పెళ్ళంటే నూరేళ్ల పంట..
పెళ్ళంటే నూరేళ్ల పంట, అది పండాలి. కోరుకున్న వారి ఇంట..
మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు..
ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు..
పెళ్లి ప్రాముఖ్యత గురించి దాశరథి గారు రాసిన మీనా చిత్రంలోని పాట అక్షరాలా నిజం.
పూర్వకాలంలో వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా, బంధుమిత్రులతో
ఇరు కుటుంబాల వారు కలిసి పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా 5 రోజుల పాటు వేడుకగా నిర్వహించేవారు. కానీ నేటి పెళ్లిళ్లలో ఒకప్పటి సందడి కనిపించడం లేదు.
గతంలో పెళ్ళంటే వదువరులను ఒకటిగా చేయడమే కాకుండా రెండు కుటుంబాలు కలవడం అంతేగాక ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, ఇరు వర్గాల వారిని కలిపే ప్రత్యేక వేడుక. ఇలా పెళ్లి వేడుకలో ఒకటైన ఇరు కుటుంబాల బంధాలు విడదీయరాని సంబంధాలుగా ఏర్పడి, ఆత్మీయానురాగాలతో పెనవేసుకొని వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతుండేవి. అలా కొనసాగుతున్న బంధుత్వ ప్రక్రియలో మరికొన్ని వివాహాలు ఏర్పడి విడదీయరాని బంధాలుగా కొనసాగుతుండేవి.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ ప్రారంభమవుతుంది, నిశ్చితార్థం లో మరియు వధూవరుల నక్షత్ర బలాన్ని చూసి ముహూర్తం నిర్ణహించేవారు. తర్వాత ఆహ్వాన పత్రికలు (శుభలేఖలు) ముద్రించుకుని 20 రోజుల ముందే సంప్రదాయబద్దంగా బంధుమిత్రులందరికి ఇంటికి వచ్చి శుభలేఖలు పంచేవారు. వివాహ కార్యక్రమానికి బంధువులు వారం రోజుల ముందే వచ్చి పెళ్లి కార్యక్రమానికి సంబంధించిన తాటాకు పందిళ్లు మరియు ఇంటి అలంకరణ వంటి పనులు చేసేవారు. ఇప్పుడు అయినవారికి కూడా రెండు రోజులు ఉందనగా ఇంటికి రావడానికి సమయం లేదని వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. ఇంటికి రావడానికి సమయం లేనివాడి పెళ్ళికి పోయి మన సమయం వృధా చేసుకోవడం ఎందుకని పెళ్లిళ్లకు పోనివారు కొంతమంది ఉన్నారు. కానీ ఆనాటి సంప్రదాయ పద్ధతులు నేటి పెళ్లిళ్లలో కనిపించకపోవడం శోచనీయం.
మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, అన్ని రంగాలు మార్పులు చెందిన విషయం మనందరికీ తెలిసిందే. కాలానుగుణంగా వివాహ వేడుకల్లో కొన్ని మార్పులు వచ్చాయి. నేటితరం వారు మానవ సంబంధాలన్నీ మరిచి ఆర్ధిక సంబంధాలతో కలిసి అడుగులేస్తుండడంతో బంధుత్వాలు బలహీనపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్న వారి పిల్లలు ఇప్పుడు కలిసి ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఒకే తల్లికి జన్మించిన పిల్లలే కలిసుండలేక కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మనిషి మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడంలో విఫలం కావడం వలన సమాజంలో మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో బంధుమిత్రుల ద్వారానే పెళ్లి సంబధాలు కుదిరేవి.
"వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయాలన్నారు" మన పూర్వికులు కానీ నేడు బంధువులు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోయి పెళ్లి సంబంధాలు చూడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది.
అందుచేత నేటి తరం వారు పెళ్లి సంబంధాల కొరకు మ్యారేజ్ బ్యూరో లను ఆశ్రయిస్తున్నారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకుల్ని చేసిన తర్వాత పెళ్లి చేస్తే ఓ పనై పోతుందనుకుంటే సంబంధాలు అంత తేలిగ్గా దొరకడం లేదు.
వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి?:
ఒకప్పుడు తల్లిదండ్రులు సంతానం విషయంలో ఆడ, మగ ఎవరైనా దేవుడు వరంగా భావించేవారు. ఆర్థిక స్థోమతును కూడా దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేక ముగ్గురితో సంతానానికి ముగింపు పలికారు. ఆ కాలంలో ఆడపిల్లలు పుడితే వారిని చదివించడం, పెంచడం, పెళ్లి చేయడం వంటివి తల్లిదండ్రులు భారంగా భావించేవారు. అదే అబ్బాయిలు అయితే ఎంత ఖర్చయినా ఉన్నత చదువులు చదివిస్తే ఉద్యోగం చేసి కుటుంబానికి ఆర్థికంగా సహకరిస్తారని, అదే విధంగా వివాహం చేస్తే వచ్చే కోడలు తెచ్చే కట్న కానుకలతో కుటుంబం ఆర్థికంగా బలపడుతుందనే ఉద్దేశంతో మగ బిడ్డే కావాలని కోరుకున్నారు. మొదటి కాన్పులో అమ్మాయి పుడితే రెండవ కాన్పులో అబ్బాయి కోసం ఎదురు చూసేవారు.అదేవిధంగా మొదటి కాన్పులో అబ్బాయి పుడితే రెండవ కాన్పులో అమ్మాయి పుడుతుందనే భావంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించునేవారు. ఫలితంగా, సాధ్యమైన ప్రతిచోటా చట్టవిరుద్ధమైన గర్భ లింగ పరీక్షలు జరిగాయి. నేడు యువతీ యువకుల నిష్పత్తిలో తేడాలు పెరగడానికి ఇదో కారణం.
యువకుల సంఖ్యకు అనుగుణంగా యువతులు లేకపోవడం, ఉద్యోగం చేసి సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోకపోవడం, అమ్మాయిలు అబ్బాయిలతో రాజీ పడకపోవడం, అమ్మాయిలు కోరుకున్నట్లు యువకులు దొరకడం లేదు, ఒకే చదువు ఒకేరకమైన ఉద్యోగం ఉన్నవారు కావాలని కోరుకోవడం, అబ్బాయికి ఆస్తితో పాటు ఉన్నత చదువు ఉండాలి మరియు లక్షల్లో జీతం ఉండాలనే ఆలోచన అమ్మాయిలలో ఉండటం అందుకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగంలో స్థిరపడిన తరువాత వివాహం చేసుకోవాలనే సంకల్పం కారణంగా అబ్బాయిల వివాహాలు ఆలస్యమవుతున్నాయనేది వాస్తవం.
వివాహాలు ఆలస్యంగా చేసుకోవడం వల్ల అనేక సమస్యలు:
వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. ఈ మధ్య కాలంలో ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్న విషయం వాస్తవం. ఇది వరకు రెండు పదులు దాటితే పెళ్లి చేసుకునే వారు కానీ ఇప్పుడు మూడు పదులు దాటిన పెళ్లి చేసుకోవడం లేదు. ఉద్యోగంలో స్థిరపడనిదే పెళ్లి వద్దంటూ అనేక కారణాలవల్ల యువత 35 సంవత్సరాలు దాటినా పెళ్లి ప్రస్తావన మాట్లాడని వారున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఆలస్యంగానే అవుతారు. అలా జరగడం వల్ల, వృద్ధాప్యానికి వచ్చేసరికి పిల్లలు జీవితంలో సరిగ్గా స్థిరపడక. ఇంకా వారిపైనే ఆధారపడుతున్నారు. కానీ వయసు పెరిగే కొద్దీ పని చేసే శక్తి తగ్గుతుంది. అలాంటి సమయాల్లో పిల్లలపై ఆధారపడాల్సి వస్తుంది. కానీ వీరికి వయస్సు మీద పడి పని చేసే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో వీరు పిల్లలపై ఆధారపడాలి. కానీ వారే సెటిల్ కాకుండా ఉంటే. పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
గణాంకాల ప్రకారం పెళ్లి కాని వారు:
ప్రభుత్వ గణాంకాల ప్రకారం పెళ్లి కాని వ్యక్తుల నిష్పత్తి 2011లో 17.2 శాతం ఉండగా, 2019లో 26.1 శాతం పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ నివేదిక ప్రకారం, వివాహం చేసుకోని యువత జనాభా (15-29 సంవత్సరాలు) శాతం వాటా పురుషుల జనాభాలో 2011లో 20.8 శాతం నుండి 2019లో 26.1 శాతానికి పెరుగుతుంది. అవివాహిత స్త్రీల నిష్పత్తి 2011లో 13.5 శాతం నుంచి 19.9 శాతానికి పెరిగింది. 2019లో, జమ్మూ కాశ్మీర్‌లో పెళ్లి చేసుకోని వారి సంఖ్య అత్యధికంగా పరిగణించబడింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి.
కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ అత్యల్ప శాతం స్థానాల్లో ఉన్నాయి.
పెళ్లి వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతుంది:
ప్రేమతో పెనవేసుకున్న బంధాలు కొంతకాలానికి అనూహ్య కారణాలవల్ల విడిపోతున్నవారిని ఈ సమాజంలో చాలా మందిని చూస్తుంటాం. ఒకప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారు కొంత కాలానికి ధ్వేషంతో ఎందుకు రగిలిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు అనే ప్రశ్నకి అనేక సమాధానాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకు గొడవపడుతు ఇగోలతో రగిలిపోతు విడాకులు తీసుకోవడానికి సిద్దపడుతున్నారు. ఇలా జరుగుతున్న సంఘటనలను ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేయడం వలన యువత భయపడి పెళ్లి చేసుకోవడానికి విముఖత చూపుతున్నారు. కోట్ల ఆస్తులున్న కూడు పెట్టని కొడుకులున్న సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనలను చూసి తల్లిదండ్రులు కూడా అబ్బాయిల పెళ్లిళ్లు చేయాలంటే భయపడుతున్నారు. ఆడపిల్ల వద్దు అనుకున్న నాటి సమాజం నేడు ఆడపిల్ల ముద్దనుకుంటుంది. అంతేకాకుండా సినిమాల్లో కూడా పెళ్లి వల్ల జరిగే ఇబ్బందులను చూపించడం వలన యువతలో పెళ్లి పై ఆసక్తి లేకుండా పోతుంది. దీనికి ఒక ఉదాహరణ 2002 లో విడుదలైన మన్మధుడు సినిమా లోని పాట
ఒరేయ్ వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్
చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి
కల్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా
నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలే నీ తొందరా
డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ
ఈ పాట పెళ్ళిచేసుకుంటే పడే కష్టాల గురించి ఆలోచించేలా చేస్తుంది. 40 సంవత్సరాలైనా పెళ్లి చేసుకొని వారిని ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరి నోట మన్మధుడి పాటే.
పెళ్లి వద్దని కొందరైతే మరికొందరు పెళ్లి చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటూ వధువుల కోసం నానా పాట్లు పడుతున్నారు. ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేద్దామంటే అబ్బాయిలు దొరికేవారు కాదు.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి