22, జులై 2023, శనివారం

మట్టి మనిషి "భాను చందర్ చెలిమిళ్ళ"

మట్టి మనిషి "భాను చందర్ చెలిమిళ్ళ"

పూర్వం ప్రజలు వ్యవసాయం మరియు చేతి వృత్తుల పైనే ఆధారపడి జీవించేవారని మనందరికీ తెలుసు. మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, కొన్ని వృత్తులు కనుమరుగవుతున్నాయి మరియు వాటి స్థానంలో కొత్త పద్ధతులు కనుగొనబడుతున్నాయి. కనుమరుగవుతున్న చేతివృత్తులలో కుమ్మరి వృత్తి ఒకటి.
కుమ్మరి మట్టితో ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసి మానవ జాతికి తొలి సాధనాన్ని అందించడమే కాక దానిని నిత్యావసర వస్తువుగా మార్చిన ఘనత కుమ్మరి కే దక్కుతుంది. గతంలో ఈ వృత్తి కి ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ నేడు ప్రాధాన్యత తగ్గిపోవడంతో కుమ్మరి వృత్తి ని వదిలి అనేక కుటుంబాలు ఇతర పనులు చేసుకుంటుండగా మరికొందరు కుమ్మరి వృత్తి నే నమ్ముకుని దిన దిన గండంగా బతుకీడుస్తున్నారు.

"మన్నును నమ్ముకున్నోడు ఏనాటికి చెడిపోడు" అనే నానుడి నిజం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన తాత, తండ్రి చేసే కుమ్మరి వృత్తినే వారసత్వ సంపదగా పుణికిపుచ్చుకుని నేర్చుకున్నాడు. కుమ్మరి వృత్తి అంతరించిపోతున్నప్పటికీ మన్ను నే నమ్ముకుని  వృత్తి ని బతికించడం కోసం బతుకీడుస్తున్న "భాను చందర్ ప్రజాపతి చెలిమిళ్ళ" నిజ జీవిత గాథ ఎందరికో ఆదర్శం.

జననం, విద్యాభ్యాసం:

హైదరాబాద్‌లోని చార్మినార్‌, రెయిన్‌ బజార్‌ కుమార్‌వాడి కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన చెలిమిళ్ళ యాదయ్య మరియు నర్సమ్మ దంపతులకు 23.05.1991 న జన్మించారు. తన చిన్ననాటి నుండి తండ్రి పడుతున్న కష్టాలు చూసి తండ్రికి సాయం చేస్తూ వృత్తిని నేర్చుకోగలిగాడు. భాను చందర్ పదేళ్ల వయసులో తండ్రి అనారోగ్య కారణాలతో ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కుటుంబ పోషణ కోసం ఆరో తరగతి మధ్యలోనే చదువు మానుకొని భాను చందర్ తన తండ్రి వృత్తిని అనుసరించడం ప్రారంభించాడు.

మానవజాతి మనుగడకు మట్టి కుండ మరువలేని సేవలందించింది.

మానవజాతి మనుగడకు మట్టి కుండ ఎంతో మేలు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే కాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా సేవలందించిన మట్టి కుండ మాయమవుతుండటం బాధాకరమైన విషయం. ఎప్పుడైతే మార్కెట్లోకి ఫ్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటు పడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు. అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారు చేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్లలో నివసించే వారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాల్లో సైతం పెంకుటిళ్ళు అంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్లాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులో నుంచి తామే స్వయంగా మట్టి తెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈ రోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినా సరే వృత్తి పై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండటం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల పై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

ఎంతో కళానైపుణ్యం తో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపుతో వెలవెల బోతోంది. కాలచక్రం తో పోటీ పడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.

మట్టి కోసం ఎన్నో ప్రయత్నాలు:  

గతంలో ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు తప్పనిసరిగా ఉండేవి. ఆ రోజుల్లో కుమ్మరికి కుండ తయారీకి ఎలాంటి ఖర్చు లేకుండా గ్రామ సమీపంలోని చెరువుల్లో ఒండ్రుమట్టి దొరికేది. ఎండా కాలంలో చెరువుల నుంచి ఒండ్రుమట్టిని సేకరించి కుండను తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి, ఆ మట్టిని నీటితో తడిపి కాళ్లతో మట్టిని మెల్లగా తొక్కి ముద్దలుగా చేసి ఎంతో ఓపికతో కుండను తయారు చేస్తారు. ఆ తర్వాత కుండను కాల్చడానికి కూడా అనేక పద్ధతులు ఉపయోగిస్తారు. ఎంతో ఓర్పు మరియు నైపుణ్యం లేనిదే కుండ తయారు చేయడం అసాధ్యం. ఎంతో శ్రమకోర్చి తయారు చేసిన మట్టి కుండ మానవాళికి తొలి వస్తువుగా ఉపయోగపడడం గొప్ప విషయం.

కానీ నేడు ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురై మట్టి కోసం కుమ్మరి అల్లాడుతుండటం బాధాకరమైన విషయం. ఒకప్పుడు ఉచితంగా లభించే మట్టి నేడు అందుబాటులో లేదు. మరికొందరు సుదూర ప్రాంతాల నుంచి మట్టిని కొనుగోలు చేసి కుండలు తయారు చేసిన గిట్టుబాటు ధర లేక కుటుంబాన్ని పోషించుకోలేక కుమ్మరి వృత్తికి దూరమవుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ఉంటున్న భాను చందర్.. తాను నమ్ముకుని బతుకుతున్న వృత్తినే కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. భాను చందర్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ వృత్తి పూర్తిగా అంతరించి పోకుండా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

భాను చందర్ కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా, అనేకమంది ఆధునిక పరికరాలు, ఆధునిక యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ మట్టి కుండ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో భాను చందర్ నగరంలో పలుచోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు. మట్టి కుండ మానవ ఆరోగ్యానికి మంచిదని, మట్టి కుండను ఉపయోగించకపోవడం వల్ల మానవుడు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని అందరికీ వివరిస్తున్నారు. అంతేకాకుండా, అతని కుండ తయారీని చూసి చాలా మంది ప్రముఖులు, నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ తారల చే ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్లాస్టిక్ వాడకం వద్దు. మట్టి కుండలు ముద్దు.

ప్లాస్టిక్ వస్తువులు అత్యంత అందంగాను, కళ్లు చెదిరే రంగులతో మరియు అత్యంత చౌకగా చౌకగా ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. విచక్షణా రహితంగా రసాయనాలు వాడడం, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్ వస్తువులను విపరీతంగా వాడడంతో పర్యావరణం ప్రశ్నార్థకంగా మారింది. ఇలాగే కొనసాగితే భావి తరాలు అనారోగ్యకరమైన సమాజంలో జీవించాల్సి వస్తుంది.

పూర్వం మట్టి కుండలో ఆహారాన్ని వండుకుని తినే వారు. కాబట్టి వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అంతే కాకుండా మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చల్లటి నీళ్ల కోసం ఫ్రిజ్, వాటర్ ప్యూరిఫైయర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులలో నీటిని నిల్వ ఉంచుకుని తాగే బదులు మట్టి కుండలో నీటిని నిల్వ చేసుకుంటే సహజంగా చల్లబడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని ప్లాస్టిక్ ను నిషేధించి మట్టి కుండలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

కుమ్మరి వృత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందించాలి.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ''స్వదేశీ ఉత్పత్తుల'' అభివృద్ధికి, గ్రామీణ వృత్తుల ఆధునికీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో విఫలమైంది అనడంలో సందేహం లేదు. కుమ్మరి వృత్తి డిమాండ్ తగ్గడంతో గ్రామీణ వృత్తులపై ఆధారపడిన కార్మికులు ఈ వృత్తిని వదులుకుని పట్టణాలకు వలస వెళ్లి లేబర్ మార్కెట్‌లో రోజువారీ కూలీలుగా ఎక్కువ గంటలు పని చేస్తూ తక్కువ వేతనాలు పొందుతూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు.

భాను చందర్ ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కిన్నెర కళాకారులు అంతరించిపోతున్న తరుణంలో కళనే నమ్ముకుని బతుకీడుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య కు భారత ప్రభుత్వం 2022 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించడం గొప్ప విషయం. అలాగే అంతరించిపోతున్న కుమ్మరి వృత్తి కళాకారులను కూడా ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయం. కుండ విశిష్టతను తెలియజేస్తూ కళను బతికిస్తున్న భాను చందర్ లాంటి వారిని ప్రభుత్వం సత్కరించి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...