పథకాలు పబ్లిసిటీ కోసమా ప్రజల కోసమా?
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని పత్రికల్లో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవంలోకి వస్తే చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు తప్ప మరో పథకం అందడం లేదన్నది ముమ్మాటికీ నిజం.
అత్యధిక ఓటర్లున్న పద్మశాలీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు. "చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు" నానుడి నేటికీ నిజం. మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యమేలుతారు అన్నట్లుగా ప్రతిభావంతులు, తెలివైన పద్మశాలీల మౌనం వల్ల మానవతావాదం లేని వారు రాజ్యమేలుతున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడని నాయకుల వల్ల నేడు నేతన్నలు అత్యంత దయనీయ పరిస్థితి ని ఎదుర్కొంటున్నారన్నారు.
పద్మశాలి నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ వారి ఎదుగుదల కోసమే తప్ప చేనేత కార్మికుల చేయూత కోసం కాదన్నది ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి తెలిసిన విషయం. నాయకులు ఎన్నికల సమయానికి ఓటు బ్యాంకు గా పద్మశాలీలను ఉపయోగించుకుంటున్నారు తప్ప వారికి ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు అందించకపోవడం శోచనీయం. పద్మశాలీల మౌనమే నేడు చేనేత కార్మికుల శాపంగా మారింది. ఇకనైనా చేనేత కార్మికుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది.
ఫలితాలు ఇవ్వని పథకాలు:
1 . చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం నూలు రాయితీ, నేతన్నకు చేయూత తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గత కొన్ని నెలల క్రితం పేపర్లో వచ్చిన విషయం అందరికి తెలిసిందే. పేపర్ లో వచ్చే ప్రతి పథకం చేనేత కార్మికులకు అందుతుందని అనుకోవడం అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. నేతన్న బీమా పథకం ప్రస్తుతం అమలులో ఉందో లేదో కూడా చేనేత కార్మికులకు తెలియదంటే దీనిబట్టి అర్థం చేసుకోవాలి పథకాలు పబ్లిసిటీ కోసమే తప్ప పబ్లిక్ కోసం కాదు అనేది.
2 . ముద్ర పథకం:
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికుల అభ్యున్నతికి ముద్ర రుణాలు అందజేస్తున్నారు అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముద్ర లోన్ల ఊసే లేదు. ముద్ర లోన్లు ఉన్నాయన్న విషయం ప్రచారానికే పరిమితం అంతే తప్ప ఏ ఒక్కరు తీసుకున్నట్లు, ముద్ర లోన్స్ అమలులో ఉన్నట్లు కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అసలు ముద్రా రుణాలు ఉన్నాయా అనే సందేహం నెలకొంది.
3 . నేతన్న బీమా పథకం:
మరణించిన చేనేత కార్మికుల కుటుంబం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం "నేతన్న బీమా పథకం". ఏ కారణం చేతనైనా 18-59 సంవత్సరాల వయస్సు గల నేత కార్మికులు మరణిస్తే 10 రోజుల్లోగా నామినీకి ఎల్‌ఐసి నుండి 5 లక్షల బీమా పరిహారం అందించేలా పథకం రూపొందించబడింది. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 2022 ఆగస్టు 8 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి చేనేత కార్మికులు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ పథకాన్ని ప్రెవేశపెట్టినందుకు ఎంతో సంతోషించిన చేనేత కార్మికులకు ఈ పథకం అందని ద్రాక్షలాగే మిగిలింది. అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి అనేక మంది చేనేత కార్మికులు మరణించగా, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందజేసినట్లు ఎక్కడ సమాచారం లేదు. బ్రతికుండగా సరైన పథకాలు లేవు మరణించిన తర్వాత కూడా నేతన్న బీమా పథకం లేదు. ఈ పథకాన్ని ప్రారంభించి చేనేత కార్మికులకు నగదు అందజేయడంలో విఫలం కావడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర కులాలకు ఇస్తున్నారు తప్ప చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకం అందకపోవడం శోచనీయం.
4 . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉచితంగా మగ్గాలు అందించిన మాట వాస్తవం. మరి మన రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉచిత మగ్గాలు ఏవి? వాటి స్థానంలో ఇంకేమైనా ఇచ్చారా అది లేదు. అది చేస్తాం ఇది చేస్తాం అనడమే తప్ప ఏమి ప్రయోజనం లేదు.
5 . బీసీ కులాలందరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ఆశ చూపి చివరి దశలో 15 కులాలకు మాత్రమే వర్తిస్తుంది అని పేపర్ ప్రకటన చేయడం తీవ్ర బాధను కలిగించింది. ఈ పథకం కోసం ప్రతి చేనేత కార్మికుడు 4 రోజులు పని చెడగొట్టుకొని మండలం ఎం ఆర్ ఓ ఆఫీస్, మీ సేవల చుట్టూ తిరిగి అలసిపోయిన చేనేత కార్మికులు ప్రకటన చేయడం వరకే పరిమితమైన పథకాలు మాకొద్దు అంటూ చేతి వృత్తుల అభివృద్ధికి పాటు పడే ప్రభుత్వాన్ని ఈసారి ఎన్నుకుంటామని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు..
నేతన్నకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ముడిసరుకు కొనుగోలు చేసేందుకు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తోందని, దీంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామాల్లోని నేత కార్మికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వాస్పత్రులు, పాఠశాలలో యూనిఫాం దుస్తుల కోసం చేనేత కార్మికులు నేసిన గుడ్డను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.
50 సంవత్సరాలు పైబడిన ప్రతి చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్ 2000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం అతి కొద్దిమందికి ఇస్తూ మిగతా వారికి ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో జి ఐ టాగ్ నమోదు కానీ చేనేత కార్మికులు ఎంతో మంది ఉన్నారు. వారికి జి ఐ టాగ్ లేనందున పెన్షన్ పొందలేకపోతున్నారు వారు జి ఐ టాగ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం.
అత్యధిక ఓటర్లు పద్మశాలీలకు నాయకులు ఎలక్షన్ సమయంలో ఎదో ఒక ఆశ చూపి ఓట్లు వేయించుకునుడు ప్రతి ఎలక్షన్స్ సమయంలో జరిగేదే. నాయకులు ప్రతిసారి పద్మశాలీలను మోసం చేయడం వారి ఓట్ల ద్వారా గెలుపొందడం ఆ తరువాత వారికి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు ఇవ్వకపోవడం సిగ్గు చేటు. అంతేకాదు పద్మశాలీలు రాజకీయంగా ఎదగకుండా ఎలాంటి పదవి అవకాశాలు కల్పించకుండా అణిచివేతకు గురిచేస్తున్నారు.
చేనేత కార్మికులందరూ ఐక్యతగా పోరాడి తమ హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత కార్మికుడికి ఉంది.
ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొని అండగా నిలవాలి.
వ్యాసకర్త.
జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం
ప్రధాన కార్యదర్శి
కోట దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి