చరవాణి రెండు పార్శ్వాలు
నేడు మనిషి కనిపెట్టిన సాంకేతిక సాధనాల్లో ఒకటైన మొబైల్ ఫోన్ మానవాళికి ఒక పక్క విలువైన సమాచారాన్ని అందజేస్తున్నప్పటికీ మరో పక్క యువత తమ విలువైన సమయాన్ని వృధా చేస్తోందని, వారిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలో అన్ని నష్టాలు కూడా అని కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ లాభ,నష్టాలు అనేవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిమనం ఉపయోగించే పద్ధతి పై ఆధారపడి ఉంటుందన్న విషయం మాత్రం సుస్పష్టం. మార్టిన్ కూపర్ అనే అమెరికన్ ఇంజనీర్ ఎన్నో మంచి ఆలోచనలతో మరియు గొప్ప ఆశయంతో అవిశ్రాంతంగా పనిచేసి ఏప్రిల్
3, 1973 న మొబైల్‌ని అందుబాటులోకి తెచ్చారు. అప్పటినుండి మొబైల్ ఫోన్
కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ మానవాళికి అనేక విధాలుగా సేవలందిస్తుంది.
మొబైల్ యొక్క ప్రధాన లక్ష్యాలు దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకొనుటకు వైద్యం, విద్య బ్యాంకింగ్ సేవలు మరియు రైలు మరియు రవాణా సేవల సమాచారాన్ని అందించడంతోపాటు సందేశాలు పంపడం,సంగీతం వినడం, సినిమాలు చూడటం,చరిత్రలను తెలియని విషయాలను తెలుసుకోవడం,లాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో మొబైల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ఓ సర్వే వెల్లడించింది. నవంబర్ 2022 సర్వే గణాంకాల ప్రకారం, ప్రపంచ జనాభా
8 బిలియన్లు, అందులో 5.44 బిలియన్లు మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇది ప్రతి
ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది మరియు మొబైల్ లేకుండా జీవించలేము అనే
స్థాయికి చేరుకుంది.
నేటి తరంవారు మాత్రం మొబైల్స్ కి
బానిసై నిద్ర లేచినప్పటి నుండి పడుకునే దాకా గంటల తరబడి అవసరం లేని విషయాల కోసం
అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూ, పనికిరాని విషయాలమీద పట్టు సంపాదించి, అవసరం లేని తగాదాలలో తలదూర్చి, పనికొచ్చే విషయాలను పక్కనపెట్టి తమ బంగారు భవిష్యత్తు కోసం ఆలోచన
చేయకుండా మొబైల్స్ తో కాలక్షేపం
చేస్తున్నారు. మొబైల్ ఇప్పుడు కౌమారదశలో ఉన్న వారి దైనందిన జీవితంలో అంతర్భాగం గా
ఉంది.
ఎన్నో మంచి ఆలోచనలతో దూరంగా ఉన్న వారి
సమాచారం తెలుసుకునేందుకు మార్టిన్ కూపర్ మొబైల్స్ కనిపెడితే. నేడు అందుకు భిన్నంగా
దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకుంటూ, ప్రేమ, ఆప్యాయత,అనురాగాలతో కూడుకున్న మానవ సంబంధాలను మరిచి అయినవారికి
దూరమవుతున్నారు, దూరం వారికి
దగ్గరవుతున్నారు. కొంతమంది వారి వ్యక్తిగత
విషయాలను ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ మరియు సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా ప్రచారం చేసుకుంటూ
అనవసరమైన గొడవలకు దారి తీస్తూ మరియు సైబర్ బెదిరింపుల వలన ఆర్థిక వనరులను కోల్పోయి
ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. మొబైల్ సాంకేతిక సాధనం
నుండి సామాజిక సాధనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొబైల్ యువతపై తీవ్ర ప్రతికూల
ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ, కొంతమంది యువత మొబైల్ ఆధారంగా విద్యార్థులకు తెలియని విషయాలను
తెలుసుకోవడానికి ఒక అభ్యాస సాధనంగా ఉపయోగపడుతుందని నిరూపిస్తున్నారు.
నిరుపేదల
సమస్యల పరిష్కారం కొరకు ట్విట్టర్:
ఒడిశాకు చెందిన డిజిటల్ కార్యకర్త
ఉపేంద్ర మహానంద్ ట్విట్టర్ సాయంతో పలు గ్రామాల్లోని పేదలకు పెన్షన్లు,రేషన్ కార్డులు, తాగునీరు అందించేందుకు శక్తి వంచన
లేకుండా కృషి చేస్తున్నారు. 41 ఏళ్ల అతను ఈ విధంగా ఇప్పటివరకు 50 కి పైగా కేసులను పరిష్కరించాడంటే అతన్ని అభినందించాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.మధ్యతరగతి కుటుంబం నుంచి
వచ్చిన ఉపేంద్ర తన తల్లిదండ్రుల కష్టాలను చూసి అభాగ్యులకు సహాయం చేయాలనే తపనతో ఈ
మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియా గురించి తెలుసుకోవడానికి, ఉపేంద్ర 2020లో ఫిర్యాదుల పరిష్కారం కోసం ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ అయిన 12baje12minuteనిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌కు
హాజరయ్యాడు. ఇక్కడ, అతను సోషల్ మీడియా ను ఎలా ఉపయోగించాలి మరియు ప్రజల సమస్యలను త్వరగా
మరియు పారదర్శకంగా ఎలా పరిష్కరించాలో నేర్చుకున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల
ద్వారా లేవనెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి కట్టుబడి ఉన్న ఒడిశా
ప్రభుత్వం యొక్క5T మోడల్ గురించి కూడా అతను తెలుసుకున్నాడు. తరువాత, అతను కంటెంట్ రైటింగ్‌లో శిక్షణ
పొందాడు, లక్ష్య ప్రేక్షకులను సమర్థవంతంగా
చేరుకోవడానికి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సరైన ట్యాగ్‌లు మరియు హ్యాష్‌ట్యాగ్‌లను
ఉపయోగించడం నేర్చుకున్నాడు మరియు వెనుకబడిన వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రావీణ్యం
సంపాదించాడు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల వారు
నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ప్రముఖుల, విద్యావేత్తల నుండి ఆర్థిక సహాయం కొరకు ట్విట్టర్ ద్వారా సమాచారం
అందించి సహాయాన్ని పొందుతున్నారు. మొబైల్ ద్వారా పేదల సమస్యలకు సత్వర పరిష్కారం
అభినందనీయం.
విద్య, ఉద్యోగ, ఎమర్జెన్సీ
సేవలు అందిస్తున్న ఇంటర్నెట్:
కమ్యూనికేట్ చేయడంతో పాటు, ఆన్‌లైన్‌లో ప్రశ్నను శోధించడం, ఆన్‌లైన్‌లో వార్తలపై సమాచారాన్ని
పొందడం మరియు ఆన్‌లైన్‌లో విద్యా వీడియోలను చూడటం వంటివి. మొబైల్ ఫోన్‌లతో అభ్యాస
శైలి యొక్క ప్రభావాన్ని పెంచడమే కాకుండా, టీనేజ్ వారికీ సులభంగా
అధ్యయనం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. కరోనా సమయంలో విద్య. ఉపాధి కల్పనలో అనేక
మార్పులు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలు
విద్యార్థులకు ఇంటి నుండి చదువుకునే అవకాశాన్ని అందించాయి మరియు ఉద్యోగులు కూడా కరోనా
నుండి బయటపడటానికి ఇంటి నుండి పని చేసారు మరియు బ్యాంక్ సేవలు మరియు ఇతర ప్రభుత్వ
సేవలు కూడా అందించబడ్డాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటర్నెట్ సేవలు బాగా అభివృద్ధి
చెందాయి. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపాధి
కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
ఉద్యోగావకాశాల కోసం కోచింగ్ ఫీజులు కట్టలేక యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న
ఎడ్యుకేషనల్ వీడియోలను చూసి సన్నద్ధమై ఉన్నత స్థాయికి చేరుకున్న పేద విద్యార్థులు
ఎందరో ఉన్నారు.
విద్యార్ధులపై
మొబైల్ ప్రభావం:
కంప్యూటర్, మొబైల్, కాలిక్యులేటర్ ఆవిష్కరణకు ముందు పిల్లలపై ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన
ప్రభావం లేదు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన గణిత లెక్కలు ఎలాంటి ఆధారం లేకుండా
అవలీలగా చేసేవారు. కానీ కాలక్రమేణా కంప్యూటర్, మొబైల్, కాలిక్యులేటర్ రాకతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి లోపంతో పాటు
బద్దకస్తులుగా తయారువుతున్నారు. అంతేకాకుండా మొబైల్ ఆవిష్కరణకు ముందు పిల్లలు
మరియు యువకులు ఇతరుల కంటే ఎక్కువ సృజనాత్మకతను కలిగి ఉండేవారు. అలాంటిది మొబైల్
వచ్చాక సృజనాత్మకతను కోల్పోతున్నారు. ఈ విషయాన్నీ తాజాగా అధ్యయనం చేసిన పరిశోధకులువెల్లడించారు.
తల్లిదండ్రులు, గురువుల పర్యవేక్షణ లేనందున అతి చిన్న వయసు నుండే
మొబైల్ వ్యసనంగా మారింది. ఆ వ్యసనం పిల్లల మెదడుపై ప్రభావం చూపి సృజనాత్మకతను
తగ్గిస్తుందని పరిశోధకులు నిర్వహించిన న్యూరోఇమేజింగ్ అధ్యయనంలో వెల్లడైంది.
యువతతో పాటు యువకులు కూడా ఫోన్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తమ టాలెంట్ చూపిస్తున్నారు. మరికొందరు సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనలు, సామాజిక స్పృహ కలిగిన సంఘటనలను షార్ట్ ఫిల్మ్‌లుగా చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల సమాజంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.
ఈ మధ్య కాలంలో ఫోటోల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఫోన్‌లో ఫొటోలు దిగడం అలవాటుగా మారింది. అంతే కాకుండా రోడ్లపై ఫొటోలు దిగడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా మార్పు రాకపోవడం బాధాకరం.
ఆరోగ్యంపై మొబైల్ ప్రభావం:
ఎక్కువసేపు మాట్లాడటం వల్ల వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెవి, ముక్కు, గొంతు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈమధ్య ఫుడ్ కి సంబంధించిన అప్లికేషన్స్ రావడంవల్ల చాల మంది బయట నుండి ఫుడ్ ఆర్డర్స్ చేస్తూ ఇంట్లో వంటకి ప్రాధాన్యత ఇవ్వటంలేదు అందువల్ల అనారోగ్యాలకు గురిఅవుతున్నారు.
ఒకప్పుడు పిల్లలు అన్నం తిననని ఏడుస్తుంటే, తల్లి చందమామను చూపిస్తూ, వారికి ఊసులు చెబుతూ అన్నం తినిపించే వారు. కానీ ఈ స్మార్ట్ కాలంలో
ఉన్న అమ్మలు పిల్లలకు స్మార్ట్ ఫోన్ లో చందమామ లేకపోతే, స్మార్ట్ ఫోన్ లో పిల్లల వీడియోలు పెడుతూ, అన్నం తినిపించడం జరుగుతుంది. దీని వలన పిల్లలకు చిన్ననాటి నుండే
స్మార్ట్ ఫోనే అంటే ఆసక్తి పెరుగుతుంది. మొదటగా పిల్లలకు ఫోన్ ఆసక్తి పెంచేలా
చేస్తుంది తల్లిదండ్రులే.
మానవ
సంబంధాల పై మొబైల్ ప్రభావం:
మొబైల్
ఆవిష్కరణకు ముందు, మానవ సంబంధాలు విలువలు ప్రజా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. అన్నదమ్ములందరూ
ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఆత్మీయత అనురాగాలతో ఉమ్మడి కుటుంబంలోజీవించేవారు.
అంతేకాదు గ్రామాల్లో సాయంత్రం వేళల్లో ఇంటి చుట్టుపక్కల వారందరూ కలిసి కష్టసుఖాలు
మాట్లాడుకునే వారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు
చెప్పేవే వార్తలు అనుకునేవారు. కానీ నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ
స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడుపుతున్నాయి. గ్రామాల్లో కూడా వీధుల్లో కూర్చుని
మాట్లాడుకునే వారు కరువయ్యారు. దీంతో పెద్దవాళ్లు కూడా సాయంత్రం అయితే చాలు టీవీలు ముందు, లేదా ఫోన్ పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ
మొబైల్స్‌తో సమయం వృధా చేసుకుంటూ మానవ సంబంధాలను దూరంచేసుకుంటున్నారు. ఒకే ఇంటి
సభ్యులు కూర్చొని భోజనం చేసే సంప్రదాయాన్ని మరిచిపోయి స్మార్ట్ ఫోన్ కారణంగా
మాట్లాడాలంటేనే విముఖత చూపుతున్నారు . ఆ రోజుల్లో పిల్లలు ప్రతి పండుగ మరియు వేసవి
సెలవులను గ్రామాల్లో గడిపేవారు. కానీ ఇప్పుడు ఇంట్లోనుండి బయటకు రావటంలేదు టీవీ, మొబైల్ తోనే కాలం గడుపుతున్నారు.
ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా పట్టించుకోకుండా పిల్లల చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి.
సెల్ ఫోన్ల అప్లికేషన్లు మనిషికి అన్ని సౌకర్యాలు కల్పించి క్షణాల్లో ఇంటి నుంచి
అన్నీ పొందే అవకాశం కల్పించి బద్దకస్తులుగా
చేశాయి. అందుకే మనిషికి ఫోన్ ఉంటే ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదన్న భ్రమలో ఉంటున్నారు.
స్నేహితులకు, బంధువులకు
దూరమవుతున్నాడు. ఫోన్లు లేనప్పుడు మనిషి ఎంత దూరమైనా వెళ్లి కలుసుకుని ఆప్యాయంగా
మాట్లాడేవాడు కానీ ఫోన్ రాకతో మనిషిలో ఆప్యాయతతో పలకరించే మనస్తత్వం మాయమైపోతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్ మీడియా నుండి దూరంగా ఉంచాలి - వారిని సరైన మార్గంలో ఉంచడానికి. సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్ కాకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలి. తద్వారా భావోద్వేగ సమతుల్యతను కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.
వ్యాసకర్త
కోట
దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి