తరగతి మరిచిన లింగన్న:
నా క్లాసుమెంట్ లింగన్న అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. లింగన్న నాతోపాటు ఐదోతరగతి నుండి పదవతరగతి వరకు గుమ్మడవెల్లి స్కూల్ లో చదివిండు. నేను లింగన్న కలిసి లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాళ్లం. లింగన్న పక్కన కూర్చుంటే నాకు సార్ చెప్పే పాఠం కంటే లింగన్న చేసే పనులమీదే ఎక్కువ ద్రుష్టి ఉండేది. లింగన్న చూడటానికి బందబస్తుగ ఉంటాడు కానీ మనుసు సున్నితం. లింగన్న పెదాలపై హాస్యం ఎప్పుడు నాట్యమాడుతూనే ఉంటది. అందుకే లింగన్న అంటే అందరికి ఇష్టం. లింగన్న చేసే పనులు అందరిని నవ్వించడమేగాక జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ఐదోతరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు టీచర్ పాఠం చెబుతూ అనుకోకుండా వెనుక బెంచ్ లో కూర్చున్న విజయ్ ని లేచినిలబడమన్నాడు. విజయ్ వెంటనే సార్ ఏదైనా ప్రశ్న అడుగుతాడేమో అని నిలబడ్డాడు. సార్ దగ్గరకు వచ్చి ఒరేయ్ నెత్తి కటింగ్ చేయించుకోక ఎన్ని నెలలు అయిందిరా, ఏందిరా నీ అవతారం, ఇది నెత్తిన లేక వరిగడ్డిన, గుడ్డెలుగులాగా పెంచినవ్. నువ్వు ఏమి చేస్తావో నాకు తెల్వదు ఈరోజు మధ్యాహ్నం అన్నం బెల్లుకు ఇంటికి పోయి కటింగ్ చేయించుకొని రా లేకపోతే నీ వీపు విమానమోతమోగుద్ది అని సార్ విజయ్ కి చెప్పిండు. సరే సార్ అన్నాడు విజయ్. కటింగ్ చేయించుకోవడం అసాధ్యమే అని సార్ కు తెలుసు విజయ్ కూడా తెలుసు మధ్యాహ్నం అర్ధగంట టైం ఉంటది అన్నం తినడానికి సరిపోదు ఆ టైం. అంత తక్కువ టైం లో చేయించుకోవడం కష్టమే కానీ విజయ్ సరే అన్నాడు. ఇక విజయ్ కి ఏమి చేయాలో అర్ధం గాక నాయి బ్రాహ్మణుడు అయినా లింగన్నను బతిలాడిండు కటింగ్ చేయమని, లింగన్న వయసు అప్పటికి 10 సంవత్సరాలే అయినా తండ్రి విద్యను అలవోకగా నేర్చుకోగలిగిన నేర్పరి. ఆరోజు విజయ్ అన్నం తిన్నాడోలేదో గాని లింగన్న కటింగ్ కోసం ఎదురుచూపు రానే వచ్చే లింగన్న విజయ్ మెడ వంచి కత్తెరతో నెత్తి అంత కట్ చేసిండు. పనిలేని మంగలాయన పిలిచి తలకొరిగినట్లు అడ్డదిడ్డంగా కటింగ్ చేసిండు. ఇక కటింగ్ అయిపొయింది ఇటు స్కూల్ టైం అయింది. స్త్రానం చేయకుండా పోతే సార్ ఏమంటాడో అని విజయ్ భయంతో అక్కడ పక్కనే ఉన్న బకెట్ లో తలపెట్టి శుభ్రం చేసుకుండు. ఈ విషయం వారిద్దరికే తెలుసు. విజయ్ క్లాస్ కు వస్తుండగానే అందరికి ఆశ్చర్యం కలిగింది ఇంత తక్కువ టైం లో కటింగ్ చేయించుకున్నాడని మాకే కాదు సార్ కూడా ఆశ్చర్యం కలిగింది. అడపాదడపా చేసిన కటింగ్ చూసి సార్ నవ్వుతు కటింగ్ ఎవ్వడు చేసిండు రా నీకు అన్నాడు. ఏమి చెప్పాలో తెల్వక మన లింగన్న నే చేసిండు సార్ అన్నాడు. ఆ రోజు లింగన్న పనిమంతుడు అని అందరికి అర్ధం అయింది. అప్పటినుండి ఎవ్వరు జుట్టు పెంచిన లింగన్న కాడికిపోయి చేయించుకోరా అనేది సార్. ఆరోజు జరిగిన సంఘటన నన్నే కాదు మా క్లాసుమెంట్స్ అందరిని నవ్వేలా చేసింది.
అంతేకాకుండా ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఓరోజు పరీక్షలు జరుగుతున్నాయి లింగన్న బాగా ప్రిపేర్ అయిండు పరీక్షకు ఈ సారి ఎలైన మంచి మార్కులు రావాలని. పరీక్షా టైం అయింది అందరం కూర్చున్నాం ఎవరి సీట్లో వాళ్ళం. సార్ అందరికి పేపర్ ఇచ్చిండు కొద్దిసేపటికి అందరికంటే ముందే లింగన్న వైట్ పేపర్ ఎక్స్ట్రా అడిగిండు ఇగ రాస్తూనే ఉన్నాడు లింగన్న పేపర్ల దాదాపుగా 10 రాసిండు. సార్ కు ఎందుకో డౌట్ వచ్చింది ఎన్నలేనిది లింగన్న గిన్నిగానం పేపర్లు తీసుకుండు మంచిగా రాస్తున్నాడు అని చూద్దామని లింగన్న దగ్గరకు వచ్చిండు తీరా సార్ పేపర్ చూస్తే లింగన్న రాసె పేపర్ పదవ తరగతి పేపర్. ఒక్కసారిగా సార్ షాక్ అయిండు ఏందిరా లింగన్న నువ్వు ఎనిమిదవ తరగతి కదరా పదవ తరగతి పేపర్ అని చెప్పొద్దా అని సార్ అరిసిండు. ఇగ లింగన్న ఏమి చెప్పాలో తెల్వక నేను చూడలేదు సార్ రాస్తానే ఉన్న అన్నాడు సార్ నవ్వుతు నీకు తెల్వది ఏమి రాశినవ్ రా లింగన్న అన్నాడు అప్పుడు లింగన్న చెప్పిన సమాధానం "నేను చదివింది రాసిన సార్" అందులో ఏముందో కూడా చూడలేదు సార్ అన్నాడు' సార్ నవ్వు ఆపుకోలేక నలుగురిని పిలిచి లింగన్న చేసిన ఘనకార్యం అందరికి చెప్పిండు. అయితే నాకు లింగన్న గురుంచి బాగా తెలుసు ఎందుకంటే నా పక్కనే కూర్చునేది కదా, పాపం లింగన్న బాగానే చదువుతాడు కానీ గుర్తుకు ఉండదు ఏది అంతేతప్ప చదవక కాదు. పాపం లింగన్నకు చదువైతే అబ్బలేదేమో గాని కటింగ్ షాప్ పెట్టుకొని స్థిరపడ్డాడు.
నేను అప్పుడప్పుడు లింగన్న ను గుర్తు చేసుకొని నవ్వుకుంట ఎంతైనా నా దోస్తు కదా.
కోట దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి