7, ఏప్రిల్ 2024, ఆదివారం

ఈశాన్య రాష్ట్రంలో ఉద్భవించిన గొప్ప శాస్త్రవేత్త "సోనమ్ వాంగ్ చుక్".


సకల చరాచర జగత్తులో సమస్త ప్రాణికోటికి జీవనాధారం 'నీరు'. నీరు లేనిదే జీవరాశి మనుగడ లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రాణమున్న ప్రతి జీవికి గాలి తర్వాత అత్యవసరమైన ప్రకృతి వనరు నీరు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య నీరు. వాతావరణంలో అనేక మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, కాలుష్యం, భూగర్భ జలాల మితిమీరిన వాడకం మరియు వర్షపు నీరు తిరిగి భూమిలోకి ఇంకక పోవడం వల్ల నీరుకొరత ఏర్పడుతుంది. ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేదు, దాదాపు సగం మందికి తగిన నీటి పరిశుభ్రత సేవలు లేవని ఐక్యరాజ్యసమితి నివేదించింది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని కొందరికి మాత్రమే తెలుసు.
లడఖ్ భారతదేశంలోనే అత్యంత అందమైన ప్రదేశం. అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. హిమాలయాలకు పశ్చిమాన చివరలో ఉన్న లడఖ్ నాలుగు ప్రధాన పర్వత శ్రేణులను కలిగి ఉంది. హిమాలయ, జన్స్కార్, లడఖ్ మరియు కారకోరం అన్నీ దాని గుండా వెళుతుంటాయి. ఇది సముద్ర మట్టానికి 3,000 మరియు 8,000 అడుగుల మధ్య ఉంటుంది. ఇది సింధు నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది. చాలా ఎత్తైన ప్రదేశం కారణంగా లడఖ వాతావరణం చాలా పొడిగా మరియు చల్లగా ఉంటుంది. లడఖ్లో రాత్రి ఉష్ణోగ్రతలు -30°C తగ్గుతాయి. ఎడారి ప్రాంతం కావడం వల్ల ఇక్కడ వృక్షసంపద చాలా తక్కువగా ఉండటంతో పాటు చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. తాగు మరియు వ్యవసాయానికి ప్రధాన నీటి వనరు హిమ నదీ కరిగే నీరు. ఈ ప్రాంతం అధిక ఎత్తులో ఉన్నందున, వాతావరణ మార్పుల కారణంగా హిమ నదీ కరిగే నీరు దిగువన ప్రవహిస్తుంది మరియు అందువల్ల లడఖ్ ప్రాంతంలో ఏప్రిల్-మే నెలలో తీవ్రమైన నీటి సంక్షోభం ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో అక్కడి ప్రజలు వలస బాట పట్టారు.
సోనమ్ వాంగ్ చుక్ అనే మెకానికల్ ఇంజనీర్ ఒకరోజు వంతెన కింద నడుచుకుంటూ వెళ్తుండగా, వంతెన కింద భాగం మంచుతో కప్పబడి ఉండటాన్ని గమనించాడు. వాతావరణం కారణంగా చుట్టుపక్కల మంచు కరిగిపోయినా కింది వంతెన భాగం కరగలేదు. బ్రిడ్జి క్రింది భాగాన మంచు ఎందుకు కరగడం లేదో అనేక ప్రయోగాలు చేసిన తర్వాత సూర్యకాంతి లేనందున మంచు కరగలేదు అని తెలుసుకున్నారు. లడఖ్లో మంచును సూర్యుడి నుండి నీడగా ఉంచగలిగితే మంచు ఎక్కువ కాలం ఉంటుందని వాంగ్ చుక్ గ్రహించాడు. నీటి సమస్యను ఎదుర్కోవడానికి సోనమ్ వాంగ్ చుక్ కి వచ్చిన సరికొత్త ఆలోచన "మంచు స్తూపం. గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి ఒక పొడవైన పైపును ఆధారంగా చేసుకొని పైనుండి వాటర్ ని స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా పంపబడుతుంది. ఫిబ్రవరి 2014లో దాదాపు 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో భారీ స్థాయిలో మంచు స్థూపం ఏర్పడుతుంది. చేసిన ప్రతి మంచు స్థూపం నుండి రోజుకు 5000 లీటర్ల నీటిని విడుదల చేయడం సోనమ్ వాంగ్ చుక్ ప్రతిభకు నిదర్శనం.
బాల్యమంతా అవమానాలే:
పుట్టిన ఊరిలో స్కూల్ లేకపోవడంతో 9 ఏళ్ల వరకు తల్లి దగ్గర చదివాడు.తర్వాత తండ్రి రాజకీయ ప్రభావంతో మంచి స్కూల్లో అడ్మిషన్ పొందారు. స్కూల్లో టీచర్లు చెప్పే ఇంగ్లీషు పాఠాలు అర్థం కాక చాలా ఇబ్బంది పడేవారు. 9 ఏళ్ల వరకు అమ్మ నేర్పిన స్థానిక భాష మాత్రమే తెలిసిన అతడికి స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలు వింతగా అనిపించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేవాడు. అందుకే స్కూల్లో అందరూ అతన్ని చదువురాని మొద్దు అని పిలిచేవారు. తోటి విద్యార్థుల అవమానము భరించలేక ఒంటరిగా ఢిల్లీకి పారిపోయాడు. చదువుపై ఆసక్తితో ఢిల్లీలోని విశేష కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ని కలిసి తన పరిస్థితిని వివరించాడు, తాను రాజకీయ నాయకుడి కుమారుడిని, చదువు పూర్తయ్యే వరకు తన ఆచూకీ తల్లిదండ్రులకు మరియు ఎవరికీ చెప్పకూడదని కోరాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, వాంగ్ చుక్ తన చదువులో చురుకైన విద్యార్థి పేరు పొందాడు. అనంతరం ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు నిజం చెప్పి వారి వద్దకు పంపించేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రుల వద్దకు చేరిన తర్వాత చదువు ఆగకుండా కొనసాగుతుంది. వాంగ్ చుక్ ఆర్థిక నిపుణుడిగా ఎదగాలని అతని తండ్రికి బలమైన కోరిక ఉండేది. శ్రీనగర్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్ని అనుకోని కారణాల వల్ల మళ్లీ తల్లిదండ్రుల నుంచి విడిపోయారు. తన తండ్రి కోరిక తీర్చనందుకు తండ్రి వాంగ్ చుక్ ను అసహ్యించుకున్నారు. సోనమ్ వాంగ్ చుక్ బాల్యం కష్టాలు మరియు కన్నీళ్లతో సాగింది. లడఖ్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన (SECMOL) విద్యాసంస్థలు స్థాపించారు.
వాంగ్ చుక్ విద్యా విధానం విప్లవాత్మకమైనది. అతను 1988లో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చర్ మూవ్మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)ని స్థాపించాడు. ఈ సంస్థ ఆచరణాత్మక, పర్యావరణ అనుకూల విద్యపై దృష్టి సారించింది. విద్యావ్యవస్థలో గొప్ప మార్పు అవసరమని భావించి విద్యార్థుల బృందంచే స్థాపించబడింది. 10వ తరగతి పరీక్షల్లో విఫలమైన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి వారి విద్య అంతరాన్ని అనుభవించిన లడఖ యువతకు ప్రవేశ అవకాశాలను అందించడంలో ఈ ప్రత్యేకత ఉంది. ఇది ఎక్కువగా వారి మాతృభాష లడఖీలో బోధించబడుతుంది. విద్యావేత్త "వాంగ్‌చుక్" ప్రతి విద్యార్థికి మాతృబాష తప్పనిసరని లడఖీ భాషలో పెంపొందించారు. అలాగే వికలాంగ అభ్యర్థులు, అనాథలు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది. పాఠశాలలో పేద విద్యార్థులకు స్పాన్సర్షిప్ మద్దతును కూడా అందిస్తుంది. SECMOL సాంప్రదాయేతర పాఠశాలగా నిలుస్తుంది. సాంప్రదాయ సంస్థ వలె కాకుండా, ఇది ప్రామాణిక పాఠ్యాంశాలకు కట్టుబడి ఉండదు. బదులుగా, విద్యార్థులకు ప్రాక్టికల్ సైన్స్ మరియు సామాజిక సమస్యల నుండి పబ్లిక్ స్పీకింగ్, గార్డెనింగ్, జంతువులు మరియు చెట్ల సంరక్షణ, లడఖీ పాటలు, నృత్యం మరియు సాంస్కృతిక విద్య వంటి విభిన్న అంశాలలో శిక్షణ ఇస్తారు. SECMOL లో, ప్రాథమిక దృష్టి విద్యావిషయక పరిజ్ఞానంపై కాదు, విద్యార్థులలో ఆచరణాత్మక మరియు సామాజిక లక్షణాలు మరియు నైపుణ్యాలను అందిస్తుంది.
SECMOL సోలార్ హీటెడ్, ఎకో-ఫ్రెండ్లీ భవనాలను డిజైన్ చేయడం, నిర్మించడంలో యువతకు 2 సంవత్సరాల కోర్సు నిర్వహించారు. SECMOL పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది.
ఒకప్పుడు లడఖ్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 5 శాతం మాత్రమే. ఈ కారణంగా విద్యాసంస్థలకు బీజం ఏర్పడింది. లడఖ్ ప్రాంతంలో విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పిల్లలకు అర్థమయ్యే రీతిలో తల్లిదండ్రులు పాఠాలు బోధించారు. దీనితో విద్యార్థుల నైపుణ్యం బయటకు రావడమే కాకుండా తక్కువ సమయంలో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. లడఖ్ ప్రాంతంలో విద్యార్థులకు విద్యను అందించడంలో ఆయన గొప్పగా కృషి చేశారు.
“మంచు స్థూపం” కొండ ప్రాంతాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడంలో మరో మార్గదర్శక ఆవిష్కరణ. 2021లో, అతను లడఖ్ ప్రాంతంలోని సియాచిన్ మరియు గాల్వాన్ లోయ వంటి అత్యంత శీతల ప్రదేశాలలో ఆర్మీ సిబ్బంది ఉపయోగించగల పర్యావరణ అనుకూలమైన సోలార్ హీటెడ్ టెంట్ కూడా నిర్మించారు. లడఖ్లోని భీకరమైన శీతాకాలాలను ఎదుర్కొనేందుకు మట్టితో తయారు చేసిన తక్కువ ధర సౌర-వేదికతో కూడిన భవనాలను రూపొందించడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు.
వాంగ్ చుక్ వ్యక్తిత్వం 2009 చిత్రం '3 ఇడియట్స్‌లో అమీర్ ఖాన్ యొక్క కాల్పనిక పాత్ర ఫున్సుఖ్ వాంగ్డుకు స్ఫూర్తినిచ్చింది.
ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాటం:
లడఖ్ రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలో ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని తదితర డిమాండ్లతో మార్చి 6 నుంచి అత్యంత కఠినమైన వాతావరణంలో కొనసాగిన ఆయన దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, గిరిజన తెగలను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా స్థానిక స్వపరిపాలన కల్పించడం, స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేయడం వారి డిమాండ్లలో ప్రధానాంశాలు. పర్యావరణం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారు. లెక్క‌లేనన్ని ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు సోన‌మ్ వాంగ్ చుక్.
2018లో రామన్ మెగాసెసే అవార్డు పొందారు. ఐసీఏ పురస్కారం, సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ , రోలెక్స్ అవార్డ్, ఇంట‌ర్నేష‌న‌ల్ టెర్రా అవార్డుతో పాటు ప‌లు జాతీయ, అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు ల‌భించాయి.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...