధాకరం.

ఇప్పటికైనా ప్రభుత్వం టైలర్ల సమస్యలను పరిష్కరించి వారికి ఉచితంగా కరెంటు, హెల్త్ కార్డు, కుట్టుమిషన్ అందించి టైలర్ల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి. అంతరించిపోతున్న కళను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475 







 


  


కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...