24, సెప్టెంబర్ 2023, ఆదివారం

మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదు..



 మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదు..


గాంధర్వ లోకాలనుండి భూలోకానికి దిగి వచ్చిన పాటల పూదోట. ఆ తోటలో విరబూసిన పసిడి పంట ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు. ఆయన గొంతు విప్పితే అమ్మ జోల పాడినట్లుగా పసిపాప కూడా హాయిగా నిద్రలోకి జారుకోవాల్సిందే అంత అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులకు పసందైన వీణుల విందునందించారు. ఆయన స్వరం అద్భుతం, ప్రభంజనం అనన్య సామాన్యం. ఆయన పాట వింటే గాయపడిన హృదయాలు సైతం ప్రశాంతంగా తన్మయత్వంలో మునిగిపోవాల్సిందనడంలో అతిశయోక్తి లేదు.  విభిన్న స్వరాలతో పాటలు పాడుతూ తన గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. బాలు గారి గొంతులో పలుకని తెలుగు పదం లేదు. పాడనీ రాగం లేదు. సంగీత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన ఘనుడు గానగంధర్వుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం.

బాలు గారి పాట తరగని మాధుర్యం. ఆహ్లాదకరమైన శ్రావ్యత మరియు ఆ స్వరంలో స్పష్టత నిజానికి బాలు గారి స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సన్నివేశానికి అనుగుణంగా ఎమోషనల్ గా, సహజంగా పాటకు ప్రాణం పోయడంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మించిన వారు లేరనే చెప్పాలి. దైవభక్తి, దేశభక్తి గేయాలు, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు, అనేకము సందార్భాను సారముగా రాగయుక్తముగా భావ యుతముగా వైవిధ్యభరితమైన వేల పాటలు పాడి తెలుగు వారి మదిలో శాశ్వత స్థానాన్ని పొందిన అమరగాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు.


ఐదు దశాబ్దాల పాటు సాగిన ప్రస్థానంలో తెలుగు పాటలే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తిరుగులేని గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, 16 భాషల్లో 50,000కు పైగా అత్యధిక సంఖ్యలో గీతాలను ఆలపించిన గాయకుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
ఆయన ఆలపించిన గీతాలు మరియు ఆయన చేసిన కృషికి ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు  మరియు 25 తెలుగు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు మరియు కర్ణాటక మరియు తమిళనాడు ప్రభుత్వం నుండి అనేక ఇతర రాష్ట్ర అవార్డులు అంతేకాకుండా  ఆరు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు ఎఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకోవడం గొప్ప విషయం. తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించదగిన విషయం. 8 ఫిబ్రవరి 1981 న కన్నడలో 24 గంటల సమయంలో ఎలాంటి విరామం తీసుకోకుండా ఏకంగా 27 పాటలు ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు. కన్నడంలో కాకుండా తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు రికార్డు చేసి రికార్డు సృష్టించారు.

కుటుంబ నేపథ్యం:

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హరికథా కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు 4 జూన్ 1946 నాడు జన్మించారు.
ఆయన తండ్రి హరికథా కళాకారుడు అవడంవల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీతంపై ఆసక్తి కలిగింది. తన తండ్రికి కూడా సంగీత కళాకారుడు కావాలనే కోరిక బలంగా ఉండేది. బాలసుబ్రహ్మణ్యం చిన్నతనంలోనే సంగీత సంజ్ఞామానాలను అభ్యసించి, తన స్వయంకృషితో సంగీతం నేర్చుకున్నారు. చిన్నతనం నుండే పాటల పోటీలో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.  ఇంజనీర్ కావాలనే ఉద్దేశ్యంతో అనంతపురం జెఎన్‌టియు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. బాలు గారికి మొదటగా సంగీత కళాకారుడిగా కాకుండా తన తండ్రి ఆశయం మేరకు ఇంజనీరింగ్ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది కానీ ఇంజనీరింగ్ చదివే సమయంలో అనారోగ్య కారణంగా మధ్యలోనే చదువు మానేశాడు. ఆ తర్వాత గాయకుడిగా రాణించడానికి నిర్విరామ కృషి చేశారు.

సినీరంగ ప్రవేశం:

ఎస్పీ కోదండపాణి స్వరపరిచిన తెలుగు సినిమా శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న లోని 'ఏమియే వింత మోహం' పాటతో ప్లేబ్యాక్ సింగర్‌గా 1966 డిసెంబర్ 15న అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1968 లో కోదండపాణి స్వరపరిచిన సుఖదుఃఖాలు చిత్రంలో "మేడంటే మేడ కాదు" పాట తెలుగు చిత్రసీమలో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది.  
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతున్న శంకరాభరణం 1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం బాలసుబ్రహ్మణ్యం గారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతేకాకుండా ఆయన కృషికి ఉత్తమ నేపధ్య గాయకుడిగా జాతీయ అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత సంవత్సరం 1981 లో  "ఏక్ దుయుజే కే లియే" హిందీ చిత్రానికి మరో జాతీయ అవార్డు లభించింది.  ఆయన గాత్రం అందించిన ఉత్తమ చిత్రాలు స్వాతిముత్యం, సాగర సంగమం, రుద్రవీణ, మాతృదేవోభవ, కే విశ్వనాధ్ గారు నిర్మించిన చిత్రాలన్నీ కూడా  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవే, అగ్ర హీరోల సినిమాలకు ఎక్కువ బాలు గారు పాడినవే.

1989లో సల్మాన్ ఖాన్‌ నటించిన హిందీ చిత్రం "మైనే ప్యార్ కియా" లో దిల్ దీవానా పాట కు  బాలు గారు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌ నటించిన చాల చిత్రాలలో ప్లేబాక్ సింగర్ పనిచేసారు. బాలు గారు మరియు లతా మంగేష్కర్‌ కలిసి పాడిన హిందీ చిత్రం "ఆప్కే హై కౌన్" లోని "దీదీ తేరా దేవర్ దీవానా " పాట అత్యంత ప్రజాధారణ పొందడమే కాక హిందీ చలన చిత్రంలో తనకంటూ మంచి గుర్తింపు లభించింది.

బాలు గారు కమల్ హాసన్, రజనీకాంత్ , విష్ణువర్ధన్ , సల్మాన్ ఖాన్ , కె. భాగ్యరాజ్ , మోహన్ , అనిల్ కపూర్ , గిరీష్ కర్నాడ్ , జెమినీ గణేశన్ , అర్జున్ సర్జా , నగేష్ , కార్తీక్ మరియు సహా పలు కళాకారులకు వాయిస్ ఓవర్ కూడా అందించారు.

సాధించిన అవార్డులు:

2001లో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
2012లో బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు.
2015లో, అతను కేరళ ప్రభుత్వం నుండి హరివరాసనం అవార్డును అందుకున్నారు.
2016 లో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు తో సత్కరించబడ్డాడు.
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే 25 సెప్టెంబర్ 2020 న అందుకోవాల్సిన పద్మ విభూషణ్ అవార్డు కోవిడ్-19 కారణంగా ఆలస్యమవడం మరియు కోవిడ్-19 కారణంగా ఆయన 25 సెప్టెంబర్ 2020 న మరణించడం బాధాకరం ఆయన మరణానంతరం 2021 పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేశారు.

ఎందరో నటీనటులకు వారి హావభావాలకు, అభినయ రీతులకు అనుగుణంగా పాటలకు  ప్రాణం పోశారు. అందుకే అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినిమా పాటకు అసలైన వారసుడు అయ్యాడు. పదాల సరళిని జాగ్రత్తగా గమనిస్తూ అతని విరామ చిహ్నాలు అతని పాటను పండితులకు దగ్గర చేశాయి  శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.

మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదనడంలో అతిశయోక్తి లేదు. భౌతికంగా మాత్రమే లేరు. ఆయన రాసిన , పాడిన పాటల్లో సజీవంగా నిలిచాయి. చరిత్రలో నిలిచిపోయారు. బాలు గారి పాట చిరస్మరణీయం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

21, సెప్టెంబర్ 2023, గురువారం

చరవాణి రెండు పార్శ్వాలు


చరవాణి  రెండు పార్శ్వాలు

 మానవ మేధస్సును ఉపయోగించి ఎప్పటికప్పుడుఅనేక కొత్త యంత్రాలు మరియు సాంకేతికతలు ఆవిష్కరింపబడుతున్నప్పటికీఅవి మనిషిపై మంచి మరియు చెడు ప్రభావాలను చూపడం సహజమే.

నేడు మనిషి కనిపెట్టిన సాంకేతిక సాధనాల్లో ఒకటైన మొబైల్ ఫోన్ మానవాళికి ఒక పక్క విలువైన సమాచారాన్ని అందజేస్తున్నప్పటికీ మరో పక్క యువత తమ విలువైన సమయాన్ని వృధా చేస్తోందనివారిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలో అన్ని నష్టాలు కూడా అని కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ లాభ,నష్టాలు అనేవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిమనం ఉపయోగించే పద్ధతి పై ఆధారపడి ఉంటుందన్న విషయం మాత్రం సుస్పష్టం. మార్టిన్ కూపర్ అనే అమెరికన్ ఇంజనీర్ ఎన్నో మంచి ఆలోచనలతో మరియు గొప్ప ఆశయంతో అవిశ్రాంతంగా పనిచేసి ఏప్రిల్

3, 1973 న మొబైల్‌ని అందుబాటులోకి తెచ్చారు. అప్పటినుండి మొబైల్ ఫోన్ కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ మానవాళికి అనేక విధాలుగా సేవలందిస్తుంది.

మొబైల్ యొక్క ప్రధాన లక్ష్యాలు దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకొనుటకు వైద్యంవిద్య బ్యాంకింగ్ సేవలు మరియు రైలు మరియు రవాణా సేవల సమాచారాన్ని అందించడంతోపాటు సందేశాలు పంపడం,సంగీతం వినడంసినిమాలు చూడటం,చరిత్రలను తెలియని విషయాలను తెలుసుకోవడం,లాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో మొబైల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ఓ సర్వే వెల్లడించింది. నవంబర్ 2022 సర్వే గణాంకాల ప్రకారంప్రపంచ జనాభా

బిలియన్లుఅందులో 5.44 బిలియన్లు మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇది ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది మరియు మొబైల్ లేకుండా జీవించలేము అనే స్థాయికి చేరుకుంది.

నేటి తరంవారు మాత్రం మొబైల్స్ కి బానిసై నిద్ర లేచినప్పటి నుండి పడుకునే దాకా గంటల తరబడి అవసరం లేని విషయాల కోసం అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూపనికిరాని విషయాలమీద పట్టు సంపాదించిఅవసరం లేని తగాదాలలో తలదూర్చిపనికొచ్చే విషయాలను పక్కనపెట్టి తమ బంగారు భవిష్యత్తు కోసం ఆలోచన చేయకుండా మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్ ఇప్పుడు కౌమారదశలో ఉన్న వారి దైనందిన జీవితంలో అంతర్భాగం గా ఉంది.

ఎన్నో మంచి ఆలోచనలతో దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకునేందుకు మార్టిన్ కూపర్ మొబైల్స్ కనిపెడితే. నేడు అందుకు భిన్నంగా దూరంగా ఉన్న వారి సమాచారం తెలుసుకుంటూప్రేమఆప్యాయత,అనురాగాలతో కూడుకున్న మానవ సంబంధాలను మరిచి అయినవారికి దూరమవుతున్నారుదూరం వారికి దగ్గరవుతున్నారు. కొంతమంది వారి వ్యక్తిగత విషయాలను ఫేస్బుక్వాట్సాప్ట్విట్టర్ మరియు సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా ప్రచారం చేసుకుంటూ అనవసరమైన గొడవలకు దారి తీస్తూ మరియు సైబర్ బెదిరింపుల వలన ఆర్థిక వనరులను కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. మొబైల్ సాంకేతిక సాధనం నుండి సామాజిక సాధనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొబైల్ యువతపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీకొంతమంది యువత మొబైల్ ఆధారంగా విద్యార్థులకు తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఒక అభ్యాస సాధనంగా ఉపయోగపడుతుందని నిరూపిస్తున్నారు.

నిరుపేదల సమస్యల పరిష్కారం కొరకు ట్విట్టర్:

ఒడిశాకు చెందిన డిజిటల్ కార్యకర్త ఉపేంద్ర మహానంద్ ట్విట్టర్ సాయంతో పలు గ్రామాల్లోని పేదలకు పెన్షన్లు,రేషన్ కార్డులుతాగునీరు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. 41 ఏళ్ల అతను ఈ విధంగా ఇప్పటివరకు 50 కి పైగా కేసులను పరిష్కరించాడంటే అతన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఉపేంద్ర తన తల్లిదండ్రుల కష్టాలను చూసి అభాగ్యులకు సహాయం చేయాలనే తపనతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియా గురించి తెలుసుకోవడానికిఉపేంద్ర 2020లో ఫిర్యాదుల పరిష్కారం కోసం ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ అయిన 12baje12minuteనిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌కు హాజరయ్యాడు. ఇక్కడఅతను సోషల్ మీడియా ను ఎలా ఉపయోగించాలి మరియు ప్రజల సమస్యలను త్వరగా మరియు పారదర్శకంగా ఎలా పరిష్కరించాలో నేర్చుకున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేవనెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి కట్టుబడి ఉన్న ఒడిశా ప్రభుత్వం యొక్క5T మోడల్ గురించి కూడా అతను తెలుసుకున్నాడు. తరువాత, అతను కంటెంట్ రైటింగ్‌లో శిక్షణ పొందాడు, లక్ష్య ప్రేక్షకులను సమర్థవంతంగా చేరుకోవడానికి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సరైన ట్యాగ్‌లు మరియు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం నేర్చుకున్నాడు మరియు వెనుకబడిన వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రావీణ్యం సంపాదించాడు.

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల వారు నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ప్రముఖుల, విద్యావేత్తల నుండి ఆర్థిక సహాయం కొరకు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించి సహాయాన్ని పొందుతున్నారు. మొబైల్ ద్వారా పేదల సమస్యలకు సత్వర పరిష్కారం అభినందనీయం.

విద్య, ఉద్యోగ, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న ఇంటర్నెట్:

కమ్యూనికేట్ చేయడంతో పాటు, ఆన్‌లైన్‌లో ప్రశ్నను శోధించడం, ఆన్‌లైన్‌లో వార్తలపై సమాచారాన్ని పొందడం మరియు ఆన్‌లైన్‌లో విద్యా వీడియోలను చూడటం వంటివి. మొబైల్ ఫోన్‌లతో అభ్యాస శైలి యొక్క ప్రభావాన్ని పెంచడమే కాకుండా, టీనేజ్ వారికీ  సులభంగా అధ్యయనం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. కరోనా సమయంలో విద్య. ఉపాధి కల్పనలో అనేక మార్పులు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలు విద్యార్థులకు ఇంటి నుండి చదువుకునే అవకాశాన్ని అందించాయి మరియు ఉద్యోగులు కూడా కరోనా నుండి బయటపడటానికి ఇంటి నుండి పని చేసారు మరియు బ్యాంక్ సేవలు మరియు ఇతర ప్రభుత్వ సేవలు కూడా అందించబడ్డాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటర్నెట్ సేవలు బాగా అభివృద్ధి చెందాయి. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపాధి కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఉద్యోగావకాశాల కోసం కోచింగ్ ఫీజులు కట్టలేక యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఎడ్యుకేషనల్ వీడియోలను చూసి సన్నద్ధమై ఉన్నత స్థాయికి చేరుకున్న పేద విద్యార్థులు ఎందరో ఉన్నారు.

విద్యార్ధులపై మొబైల్ ప్రభావం:

కంప్యూటర్, మొబైల్, కాలిక్యులేటర్ ఆవిష్కరణకు ముందు పిల్లలపై ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం లేదు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన గణిత లెక్కలు ఎలాంటి ఆధారం లేకుండా అవలీలగా చేసేవారు. కానీ కాలక్రమేణా కంప్యూటర్, మొబైల్, కాలిక్యులేటర్ రాకతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి లోపంతో పాటు బద్దకస్తులుగా తయారువుతున్నారు. అంతేకాకుండా మొబైల్ ఆవిష్కరణకు ముందు పిల్లలు మరియు యువకులు ఇతరుల కంటే ఎక్కువ సృజనాత్మకతను కలిగి ఉండేవారు. అలాంటిది మొబైల్ వచ్చాక సృజనాత్మకతను కోల్పోతున్నారు. ఈ విషయాన్నీ తాజాగా అధ్యయనం చేసిన పరిశోధకులువెల్లడించారు. తల్లిదండ్రులు, గురువుల  పర్యవేక్షణ లేనందున అతి చిన్న వయసు నుండే మొబైల్ వ్యసనంగా మారింది. ఆ వ్యసనం పిల్లల మెదడుపై ప్రభావం చూపి సృజనాత్మకతను తగ్గిస్తుందని పరిశోధకులు నిర్వహించిన న్యూరోఇమేజింగ్ అధ్యయనంలో వెల్లడైంది.

యువతతో పాటు యువకులు కూడా ఫోన్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తమ టాలెంట్ చూపిస్తున్నారు. మరికొందరు సమాజంలో జరుగుతున్న యదార్థ సంఘటనలు, సామాజిక స్పృహ కలిగిన సంఘటనలను షార్ట్ ఫిల్మ్‌లుగా చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల సమాజంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.

ఈ మధ్య కాలంలో ఫోటోల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఫోన్‌లో ఫొటోలు దిగడం అలవాటుగా మారింది. అంతే కాకుండా రోడ్లపై ఫొటోలు దిగడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా మార్పు రాకపోవడం బాధాకరం.

ఆరోగ్యంపై మొబైల్ ప్రభావం: 

మొబైల్స్ విడుదల చేసే రేడియేషన్ గుండెను దెబ్బతీస్తుందని నిపుణులు చెపుతున్నారు.
ఎక్కువసేపు మాట్లాడటం వల్ల వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెవి, ముక్కు, గొంతు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈమధ్య ఫుడ్ కి సంబంధించిన అప్లికేషన్స్ రావడంవల్ల చాల మంది బయట నుండి ఫుడ్ ఆర్డర్స్ చేస్తూ ఇంట్లో వంటకి ప్రాధాన్యత ఇవ్వటంలేదు అందువల్ల అనారోగ్యాలకు గురిఅవుతున్నారు. 

ఒకప్పుడు  పిల్లలు అన్నం తిననని ఏడుస్తుంటే,  తల్లి చందమామను చూపిస్తూ, వారికి ఊసులు చెబుతూ అన్నం తినిపించే వారు. కానీ ఈ స్మార్ట్ కాలంలో ఉన్న అమ్మలు పిల్లలకు స్మార్ట్ ఫోన్ లో చందమామ లేకపోతే, స్మార్ట్ ఫోన్ లో పిల్లల వీడియోలు పెడుతూ, అన్నం తినిపించడం జరుగుతుంది. దీని వలన పిల్లలకు చిన్ననాటి నుండే స్మార్ట్ ఫోనే అంటే ఆసక్తి పెరుగుతుంది. మొదటగా పిల్లలకు ఫోన్ ఆసక్తి పెంచేలా చేస్తుంది తల్లిదండ్రులే.

మానవ సంబంధాల పై మొబైల్ ప్రభావం:

మొబైల్ ఆవిష్కరణకు ముందు, మానవ సంబంధాలు విలువలు ప్రజా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. అన్నదమ్ములందరూ ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఆత్మీయత అనురాగాలతో ఉమ్మడి కుటుంబంలోజీవించేవారు. అంతేకాదు గ్రామాల్లో సాయంత్రం వేళల్లో ఇంటి చుట్టుపక్కల వారందరూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకునే వారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవే వార్తలు అనుకునేవారు. కానీ నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడుపుతున్నాయి. గ్రామాల్లో కూడా వీధుల్లో కూర్చుని మాట్లాడుకునే వారు కరువయ్యారు. దీంతో పెద్దవాళ్లు కూడా సాయంత్రం అయితే చాలు  టీవీలు ముందు, లేదా ఫోన్‌ పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్‌తో సమయం వృధా చేసుకుంటూ మానవ సంబంధాలను దూరంచేసుకుంటున్నారు. ఒకే ఇంటి సభ్యులు కూర్చొని భోజనం చేసే సంప్రదాయాన్ని మరిచిపోయి స్మార్ట్ ఫోన్ కారణంగా మాట్లాడాలంటేనే విముఖత చూపుతున్నారు . ఆ రోజుల్లో పిల్లలు ప్రతి పండుగ మరియు వేసవి సెలవులను గ్రామాల్లో గడిపేవారు. కానీ ఇప్పుడు ఇంట్లోనుండి బయటకు రావటంలేదు టీవీ, మొబైల్ తోనే కాలం గడుపుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా పట్టించుకోకుండా పిల్లల చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. సెల్ ఫోన్ల అప్లికేషన్లు మనిషికి అన్ని సౌకర్యాలు కల్పించి క్షణాల్లో ఇంటి నుంచి అన్నీ పొందే అవకాశం కల్పించి బద్దకస్తులుగా  చేశాయి. అందుకే మనిషికి ఫోన్ ఉంటే ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదన్న భ్రమలో ఉంటున్నారు. స్నేహితులకు, బంధువులకు దూరమవుతున్నాడు. ఫోన్లు లేనప్పుడు మనిషి ఎంత దూరమైనా వెళ్లి కలుసుకుని ఆప్యాయంగా మాట్లాడేవాడు కానీ ఫోన్ రాకతో మనిషిలో ఆప్యాయతతో పలకరించే మనస్తత్వం మాయమైపోతుంది.

తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్ మీడియా నుండి దూరంగా ఉంచాలి - వారిని సరైన మార్గంలో ఉంచడానికి. సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్ కాకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలి. తద్వారా భావోద్వేగ సమతుల్యతను కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.

వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ : 9391480475

 


మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...