26, నవంబర్ 2023, ఆదివారం

సిరి వెన్నెల పాటకు మరణం లేదు.

 "సిరి వెన్నెల" పాటకు మరణం లేదు.


"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం"  

సమాజంలోని అసమానతలు, అక్రమాలు మరియు అన్యాయాలను బహిర్గతం చేయడానికి పోరాడే నిజాయితీగల పౌరులు లేరని మరియు ఈ ప్రపంచం ఎప్పటికీ మారని తీరును తన కలం నుండి జాలువారిన అక్షరాలను అద్భుతమైన పాటగా మలిచి ప్రపంచానికి చాటిచెప్పిన మహాకవి, తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత, పాటల పూదోటలో విరిసిన పారిజాతం "సిరి వెన్నెల సీతారామశాస్త్రి".

సిరి వెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు మూడు దశాబ్దాల పాటు మధురమైన పాటలు అందించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాతో పాట ప్రారంభించి ఎన్నో తెలుగు సినీ పాటలకు  సిరుల జల్లు కురిపించారు. అంతేకాదు తన మొదటి పాట "విధాత తలపున"కి నంది అవార్డు రావడం అభినందనీయం. మొదటి పాట నుంచి చివరి పాట వరకు పాటల్లోని అభినయం ఎందరో తెలుగు పాటల ప్రియులను ఆకట్టుకుంది. ప్రతి పాట ప్రతి పదం మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఆయన రాసిన ప్రేమ యుగళగీతాలు ప్రేమికుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన సాహిత్య శిఖరం సిరి వెన్నెల. సిరి వెన్నెల సాహిత్యానికి మసకబారిన హృదయాలను సైతం కదిలించే సామర్థ్యం  ఉందంటే అతిశయోక్తి కాదు. సిరి వెన్నెల తెలుగు పదాలతో అలవోకగా ఆడుకోగల సాహితీవేత్త. సిరి వెన్నెల శాస్త్రి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం ప్రేక్షకుల మదిలో చిరకాలం పదిలంగా ఉంటాయనేది ముమ్మాటికీ నిజం.

ఆయన రాసిన పాటలన్నీ పాటల పూదోటలో వికసించిన గులాబీల్లా ఉంటాయి. పాటలన్నీ అద్భుతం. అర్ధవంతం. ఆణిముత్యం..పాటలో వైవిధ్యం..ప్రతి పాటలో మానవత్వానికి బాటలు వేసే ఎన్నో భావాలు..ఒక్కో పదంలోనూ అద్వితీయమైన వ్యక్తిత్వపు జాడలు.

ఆణిముత్యం వంటి కొన్ని పాటలు గుర్తుచేసుకుందాం:

 1993 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాయం సినిమాలోని  "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని" ఈ పాట పలు భాషల్లోకి అనువదించడమేగాక ఎంతోమందిని ఆలోచింపజేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట వినని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. నేటికీ ఈ పాట మారుమోగుతూనే ఉంది. ఏనాటికి మారదు లోకం, మారదు కాలం అంటూ రాసిన ప్రతి పదం ఆలోచనాత్మకంగా ఉంది. ఆయన పాటతోనే యావత్ దేశాన్ని ప్రశ్నించాడు. కుర్రకారును ఉర్రూతలూగించే పాటల నుంచి సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల వరకు ప్రతి ఒక్కటీ.. గుండెను హత్తుకొనేలా రాయడం సిరి వెన్నెల కే సాధ్యం.  

హిందూ సంప్రదాయంలో మంగళ సూత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధానికి గుర్తు ఈ మంగళ సూత్రం. పుట్టింటి వారిని,మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళ సూత్రంలో రెండు తాళి బొట్లు ఉంటాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ విడాకుల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారు ముందుగా మంగళసూత్రం విశిష్టత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1994 లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం అందించిన శుభలగ్నం చిత్రంలోని 

చిలక ఏ తోడు లేక  ఎటేపమ్మ ఒంటరి నడక

తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక

లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అంటూ సిరి వెన్నెల గారు రాసిన ఈ పాట కోట్లాది ప్రజలను ఆలోచింపజేసింది.

అనురాగం కొనగలిగే  ధనముందా  ఈ లోకంలో

మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో... అంటూ ప్రేమను కొనగలిగే డబ్బు ఈ ప్రపంచంలో ఉందా? ధన వ్యామోహం లో ఉన్న కలియుగ ధనరాశులకు తన పాటతో జ్ఞానోదయం చేశారు మహానుభావుడు సిరి వెన్నెల.

కొన్ని పాటలు మన వ్యవస్థని, మన సమాజంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తాయి... అలాంటి పాటే 1997 లో కృష్ణవంశీ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన చిత్రం "సింధూరం" లోని 

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ!

ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే! 

ఈ పాటకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు లభించింది.

సమాజంలో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ప్రశ్నించే రచన సిరి వెన్నెల కలం.

ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన సిరి వెన్నెలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 

ఆయన రాసిన పాటల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిలో 

రుద్రవీణ లో "నమ్మకు నమ్మకు ఈ రేయిని"

స్వర్ణకమలం లో "ఆకాశంలో ఆశల హరివిల్లు"

నువ్వే కావాలి లో "ఎక్కడ ఉన్న పక్కన నీవే"

చక్రం లో "జగమంత కుటుంబం"

అమ్మ రాజీనామా లో "ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం "

ఇలాంటి ఎన్నో కమనీయమైన పాటలతో తెలుగు ప్రజల మనసులను దోచుకున్న గేయరచయిత సిరి వెన్నెల.

మనిషికి మరణం తప్ప పాటకు మరణం లేదనడం లో అతిశయోక్తి లేదు.  


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475






4, నవంబర్ 2023, శనివారం

ప్రజా సేవకుడు "మండల పరశురాములు".

 ప్రజా సేవకుడు "మండల పరశురాములు".

'బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో.

రాళ్లకు పాలిచ్చు కథ నశించునదెన్నడో.

పేడకు బొట్టెట్టి దైవమని పూజించువారు.

పేదను గుర్తించగ మారబోవునదెన్నడో' కవి ముత్తువేల్ కరుణానిధి గారు రాసిన ఈ కవిత ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది. బిడ్డల పాలకొరకు బిచ్చమెత్తుకుంటున్న దేశంలో పసిబిడ్డలకు పాలు అందించరు కానీ..రాళ్లనే దేవుడిగా భావించి క్షీరాభిషేకం చేస్తారు, కుబేరులున్న దేశంలో కూటికి లేనివాడికి కూడు కరువు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు నశిస్తాయో అని తన ఆవేదనను కవిత ద్వారా అందించారు. కానీ నేటికీ ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండటం బాధాకరమైన విషయం.

ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతువుంటాడు జీవుడు.

ఎవరన్నారో గాని ఆనాడు మానవసేవయే మాధవసేవనే ఓ మహనీయుడు.

సేవే మార్గం అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా అనే సిద్ధాంతాన్ని సేవా మార్గంగా ఆచరించి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో మదర్‌ థెరిసా ఒకరు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమంటే దేవుడిని సాక్షాతూ పూజించడమేనని ప్రగాఢంగా విశ్వసించిన మదర్ థెరిసా లక్షలాది మందికి ప్రేమను పంచి, ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే విలువైనవని ప్రపంచానికి తెలియజేసింది. సాటి మానవుల పట్ల ప్రేమ,దయ కలిగి ఉండడం మరియు సేవా తాత్పరత యొక్క నిజమైన అర్ధమని సూచించారు. ఆమె మరణానంతరం కూడా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మానవుడే మహనీయుడు అనే నానుడిని నిజమని నిరూపించిన మహిళా మాతృమూర్తి. మదర్‌ థెరిసా స్ఫూర్తి పొంది ఎంతోమంది సామజిక సేవ కార్యక్రమాలు చేపడుతుండటం గొప్ప విషయం. అంతేకాదు 1988లో మదర్ థెరిసా వరంగల్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కుముద్ బెన్ జోషి నేతృత్వంలో పరశురాములు సేవలకు గుర్తింపు లభించింది. మదర్ థెరిసా చేతులమీదుగా బెస్ట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు. మదర్‌ థెరిసా స్పూర్తితో సామజిక సేవ రంగంలో 35 సంవత్సరాలుగా సేవలందిస్తూ అంతర్జాతీయ, జాతీయ అవార్డులు అందుకున్న తెలంగాణ బిడ్డ  ప్రజా సేవకుడు "మండల పరశురాములు ".

ప్రజా సేవకుడు పరశురాములు :

నిరుపేద కుటుంబంలో పుట్టిన పరశురాములు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగాడు. చిన్నప్పటి నుంచి తనకి ఎదురైన సమస్యలు జీవితంలో ఇతరులకు రాకూడదని భావించి చిన్నతనం నుంచే మూర్తీభవించిన మానవత్వంతో సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. 8 వ తరగతి చదివే సమయంలో గురువుల స్పూర్తితో సమాజ సేవ పట్ల ఆసక్తితో 1981లో భారత్ స్కౌట్స్ & గైడ్స్ లో  చేరాడు. అందులో క్రమశిక్షణ మరియు అంకితభావ నిబద్ధత అలవర్చుకున్నారు. సామజిక సేవ చేయాలంటే విద్యయే సరైన మార్గమని తెలుసుకుని ఒకవైపు చదువు కొనసాగిస్తూనే పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన చేసిన సేవలను గుర్తించి 1985 లో అప్పటి భారత రాష్ట్రపతి గియాని జైల్ సింగ్ చేతులమీదుగా ప్రెసిడెంట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు. ఆతర్వాత అభ్యుదయ సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి అక్షరాస్యత, బాల కార్మికుల వ్యవస్థ నిర్ములన, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత,  బాల్య వివాహాల నివారణ, అక్రమ దత్తత నిలుపుదల, బాలల హక్కుల ఉల్లంఘన నిరోధం వంటి అంశాలలో ఎనలేని కృషి చేశారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని బాల్య వివాహాలు నిలిపివేయాలని అనేక జిల్లాలో విస్తృత ప్రచారం చేయడమేగాక మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా పరిషారా ప్రాంతాలలో అనేక బాల్య వివాహాలను నిలిపివేయించారు. అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 1989 లో వరంగల్ జిల్లాలోని నెహ్రు యువ కేంద్రంలో జాతీయ సేవా వలంటీర్‌గా చేరి యువజన సంఘాలను ఏర్పాటు చేసి క్రీడా కార్యక్రమాలు, చెట్లు నాటించడం కొరకు శ్రమదానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు, రాత్రి బడులు నిర్వహించి నిరక్ష్యరాసులకు చదువు నేర్పించారు. అక్షరాస్యత కోఆర్డినేటర్‌గా సమర్ధవంతమైన సేవలందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుడిగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అతని సేవలకు చిహ్నంగా, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి యువజన పురస్కారాలు, నిఖిల్ కొయితారా ఆంతర్జాతీయ అవార్డు, గాడ్ ప్రే ఫిలిప్స్ బాల కార్మికుల నిర్ములన అవార్డు , ప్రపంచ శాంతి శిఖరాగ్ర పురస్కారం వంటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు ప్రముఖుల చేతులమీదుగా అందుకున్నారు. నిరుపేద కుటుంభంలో పుట్టి సామజిక సేవ కార్యక్రమాలు చేయటం అనేది గొప్ప విషయం. ఆయన సేవలు ప్రశంశనీయం, ప్రభంజనం. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.

కుటుంబ నేపథ్యం, విద్యాబ్యాసం:

పరశురాములు గారు మార్చి 04, 1968న తెలంగాణ రాష్ట్రం, వరంగల్ అర్బన్ జిల్లా, రంగసాయిపేట రైల్వే గేట్ ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో రాములు మరియు ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి ఏజే మిల్లుల్లో దినసరి కూలీ. తల్లి ఎల్లమ్మ బీడీ కార్మికురాలు.

ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రంగశాయిపేటలోని ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగింది. కుటుంబ పోషణ కొరకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక తల్లికి తోడుగా బీడీలు తయారు చేసి  సహాయం అందించేవారు. గురువులు ఆయనకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి పై చదువులు చదవాలని ప్రోత్సహించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా అతను ఉన్నత చదువులను అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వరంగల్‌లోని శంభుంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి చదివాడు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. ఆయన చదువుకునే సమయంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా చదువే లక్ష్యంగా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు.  1993లో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో యం.  ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశారు.  ఎల్.ఎల్.బి. 2002లో వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. యం .ఎస్.డబ్ల్యూ (సోషల్ వర్క్) 2010లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.

అవార్డులు:

1985లో అప్పటి భారత రాష్ట్రపతి జైల్‌సింగ్‌ చేతులమీదుగా రాష్ట్రపతి స్కౌట్ అవార్డు అందుకున్నారు.

1988లో మదర్ థెరిసా చేతులమీదుగా బెస్ట్ స్కౌట్ అవార్డు అందుకున్నారు

1991వ సంవత్సరంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువజన వ్యవహారాల శాఖ మరియు క్రీడలు రంగంలో యువజన పురస్కారం అందుకున్నారు.

1996లో ఇంటర్నేషనల్ యూత్ సెంటర్, న్యూ ఢిల్లీ వారిచే అక్షరాస్యత కొరకు చేసిన కృషికి  చిహ్నంగా నిఖిల్ కోయితారా అవార్డును అందజేశారు.

భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి ద్వారా 1997 సంవత్సరంలో జాతీయ యువజన పురస్కారం అందుకున్నారు.

2006 ద్వారా అప్పటి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిచే  రెడ్ అండ్ వైట్ బ్రేవరీ అవార్డును అందుకున్నారు.

అభ్యుదయ సేవా సమితిలో పనిచేస్తున్నప్పుడు అత్యుత్తమ సామాజిక సేవకు గాను జిల్లా స్థాయి అవార్డులు (6) ఆరు అందుకున్నాను.

సందర్శించిన దేశాలు:

1999 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కొరకు కొలంబో, శ్రీలంక (25 రోజులు) సందర్శించారు.

1999 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కొరకు కెనడాలోని వాంకోవర్ (4 నెలలు) సందర్శించారు.

 మానవ సేవే మాధవ సేవ:

"ఆత్మే పరమాత్మ" అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. భక్తితో కొలిచే స్వామిని దర్శించగలగాలి. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. పేదలకు సేవ చేయడమే మాధవ సేవ. ఇతరులకు సహాయం చేసి తమను తాము మానవత్వంతో నిరూపించుకున్నవారే గొప్పవారు అవుతారు. సమాజ శ్రేయస్సు కోరని ఆధ్యాత్మిక సాధన ఫలించదు. ఆహ్లాదకరమైన సత్కార్యాలు చేసేవారిని ఇష్టపడతాడు. అందుకే 'దయగల హృదయమే భగవంతుని నిలయం' అన్నారు పెద్దలు.

సేవ అనేది సహజ లక్షణంగా ఉండాలి.  భగవంతుని అనుగ్రహం కోసం పుణ్యక్షేత్రాలు, గోపురాలను దర్శించుకోవడం మంచిది. కానీ, నిరుపేదల పట్ల కరుణ చూపకపోతే దేవుడు కూడా సంతోషించడు అనే విషయాన్నీ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరముంది. నలుగురితో కలిసి చేసే మంచి పనిలో భాగస్వాములు కావడం గొప్ప లక్షణం. అంతేకాని ప్రచారం, ప్రశంసల కోసం చేసే కార్యక్రమాలను పుణ్యకార్యాలుగా చూడరు. ఏ చిన్న పనైనా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం. సమాజంలో సేవ చేసేవారిని ప్రోత్సహించడం అంటే మనం కూడా సేవ చేస్తున్నట్లే. 35 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పరశురాములు ప్రతిఒక్కరికి ఆదర్శం కావాలని కోరుకున్నాను..


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ : 9391480475





2, నవంబర్ 2023, గురువారం

కోటి విద్యలు కూటి కోరకే (సర్కస్)

కోటి విద్యలు కూటి కోరకే (సర్కస్):

“కోటి విద్యలు కూటి కోరకే” అని మన పూర్వీకులు అప్పుడప్పుడు ఒక సామెత చెప్పేవారు. ఇలాంటి సామెతలు మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అనుభవాలను వ్యక్తీకరించడం ద్వారా జీవిత సత్యాలను వ్యక్తపరుస్తారు. మనిషి ఎంత చదువు చదివిన, ఎన్ని కోట్లరూపాయలు సంపాదించినా కడుపు నింపుకోవడానికే తప్ప చనిపోయిన నాడు చిల్లిగవ్వ తీసుకొనిపోలేము అని ఈ సామెత సూచిస్తోంది.

దేశంలో రోజు రోజుకు సంపన్నుల సంపద రెట్టింపై కోటీశ్వర్లుగా మారుతున్నప్పటికీ పేదలు మాత్రం మరింత పేదలై కూటి కోసం కోటి తిప్పలు పడుతున్నారు. కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శిస్తున్నారు. రెక్కాడితేనే డొక్కాడని నిరుపేదల కన్నీళ్లు తుడిచే దెవరు? వారి కడుపు నింపే దెవరు?

నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో బోడుప్పల్ మేడిపెల్లి ప్రాంతంలో రోడ్ పక్కన జనాలు గుమికూడారు. అందరూ ఆసక్తితో చూస్తుండగా నేను కూడా బండి ఆపి చూడగా అక్కడ సర్కస్ ఆడుతున్నారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు గుమ్మడవెల్లి లో చూసిన సర్కస్ ఆట మళ్లీ చూసినప్పుడు అద్భుతమైన ప్రదర్శన చూసిన అనుభూతి కలిగింది. భార్య భర్త మరియు ఇద్దరు పిల్లల సాయంతో సర్కస్ నిర్వహిస్తున్నారు. తండ్రి ఒక ఇనుప రాడ్ ను గొంతుకు అదిమి పెట్టుకొని గట్టిగా ఆ ఇనుప రాడ్ ను వంచడం ప్రారంభించాడు. అక్కడ జనాలందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తుండగానే రాడ్ ను గొంతులో దిగకుండా వంచాడు. గొంతుకు అదిమి పట్టి రాడ్ ను వంచడమనేది అసాధారణమైన విషయం. పట్టు తప్పితే ప్రాణం ఉండదని తెలిసి కూడా కుటుంబాన్ని పోషించాలనే తండ్రి తపన అందరినీ ఉద్వేగానికి గురి చేసింది. అంతేకాదు పొడవాటి వెదురు కర్రను తీసుకుని ఆ చిన్న పాపని కర్ర చివరన ఉంచి నోటి సహాయంతో పాపా కింద పడకుండా కర్రను పట్టుకొని ఇలాంటి ఎన్నో విస్మయాన్ని కలిగించే విన్యాసాలు చేశారు. ఎత్తైన కర్రలకు తాడు కట్టి ఆ తాడుపై చిన్న పాపని నడిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  అంతరించిపోతున్న కళలను కుటుంబ పోషణ కొరకు నేటికీ సర్కస్ వంటి ప్రదర్శనలు చేస్తుండటం బాధాకరమైన విషయం. అయినా వారికి సర్కస్ జీవన ఉపాధి. రెక్కాడితేనే డొక్కాడదు అన్నట్లుగా వారు ప్రదర్శనలు చేస్తేనే కడుపు నింపుకో గలరు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చిన్న పిల్లలతో చేయించడం విచారకరం.

సర్కస్ ఆటని కొనసాగించడానికి కారణం అంతరించిపోతున్న కళను బ్రతికించడం. తనని తాను బ్రతికించుకోవడం.

నేటి తరం పిల్లలకు సర్కస్ గురించి వివరించడం అవసరం:

తిండి కోసం మనిషి పడే తపన మరియు తల్లిదండ్రులు పడే కష్టం గురించి పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వారికి సర్కస్ లో చిన్న పిల్లలు చేసిన విద్య ఏ విధంగా నేర్చుకో సాగారనేది వారికీ వివరంగా వివరించాలి. మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ. పుట్టిన మనిషి మట్టి బొమ్మ కాదు. మనిషి మరొక బ్రహ్మ అన్నట్లు ఆచరిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని వారు తెలుసుకోవాలి.

చిన్న పాప తాడుపై ఎలా నడవగలిగింది అనే సందేహం కలుగకమానదు.

సాధన చేయుమురా నరుడా సాదించనిదే లేదురా అన్నట్లుగా సాధన చేస్తే సాదించనిది ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. చేయాలనే తపన తాలిమి తపస్సు ఉంటే సాధ్యం కానిది ఉండదు. గొంతులో దిగకుండా రాడ్ ను వంచడమనేది అసాధారణమైన విషయం అయినప్పటికీ ఆయన చేసిన సాధనకు రాడ్ వంగక తప్పదు. ప్రతి మనిషి కష్టాలను దీటుగా ఎదుర్కోగలిగితే కష్టాలు వెనుదిరగక తప్పదు.  


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ 9391480475



మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...