చెత్తశుద్ధి:
ఈరోజు పేపర్ తెరవగానే ఒక ఫోటో నా దృష్టిని నిలిపేసింది. ఆదివారం రోజు విజయనగరంలో జరిగిన రోడ్ ప్రమాద సంఘటన నన్నెందుకో తీవ్రంగా కలిచివేసింది. ప్రమాదంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్న కొడుకు ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు నన్నెందుకో తీవ్రంగా కలిచివేసింది. ఈ వార్త పేపర్లో చాలామంది చదివే ఉండవచ్చు కానీ మరోసారి చదివిన తప్పులేదు. విజయనగరం రైల్వే ప్రాంతానికి చెందిన కే గంగాధరరావు తల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళ్తూ, మార్గమధ్యలో పని ఉందని దిగాడు. ఒక రెండడుగులు ముందుకు వెళ్లాడోలేదో ఇంతలో అటువైపు నుంచి వస్తున్నా ట్రాక్టర్ ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్ మీద పడిపోయాడు గంగాధర్ ను చూసి ఆటోలో ఉన్న తల్లి గోవిందమ్మ పరుగున వచ్చి లేపేందుకు ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. చుట్టుపక్కన చాలామంది ఉండడంతో అయ్యా బాబు రండయ్యా హాస్పిటల్ కి తీసుకెళదాము అంటూ దారిన పోయేవారందరిని వేడుకున్నారు, చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవ్వరు కనికరించలేదు. తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడుతూ రోడ్ పై పడి ఉన్న ఎవరు కనికరించలేదు. 5 నిముషాలలో చేరుకోగలిగే దూరంలోనే హాస్పిటల్ ఉన్నప్పటికీ చుట్టుపక్కల వారు మౌనంగా చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు సహాయం చేయలేదు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ లో ఫొటోస్ మరియు వీడియోస్ తీసుకుంటున్నారే తప్ప సహాయం చేయాలనే ఆలోచన చేయలేదు. ఇంతలో ఎవరో 108 కాల్ చేయగా అంబులెన్సు వచ్చేసరికి గంగాధర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన నన్నెందుకో తీవ్రంగా కలిచివేసింది.
చరవాణి మోజులో చలించని వారు కొందరైతే, ఎవరికి ఏమైతే మనకెందుకులే అని పట్టించుకొనువారు కొందరు. కన్న కొడుకు కళ్ళముందే కొట్టుమిట్టాడుతున్న హృదయవిదారక ఘటన చూసి చూడనట్లు వెళ్తున్న జనాలకు మన చాపకిందికి నీరు వస్తేగాని మనం చెమ్మను గుర్తు పట్టం అన్నట్లుంది. ఈ మధ్య కాలంలో పక్కవాడి ప్రాణాలు పోతున్న మొబైల్ మోజులో పట్టించుకునేవారే లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. మొబైల్ ఫోన్స్ రాకతో ఎవడి పిచ్చివాడికే ఆనందం అన్నట్లు వ్యవరిస్తుండటం అత్యంత బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటన మనకు కూడా జరిగితే ఆ బాధ ఎలాఉంటుందో అర్ధం చేసుకున్నవారికే మాత్రమే అర్ధమవుతుంది అంతేతప్ప అర్ధంచేసుకోనివారికి ఇది కేవలం వార్తే.. ఈ దేశంమీద పరాయిదేశం దండయాత్ర చేసిన అర్ధంచేసుకోనివారికి అది కేవలం వార్త గానే అనిపిస్తుంది..
10 పక్కన సున్నా లేకపోతే 10 కి అర్ధమే లేదు. అది కేవలం ఒకటిగానే మిగిలిపోతుంది.
అలాగే 100 పక్కన రెండు సున్నాలు లేకపోతే కూడా ఒకటిగానే మిగిలిపోతుంది.
ఇలా వెయ్యి, పదివేయ్యిలు, లక్షలు, కోట్ల రూపాయలకు కూడా సున్నా లేకపోతే అర్ధం లేదు.
మనకు వెయ్యికోట్ల రూపాయలున్న మనం పక్కోడికి పనికిరానప్పుడు మనం ఎప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఆ ఒంటరితనానికి అర్ధం లేదు.. ఆ బతుకు వ్యర్ధమే..
ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి, వారి ప్రాణాలను కాపాడండి..
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి