9, ఏప్రిల్ 2024, మంగళవారం

చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం “ ఎన్ను నింటే మొయిదీన్ ”.

చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం ఎన్ను నింటే మొయిదీన్ ”. 

ప్రేమించే హృదయానికి ధనిక , పేద అనే తేడా ఉండవు .. నిజమైన ప్రేమికులకు కుల , మత బేధాలు ఉండవు .. ప్రపంచంలో డబ్బు మించిన శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే . కుల మత బేధాలను ఎదురించే శక్తి ప్రేమకు మాత్రమే ఉందనడంలో అతిశయోక్తి లేదు . అంతేకాదు తల్లిదండ్రులను సైతం మరిపించగల శక్తి ప్రేమకు కలదు . ప్రాణ స్నేహితుల మధ్య కూడా చిచ్చురగగలిగే శక్తి . ప్రాణాలు తీసే శక్తి కలదు ప్రేమకు . ప్రేమ ఒక మధురమైన అనుభూతి , అనిర్వచనీయమైన భావన .  

ఎన్నో ఏళ్లుగా తమ ప్రియురాలు కోసం ఎదురు చూసి చివరికి ప్రేమ విఫలమైన ప్రేమికులను మన నిజ జీవితంలో చూస్తుంటాం . కానీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తే గర్ల్ ఫ్రెండ్ లను చాలా తక్కువ మందిని చూస్తుంటాం . ప్రేమిస్తానంటూ నమ్మించి మోసం చేసి చాటేసిన బాయ్ ఫ్రెండ్స్ మరియు ఎంతోకాలంగా ప్రేమించినట్లు నటిస్తూ చివరకు వేరే వారిని పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్స్ మన దైనందిన జీవితంలో తారసపడటం సహజమే కానీ కొందరు యువతీ యువకులు మాత్రం ప్రేమ కోసం పెద్దలను ఎదిరించడానికి కుల , మత కట్టుబాట్లను అధిగమించడానికి కూడా వెనుదిరగని విశ్వాసంతో పెళ్లితో ఒక్కటవుతుండటం విశేషం .ఇలాంటి సంఘటనలు మనం నిత్య జీవితంలో కంటే సినిమాల్లోనే ఎక్కువగా చూస్తున్నాను . అంతేకాదు నిత్య జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను చిత్రీకరించడంలో మన దేశ సినీ పరిశ్రమలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు .​ 

తెలుగు , తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రేమ సినిమాలు వచ్చినా . వాటిలో కొన్ని మాత్రమే ప్రేమికుల హృదయాలను కదిలించాయి . ఎస్ శంకర్ నిర్మించిన తమిళ చిత్రం " కాదల్ " అటువంటి చిత్రమే . ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది . ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకున్నారని ప్రియుడిని చిత్రహింసలు పెట్టి అమ్మాయికి తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయడం వల్ల ప్రియుడు పిచ్చివాడు కావడం , కొన్ని సంవత్సరాల తరువాత తన ప్రియుడిని పిచ్చివాడు గా గుర్తించి ప్రియురాలు అతని దయనీయ పరిస్థితి కి తానే కారణమని బాధపడిన ప్రేమికుల హృదయాన్ని ద్రవింపజేస్తుంది .అప్పట్లో సినిమా సంచలనం సృష్టించింది

ప్రియురాలి కోసం ప్రియుడు ప్రాణత్యాగం చేయడం ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూశాం . అయితే ప్రియుడిని పెళ్లి చేసుకున్న 22 ఏళ్లుగా ఎదురుచూస్తే ప్రేయసి బహుశా సినిమాలో చూసుండకపోవచ్చు . 1960 మరియు 70 దశకంలో కేరళలోని ముక్కమ్‌లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా RS విమల్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం " ఎన్ను నింటె మొయిదీన్ " .

కేరళలోని ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ మరియు హిందూ కుటుంబానికి చెందిన కాంచనమాల మధ్య వాస్తవంగా సంభవించిన విషాదకరమైన ప్రేమకథ ఇది . చిత్రం 1960 లో ఇరువంజిప్పుజ నది మరియు ముక్కం గ్రామం నిర్మాణం జరిగిన మొయిదీన్ మరియు కాంచనమాల నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా రూపొందించబడింది . సినిమాలో సన్నివేశాలన్నీ ప్రేమికులకు ఉత్కంఠభరితంగా ఉండి వారిని భావోద్వేగాలకు గురిచేస్తాయి . ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ , హిందూ కుటుంబానికి చెందిన భూస్వామి కుమార్తె అయిన కాంచనమాల ఇరువురు ప్రేమలో పడిన సమయంలో మతాంతర వివాహాలు నిషిద్ధంగా పరిగణించబడుతున్నందున , వారి ప్రేమ వివాహానికి ఇద్దరి కుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో విడిపోవాల్సి వచ్చింది .మరో పెళ్లి కావాలని కాంచనమాల తండ్రి కట్టుదిట్టమైన ఆంక్షలతో చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు . పెళ్లి చేసుకుంటే మొయిదీన్ ను పెళ్లి చేసుకుంటానని , లేదంటే అవివాహితగా ఉండిపోతానని కాంచనమాల తన తండ్రికి చెప్పిన సంఘటన అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు . వీరిద్దరూ తమ ప్రేమ గురించిన లేఖల ద్వారా వ్యక్తం చేసుకునే క్రమం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది .రోజు ఆమెను సంప్రదాయవాద బంధువులు పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కొట్టిన సందర్భం ద్వారా ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా సన్నివేశాన్ని చిత్రీకరించడం అభినందనీయం . కాంచనమాలతో విడిపోవడానికి మొయిదీన్ అంగీకరించారు ,

మొయిదీన్ తండ్రి బాల్యంబ్ర పొట్టాట్టు ఉన్న మొయిదీన్ సాహిబ్ కొడుకుని ఇంట్లోనుండి వెళ్ళగొట్టాడు . తర్వాత మొయిదీన్ సామాజిక - రాజకీయ కార్యకర్తగా మారారు . రోజు మొయిదీన్ తండ్రి దగ్గరి సంబంధీకుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మొయిదీన్ ని అడగగా అందుకు మొయిదీన్ నిరాకరించడంతో , అతని తండ్రి ఓరోజు మొయిదీన్ ని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు .అదృష్టవశాత్తు మొయిదీన్ బతికి బయటపడ్డారు . కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నం చేశాడని తెలిసి భర్తకు దూరంగా ఉంటూ కొడుకు బాగోగులు చూస్తుంది అతని తల్లి . అనంతరం మొయిదీన్ తండ్రి పై బహిరంగంగా హత్యాప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేశారు . అనంతరం కోర్టులో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు మొయిదీన్ చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపజేసింది . అంతేకాదు కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని , అనుకోని కారణాల వల్లే ఇలా జరిగిందని చెప్పారు . తండ్రి కేసు నుంచి విముక్తి పొందేందుకు కొడుకు గొప్ప మనసున్న వ్యక్తిత్వాన్ని కనబరిచాడు . కొడుకు సమాధానంతో మొయిదీన్ సాహెబ్ తన కుమారుడి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు . ఒక రోజు మొయిదీన్ సాహెబ్ తన భార్య మరియు కొడుకు వద్దకు స్వయంగా వెళ్లి ఇంటికి వెళ్లి ఉండమని చెప్పాడు మరియు రాత్రి మొయిదీన్ సాహిబ్ గుండెపోటుతో వెంటనే మరణించాడు .కాంచనమాల ఇంట్లో ఒప్పుకో ప్రత్యక్ష మొయిదీన్ మరియు కాంచన పారిపోవాలని నిర్ణయించుకున్నారు , అయితే మొయిదీన్ వారి పాస్ పోర్ట్ లను సేకరించి తిరిగి వస్తున్నప్పుడు , తను ప్రయాణిస్తున్న పడవ సుడిగుండంలో చిక్కుకుంది . అతను తనతో పడవలో ఉన్న సహచరులను రక్షించగలిగాడు , అతను సుడిగుండంలో చిక్కుకుని మరణిస్తాడు . అతని మరణం గురించి విన్న కాంచన ఆత్మహత్య చేసుకునే సమయంలో మొయిదీన్ తల్లి ఆమెను వారిస్తుంది . చివరికి , కాంచన మొయిదీన్ అవివాహితులుగా మొయిదీన్ ఇంట్లో నివసించడానికి ఇంటిని విడిచిపెట్టింది . ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసే సినిమా . అటువంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత సంఘటనను చిత్రీకరించినందుకు మలయాళ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు . ఇలాంటి చిత్రాలు చరిత్ర సృష్టిస్తాయి . 19 సెప్టెంబర్ 2015 విడుదలైన చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹50 కోట్లు వసూలు చేసింది , ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది . “ కత్తిరున్ను పాటకు సంగీత దర్శకుడు ఎం . జయచంద్రన్ జాతీయ అవార్డును గెలుచుకోవడం గర్వించదగ్గ విషయం . ఇంకా , ఇది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ , 5 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ , ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ , కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ నుండి అనేక అగ్ర అవార్డులను అందుకుంది

కులమతాల బండిఖానాలో బలైపోతున్న ప్రేమికులు ఎందరో

ప్రేమ అనేది కులం , మతం రంగుల కే పరిమితం కాదని , దేశాలు , ఖండాల వారీగా కూడా ప్రేమగలదని నిరూపించే యదార్థ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం .పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యులందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారు కొందరైతే . కులం , మతం , పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే వారు మరికొందరు . కొంతమంది ప్రేమికులకు కులం , మతం , ధనిక , పేద తేడాలు సృష్టించి చివరకు ప్రేమికులు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి . ప్రేమకు కులం మతం పేద ధనిక అనే అంతరాలు సృష్టించడం అత్యంత బాధాకరం , అత్యంత ప్రమాదకరం కూడా . రెండు హృదయాలను కలిపేదే ప్రేమ . రెండు హృదయాలు కలిసి జీవించడానికి కులం మతం ఏమి అడ్డు కాదనేది అక్షర సత్యం . నేటి యువత ప్రేమకు ఇంచినంత ప్రాధాన్యత చదువుకు ఇవ్వడంలేదనేది జగమెరిగిన సత్యం . అందుకు కారణం ప్రేమకు యువతను ఆకర్షించే శక్తి ఎక్కువ ,   అత్యంత ప్రభావం వీరిపైనే ఉంటుందనడంలో సందేహమే లేదు . నిజమైన ప్రేమ లక్ష్యాలను సాధించడానికి నిస్వార్థంగా ముందుకు సాగుతుంది మరియు ఆత్మహత్యకు దారితీయదు . అవగాహన లేమితో ప్రేమికులు ఆవేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరం

వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475       



 








కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...