1, ఏప్రిల్ 2023, శనివారం

అసమాన యోధుడు "కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా"

అసమాన యోధుడు "కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా"

"మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు.. కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేలా ఉండాలి" అబ్దుల్ కలాం చెప్పిన మాటలు ఎప్పటికీ నిజమే. 

ప్రతి ఒక్కరి పుట్టుక సాధారణమే కానీ కొందరి మరణం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది, చరిత్ర సృష్టిస్తుంది, వారి జ్ఞాపకాలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

ఆనాటి యోధుల త్యాగాల వల్ల ఈ రోజు భారతదేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు.

1971 భారత్‌ - పాక్‌ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర యోధుడు "కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా" స్ఫూర్తివంతమైన విజయగాథను ఒకసారి మననం చేసుకుని అతని దేశభక్తికి నివాళులర్పిద్దాం. 

"కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా" ​​1926 మే 15వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జన్మించారు. అతని తండ్రి, శ్రీ తేజ్ నారాయణ్ ముల్లా, హైకోర్టు న్యాయమూర్తి మరియు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అతని కుటుంబ సభ్యులందరూ న్యాయవాద వృత్తికి చెందిన వారు. మొదట్లో మహేంద్ర నాథ్ ముల్లా కూడా న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉండేది, అయితే అతను పెద్దయ్యాక అతని ఆసక్తి సాయుధ దళాల వైపు మళ్ళింది. 

20 సంవత్సరాల వయస్సులో, అతను ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత జనవరి 1946లో రాయల్ ఇండియన్ నేవీలో క్యాడెట్‌గా చేరాడు. అతను యునైటెడ్ కింగ్‌డమ్‌లో శిక్షణ పొందిన తరువాత తిరిగి మే 1, 1948 న రాయల్ ఇండియన్ నేవీలో నియమించబడ్డాడు. భారత నావికాదళంలో ఉన్నతాధికారులు ముల్లా ప్రతిభను గుర్తించి 16 సెప్టెంబర్ 1958న లెఫ్టినెంట్ కమాండర్‌గా పదోన్నతి కల్పించారు. ఆపై ఏప్రిల్ 1961లో ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC) వెల్లింగ్‌టన్‌కు ఎంపికయ్యారు. అతను 1964 జూన్ 30న కమాండర్ స్థాయి పదోన్నతి పొందారు. ఐఎన్‌ఎస్‌ కృష్ణాలో మూడేళ్లపాటు సేవలందించారు. కెప్టెన్ ముల్లా తన సేవా జీవితంలో నావికాదళ ప్రధాన కార్యాలయంలో ఆఫీసర్-ఇన్-చార్జ్ ఆఫ్ నేవల్ నియామకాలు, మూడు సంవత్సరాల పాటు లండన్‌లోని భారత హైకమిషనర్‌కు డిప్యూటీ నావల్ అడ్వైజర్ మరియు బొంబాయిలోని నేవల్ షోర్ స్థాపన ఐఎన్‌ఎస్ ఆంగ్రే యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వంటి అనేక ముఖ్యమైన నియామకాలను నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ప్లాన్స్‌లోని నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లో పదవీకాలం పాటు డిస్ట్రాయర్ INS రాణాకు కమాండింగ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశాడు. ఆ తరువాత  డిఫెన్స్ కౌన్సెల్‌గా నియమించబడ్డాడు. ఫిబ్రవరి 1971లో, అతను INS ఖుక్రీలో చేరి  కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 

1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో కెప్టెన్ ముల్లా INS ఖుక్రీ (F-149), INS కుతార్ (F-146) మరియు INS కిర్పాన్ (F-144) లకు ఫ్లోటిల్లా కమాండర్‌గా ఉన్నారు. ఉత్తర అరేబియా సముద్రంలో శత్రు జలాంతర్గాములను వేటాడడం మరియు తటస్థీకరించడం కొరకు ఈ మూడు జలాంతర్గాములను ఉపయోగించేవారు. 03 డిసెంబర్ 1971న డయ్యూ నౌకాశ్రయానికి సమీపంలో ఇండియన్ నేవల్ రేడియో డిటెక్షన్ పరికరాలు ఒక శత్రు జలాంతర్గామిని గుర్తించాయి. అదేసమయంలో INS కుతార్‌లో ఒక సాంకేతిక సమస్య ఏర్పడటంవలన డిసెంబర్ 05న దానిని తిరిగి నౌకాశ్రయానికి తీసుకెళ్లారు. ఆ తరువాత శత్రు జలాంతర్గామి ముప్పును ఎదుర్కొనడానికి  INS కిర్పాన్‌తో పాటు INS ఖుక్రీని పంపించారు. దురదృష్టవశాత్తూ డిసెంబర్ 9 వ తేదీ సాయంత్రం 20 :46 సమయంలో  టార్పెడోలను ప్రయోగించి పాకిస్థానీ జలాంతర్గామి PNS హంగూర్ INS ఖుక్రీ ని బలంగా ఢీ కొట్టడం వల్ల ఖుక్రీ లోపల రెండు భారీ పేలుళ్లు సంభవించాయి అందువల్ల వెనుకభాగం దగ్ధమైంది కెప్టెన్ ముల్లా నిమిషాల వ్యవధిలో పరిస్థితిని పరిశీలించి, ఒడనుండి లైఫ్ బోట్‌లు, తెప్పలు మరియు బోయ్‌లను సముద్రంలోకి విసిరేయమని అతను తన సెకండ్-ఇన్-కమాండ్‌ని ఆదేశించాడు,

INS ఖుక్రీ 176 మంది నావికులు మరియు 18 మంది అధికారులను మరియు ఓడ కెప్టెన్‌ను అరేబియా సముద్రంలో కొంత దూరం తీసుకెళ్లి నిమిషాల వ్యవధిలో మునిగిపోయింది. కానీ కెప్టెన్ ముల్లా అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు, అతను ప్రాణాపాయ స్థితిలో తన డ్యూటీ ని మరువకుండా వీలైనంత మందిని రక్షించడంలో గొప్ప సాహసం చేశారు. మొత్తం 67 మందిని రక్షించగలిగారు, ఇందులో 05 మంది అధికారులు, 01 మిడ్‌షిప్‌మ్యాన్ మరియు 61 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సంక్షోభ సమయంలో కెప్టెన్ ముల్లా యొక్క ధైర్యసాహసాలు నేవీ మరియు సాయుధ బలగాల మనోధైర్యాన్ని పెంచింది. 

కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లాకు భారత నౌకాదళం యొక్క మొదటి మరియు దేశం యొక్క రెండవ అత్యున్నత "శౌర్య పురస్కారం" లభించింది, 

అతని అద్భుతమైన ధైర్యం, నాయకత్వం మరియు అత్యున్నత త్యాగం కోసం "మహా వీర్ చక్ర". లభించింది. అంతేకాకుండా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను భారత నౌకాదళం డయ్యూలో స్మారక చిహ్నం తో సత్కరించింది.

 ముంబైలోని కొలాబాలోని నేవీ నగర్‌లో ఉన్న "కెప్టెన్ MN ముల్లా ఆడిటోరియం" అతని గౌరవార్ధం పేరు పెట్టబడింది.

28 జనవరి 2000న, ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, కెప్టెన్ ఎంఎన్ ముల్లాకు నివాళులు అర్పిస్తూ ఇండియా పోస్ట్ విడుదల చేసిన స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 

ఆయన త్యాగం మరువలేనిది :

ఓడ మునిగిన క్షణాలలో, కెప్టెన్ ముల్లా సులభంగా తనను తాను రక్షించుకోగలరు. కానీ తోటి సైనికులను కాపాడుకోవాలనే ఆలోచనతో దైర్యంగా తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా 67 మంది ప్రాణాలు రక్షించడమనేది అసాధారణమైన విషయం. కెప్టెన్ ముల్లా ధైర్యసాహసాలకు దేశంలోని ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాల్సిందే. 

ఈ వీరోచిత చర్యలో, కెప్టెన్ ముల్లా మనకు ఎలా జీవించాలో మాత్రమే కాకుండా, ఎలా చనిపోవాలి అనేది ఆయన మరణంతో మనకు తెలియజేయడం శోచనీయం.    

కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా లాంటి సైనికులు మరణించడం ఈ దేశానికి తీరని లోటు. ఈ వీర యోధుని త్యాగాన్ని దేశం కృతజ్ఞతతో ఎప్పటికీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475






కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...