11, మే 2024, శనివారం

చేతులతో కాక చేష్టలతో పద్మశ్రీ అందుకున్నారు ":KS రాజన్న".

చేతులతో కాక చేష్టలతో పద్మశ్రీ అందుకున్న ":KS రాజన్న".

“సేవే మార్గం” అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా ఆచరించి చరిత్రలో తన నమూనా సుస్థిరం చేసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో మదర్‌ థెరిసా ఒకరు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమంటే దేవుడిని సాక్షాత్తు పూజించడమేనని ప్రగాఢంగా విశ్వసించిన మదర్ థెరిసా లక్షలాది మందికి ప్రేమను పంచి, “ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే విలువైనవి”అని ప్రపంచానికి తెలియజేసింది. సాటి మానవుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండటం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని ఆమె తన జీవితం ద్వారా చాటిచెప్పింది. ఆమె తన జీవిత కాలంలోనే కాకుండా మరణానంతరం కూడా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. “మానవుడే మహనీయుడు” అనే నానుడి నిజమని నిరూపించిన మహిళా మూర్తి ఆమె. మదర్‌ థెరిసా స్ఫూర్తితోనేటికీ ఎంతోమంది సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటం ఆమె ఆదర్శమయ జీవితానికి ప్రతీక.

మనిషికి వైకల్యం ఉన్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదు అంటారు. మానసిక దృఢత్వం ఉన్నవారు శారీరక వైకల్యాలను అధిగమించడమే గాక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వికలాంగుడు, సామాజిక సేవాతత్పరుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కె ఎస్ రాజన్న జీవిత కథ గురించి కొంత తెలుసుకుందాం.

పోలియో బారిన పడి కాళ్లు, చేతులు కోల్పోయిన ఆయన స్వీయ ప్రేరణ, దీక్షతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. సమాజంలో తాను ఎవరికీ తక్కువ కాదని భావించిన రాజన్న 2002లో వివిధ వైకల్యాలున్న క్రీడాకారుల కోసం నిర్వహించిన పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో క్రీడలో స్వర్ణం సాధించాడు. అంతేకాదు స్విమ్మింగ్‌లో రజతం సాధించి ఆశయసిద్ధికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించాడు. అతను వికలాంగుల రాష్ట్ర కమిషనర్‌గా కూడా పనిచేశాడు.

కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాకు చెందిన కేఎస్ రాజన్న 11 ఏళ్ల వయసులో పోలియో బారిన పడి చేతులు, కాళ్లు చచ్చుబడి వికలాంగుడైన రాజన్న ధైర్యం కోల్పోకుండా మోకాళ్లపై నడవడం నేర్చుకున్నాడు. అందరితో సమానంగా విద్యనభ్యసించాలనే దృఢ సంకల్పంతో పట్టుదలతో చదివి 1975లో రాష్ట్రస్థాయి సివిల్ పరీక్షల్లో విజయం సాధించారు. 1980లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పొందారు. ఆ తర్వాత వికలాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరియు వికలాంగుల హక్కులను పరిరక్షించడానికి, తను వికలాంగుల ప్రయోజనాల కోసం, వికలాంగుల సమాన అవకాశాల కోసం పనిచేయాలని నిర్ణయించుకొని సామాజిక కార్యకర్తగా శ్లాఘనీయమైన సేవలందించారు. వికలాంగుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసి వివిధ రంగాల్లో అఖండ విజయాలు సాధించారు. వందలాది మందికి ఉపాధి కల్పించి వేలాది మంది వికలాంగులకు స్వావలంబన కల్పించారు. అక్కడితో ఆగకుండా, రాజకీయాల్లో చేరి లింగరాజ పురం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన ఎస్ ఎంకృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి బెళూరు సిటీ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా నామినేషన్‌కు చేర్చారు. వికలాంగులకు ఉపాధి హామీ కల్పించడం కోసం రాజన్న వ్యాపార సంస్థను ఏర్పాటు చేశారు.తన సంస్థ ద్వారా ప్రత్యేకంగా 500 మందికి పైగా వికలాంగులకు ఉపాధి కల్పించడం అభినందనీయం. రాజన్న చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం 2013లో రాజన్నకు 'కమిషనర్ డిసేబుల్' పదవి ఇచ్చింది. రాజన్న 54 ఏళ్ల వయసులో రాష్ట్ర తొలి వికలాంగ కమిషనర్‌గా సభ్యులవ్వడం గర్వకారణమని.. ఆయన హయాంలో వికలాంగుల జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు వికలాంగుల చట్టం సక్రమంగా అమలు కావాలంటే వికలాంగుల గణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్ద ఎత్తున పోరాటం సాగింది. ఈ నేపథ్యంలోనే వికలాంగుల సంఖ్య మాత్రమే కాకుండా వైకల్యంతో బాధపడుతున్న జనాభా ఎంత, విద్యార్హత, ఉపాధి, ఆదాయం వంటి వివరాలను కూడా నమోదు చేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అనేక సమస్యలపై అధ్యయనం చేసి వికలాంగులకు ప్రశంసనీయమైన సేవలందించారు. కమిషనర్ పదవిలో రాజన్న 2016 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం 2015 ప్రారంభంలో ఆయనను పదవి నుంచి తొలగించింది. రాజన్నను తొలగించడంపై రాష్ట్ర వికలాంగుల సంఘాలు విమర్శించాయి. కాగా ఆ తర్వాత ఏర్పాటైన సిద్ధరామయ్య ప్రభుత్వం పునః సంస్కరణల్లో భాగంగా రాజన్నను తిరిగి నియమించింది. పునర్నియామకం తర్వాత ఆయన  ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

KS రాజన్న సమాజ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం “అంకితభావంతో కూడిన సామాజిక కార్యకర్త” విభాగంలో ఆయనకు 2024 మే 9న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆయనను ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

"ఆత్మే పరమాత్మ" అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. భక్తితో కొలవడం ద్వారానే స్వామిని దర్శించగలగాలి. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. పేదలకు సేవ చేయడమే మాధవ సేవ. ఇతరులకు సహాయం చేసి తమను తాము మానవత్వంతో నిరూపించుకున్న వారే గొప్పవారు. సమాజ శ్రేయస్సు కోరని ఆధ్యాత్మిక సాధన ఫలించదు. ఆహ్లాదకరమైన సత్కార్యాలు చేసే వారిని ఇష్టపడతారు. అందుకే 'దయగల హృదయమే భగవంతుని నిలయం' అన్నారు పెద్దలు.

సేవ అనేది సహజ లక్షణంగా ఉండాలి. భగవంతుని అనుగ్రహం కోసం పుణ్యక్షేత్రాలు, గోపురాలను దర్శించుకోవడం మంచిది. కానీ, నిరుపేదల పట్ల కరుణ చూపకపోతే దేవుడు కూడా సంతోషించడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నలుగురితో కలిసి చేసే మంచి పనిలో జీవించడం గొప్ప లక్షణం. అంతేకాని ప్రచారం, ప్రశంసల కోసం చేసే కార్యక్రమాలను పుణ్యకార్యాలుగా చూడరు. ఏ చిన్న పనినైనా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం. సమాజంలో సేవ చేసే వారిని ప్రోత్సహించడం అంటే మనం కూడా పరోక్షంగా సేవ చేస్తున్నట్టే. రాజన్న సేవలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కేఎస్ రాజన్న తన సామాజిక సేవలో వైకల్యాన్ని ఎప్పుడూ అడ్డంకిగా భావించలేదు. అది ఆశయ సాధనకు ఏమాత్రం అవరోధం కాబోదని ఆయన సాధించిన ఈ విజయం నేటి యువతకు ముఖ్యంగా వికలాంగులకు ఎంతో స్ఫూర్తిదాయకం.

సంకల్పం, నిర్విరామ కృషితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని మరోసారి నిరూపించిన "కె.ఎస్.రాజన్న" జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు..  

అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప అది మనిషిలో ఉన్న ప్రతిభకు కాదు అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం "KS రాజన్న". ఆయన సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...