12, జులై 2023, బుధవారం

దైర్యసాహస వీరుడి కథ.

భగవంతుడు ఎలా ఉంటారో మనం చూడలేము, ఆపదలో మనకు సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ, ఆపదలో మనకు సహాయం చేసే వారు భగవంతుని తో సమానం అనేది నిజం.

ప్రజలకు సహాయం చేయాలనుకునే వారికి డబ్బు అవసరం లేదు. మనసుంటే చాలు.

మనసుంటే మార్గాలెన్నో అన్నట్లుగా సాటి మనిషికి సాయం చేయాలనే మానవత్వం, తపన ఉంటే ఎలాగైనా చేయగలడు. సాటి మనిషికి సహాయం చేయలేని మనిషి జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. అయినా సాటిమనిషికి సహాయం చేయలేని స్వార్ధపరులెందరో.

సాటి మనిషి చనిపోయే స్థితిలో ఉన్నా సహాయం చేయాలనే చలనం లేని వారెందరో. 

అత్యవసర పరిస్థితుల్లో, సాధారణంగా నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో అంబులెన్స్‌లకు దారి ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాలను రక్షించడం మనందరి కర్తవ్యం. కొన్ని సందర్భాల్లో అంబులెన్సుకు దారి ఇవ్వాలనే అవగాహన లేని వారి కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అంబులెన్స్ వాహనాలకు దారి ఇవ్వడం చాలా కష్టమైన పని. అలాంటి సందర్భాలలో ట్రాఫిక్ పోలీసులు మరియు మానవత్వం ఉన్నవారు ధైర్యసాహసాలతో  తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మార్గనిర్దేశం చేసే స్పూర్తిదాయకమైన ప్రాణదాతలు ఎందరో ఉన్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన 12 ఏళ్ల బాలుడు వెంకటేష్ అనే ధైర్య సాహస వీరుడి కథ.

వెంకటేష్ కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా హిరేరాయనకుంపి గ్రామానికి చెందినవాడు. హిరేరాయనకుంపేలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. వెంకటేష్‌కి స్నేహితులతో సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం. వెంకటేష్ తన స్నేహితులతో కలిసి తరచూ హిరేరాయనకుంపి లోని వాగు పరిసర ప్రాంతాల్లో ఆదుకునేవాడు. అలా స్నేహితులతో కాలక్షేపం చేస్తూనే తల్లిదండ్రులకు సహాయపడుతుండేవాడు. ఆగస్టు 2019లో, వరదల కారణంగా వాగు పరిసర ప్రాంతాలు నీట మునిగి, నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న వంతెన నీట మునిగింది. యాద్గిర్ జిల్లా వడగెర తాలూకాలోని మాచనూర్ గ్రామానికి అంబులెన్స్ డ్రైవర్ ఆరుగురు పిల్లలతో పాటు మహిళ మృతదేహాన్ని తీసుకెళ్తున్నాడు. బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తున్న నీరు కారణంగా అంబులెన్స్ మునిగిపోయిన వంతెన వద్ద ఆగిపోయింది.డ్రైవర్ సహాయం కోసం సమీపంలో ఆడుకుంటున్న పిల్లల గుంపు ను పిలిపించి, వంతెనపై మార్గం సరైనదని తెలుసుకొని  అంబులెన్స్‌కు మార్గం చూపించమని అడిగాడు. అప్పుడు అక్కడున్న పిల్లలు ఎవరు ఆ సాహసం చేయమని చెప్పారు. వెంటనే వెంకటేష్ నేను దారి చూపిస్తాను అంటూ ధైర్యంగా ముందుకు వచ్చాడు. వెంకటేష్‌ స్నేహితులు అతడ్ని హెచ్చరించినా వినకుండా, డ్రైవర్‌ని అనుసరించమని కోరాడు. అంతటా పారుతున్న నీరు కారణంగా దారి కనిపించని పరిస్థితి, వెంకటేష్ బ్రిడ్జి పై తరుచుగా ఆడుకునే వాడు కావడం వల్ల బ్రిడ్జిపై దారి సులభంగా కనిపెట్టగలను అనే నమ్మకంతో ఆ డ్రైవర్ కి సూచనలిస్తూ మెడ లోతు ప్రవహిస్తున్న నీటిలో ముందుకు అడుగులేస్తూ సాహసోపేతమైన ధైర్యంతో అంబులెన్స్ కి మార్గనిర్దేశం చేయగలిగాడు. దారి చూపిన సాహస  వీరుడికి డ్రైవర్ కృతజ్ఞతాభావం తెలిపారు. 

అంతేకాకుండా వెంకటేష్ 10 ఏళ్ల వయసులో నది ప్రవాహం లో పడిపోయిన మహిళను రక్షించి ప్రాణాలు కాపాడాడు. అతి చిన్న వయసులోనే సాహసోపేతమైన విన్యాసాలు చేసినవారిని చూస్తుంటాము కానీ ప్రాణాలకు తెగించి ప్రాణాలను రక్షించే వారిని చూడటం అరుదు.   

ధైర్య సాహసాలకు "జాతీయ శౌర్య పురస్కారం":

వరదలున్న ప్రాంతంలో అంబులెన్స్‌కి మార్గనిర్దేశం చేయడం అంటే మామూలు విషయం కాదు అనే విషయం మనందరికీ తెలిసిందే. అంబులెన్స్ సజావుగా వెళ్లేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అంబులెన్స్ కి దారి ఇవ్వడం నిజంగా వెంకటేష్ ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంబులెన్స్‌కు మార్గనిర్దేశం చేస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో పాటు బాలుడి ధైర్యసాహసాలు జాతీయ వార్తగా మారడమే కాకుండా, ప్రశంసలు వెల్లువెత్తాయి. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా పిల్లలకు కేంద్ర ప్రభుత్వం సాహస పురస్కారాలను అందజేస్తోంది.

సహాయం, సాహసం చేయడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన వెంకటేష్ ని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అతని ధైర్య సాహసాలకు గుర్తింపుగా 26 జనవరి 2020 , న్యూ ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ (ICCW) ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి చేతులమీదుగా జాతీయ శౌర్య పురస్కారాన్ని అందజేశారు. 

బాలలకు ప్రదానం చేసిన సాహస పురస్కారాల అవార్డులు వారికి ప్రత్యేక గుర్తింపును తేవడమే కాకుండా వారి నైపుణ్యాన్ని వెలికితీస్తుంది. వారు సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు.  

విద్యార్థుల్లో మానవీయ విలువలు పెరిగేలా ప్రోత్సహించాలి.

పిల్లలలో ప్రతి ఒక్కరికి సృజనాత్మకత ఉంటుంది. వారికి సరైన ప్రోత్సాహం లభిస్తే సృజనాత్మకత మరింత పెరిగి అవధులు లేని ఆవిష్కరణలు చేస్తారు. పిల్లల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల శిక్షణ అవసరం. ప్రస్తుతం విద్యార్థి తన పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పాఠ్యపుస్తకంలోని పాఠాలకే పరిమితమై, సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై అవగాహన ఉండటం లేదు. పాఠశాల స్థాయిలో, ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజంలో మానవతా విలువలపై సరైన అవగాహన కల్పించి, ఇతరులకు సహాయపడే కార్యక్రమాలను నిర్వహించాలి. అప్పుడే విద్యార్థుల్లో మానవీయ విలువలు పెరిగి నవ సమాజ నిర్మాణానికి పునాదులు పడతాయి. పిల్లలు వారికి తెలియకుండానే కొన్ని చెడు అలవాట్లకు గురవుతుంటారు అలా జరగకుండా వారిపై తల్లిదండ్రులు, గురువుల పర్యవేక్షణ తప్పనిసరి. తల్లిదండ్రులు పిల్లలలో ధైర్యాన్నిచ్చే సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కుటుంబ సమస్యలపై కాకుండా సమాజంలోని సమస్యలపై అవగాహన కల్పిస్తే పిల్లలలో సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకు వెంకటేష్ లాంటి ధైర్య సాహస వీరుడి వంటి స్టోరీస్ తెలియజేయడం ద్వారా వారిలో కొంతైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థి ధైర్యసాహసాలు చేయడానికి వెనకడుగు వేయకుండా ముందుకు సాగేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలి.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475  

 





  

కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...