మా ఓట్లు మాకే,
మా వాటా మాకే.
సిరా చుక్క మౌనం వహిస్తే . మందు చుక్క రాజ్యం ఏలుతుంది అన్నట్లుగా. బీసీ కులాలు మౌనం పాటించడం వల్లే అగ్రకులాల వారు రాజ్యం ఏలుతున్నారన్న విషయం జగమెరిగిన సత్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఇప్పటికి బి సి కుల గణన కలగానే మిగిలిపోయింది. స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపునిచ్చిన బీసీ కులాలకు రాజ్యాధికారం కలగానే మిగిలిపోయింది. దేశ జనాభాలో 75 శాతం బి సి వారు ఉండగా వారికి సరైన రాజ్యాధికారం లేకపోవడం శోచనీయం.
మన దేశంలో 1931లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది, ఆ సమయంలో మన దేశానికి అన్ని అధికారాలు లేవు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రతి పదేళ్లకోసారి జనాభా గణన చేపట్టాలని అంగీకరించారు. జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతుండగా కుల గణన అంశం చర్చకు రాకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. షేడ్యూల్డ్ కులాలు, షేడ్యూల్డ్ తెగల జనగణన సేకరణ చేపడుతున్నారు తప్ప 70 యేండ్లు గడిచిన నేటికీ బి సి కుల గణన చేపట్టడం లేదు. బీసీ కులాల గణన వివరాలు చేపట్టాలని సుప్రీం కోర్టు, బీసీ కమిషన్ ఎన్నోసార్లు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాప్యం చేస్తున్నాయన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బి సి కుల గణన వివరాలు చేపట్టక పోవడానికి బలమైన కారణమేంటో ప్రతి బీసీ ఓటరు తెలుసుకోవాలి. మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికార వ్యవస్థలు, పార్లమెంట్ వ్యవస్థలు మరియు అసెంబ్లీ, కమిషన్ అనేక రాజకీయ పార్టీల కార్యవిర్వాహక శాఖలలో పనిచేస్తున్న వారు ఎంత శాతం? అందులో బి సి ల శాతం ఎంత? రాజకీయ నాయకులలో అత్యధిక శాతం పదవులు అనుభవించే వారి శాతం ఎంత? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ జనాభాలో 75 శాతం మంది బీసీ కులాలకు చెందిన వారు. కానీ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న వారిలో 75 శాతం మంది అగ్రవర్ణాలకు చెందినవారే కావడం మరింత బాధాకరం. అగ్రవర్ణాలు శాశ్వతంగా పాలించేలా బీసీ కులాలను అణిచివేతకు గురిచేస్తున్నారనడంలో సందేహం లేదు.
జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ కులాల వారీగా లెక్కలు తీయడం వల్ల వారికీ సరైన రిజర్వేషన్లు దక్కుతున్నాయి. బి సి కులాలవారీగా ఎలాంటి లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్ల వాటా శాతం కోల్పోవాల్సి వస్తుందనేది ముమ్మాటికీ నిజం. అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ సరి మేము గెలిస్తే బిసి లకు రాజ్యాధికారం ఇస్తామని మురిపించి ఓట్లు దండుకుంటున్నారు తప్ప బిసి లకు ఎలాంటి అధికారాలు ఇవ్వడం లేదు.
తెలంగాణలో బి సి లకు ప్రాధాన్యత కరువు:
పద్మశాలీయులకు రాజ్యాధికారంలో మొండిచేయి:
భారతదేశంలో ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న పద్మశాలీయులు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో సుమారు 2 కోట్ల 20 లక్షల మంది ఉన్నారు. పద్మశాలి సంఘం గణాంకాల ప్రకారం ఒక్క తెలంగాణలోనే 22 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇది అనధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. అధికారిక లెక్కల ప్రకారం 23 లక్షల మంది ఓటర్లు ఉంటారు. నేటికీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న పద్మశాలి రాజకీయంగా ఎదగలేక పోవడం బాధాకరం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సత్తా ఒక్క పద్మశాలికే ఉందంటే అతిశయోక్తి కాదు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నేతలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా అగ్రకుల నాయకుల ఎత్తుగడలకు ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం పద్మశాలీల కుల సంఘాలను విచ్చిన్నం చేసి వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప రాజకీయంగా ఎదగకుండా అణచివేశారు. ప్రత్యేక తెలంగాణ సాదించుకుంటే రాజకీయంగా ఎదుగుతామని భావించిన పద్మశాలీయులకు 9 ఏళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. పద్మశాలి వర్గంలో ఉన్న మేధావులు, విద్యావంతులు, యువకులు బానిస బ్రతుకు బ్రతికే కన్నా పోరాడితే పోయేది ఏమి లేదని రాజ్యాధికార సాధన కొరకు మరియు 2023 ఎలక్షన్ లో పద్మశాలీయుల సత్తా చాటడం కోసం కుల సంఘాల్లాంటిని ఒకే వేదిక గా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ఈసారి అయినా అగ్రవర్ణాల నాయకులు పద్మశాలీయులను రాజకీయంగా ఎదగనిస్తారా లేదా అనేది ఎదురుచూడాల్సిన అవసరం ఉంది.
రజకులకు రాజ్యాధికారంలో మొండిచేయి:
తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలో ఇతర కుల వృత్తుల వారితో పాటు రజకులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రదర్శించి రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారు. సభ్య సమాజానికి రజకులు చేసిన సేవలు మరువలేనివి. దేశ సేవకులైన రజకులను బానిసలుగా మార్చిన పాపం అగ్రకుల నాయకులదే. ఆటు రాజ్యాధికారంలోను, మిగతా అన్నింటిలో సరైన గుర్తింపు ఇవ్వకుండా వారిని కేవలం ఓటు బ్యాంకు గానే వినియోగించుకున్నారు తప్ప వారికి ఎలాంటి ప్రయోజనాత్మకమైన పథకాలు గానీ ప్రాధాన్యత గానీ ఇవ్వడంలేదు. ప్రతి రజకుడి ఇంటికి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి యేండ్లు గడిచిన ఇప్పటికి పూర్తి స్థాయిలో అమలుకాలేదని రజక సంఘాలు వాపోతున్నాయి. ఎంతో కస్టపడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదని తమ హక్కుల పరిరక్షణ కొరకు రజక సంఘాలు కూడా రాజ్యాధికారం కోసం రాజకీయ యుద్ధ భేరీ సమావేశాలు నిర్వహించాలని కోరుకుంటున్నాయి. 2023 ఎలక్షన్ లో రాజ్యాధికార దిశ గా ముందుకు అడుగులువేయాలని భావిస్తున్నారు..
రాజ్యాధికారమే లక్ష్యంగా కుమ్మరివృతి సంఘాలు:
పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్, ప్లాస్టిక్, జర్మన్ సిల్వర్ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది ప్రభుత్వాల చేయూత లేక చేతి వృత్తులు కనుమరుగవుతుంటే కనీసం వారికి సరైన ఉపాధి హామీ కల్పించలేని పరిస్థితి. కుమ్మరి వృత్తికి ఎలాంటి పథకాలు లేకపోవడం శోచనీయం. కుమ్మరి వృత్తిదారులు మాకు అన్నిటిలోను అన్యాయమే జరిగిదంటూ మా హక్కులు మాకు కావాలంటూ రాజ్యాధికార దిశగా అడుగులువేస్తున్నారు. కుమ్మరి సంఘాలు ఏక తాటిపై నడవాలని భావిస్తున్నాయి.
రాజ్యాధికారమే లక్ష్యంగా గౌడ సంఘాలు:
నేడు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో లిక్కర్,బీర్, బ్రాంది, విస్కీ, రమ్ము, శీతల పానియాలు (థమ్స్ అప్, కోకోకొలా, స్పైట్, మాజా) అనేకం రావటం వలన కల్లు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అందు ఫలితంగా దీనిపై ఆధారపడ్డ లక్షలాదిమంది గీతకార్మికుల బ్రతుకులు ప్రశ్నార్థకంగామారుతున్నాయి. అందుకు కారణం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు శీతల పానీయాలమీద పత్రికలు,టీవీ లలో గుప్పించి ఆకట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కల్లు ఆరోగ్యానికి ఏ విధమైన మేలుచేస్తుందో ప్రజలకు అడ్వర్ టైజ్‌మెంటుల రూపంలో చెప్పకపోవడం ఇందుకు ముఖ్యకారణం అనే చెప్పాలి. నేటియువత మద్యానికిఇచ్చిన ప్రాధాన్యత కల్లుకు ఇవ్వక పోగా దానిని చులకన చేసి చూడటం అత్యంత బాధాకరమైన విషయం. అంతేగాక వ్యవసాయం వంటి ఇతర రంగాల్లో అభివృద్ధి సాదించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిలో ఎలాంటి ఆధునిక పద్ధతులను, విధానాలను తీసుకురాకపోవడంతో ఆ వృత్తి దెబ్బతింటోంది. ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ గౌడన్న తన సంప్రదాయ వృత్తిని బ్రతికించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. కల్లుగీత కార్మికుల పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గౌడాన్న చెట్టుపైనుండి పడి చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం అందచేయటం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ మేము బ్రతుకున్నపుడే మంచి మార్గాన్ని చూపే పథకాలుంటే బాగుంటుంది అనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2023 ఎలక్షన్ లో రాజ్యాధికార దిశ గా ముందుకు అడుగులువేయాలని భావిస్తున్నారు..
తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న బీసీ కులాలు తమ అస్తిత్వాన్ని పక్కనపెట్టి ఎలాంటి స్వార్థం లేకుండా చిత్తశుద్ధితో ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక ధోరణి అవలంబిస్తూ వచ్చింది. బి సి లకు టిక్కెట్ల పంపకం లో కూడా పూర్తి వ్యతిరేకత చూపింది.
గుర్తింపు నోచుకోని నాయి బ్రాహ్మణుల వృత్తి:
2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల నాయీ బ్రాహ్మణుల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హెయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు అద్దె మరియు కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో "అర్బన్ క్లాప్" లాంటి పలు సంస్థలు ఉనికి లోకి రావడంతో ఈ వృత్తే జీవనం సాగించే సాధారణ నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కులవృత్తులు కనుమరుగైపోయినా.. వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా కులవృత్తులనే నమ్ముకుని అరకొర సంపాదనతో సాధారణ జీవితాలను నెట్టుకొచ్చే బడుగు జీవులతోబడా కార్పోరేట్ సంస్థలు పోటీ పడి వారి నోటి ముందు కూడును లాక్కోవడం అత్యంత శోచనీయం. ఇతర వృత్తి రాక, వంశపారంపర్య వృత్తిపై మమకారం చంపుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనోవేదనకు గురవుతుండగా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు నాయీ బ్రాహ్మణులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్ని “బంగారు తెలంగాణ” గా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి నాయీ బ్రాహ్మణులు చేస్తున్న సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
మా ఓట్లు మా వాళ్ళకే, మా వాటా మాకే:
మా ఓట్లు మాకే, మా సీట్లు మాకే అనే నినాదంతో బీసీ సంఘాలన్నీ ఏకం కావడానికి సిద్ధపడుతున్నాయి.
అగ్రవర్ణాల ఆధిపత్యంతో అణచివేతకు గురవుతున్న బీసీలంతా ఒకే గొంతుకతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలు బీసీ సంఘాలు సంకేతాలిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా చాటేందుకు కులాల వారీగా రాజకీయ పోరుబాట పట్టే సంఘాలు ఇప్పటి నుంచే సమావేశమవుతున్నాయి. ఏదిఏమైనా బీసీ ప్రజలంతా ఒక్కటిగా ఉండి హక్కుల పరిరక్షణ కోసం పోరాడితేనే రాజ్యాధికారం దక్కుతుందనేది జగమెరిగిన సత్యం.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం అంశం మరియు బీసీ కుల గణన విషయం తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారు. మళ్ళీ ఐదేండ్ల తర్వాత ఎదో ఒక ఆశ చూపి ఓట్లు దండుకుంటున్నారు.
ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కుల గణన ప్రక్రియను ప్రారంభించి బీసీలకు రాజ్యాధికారం అందించేలా కృషి చేయాలనీ ముక్తకంఠంతో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నీ కోరుకుంటున్నాయి.
కోట దామోదర్
మొబైల్: 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి