సమాజంలో నేటికీ డ్రైవర్ల వృత్తి కూలీలగానే పరిగణించబడుతుంది. వారు చేసే పని ఎంతో విలువైనది అయినా వారికీ సరైన జీతం, సరైన వసతి, గౌరవం, గుర్తింపు లభించకపోవడం బాధాకరమైన విషయం. డ్రైవర్ వృత్తి ప్రపంచంలో చాలా ప్రధానమైనవి. వీరు రాత్రి, పగలనక అహర్నిశలు శ్రమించిన కష్టానికి ఫలితం అంతంత మాత్రమే. ఈ వృత్తుల వారు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతాయని అతి కొద్దిమందికి తెలుసు. సమాజంలో చాలా కొద్ది మంది మాత్రమే తమ శ్రమను గుర్తించి శ్రమకు తక్కువ గౌరవం ఇస్తున్నారు.
డ్రైవర్ వృత్తి గురుంచి తెలుసుకుందాం:
విలాసవంతమైన భవనాలు, కోట్ల ఖరీదైన కార్లు ఉన్నపటికీ గౌరవం కోసం కొందరైతే, కొందరు నడపగలిగే సామర్థ్యం ఓపిక లేక, నిత్యం బిజీ గా ఉండే రాజకీయ ప్రముఖులు, ఉన్నత అధికారులు ఎంతోమంది నెలవారీ జీతంతో డ్రైవర్లుగా నియమించుకుంటారు. డ్రైవర్ అంటే ఒక కూలివాడుగా పరిగణిస్తారు తప్ప వారి శ్రమను గుర్తించారు. డ్రైవర్ అంటే ఒక కూలివాడు అనుకునే వారికీ డ్రైవర్ అనే పదానికి అసలు నిర్వచనం తెలియదని కూడా గమనించాలి. సమయానికి మనందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే దేవుడే నిజమైన డ్రైవర్. డ్రైవర్ కంటి మీద కునుకు లేకుండా ఎంతో నిబద్ధతతో మనల్ని గమ్యస్థానానికి తీసుకెళతాడు. అనివార్యమైన సంఘటన ఏదైనా జరిగిన మన ప్రాణాలకంటే ముందు తన ప్రాణాలను వదలడానికైనా సిద్దపడి ముందుండి నడుపుతాడు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే మా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న వాస్తవాన్ని మరిచిపోయి వారిని ఒక కూలీగానే చూడటం శోచనీయం. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు వంటి అనేక డ్రైవర్ సంబంధిత ప్రమాదాలు కనురెప్పపాటులో జరిగే ఘోర ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాము. మన కుటుంబ క్షేమం కోసం డ్రైవర్ తన కుటుంబానికి దూరమై అవసరమైతే మనతోపాటే ప్రాణాలర్పించడానికి వెనుకాడని డ్రైవర్ వృత్తి ఎంత ప్రధానమైనదో ఒకేసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు వారికి సరైన ఆహారం, నిద్ర, సరైన జీతం, అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేయాలి. డ్రైవర్ అంటే మన కుటుంబ సభ్యుడిగా చూడాలి. మనం తినే ఆహారమే తనకు పెట్టాలి. అంతే తప్ప కూలివాడుగా చూడరాదు. మనం నిత్యం వార్తలలో చూస్తూనేవుంటాం బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణం అయినా ప్రయాణికులు సురక్షితమని లేదా ప్రమాదం నుండి రక్షించిన డ్రైవర్ అని ఇలా ఎన్నో వార్తలు వస్తుంటాయి. బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో మనం నిద్రపోయినా ప్రశాంతంగా ఉంటూ తమ కర్తవ్యాన్ని నిర్వహించడం వల్ల మనమంతా క్షేమంగా ప్రయాణించడం గొప్ప విషయం. వారికి తగిన గౌరవం ఇవ్వాలి. అంతేకాకుండా అంబులెన్స్ వాహన డ్రైవర్లు కూడా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ చివరకు కూలి డ్రైవర్ గానే చూస్తాం. అంబులెన్స్ డ్రైవర్ అతివేగంతో నడపడంతో తన ప్రాణాలకు కూడా ప్రమాదమని తెలిసినప్పటికీ మన ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా బ్రతికిస్తాడన్న కృతజ్ఞత భావం కలిగినవారు అతితక్కువ మంది ఉంటారు.
డ్రైవర్ మృతి పట్ల కృతజ్ఞత భావం తెలిపిన "జవేరి పూనావాలా":
కరోనా వాక్సిన్లలో ఒకటైన కోవిషిల్డ్ కంపెనీ అధినేత ఆధార్ పూనావాలా సోదరుడు జవేరి పూనావాలా దగ్గర కారు డ్రైవర్ గా 30 సంవత్సరాలుగా పనిచేసిన గంగాదత్త అంటే జవేరి పూనావాలాకు అమితమైన ప్రేమ అయన అతన్ని డ్రైవర్ కాకుండా సొంత తమ్ముడిగా చూసుకునేవారు. ఒకరోజు జవేరి పూనావాలా ముంబై పర్యటనలో ఉండగా పూణే లో గంగాదత్త అకాలమరణం పొందారన్న విషయం తెలిసింది. వెంటనే అన్ని పనులు రద్దుచేసుకొని హుటాహుటిన పూణెకి చేరుకొని అంతిమ యాత్ర జరిగే సమయంలో గంగాదత్త నడిపిన కారు ను పూలతో అలంకరించి దానిలో పార్థివ దేహాన్నుంచి గంగాదత్త అంతిమ యాత్రను అయన నివాసం నుండి శ్మశానవాటిక వరకు స్వయంగా తాను కారు నడుపుకుంటూ తీసుకెళ్లారు.
ఇదే విషయాన్నీ ఆయనతో ప్రస్తావించగా అయన విషణ్ణ వదనంతో " గంగాదత్త నాకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందించారు. అందుకు ప్రతిగా నా కృతజ్ఞతను ఈ విధంగా వ్యక్తపరుచుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్న" అని అన్నారు.
డ్రైవర్ల సమస్యలెన్నో:
డ్రైవర్లకు సరైన జీతం లేదు, వారానికోసారి సెలవు లేదు, వైద్య బీమా లేదు, ఇఎస్‌ఐ లేదు, పిఎఫ్ లేదు. డ్రైవర్ అకాల మరణం పొందితే ఆ కుటుంబానికి బీమా లేదు.
చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న డ్రైవర్ల శ్రమను గుర్తించి న్యాయమైన వేతనం ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. ఓలా, ఉబర్, ఇతర క్యాబ్‌లను అనుమతించడం వల్ల చిన్న వాహనాల డ్రైవర్లకు సరైన గిరాకీ లేక ఫైనాన్షియర్ల వేధింపులు, రవాణా, పోలీసు శాఖల్లో అవినీతి, వేధింపులు ఇలా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రైవర్ల అభ్యున్నతికి తగిన చట్టాలు రూపొందించి డ్రైవర్లకు ఈఎస్ ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి