2, నవంబర్ 2023, గురువారం

కోటి విద్యలు కూటి కోరకే (సర్కస్)

కోటి విద్యలు కూటి కోరకే (సర్కస్):

“కోటి విద్యలు కూటి కోరకే” అని మన పూర్వీకులు అప్పుడప్పుడు ఒక సామెత చెప్పేవారు. ఇలాంటి సామెతలు మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అనుభవాలను వ్యక్తీకరించడం ద్వారా జీవిత సత్యాలను వ్యక్తపరుస్తారు. మనిషి ఎంత చదువు చదివిన, ఎన్ని కోట్లరూపాయలు సంపాదించినా కడుపు నింపుకోవడానికే తప్ప చనిపోయిన నాడు చిల్లిగవ్వ తీసుకొనిపోలేము అని ఈ సామెత సూచిస్తోంది.

దేశంలో రోజు రోజుకు సంపన్నుల సంపద రెట్టింపై కోటీశ్వర్లుగా మారుతున్నప్పటికీ పేదలు మాత్రం మరింత పేదలై కూటి కోసం కోటి తిప్పలు పడుతున్నారు. కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శిస్తున్నారు. రెక్కాడితేనే డొక్కాడని నిరుపేదల కన్నీళ్లు తుడిచే దెవరు? వారి కడుపు నింపే దెవరు?

నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో బోడుప్పల్ మేడిపెల్లి ప్రాంతంలో రోడ్ పక్కన జనాలు గుమికూడారు. అందరూ ఆసక్తితో చూస్తుండగా నేను కూడా బండి ఆపి చూడగా అక్కడ సర్కస్ ఆడుతున్నారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు గుమ్మడవెల్లి లో చూసిన సర్కస్ ఆట మళ్లీ చూసినప్పుడు అద్భుతమైన ప్రదర్శన చూసిన అనుభూతి కలిగింది. భార్య భర్త మరియు ఇద్దరు పిల్లల సాయంతో సర్కస్ నిర్వహిస్తున్నారు. తండ్రి ఒక ఇనుప రాడ్ ను గొంతుకు అదిమి పెట్టుకొని గట్టిగా ఆ ఇనుప రాడ్ ను వంచడం ప్రారంభించాడు. అక్కడ జనాలందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తుండగానే రాడ్ ను గొంతులో దిగకుండా వంచాడు. గొంతుకు అదిమి పట్టి రాడ్ ను వంచడమనేది అసాధారణమైన విషయం. పట్టు తప్పితే ప్రాణం ఉండదని తెలిసి కూడా కుటుంబాన్ని పోషించాలనే తండ్రి తపన అందరినీ ఉద్వేగానికి గురి చేసింది. అంతేకాదు పొడవాటి వెదురు కర్రను తీసుకుని ఆ చిన్న పాపని కర్ర చివరన ఉంచి నోటి సహాయంతో పాపా కింద పడకుండా కర్రను పట్టుకొని ఇలాంటి ఎన్నో విస్మయాన్ని కలిగించే విన్యాసాలు చేశారు. ఎత్తైన కర్రలకు తాడు కట్టి ఆ తాడుపై చిన్న పాపని నడిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  అంతరించిపోతున్న కళలను కుటుంబ పోషణ కొరకు నేటికీ సర్కస్ వంటి ప్రదర్శనలు చేస్తుండటం బాధాకరమైన విషయం. అయినా వారికి సర్కస్ జీవన ఉపాధి. రెక్కాడితేనే డొక్కాడదు అన్నట్లుగా వారు ప్రదర్శనలు చేస్తేనే కడుపు నింపుకో గలరు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చిన్న పిల్లలతో చేయించడం విచారకరం.

సర్కస్ ఆటని కొనసాగించడానికి కారణం అంతరించిపోతున్న కళను బ్రతికించడం. తనని తాను బ్రతికించుకోవడం.

నేటి తరం పిల్లలకు సర్కస్ గురించి వివరించడం అవసరం:

తిండి కోసం మనిషి పడే తపన మరియు తల్లిదండ్రులు పడే కష్టం గురించి పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వారికి సర్కస్ లో చిన్న పిల్లలు చేసిన విద్య ఏ విధంగా నేర్చుకో సాగారనేది వారికీ వివరంగా వివరించాలి. మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ. పుట్టిన మనిషి మట్టి బొమ్మ కాదు. మనిషి మరొక బ్రహ్మ అన్నట్లు ఆచరిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని వారు తెలుసుకోవాలి.

చిన్న పాప తాడుపై ఎలా నడవగలిగింది అనే సందేహం కలుగకమానదు.

సాధన చేయుమురా నరుడా సాదించనిదే లేదురా అన్నట్లుగా సాధన చేస్తే సాదించనిది ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. చేయాలనే తపన తాలిమి తపస్సు ఉంటే సాధ్యం కానిది ఉండదు. గొంతులో దిగకుండా రాడ్ ను వంచడమనేది అసాధారణమైన విషయం అయినప్పటికీ ఆయన చేసిన సాధనకు రాడ్ వంగక తప్పదు. ప్రతి మనిషి కష్టాలను దీటుగా ఎదుర్కోగలిగితే కష్టాలు వెనుదిరగక తప్పదు.  


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ 9391480475



కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...