20, ఏప్రిల్ 2023, గురువారం

మే డే

దేశ శ్రేయస్సు కోసం ఎండనకా, వాననకా, కాలాలకు అతీతంగా అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామికులు ఈ దేశ ప్రగతికి మూలాలు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. కార్మికుల స్వేదం చిందించకపోతే ఏ దేశం ప్రగతిశీల మార్గంలో నడవబోదనడంలో అతిశయోక్తి లేదు..

గుండు పిన్ను నుంచి విమానం వరకు ప్రతి వస్తువు తయారీకి శ్రామికుల శ్రమ ఎంతో అవసరం. 

కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరు కార్మికులే, శ్రమనే నమ్ముకుని పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికులే. దేశ భవిష్యత్తు నిర్మాణంలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది.

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా అమెరికా మరియు ఐరోపాలో అనేక పెద్ద పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల్లో పని చేయడానికి అసంఖ్యాక కార్మికులు అవసరం. దీంతో ఉత్పత్తి రంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం కార్మికుల శ్రమను విచక్షణారహితంగా దోపిడీ చేయడం ప్రారంభించారు. కార్మికులతో రోజుకు కనీసం 16 గంటల నుంచి 20 గంటల వరకు పని చేయించేవారు. కర్మాగారాలకు సరైన వెంటిలేషన్ మరియు లైటింగ్ వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. అందువల్ల కొందరు కార్మికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు తమ శ్రమను మరచిపోవడానికి పాటలు పాడినా లేదా విశ్రాంతి తీసుకున్న యజమానులు కోపోద్రిక్తులైయేవారు. ఈ క్రూరమైన చర్యల నేపథ్యంలో కార్మికుల్లో క్రమంగా తిరుగుబాటు మొదలైంది. కార్మిక సంఘాల ఏర్పాటు ప్రారంభమైంది. 1764-1800 మధ్యకాలంలో, బ్రిటన్‌లో మరియు తరువాత ఐరోపాలో ట్రేడ్ యూనియన్లు ఏర్పడ్డాయి. 1806లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ప్రేరణ పొందిన కార్మికులు మెకానిక్స్ యూనియన్ పేరుతో మొదటి ట్రేడ్ యూనియన్‌ను స్థాపించారు. పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్‌ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఆ పోరాట జ్వాలలు అన్ని దేశాల ప్రాంతాలకు వ్యాపించాయి. 1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 18 గంటల పని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఆ ఉద్యమంలో ఎందరో కార్మికులు మరణించి తమ హక్కులు సాధించుకున్నారు. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరవీరుల స్పూర్తికి గుర్తుగా జరుపుకునేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే.

నేటికీ ఫలించని కార్మిక హక్కులు:

దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా దేశ ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువును ఉత్పత్తి చేస్తూ వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. నేటికీ శ్రామికశక్తి అసంఘటిత రంగంలోనే ఉండడం మరింత బాధాకరం. కార్మికుల చట్టాల్లో ఎన్నో మార్పులు వస్తున్నా వారి వేతనాలు, జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. చట్టాలు అమలవుతున్న, ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. తత్ఫలితంగా కార్మికుల శ్రమకి తగ్గ వేతనం ఇవ్వకుండా, పనిలో రక్షణలు లేకుండా, సమ్మె హక్కులు లేకుండా, కనీసం వారు ఆరోగ్యంగా ఉండడానికి కనీసం భద్రత కల్పించకుండా వారిచేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. 

చట్టాలు మారిన కార్మికుల కష్టాలు తీరలేదు:

బ్రిటిష్‌ పాలనలోని అమానవీయ కార్మిక విధానాలను, బానిస చట్టాలను స్వాతంత్య్రానంతరం అనేక మంది కార్మికులు పోరాడి కార్మిక సంక్షేమమే ధ్యేయంగా 44 కార్మిక చట్టాలను రూపొందించుకున్నారు. ఈ 44 కార్మిక చట్టాలవల్ల కొంతమేరకు కార్మికులకు లాభం చేకూరిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం 44 చట్టాలు రద్దు చేస్తూ కొత్త 4 లేబర్‌ కోడ్‌లు రూపొందించింది. ఈ 4 చట్టాల వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోయే అవకాశముందని మరియు జీతాలతో వ్యత్యాసముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

4 లేబర్‌ కోడ్‌లు:

  • పారిశ్రామిక సంబంధాల కోడ్‌.
  • వేతనాల కోడ్‌.
  • సామాజిక భద్రత కోడ్‌.
  • భద్రత-ఆరోగ్యం- పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌.

పారిశ్రామిక సంబంధాల కోడ్‌:

పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మిక హక్కులను దెబ్బతీస్తుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల డిమాండ్లపై సమ్మె నోటీసు ఇవ్వడానికి కేంద్రం ఒకప్పుడున్న  14 రోజుల గడువును 60 రోజులకు పొడిగించింది. సమ్మెకు వ్యతిరేకంగా న్యాయస్థానికి  వెళ్లేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. దీంతో న్యాయస్థానం లో కేసు ఉన్నంత వరకు కార్మికులు సమ్మెకు దిగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు 10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలను పరిశ్రమలుగా పరిగణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 20కి పెంచగా చిన్న పరిశ్రమల కార్మికులు చట్టబద్ధమైన ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమ పథకాల నుండి మినహాయించబడే ప్రమాదం ఉంది. పాత చట్టం ప్రకారం, యాజమాన్యం యూనియన్‌లను గుర్తించే నిబంధన లేదు. ఏ యూనియన్ అయినా కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిపే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం పరిశ్రమల్లో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్నట్లైయితేనే యూనియన్‌గా పరిగణించబడుతుంది. 

వేతనాల కోడ్‌:

వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగుల వేతన విధానంలో పలు మార్పు సంతరించుకున్నాయి. తత్పలితంగా కార్మికుడి టేక్ హోమ్ పే తగ్గుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల కోడ్‌ చట్టం ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక జీతం (CTC) కంపెనీ ఖర్చులో 50% కంటే తక్కువ ఉండకూడదు. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ వేతనాన్ని తగ్గించి పై నుంచి ఎక్కువ అలవెన్సులు ఇస్తూ కంపెనీపై భారాన్ని తగ్గించుకుంటున్నాయి. దీంతో ఉద్యోగికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. బేసిక్ వేతనం తగ్గడంవల్ల   

కార్మికుడి రిటైర్మెంట్ తరువాత జీవన ఉపాధికి చెల్లించబడే  గ్రాట్యుటీ, పీఎఫ్‌, పెన్షన్ లు భారీగా తగ్గే అవకాశముంది. ఈ వేతనాల కోడ్ వల్ల కార్మికుడికి తీవ్ర నష్టమే తప్ప లాభం లేదు.

ఎందరో త్యాగాల ఫలితంగా  కొట్లాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి స్వస్తి చెప్తూ యాజమాన్యం కోరితే 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాలని, అం దుకు ఎలాంటి ఓటీ (ఓవర్‌ టైమ్‌) వేతనాలను చెల్లించాల్సిన అవసరం లేదని చట్టం పేర్కొన్నది.

అతి తక్కువ పెన్షన్ తో రిటైర్డ్ కార్మికుల జీవితం:

ప్రవేట్ రంగంలో 40 ఏళ్లు పనిచేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛను 2500 లోపే, అది కూడా 30000 జీతంతో పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛను. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటం వల్ల మనిషి జీవన వ్యయం పెరిగింది. పెన్షన్ మాత్రం పెరగటంలేదు. 2500 తో రిటైర్డ్ కార్మికులు ఏ విదంగా జీవనం కొనసాగించాలి?.ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేస్తే అతనికి సగం జీతం పెన్షన్ వస్తుంది. ఈ దేశ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన ప్రైవేట్ కార్మికుడికి మాత్రం 2500 పింఛన్. దేశంలోని ప్రజాప్రతినిధులు వారి జీతాలు మరియు పెన్షన్స్ పెంచుకుంటున్నారు తప్ప కార్మికులకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటు రంగంలోని కార్మికులకు సరైన పింఛను, కనీస వేతన పథకాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనావుంది. 

కరోనా కారణంగా పెరగని కార్మికుల జీతాలు:

కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరియు మానవాళిని విపత్తులోకి నెట్టింది. ఈ మహమ్మారిని నియంత్రించే ప్రయత్నంలో మన దేశంతో పాటు అనేక దేశాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువగా నష్టపోయిన రంగాల్లో పారిశ్రామిక రంగం ఒకటి. పరిశ్రమలకు ఐటీ సంస్థల లాగా ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించే వెసులుబాటు ఉండదు. దీంతో ఉత్పత్తితో పాటు లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా కారణంగా ఇప్పటికి కోలుకొని పరిశ్రమలున్నాయనే చెప్పొచ్చు. కరోనా ప్రభావం వల్ల నష్టాలలో ఉన్న పరిశ్రమలు కార్మికులకు ఏటా జీతాలు పెంచలేమని కొన్ని పరిశ్రమలు వెల్లడించాయి. అయితే కొన్ని లాభదాయక పరిశ్రమలు కూడా కరోనా ప్రభావం సాకుతో జీతాలు పెంచలేమని చెబుతూ కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కరోనా ప్రభావంతో పరిశ్రమలు కాకుండా కార్మికులు ఎక్కువగా నష్టపోయారన్నది నమ్మలేని నిజం. 

ఉద్యోగ విరమణ తర్వాత కూడా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి:

పారిశ్రామిక రంగాలలో పని చేసే కార్మికులకు ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తమకు వచ్చే జీతం తక్కువగా ఉండడంతో పిల్లలను చదివించేందుకు, కుటుంబ పోషణకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనుకోకుండా అనారోగ్య సమస్యలు ఎదురైతే కుటుంబ సభ్యులకు ఈఎస్ ఐ దిక్కు. వేరే మార్గం లేదు. ఉద్యోగం ఉన్నంత కాలం ఇఎస్‌ఐపైనే ఆధారపడుతున్నారు. ఇక రిటైర్మెంట్ తర్వాత కార్మికుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ అన్నీ తక్కువ, కార్మికుడు ఎలా బతకగలడు? కావున ప్రభుత్వం కార్మికుల గురించి ఆలోచించి పదవీ విరమణ తర్వాత కూడా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475











 






9, ఏప్రిల్ 2023, ఆదివారం

చీకటి పల్లెల్లో వెలుగులు నింపిన సూర్యుడు.

చీకటి పల్లెల్లో వెలుగులు నింపిన సూర్యుడు. 


ఏ సామాజిక ఉద్యమానికైనా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యూహాలు, ఆచరణ, నాయకత్వం మరియు సామాజిక అంగీకారాన్ని నిర్వహించే 

తత్వశాస్త్ర (తాత్విక సిద్ధాంతం) సూత్రాలను శాస్త్రీయ పద్ధతుల్లో వివరించిన గొప్ప ఉద్యమ నాయకుడు 'డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్'.


డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ అసమాన విద్యావేత్త, దళిత హక్కుల పోరాట యోధుడు, మేధావి, దార్శనికుడు, గొప్ప దేశభక్తుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు, పరిపాలన ప్రవీణుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రచయిత, భారత రత్న, న్యాయ నిపుణుడు, బహుభాషావేత్త, సామాజిక అసమానతలను రూపుమాపడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి. అంటరానితనం పై, అగ్రకుల దురహంకారం పై గొంతెత్తిన స్వరం. బడుగు బలహీన  వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు.


డా.బాబాసాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం.


 ఓటు హక్కు ప్రదాత:


ప్రజాస్వామ్య పౌరసత్వానికి ఓటు హక్కు అత్యంత ప్రాథమిక అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు సార్వత్రిక ఓటు హక్కును పొందలేదు.  సామాన్యులు తమపై ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారని ఉన్నత వర్గాలు భావించాయి. సార్వత్రిక ఓటు హక్కుకు అడ్డంకులు ప్రపంచంలోని అనేక దేశాల్లో, మహిళలు, ఆస్తి లేనివారు మరియు జాతి మైనారిటీలకు ఓటు హక్కు నిరాకరించబడింది. చరిత్రకారుడు అలెగ్జాండర్ KSR "ఓటు హక్కు" పుస్తకంలో పేర్కొన్న ప్రకారం, అమెరికాలో కూడా సార్వత్రిక ఓటు హక్కు అనేక ఉద్యమాల తర్వాత కూడా ప్రజలకు చేరలేదు.
అన్ని దేశాల్లాగే భారతదేశంలో కూడా మొదటగా అందరికీ ఓటు హక్కు లభించలేదు. పన్ను చెల్లించే వారికి మరియు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) సహా కొందరికి మాత్రమే ఓటు హక్కు ఉండేది.  ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన అంబేద్కర్ 1919లో సౌత్ బోరో కమిటీకి తన పిటిషన్‌లో "ప్రాతినిధ్య హక్కు మరియు రాజ్యాంగ హోదా హక్కు పౌర హక్కులలో అత్యంత ముఖ్యమైనవి పౌరసత్వం మరియు రాజకీయాల్లో సభ్యత్వం కోసం ఓటు హక్కు అని పేర్కొన్నాడు. ఓటు హక్కు వల్ల బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ చైతన్యాన్ని తెస్తుందన్నారు. ఇన్ని సంవత్సరాలుగా సామాజిక, రాజకీయ జీవితాల జోలికి వెళ్లని వారి విముక్తికి ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది. అంబేద్కర్ పేర్కొన్న ఈ రెండు అంశాలు భారత రాజ్యాంగం ఇచ్చిన సార్వత్రిక ఓటు హక్కుకు వెన్నెముక. అంబేద్కర్ 1930లో మరియు తరువాత రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ డిమాండ్‌ను లేవనెత్తడానికి తనకు అందుబాటులో ఉన్న ప్రతి వేదికను ఉపయోగించారు. ఓటు హక్కు అనేది స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యానికి అవసరమైన అంశం అనే అభిప్రాయాన్ని అంబేద్కర్ సృష్టించగలిగారు. 
నిరక్షరాస్యత ఆధారంగా ఓటు హక్కు కల్పించడాన్ని అంబేద్కర్ రాజ్యాంగ సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అగ్రనేతల సహాయంతో అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ప్రవేశపెట్టడం వల్ల  వర్గ, లింగ, కుల, కులాలకు అతీతంగా ప్రజలందరికీ ఓటు హక్కు లభిస్తుంది. ఈరోజు మనం ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నకుంటున్నామంటే ఇది అంబేద్కర్ కృషి ఫలితం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఓటు ప్రాముఖ్యతను గుర్తించి దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం మరియు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటే ఆధారం. ఓటును డబ్బుకు అమ్ముకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనే రెండక్షరాలు దేశ భవిష్యత్తుకి పునాది.

 పంచాయతీరాజ్ వ్యవస్థ :


భారత గణతంత్ర 70 ఏళ్ల సుదీర్ఘ పాలన లో పంచాయత్ రాజ్ వ్యవస్థ గొప్ప విజయం. ఢిల్లీ పాలన ను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్ లక్ష్యంతో ప్రారంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థ అనుకున్న లక్ష్యాలను చాలా వరకు సాధించింది. జనాభాలో సగం మంది మహిళలు మరియు ప్రస్తుతం 50% స్థానిక సంస్థలను పరిపాలిస్తున్నారు. గ్రామానికి దూరంగా..వివక్షతో జీవించే దళితులు కూడా అధికారంలో భాగమయ్యారు. ఇలా ఎన్నో విజయాలతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో వాటన్నింటినీ పరిష్కరించ గలిగితే భారత్ ప్రపంచంలోనే ఆదర్శవంతమైన దేశంగా రూపుదిద్దుకుంటుందనడంలో సందేహమే లేదు. ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయి వరకు విస్తరింప చేయడానికి, స్వపరిపాలన ద్వారా పంచాయతీ లను బలోపేతం చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.


 అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం:

1927లో మహద్‌లో అంటరానితనానికి వ్యతిరేకంగా మంచినీరు, దేవాలయాల ప్రవేశం కోసం పెద్ద ఎత్తున మంచినీటి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. 1927 డిసెంబర్ 25న తన వేలాది మంది అనుచరులతో కలిసి దేశంలో కుల వ్యవస్థకు పునాదులు వేసిన సామాజిక అసమానతలకు మూలమైన మనుస్మృతిని తగులబెట్టాడు. 1930లో 15,000 మంది వాలంటీర్ల సహాయంతో మిలటరీ బ్యాండ్ స్కౌట్ బృందం కాలారామ్ ఆలయ ఉద్యమాన్ని ప్రారంభించగా, మహిళలంతా క్రమశిక్షణగా ఈ ఉద్యమాన్ని చేసి తొలిసారిగా దేవుడిని దర్శించుకున్నారు. ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని చట్టపరంగా పూర్తిగా నిషేధించారు.

 భారత రాజ్యాంగ నిర్మాత:

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా మనం ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అనేక సాయుధ పోరాటాలు మరియు అహింసా పద్ధతిలో అనేక ఇతర ఉద్యమాల తరువాత, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆగష్టు 14, 1947 అర్ధరాత్రి, భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. అప్పుడు మనకు సమగ్రమైన, లిఖితపూర్వకమైన రాజ్యాంగం లేనందున, ఏ మార్గాన్ని అనుసరించాలనేది ప్రశ్నగా మారింది. అయితే నియంతృత్వమైనా, సైనిక పరిపాలన, సార్వభౌమాధికారమైనా, రాచరికమైనా.. స్వపరిపాలనపై అనేక ప్రశ్నలు తలెత్తాయి, వీటన్నింటికీ సమాధానమే భారత రాజ్యాంగం. జనవరి 26, 1950 న సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.     

అసమానతలు, అవమానాలు మరియు అన్యాయాలను ఎదుర్కొంటున్న అట్టడుగు కులాలు మరియు అణగారిన వర్గాల సామాజిక గౌరవం మరియు భద్రతకు ప్రధాన ప్రాతిపదిక అయిన భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ క్రియాశీల పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ఎంపికైన ఆయన, సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దుర్భర జీవితం గడిపిన వారికి అన్ని రకాల రక్షణ, భద్రత కల్పించారు.

కుటుంబ నేపథ్యం:

అంబేద్కర్ మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలోని అంబవాడే గ్రామంలో భీమాబాయి మరియు రాంజీ మలోజీ సక్వాల్ దంపతులకు 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అంబేద్కర్ తండ్రి భారత సైన్యంలో అధికారి. వారి ఇంటిపేరు "అంబవడేకర్". బ్రాహ్మణుడైన అతని గురువు మహదేవ్ అంబేద్కర్ అతనిపై అభిమానంతో అతని ఇంటి పేరును 'అంబవడేకర్' నుండి అతని ఇంటి పేరు అంబేద్కర్ గా మార్చారు ఆ పేరే ఆయనకు స్థిరనామమయింది.

 విద్యాబ్యాసం మరియు ఎదుర్కున్న సమస్యలు:

సమాజంలో నిమ్న కులం గా భావించే మహర్ (దళిత) కులంలో జన్మించిన అంబేద్కర్ బాల్యంలో అనేక అవమానాలను, ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో స్నేహభావంతో మెలగకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూలాన  కూర్చోబెట్టేవారు. మంచినీళ్లు తాగే సందర్భంలో కూడా అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో తనను ఇబ్బంది పెట్టిన సమాజంలో అందరికన్నా గొప్ప మేధావిగా, విద్యావంతునిగా ఎదగాలనే పట్టుదలతో రాత్రీ పగలు తేడాలేకుండా నిరంతరం చదువులోనే జీవితాన్ని గడిపిన అంబేద్కర్. తండ్రి రామ్‌జీ పదవీ విరమణ తరువాత   అంబేద్కర్ కుటుంబం సతారాకు వెళ్లి అక్కడ నివాసం ఉంది. అయితే కొంతకాలానికి తల్లి మరణించడంతో అంబేద్కర్ కుటుంబం ముంబైకి వలస వెళ్లింది.

  •  1907లో ముంబైలోని ఎల్‌ఫన్‌స్టోన్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యారు.
  • 1908లో అదే కాలేజీలో చేరి కాలేజీ విద్యను పూర్తిచేశారు.
  • 1912లో బాంబే యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు.
  • 1913 లో బరోడా మహారాజ్ అందించిన సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. అదే సమయంలో భారతదేశం వాణిజ్యం, భారతదేశంలోని మతాలు, పుట్టుపూర్వతరాలు అనే పరిశోధన వ్యాసాలు వ్రాసారు అంతేకాకుండా 'భారతదేశం జాతీయాదాయం చారిత్రక పరిశీలన' సిద్ధాంత గ్రంధం వ్రాసి పి. హెచ్. డి పట్టా పొందారు. ఆ తర్వాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అయ్యారు.
  • 1916లో లండన్ వెళ్లి ఎంఏ (నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ) పూర్తిచేయడమే కాకుండా ఎకానామిక్స్‌లో పీహెచ్‌డీ కూడా సంపాదించారు.
  • 1918లో ముంబైలోని సైదన్‌హమ్ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో పొలిటికల్ ఎకానమీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
  • 1921లో మాస్టర్ డిగ్రీని (ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్).
  • 1923లో ఎకనామిక్స్‌లో డీఎస్సీ పూర్తిచేశారు. ఆ తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన అంబేద్కర్ బరోడా సంస్థానం లో మిలిటరీ సెక్రటరీగా నియామకమయ్యారు. అయితే అతి తక్కువ కాలంలోనే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. చివరకు కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేశాడు.
  • 1952  లో ఎల్‌ఎల్‌డీ (కొలంబియా విశ్వవిద్యాలయం, గౌరవపట్టా) పొందారు.
  • 1953  లో డీ.లిట్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, గౌరవపట్టా) పొందారు.

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా.. తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీడిత వర్గాల విముక్తి, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475




1, ఏప్రిల్ 2023, శనివారం

అసమాన యోధుడు "కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా"

అసమాన యోధుడు "కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా"

"మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు.. కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేలా ఉండాలి" అబ్దుల్ కలాం చెప్పిన మాటలు ఎప్పటికీ నిజమే. 

ప్రతి ఒక్కరి పుట్టుక సాధారణమే కానీ కొందరి మరణం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది, చరిత్ర సృష్టిస్తుంది, వారి జ్ఞాపకాలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

ఆనాటి యోధుల త్యాగాల వల్ల ఈ రోజు భారతదేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు.

1971 భారత్‌ - పాక్‌ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర యోధుడు "కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా" స్ఫూర్తివంతమైన విజయగాథను ఒకసారి మననం చేసుకుని అతని దేశభక్తికి నివాళులర్పిద్దాం. 

"కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా" ​​1926 మే 15వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జన్మించారు. అతని తండ్రి, శ్రీ తేజ్ నారాయణ్ ముల్లా, హైకోర్టు న్యాయమూర్తి మరియు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అతని కుటుంబ సభ్యులందరూ న్యాయవాద వృత్తికి చెందిన వారు. మొదట్లో మహేంద్ర నాథ్ ముల్లా కూడా న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉండేది, అయితే అతను పెద్దయ్యాక అతని ఆసక్తి సాయుధ దళాల వైపు మళ్ళింది. 

20 సంవత్సరాల వయస్సులో, అతను ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత జనవరి 1946లో రాయల్ ఇండియన్ నేవీలో క్యాడెట్‌గా చేరాడు. అతను యునైటెడ్ కింగ్‌డమ్‌లో శిక్షణ పొందిన తరువాత తిరిగి మే 1, 1948 న రాయల్ ఇండియన్ నేవీలో నియమించబడ్డాడు. భారత నావికాదళంలో ఉన్నతాధికారులు ముల్లా ప్రతిభను గుర్తించి 16 సెప్టెంబర్ 1958న లెఫ్టినెంట్ కమాండర్‌గా పదోన్నతి కల్పించారు. ఆపై ఏప్రిల్ 1961లో ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC) వెల్లింగ్‌టన్‌కు ఎంపికయ్యారు. అతను 1964 జూన్ 30న కమాండర్ స్థాయి పదోన్నతి పొందారు. ఐఎన్‌ఎస్‌ కృష్ణాలో మూడేళ్లపాటు సేవలందించారు. కెప్టెన్ ముల్లా తన సేవా జీవితంలో నావికాదళ ప్రధాన కార్యాలయంలో ఆఫీసర్-ఇన్-చార్జ్ ఆఫ్ నేవల్ నియామకాలు, మూడు సంవత్సరాల పాటు లండన్‌లోని భారత హైకమిషనర్‌కు డిప్యూటీ నావల్ అడ్వైజర్ మరియు బొంబాయిలోని నేవల్ షోర్ స్థాపన ఐఎన్‌ఎస్ ఆంగ్రే యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వంటి అనేక ముఖ్యమైన నియామకాలను నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ప్లాన్స్‌లోని నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లో పదవీకాలం పాటు డిస్ట్రాయర్ INS రాణాకు కమాండింగ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశాడు. ఆ తరువాత  డిఫెన్స్ కౌన్సెల్‌గా నియమించబడ్డాడు. ఫిబ్రవరి 1971లో, అతను INS ఖుక్రీలో చేరి  కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 

1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో కెప్టెన్ ముల్లా INS ఖుక్రీ (F-149), INS కుతార్ (F-146) మరియు INS కిర్పాన్ (F-144) లకు ఫ్లోటిల్లా కమాండర్‌గా ఉన్నారు. ఉత్తర అరేబియా సముద్రంలో శత్రు జలాంతర్గాములను వేటాడడం మరియు తటస్థీకరించడం కొరకు ఈ మూడు జలాంతర్గాములను ఉపయోగించేవారు. 03 డిసెంబర్ 1971న డయ్యూ నౌకాశ్రయానికి సమీపంలో ఇండియన్ నేవల్ రేడియో డిటెక్షన్ పరికరాలు ఒక శత్రు జలాంతర్గామిని గుర్తించాయి. అదేసమయంలో INS కుతార్‌లో ఒక సాంకేతిక సమస్య ఏర్పడటంవలన డిసెంబర్ 05న దానిని తిరిగి నౌకాశ్రయానికి తీసుకెళ్లారు. ఆ తరువాత శత్రు జలాంతర్గామి ముప్పును ఎదుర్కొనడానికి  INS కిర్పాన్‌తో పాటు INS ఖుక్రీని పంపించారు. దురదృష్టవశాత్తూ డిసెంబర్ 9 వ తేదీ సాయంత్రం 20 :46 సమయంలో  టార్పెడోలను ప్రయోగించి పాకిస్థానీ జలాంతర్గామి PNS హంగూర్ INS ఖుక్రీ ని బలంగా ఢీ కొట్టడం వల్ల ఖుక్రీ లోపల రెండు భారీ పేలుళ్లు సంభవించాయి అందువల్ల వెనుకభాగం దగ్ధమైంది కెప్టెన్ ముల్లా నిమిషాల వ్యవధిలో పరిస్థితిని పరిశీలించి, ఒడనుండి లైఫ్ బోట్‌లు, తెప్పలు మరియు బోయ్‌లను సముద్రంలోకి విసిరేయమని అతను తన సెకండ్-ఇన్-కమాండ్‌ని ఆదేశించాడు,

INS ఖుక్రీ 176 మంది నావికులు మరియు 18 మంది అధికారులను మరియు ఓడ కెప్టెన్‌ను అరేబియా సముద్రంలో కొంత దూరం తీసుకెళ్లి నిమిషాల వ్యవధిలో మునిగిపోయింది. కానీ కెప్టెన్ ముల్లా అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు, అతను ప్రాణాపాయ స్థితిలో తన డ్యూటీ ని మరువకుండా వీలైనంత మందిని రక్షించడంలో గొప్ప సాహసం చేశారు. మొత్తం 67 మందిని రక్షించగలిగారు, ఇందులో 05 మంది అధికారులు, 01 మిడ్‌షిప్‌మ్యాన్ మరియు 61 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సంక్షోభ సమయంలో కెప్టెన్ ముల్లా యొక్క ధైర్యసాహసాలు నేవీ మరియు సాయుధ బలగాల మనోధైర్యాన్ని పెంచింది. 

కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లాకు భారత నౌకాదళం యొక్క మొదటి మరియు దేశం యొక్క రెండవ అత్యున్నత "శౌర్య పురస్కారం" లభించింది, 

అతని అద్భుతమైన ధైర్యం, నాయకత్వం మరియు అత్యున్నత త్యాగం కోసం "మహా వీర్ చక్ర". లభించింది. అంతేకాకుండా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను భారత నౌకాదళం డయ్యూలో స్మారక చిహ్నం తో సత్కరించింది.

 ముంబైలోని కొలాబాలోని నేవీ నగర్‌లో ఉన్న "కెప్టెన్ MN ముల్లా ఆడిటోరియం" అతని గౌరవార్ధం పేరు పెట్టబడింది.

28 జనవరి 2000న, ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, కెప్టెన్ ఎంఎన్ ముల్లాకు నివాళులు అర్పిస్తూ ఇండియా పోస్ట్ విడుదల చేసిన స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 

ఆయన త్యాగం మరువలేనిది :

ఓడ మునిగిన క్షణాలలో, కెప్టెన్ ముల్లా సులభంగా తనను తాను రక్షించుకోగలరు. కానీ తోటి సైనికులను కాపాడుకోవాలనే ఆలోచనతో దైర్యంగా తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా 67 మంది ప్రాణాలు రక్షించడమనేది అసాధారణమైన విషయం. కెప్టెన్ ముల్లా ధైర్యసాహసాలకు దేశంలోని ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాల్సిందే. 

ఈ వీరోచిత చర్యలో, కెప్టెన్ ముల్లా మనకు ఎలా జీవించాలో మాత్రమే కాకుండా, ఎలా చనిపోవాలి అనేది ఆయన మరణంతో మనకు తెలియజేయడం శోచనీయం.    

కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లా లాంటి సైనికులు మరణించడం ఈ దేశానికి తీరని లోటు. ఈ వీర యోధుని త్యాగాన్ని దేశం కృతజ్ఞతతో ఎప్పటికీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475






ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...