మాఊరి పీర్ల పండుగ (సరిగస్తు గమ్మత్తు):
చాలా సంవత్సరాల తర్వాత నా చిన్ననాటి స్నేహితుడు హైద్రాబాదులోని ECIL బస్టాండ్లో కలిశాడు. కాసేపు ఇద్దరం బస్టాండ్లో కూర్చొని ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఉండగా మిత్రుడు చిన్నప్పుడు ఊళ్ళో జరిగిన పీర్ల పండుగ గుర్తుచేస్తూ కడుపుబ్బా నవ్వించిండు. గుమ్మడవెల్లి వారందరికీ ఈ సంఘటన తెలిసే ఉంటుంది కానీ మరోసారి తెలుసుకొని నవ్వడంలో మాత్రం తప్పులేదు.
ఆరోజు శనివారం పొద్దుగూకాల అందరూ ఇంటిముందు అరుగులమీద కూసోని ముచ్చటపెడుతుండ్రు. కచ్చిరు దగ్గర సరిగస్తు ఉంది అందరూ రారండయ్యో అని ఊరంతా డప్పుసాటింపు జేసిండ్రు. సరిగస్తుందని విన్నాక మాలాంటి పోరగాళ్లకు ఎక్కడాలేని ఆనందం, ఉత్సాహం ఉప్పొంగింది. ఎక్కడాలేనివిధంగా మా ఊళ్ళో సరిగస్తు ఓ గమ్మత్తుగా ఉంటది, తీరొక్క తీరు వేషాలు వేసి పీర్లకొట్టం గుండం దగ్గర డప్పుదరువులకు కాళ్లకు గజ్జెలుకట్టుకొని అందరూ ఎగిరెగిరి నృత్యం చేసేటోళ్లం. సరిగస్తు ఉందంటే ఆరోజు ఊళ్ళో అందరూ నడిరేత్రివరకు నిద్రపోకుండా సరిగస్తు ఆట చూసేందుకు పీర్లకొట్టంకాడనే కూసునేది. సరిగస్తుందని డప్పుసాటింపు విన్నాక ఊళ్ళో కొందరు ఇయ్యాల ఎవేశం వేయాలని గుసగుసలాడుకుండ్రు మరికొందరైతే గుండంలో మంటకాలాడానికి కట్టెలు మొద్దులు, తడకలు యెడ ఎదుర్కరావాలన్న ఆలోచనపడ్డారు. కొద్దిసేపైనకా గుండం దగ్గర ఒక్కొకరుగా అందరూ పోగయిండ్రు, డప్పుదరువులతో సరిగస్తు మొదలైంది. ఒక్కొక్కరు గుర్తుపట్టని వేషాలు యేసుకొని గుండంసుట్టు ఎగురుతుంటే అందరూ గీయన ఎవరో ఉండే తోట బక్కయ్య కదూ? అని కొందరు కాదు కాదు ఆయన ఎందుకైయే తోట బక్కయ్య కాదు. హే ఎవరో అని మరికొందరు అట్లా గుర్తుపట్టరాకుండా వేషాలేసుకొని వచ్చిండ్రు. గుండం చుట్టూ గమ్మత్తయిన స్టెపులేసుకుంటూ నృత్యం చేస్తుంటే కాళ్ళాడనోళ్ళకుకూడా లేసి ఓ స్టెప్పేయాలనిపించేటట్లుండేది సరిగస్తు సంబురం. వేషం వేసుకొని గుర్తుపట్టనొల్లను తెల్లారిగట్ల వాళ్లమొహానికి రంగులు పూసుకున్నట్లు మొహమ్మీద అక్కడక్కడా కలర్ ఉండేది గప్పుడు గాని తెలిశేది రాత్రి ఏదో వేషం వేశాడని. ఆరోజు తోట బక్కయ్య ఒంటినిండా గడ్డికప్పుకొని వేషం వేయడంవల్ల ఆయన్ని ఎవరు గుర్తుపట్టలేదు ఒక్కొకరిదగ్గరకు వచ్చి సరదాగా స్టెప్పులేస్తూ అందరిని ఆటపట్టించేది. ఆయన వేసే స్టెప్పులకు నవ్వు ఆగకపొయ్యేది కొందరికి. దూదేకుల లతీఫ్ వింతైన వేషంతో నోట్లో నూకలు నములుకుంటూ గుండం సుట్ఠు నృత్యం చేస్తుంటే ఆ గమ్మతే వేరు. పీర్ల పండుగ వచ్చిందంటే లతీఫ్ తాత తీరొక్కతీరు వేషాలేసేది. లతీఫ్ తాత లేకపోతే పీర్ల పండుగ లేదు అన్నట్లుగా ఉండేది. పీర్ల పండుగ పెద్దమనిషి దూదేకుల లతీఫ్. ఇంకో గమ్మతైనా వేషం ఏంటంటే చినిగిపోయిన గుడ్డపేలుకలతో నడుంచుట్టూ కట్టుకొని పాత చీపురుకట్ట చేత పట్టుకొని గుండం సుట్ఠు రెండురౌండ్లు తిరిగి అక్కడ కనపడ్డవాళ్ళని మెడలోంచి వీపున చీపురుకట్టతో రెండు అంటించిండు కుమ్మరి రామయ్య. ఎక్కడ దెబ్బలుపడుతాయో అని కొంతమంది ఉరికిండ్రు కొంతమంది పాత చీపురుకట్టతో కొట్టించుకుంటే దయ్యాలు, బూతులు దరిచేరవని నమ్మి మరి మరి కోటించుకుండ్రు. కుమ్మరి రామయ్య వేషం ఎప్పటికి మరచిపోలేము. అట్లా చాలామంది వేషాలేసుకొని ఎగురుతుంటే అనుకోకుండా ఒక గమ్మత్తయిన ముసలాయన వేషంతో వచ్చి గుండం కాడ సుట్టా కలుస్తూ అందరిని ఆశ్చర్యపరిచిండు. అందరూ ఆశ్చర్యపోయి గుండంకాడ సుట్ట కలుస్తుండు అంతదైర్యం ఎవ్వడికుందని ఎవరీ ముసలాయనని అందరూ గుసగుస కానీ అక్కడ ఎవ్వరు గుర్హ్తుపట్టలేకుండా వేషం వేసుకుండు గంభీరమైన నల్లని మీసాలతో నడుమువంగినట్లు చేతికర్ర పట్టుకొని గుండం చుట్టూ తిరిగి ఇంటికి పోయిండు. అక్కడ ఎవరో వేషం వేసుకుంటుంటే చూసినాయన హే ఆయన కోట సోమయ్య అని చెప్పిండు అప్పుడుగాని గుర్తుకురాలే ఆయన కోట సోమయ్య (మా నాన్న) అని. అలా ఎంతోమంది పోతరాజు వెంకన్న, ఇంకా చాలామంది వింతైన వేషాలతో అందరిని ఆశ్చర్యపరుస్తూ సరిగస్తు చేసిండ్రు. ఆరోజు గుండంలో మంట పెట్టడానికి మొద్దులు, తుంటలూ ఇంటిముందుండే తడికలు ఎదురుకొచ్చి అన్ని గుండంలో పడేసిండ్రు. సరిగస్తు సంబరంలో అక్కడఉన్నోళ్లకు ఇంటికాడ తడికలు మాయమవుతాయేమో అనే భయము ఉండేది. సరిగస్తు అయినాక ఇంటికిపోయినంక తెలిసేది ఇంటిముందు తడిక మాయమైందని. ఆరోజు చాలా తడికలు ఊళ్ళో ఎదుర్కొచ్చి గుండంలో పడేసిండ్రు సరిగస్తు సంబరమున జనాలుంటే తడికలు, మొద్దులు ఊళ్ళో ఎదుర్కొచ్చే పనిలోకొందరున్నారు. తెల్లారి ఆదివారం కాబట్టి ఆరోజు చాలా పెద్దగా జరిగింది అందరూ మస్తు ఎంజాయ్ చేసిండ్రు. సరిగస్తు అయిపోయినాక అందరూ ఎవరి ఇండ్లల్లకు వాళ్ళు పోయిండ్రు.
తెల్లారి ఆదివారం పొద్దుగాల బడికాడ గొల్లోల్ల ముసలమ్మా నోటికొచ్చినట్టు ఒకటే తిడుతుంది తడికలెత్తుకుపోయినోడి కడుపుడుకా, వాడి బొందమీద మన్నుబొయ్యా, వానిల్లు నాశనంగాను అని ఒకటే తిట్టుడు. సరిగస్తు సంబురాన తడికలు ఎత్తుకబోయినోళ్లు గొల్లోల్ల ముసలమ్మా తిట్లు విని ఒకనవ్వుకునుడు కాదు ఓవైపు పాపం అనుడు ఒకవైపు నవ్వుడు. ఎంతైనా సరిగస్తు గమత్తే వేరబ్బా.
పీర్ల పండుగ అయిపోయిన మరునాడు అతిభయంకరమైన బేతాళుడి వేషం వేసేది ఇతరాజు బుచ్చయ్య. నాకుతెలిసి బుచ్చయ్య వేషం చూసి బయపడనివారుండరనేది ముమ్మాటికీ నిజం. అసలైన బేతాళుడు కూడా బుచ్చయ్య వేషం చూసి బయపడుతాడేమో బహుశా. నల్లని శరీరం పొట్టిగా భారీ బొర్ర తో నోట్లో కత్తిపొడుసుకొని ఒంటినిండా రక్తంతో వేపమండలు చేతబట్టుకొని, వెనకాల పగ్గాలతో కట్టి ముగ్గురునాలుగురు అదిమి పట్టుకునేది అయినా ఆయన ఉరికేటప్పుడు వెంట ఉన్నోళ్లు ఆయన్ని ఆపలేక శానా ఇబ్బంది పడేటోళ్లు. బదార్ల నిలబడ్డోడిని వేపమండలతో ఉరికిచ్చుకుంటూ కొట్టేది. బుచ్చయ్య భేతాళుడి వేషం వస్తున్నదంటే చిన్న పోరగాళ్ళు తలుపులసంధులనుండి చూసేది తప్ప బయటకు రాకపోతుండే. ఆయన్ని చూస్తే చిన్నపిల్లలు అదురుకే బెదురుతరు. బేతాళుడి వేషం వేయడంలో ఇతరాజు బుచ్చయ్య ను మించినోడు లేడు ఇక రాడు కూడా వేషానికి తగ్గట్టుగా నటన, నడక, ఆ నృత్యం అందరికి రాదనే చెప్పాలి.
పీర్ల పండుగ ప్రత్యేకత ఏంటో ఏమి తెలియదుగాని సరిగస్తు ఆట, బేతాళుడి వేషం వేస్తారని మస్తు గమ్మత్తుగా ఉంటుందనిమాత్రమే తెలుసు.. సరిగస్తు ఆట నాడు ఇంటిముందున్న తడికలు భద్రంగా దాసుకుంటారనేది తెలుసు.
ఈరోజుల్లో చేసే పీర్ల పండుగ అసలైన పీర్ల పండుగ అన్నట్లుగా లేదు. ఆరోజుల్లో ఉన్న సరిగస్తు గమ్మత్తు వేరు..
కోట దామోదర్
మొబైల్ : 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి